ఢిల్లీలో పవన్ కల్యాణ్ మకాం.. అమిత్‌షాతో భేటీ
ఎన్డీఏ పక్షాల సమావేశానికి హస్తినకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడే మకాం వేశారు.. కేంద్ర ప్రభుత్వంలోని కీలక నేతలు, బీజేపీ పెద్దలతో సమావేశాలు అవుతున్నారు.. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నిన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. వరుసగా బీజేపీ పెద్దలను కలుస్తుండగా.. అందులో భాగంగా అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపూ చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, రేపు కూడా ఢిల్లీలోనే పవన్ కల్యాణ్ ఉండే అవకాశం ఉండగా.. ఇంకా ఎవరెవరిని కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో పవన్ కీలక చర్చలు జరుపుతున్నారు.. అయితే, ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరుగుతుందని భావించినా అది జరగలేదు. కేవలం జాతీయ అంశాలకే ఎన్డీఏ భేటీ పరిమితం అయ్యింది.. దీంతో, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీలోనే మకాం వేశారు.. బీజేపీ పెద్దల్ని కలుస్తూ.. పొత్తుల అంశంపై చర్చిస్తున్నారు.. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయనే భావన ఉంది.. ఆ దిశగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారనే చర్చ సాగుతోంది.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన-బీజేపీకి కలిగే ఉపయోగాలని కూడా బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కల్యాణ్ ఇంకా ఎవరెవరిని కలుస్తారు.. ఎలాంటి చర్చలు జరుగుతాయి.. ఏపీలో పొత్తులపై ఎలాంటి నిర్ణయం వెలువడనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు జనసేనాని పవన్ కల్యాణ్.. గౌరవనీయులైన హోం మంత్రి శ్రీ అమిత్ షా జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ పరస్పర చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక మరియు సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని నేను ఖచ్చితంగా అమ్ముతున్నాను అని కామెంట్ పెట్టిన పవన్.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి అమిత్‌షాతో సమావేశమైన ఫొటోలను కూడా జత చేశారు.
పాఠశాలల్లో పిల్లలకు మాతృ భాష.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పాఠశాలల్లో పిల్లలకు మాతృ భాషపై నేర్పటంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థులకు బేసిక్ లైన్ పరీక్షలు జరపటంలేదని, జరిపినా ఫలితాలు వెల్లడించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనివల్ల మాతృ భాష రాక ఐదో క్లాస్ విద్యార్ది రెండో క్లాస్ కూడా చదవలేక పోతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే, మాతృభాష తెలియకపోతే వేరే భాషలపై పట్టు ఎలా వస్తుందని ప్రశ్నించింది న్యాయస్థానం.. గతంలో మాతృ భాష రాకపోతే సిగ్గుపడే వారు.. ఇప్పుడు మాతృ బాష రాకపోతే గొప్పగా చెబుతున్నారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.. విద్యార్థులు అంటే దేశానికి భావి భవిష్యత్ అని పేర్కొన్న కోర్టు.. మాతృభాష రాకపోతే ఏం చేయగలరని ప్రశ్నించింది.. సమాజంలో మేధావులు ఇంకా ఉన్నారని వారి సేవలు వినియోగించు కోవాలని న్యాయ స్థానం సూచించింది.. ఇక, విద్యార్థుల్లో మాతృ భాష అధ్యయన సామర్థ్యం పెంచేందుకు ఏం చర్యలు చేపట్టారో తెలపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
విభజన హామీలను నెరవేర్చాలి.. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. పోలవరం ప్రాజెక్టు బకాయిలన్నీ చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. రైల్వేజోన్ ఏర్పాటుపై మాటనిలబెట్టుకోవాలంటూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో.. ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లేవనెత్తిన అంశాలను వివరించారు సాయిరెడ్డి.. బీసీలకు సంబంధించి వైసీపీ మొదట్నుంచీ చాలా స్పష్టమైన విధివిధానాలతో ఉంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఏ రకంగానైతే చట్టసభల్లో రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారో.. అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్‌ను అమలులో ఉంది. అదే మాదిరిగా దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రస్తుతం 27 శాతానికి పరిమితమైంది. జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని వైసీపీ తరఫున సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.. ఇక, పార్టీ ఫిరాయింపుల చట్టం విషయానికొస్తే రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లో దీనిని పొందుపరిచినప్పటికీ అది పూర్తిగా నిర్వీర్యం అయింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీజేపీ ప్రభుత్వం రెండూ కూడా ఆ చట్టం అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకొచ్చాం. రాష్ట్రాల్లో, లోక్‌సభలో ప్రిసైడింగ్ అధికారులుగా ఉన్న స్పీకర్లు పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు.
వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం ఆశాజనకంగా ఉందని, ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, వరి నాట్లు జోరందుకున్నాయని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంత సాగునీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం ఉన్నతస్థాయిలో రెండు సార్లు శాఖ తరపున సమీక్ష చేశామని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా స్వల్పకాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలన్నారు. శాస్త్రవేత్తల సూచన ప్రకారం.. కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకు విత్తుకోవచ్చని, మొక్కజొన్న పంట సాగుకు ఈ వర్షాలు ఈ నెలాఖరు వరకు అనుకూలంగా ఉంటాయని మంత్రి నిరంజన్ తెలిపారు. ఇదివరకే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు.. ఈ అదును నేపథ్యంలో వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. నేరుగా విత్తుకునే స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి సారించాలన్నారు. దీనిమూలంగా పంట ఖర్చులు, సాగు కాలం కలిసొస్తుందని చెప్పారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిన్నటి వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుందని.. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో 32 జిల్లా్ల్లో ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయ్నారు. ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకెళ్లాలని తెలియజేశారు.
కర్ణాటక అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్.. 5 బిల్లులకు ఆమోదం
కర్ణాటక అసెంబ్లీ నుండి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో అసభ్యకరంగా, అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు వారిని డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ సహాయంతో బయటకు పంపించారు. దీంతోవారు అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళనకు దిగారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలలో డాక్టర్ సీఎన్ ఆశ్వత్ నారాయణ్, వి. సునీల్ కుమార్, ఆర్. ఆశోక్, అరగ జ్ఞానేంద్ర, వేదవ్యాస్ కామత్, యశ్ పాల్ సువర్ణ, అరవింద్ బెల్లాడ్, దేవరాజ్ మునిరాజ్, ఉమానాథ్ కొట్యాన్, భరత్ శెట్టిలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన కొందరు సభ్యులు బిల్లులు, అజెండా కాపీలను చించి స్పీకర్ పైకి విసిరేశారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన విరామం లేకుండా ప్రొసీడింగ్స్ నిర్వహించడంపై కూడా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులో నిన్న ముగిసిన రెండు రోజుల ప్రతిపక్ష పార్టీల ఐక్యతా సమావేశానికి సంబంధించి ఐఎఎస్ అధికారుల బృందాన్ని నియమించారు. దీనిని బీజేపీ తప్పుబట్టింది. సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ పదిమంది బీజేపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. భావోద్వేగానికి గురైన రాహుల్..
తనకు అమ్మ సోనియా గాంధీ అంటే ఎంత ప్రేమో.. పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ తీసుకునే జాగ్రత్త చర్యలు ఇట్టే చెబుతుంటాయి.. అయితే, రాహుల్ గాంధీ తాజాగా, సోషల్ మీడియాలో షేర్ చేసిన సోనియా గాంధీ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ రాహుల్ ఎందుకు ఆ ఫొటో షేర్ చేశారనే విషయంలోకి వెళ్తే.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక సమావేశం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా.. సాంకేతిక లోపం కారణంగా, వారి చార్టర్డ్ విమానం భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. దీంతో విమానంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.. ఇక, రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో సోనియా గాంధీ ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ రాశారు. సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ.” అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు. చార్టర్డ్ విమానంలో ఆక్సిజన్ కొరత ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఈ విమానంలో వెళ్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ఇద్దరూ భోపాల్ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో బస చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆయనను కలిశారు. దాదాపు గంటన్నర సేపు భోపాల్ ఎయిర్‌పోర్టులో బస చేసిన అనంతరం ఇద్దరూ రాత్రి 9.35 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ప్రియురాలి స్కెచ్.. ఇంటికి పిలిచి.. పాముతో కాటు వేయించి..!
ఓ అమ్మాయి తన ప్రేమికుడిని దారిలో పెట్టేందుకు విషపూరిత కుట్ర పన్నిన షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడిని దారిలో పెట్టేందుకు ప్రియురాలు ఇంత విషపూరిత కుట్ర పన్నింది, దాని గురించి విని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియురాలు పాముతో కాటు వేయించి ప్రేమికుడిని హత్య చేసింది.. ఈ విషయాన్ని నైనిటాల్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు స్నేక్‌చామర్ రమేష్‌నాథ్‌ను అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారం హల్ద్వానీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడి మరణానికి సంబంధించినది. సమాచారం ప్రకారం, జూలై 15 న, రాంపూర్ రోడ్ రాంబాగ్ నివాసి, ఆటో షోరూమ్ వ్యాపారి, 32 ఏళ్ల అంకిత్ చౌహాన్ మృతదేహం హల్ద్వానీలోని తీన్ పానీ బైపాస్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనంలో కనుకొగన్నారు. అంకిత్ చౌహాన్ కారు వెనుక సీటుపై శవమై పడి ఉండగా, అతని కారు ఏసీ కూడా ఆన్‌లో ఉందని పోలీసుల విచారణలో తేలింది. అంతకుముందు, అంకిత్ మరణానికి కారులో ఊపిరాడకపోవడమే కారణమని పోలీసులు భావించారు, అయితే తరువాత షాకింగ్ వివరాలు తెరపైకి రావడంతో, పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి అంకిత్ రెండు పాదాలకు పాము కాటు వేసిన గుర్తులు ఉండడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. అంకిత్ చౌహాన్‌ను విష పాము కాటు వేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కుటుంబ సభ్యులు కూడా హత్యేనని ఆరోపించారు. అంకిత్ చౌహాన్ మరణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడంతో, మృతుడి సోదరి ఇషా చౌహాన్ హత్య కేసు నమోదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొరపడావ్‌కు చెందిన అంకిత్ స్నేహితురాలు మహి తన స్నేహితుడు దీప్ కంద్‌పాల్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నారు. మహి అంకిత్‌ని తన ఇంటికి పిలిచింది మరియు పాములు పట్టే మంత్రగాడితో కలిసి అతనిని నాగుపాము కాటు వేసేలా చేసింది.. ఆ తర్వాత అంకిత్ స్పృహతప్పి పడిపోయాడు. జూలై 14వ తేదీ రాత్రి అంకిత్‌ను గోలా బైపాస్‌లో రోడ్డు పక్కన పార్క్ చేసిన తన కారులో మృతదేహాన్ని ఉంచారు.. హత్యగా కనిపించకుండా ఉండేందుకు కారులో ఏసీ కూడా ఆన్ చేశారు..
ఎరక్క పోయి ఇరుకున్న బండ్ల.. బయటకు రావద్దంటూ ట్వీట్
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక రకమైన ట్వీట్లు పెడుతూ కామెంట్లు చేస్తూ హడావుడి చేసే బండ్ల గణేష్ ఎరక్కపోయి ఇరుక్కున్నారు. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఆయన ప్రయాణిస్తున్న కారు దాదాపు ఐకియా జంక్షన్ వద్ద రెండు గంటలసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్లుగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. కాబట్టి ఏదైనా పని ఉంటే తప్ప హైదరాబాద్ లో రోడ్డు ఎక్కవద్దని ఆయన సూచించారు. ఇక ప్రస్తుతానికి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇక భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మూమెంట్స్ బాగా మందగించాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అనేక ప్రాంతాల్లో అవుతోంది. అదిగాక ఐటీ ఉద్యోగుల ఆఫీసులు పూర్తయి వారంతా ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలోని రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే గత కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఆయన ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రకటించారు కానీ దర్శకుడు ఎవరు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ విషయం గురించి బండ్ల గణేష్ ఎలాంటి ట్వీట్లు గాని సోషల్ మీడియాలో ప్రస్తావించడం కానీ చేయడం లేదు.
హిరణ్యకశిపను ప్రకటించిన రానా.. గుణశేఖర్ ప్లేస్ లో గురూజీ..?
దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప అన్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు దీని గురించిన ఒక అప్డేట్ కూడా లేదు. అసలు ఈ సినిమా ఉందా.. ? లేదా.. ? అనే క్లారిటీ కూడా లేదు. శాకుంతలం తరువాత గుణశేఖర్ ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే శాకుంతలం భారీ పరాజయాన్ని అందుకోవడంతో హిరణ్యకశిప అటకెక్కినట్టే అనుకున్నారు. కానీ, హిరణ్యకశిప పట్టాలెక్కుతోందని రానా అధికారికంగా ప్రకటించాడు. నేటి నుంచి అమెరికాలో శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలైన విషయం తెల్సిందే. ఇక ఈ వేడుకలో ఈరోజు రానా.. స్పిరిట్ మీడియా తో కలిసి నిర్మిస్తున్న కొన్ని సినిమాలను.. పోస్టర్లతో సహా రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. అందులో ఒక హిరణ్యకశిప. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా హిరణ్యకశిప టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. త్రివిక్రమ్ కేవలం స్టోరీ మాత్రమే రాస్తున్నాడు అంటే.. డైరెక్టర్ గా గుణశేఖర్ ఉంటాడా.. ? లేక డైరెక్షన్ కూడా త్రివిక్రమే చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే హిరణ్యకశిప కామిక్ పోస్టర్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
సినిమాలు బ్రేక్ ఇచ్చి సామ్ ఏం చేస్తుందో చూడండి..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే తన సినిమాలు అన్నింటిని పూర్తిచేసిన ఆమె దాదాపు ఒక ఏడాది వరకు బ్రేక్ తీసుకునున్నట్లు తెలిపిన విషయం తెల్సిందే. ఇక ఈ బ్రేక్ లో సామ్ ఏం చేస్తుందో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్తోంది అని చెప్పగా .. మరికొంతమంది వెకేషన్ కు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అయితే వాటికి భిన్నంగా సమంత సద్గురు ఆశ్రమంలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇషా ఫౌండేషన్ కు సమంతకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనశ్శాంతి కోసం ఆమె ఎప్పటి నుంచొ ఆ ఆశ్రమానికి వెళ్తూ ఉంది. సద్గురు మాటలు ఆమెకు దైవ వాక్కుతో సమానం. ఇక ఈ ఏడాది సామ్.. ఈ ఆశ్రమంలోనే గడపనుందని సమాచారం. తాజాగా కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో సామ్ ధ్యానంలో పాల్గొని కనిపించింది. ఈ ఫోటోలను సామ్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. “ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా.. నిశ్శబ్దంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ఇంత ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు” అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ ఫొటోలో సమంత ఎంతో అందంగా కనిపించింది. ఆమె మోములోని ప్రశాంతత వలన ఆమె మరింత అందంగా కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి సామ్.. ఈ ఏడాది మొత్తం ఇక్కడే ఆధ్యాత్మిక చింతనలో గడిపేస్తుందా.. ? లేక బయటకు వస్తుందా.. ? అనేది చూడాలి.