తనకు అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని..
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారంటూ.. సోషల్ మీడియాతో మాటు కొన్ని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. దీంతో, తమ నేతకు ఏమైంది? అనే ఆందోళన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో మొదలైంది.. అయితే, తనకు అనారోగ్యం అంటూ జరుగుతోన్న ప్రచారంపై తానే క్లారిటీ ఇచ్చారు కొడాలి.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. చంద్రబాబును రాజకీయాల నుంచి, రాష్ట్రం నుంచి ఇంటికి పంపే వరకు నేను భూమి మీదే ఉంటానంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు. నాకు ఎలాంటి క్యాన్సర్ లేదని స్పష్టం చేశారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుని మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు కొడాలి నాని.. 2024 ఎన్నికలు అయిన తర్వాత వీళ్లకి మానసిక వైకల్య కేంద్రంలో చేరుస్తామన్న ఆయన.. దమ్ముంటే నాపై పోటీకి దిగాలని చంద్రబాబు, లోకేష్ కు సవాలు చేసినా స్పందించటం లేదన్నారు. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పలికే వరకు నేను భూమి మీదే ఉంటా.. ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాల వల్ల నాకేం కాదన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
పవన్‌కు మాస్ వార్నింగ్.. వెంట్రుక కూడా పీకలేవు..!
ఇరిటేషన్ స్టార్ రెండు రోజులుగా వాలంటీర్లని, సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. సీఎం వైఎస్ జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2024లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అర్ధం అయ్యింది.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. పవన్ వాలంటీర్ల కళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.. లేదంటే వాళ్లే పవన్ సంగతి తెలుస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా. మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుంది అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నీకు సమాచారం ఎవరు ఇచ్చారు..? అంటూ దుయ్యబట్టారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6 స్థానంలో ఉంది.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా? మాట్లాడితే హైదరాబాద్ లో వుండలేవు అంటూ కామెంట్ చేశారు. ఇక, నందమూరి బాలకృష్ణ.. జనసేన వాళ్లను అలగా జనం అన్నారు.. అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా వెళ్లావు? అని ప్రశ్నించారు.
ఎస్‌ఐపీబీలో సీఎం కీలక వ్యాఖ్యలు.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఇలా చేయండి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఎస్‌ఐపీబీ.. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలని స్పష్టం చేశారు.. దీనిని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.. ఇప్పటికే ఇది అమల్లో ఉంది. సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు అవుతుంది.. ఇది సరిగ్గా అమలవుతుందా? లేదా? అన్నదానిపై సమీక్ష చేసి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలన్నారు.. ప్రైవేట్ సహా అన్నిరకాల పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు అనేది అత్యంత ముఖ్యమైనది అన్నారు సీఎం జగన్.. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇచ్చే క్రమంలోనే పరిశ్రమలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నాం.. భూములు ఇతర వనరులు సమకూరుస్తున్నాం.. స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇది చేస్తున్నాం. ఒక పరిశ్రమ ఏర్పాటు, అది సమర్థవంతంగా నడవాలంటే ఆ ప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరం అన్నారు.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఎస్సీ నోటిఫకేషన్..
ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు శుభవార్త.. టెట్‌లో అర్హత సాధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారా? అయితే, మీరు సిద్ధం కావాల్సిన సమయం రానే వచ్చింది.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నోటిఫకేషన్ విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దగ్గర ఉందని.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్.. ఎప్పటి నుంచో తెలుసా..?
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రతి రోజూ వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తుంటారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి రోజు పది వేల మందికి పైగా భక్తులు వెళ్తారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా గంటన్నర పాటు సిటీ దాటేందుకు టైం పడుతోంది. దీంతో బస్సుల్లో, ప్రైవేట్ వెహికిల్స్ అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది. ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ సమస్య లేకుండా తొందరగా యాదాద్రికి చేరుకోవచ్చునని కోరుతున్నారు. ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి కావాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత్‌లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
దశాబ్ధాలుగా పేదరికంతో బాధపడుతున్న భారతదేశం, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పేదరికం తగ్గముఖం పట్టింది. గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. యూన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(UNDP), ఆక్స్‌ఫర్డ్ ‘పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్(OPHI)లు కలిసి ‘గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’(MPI) వెల్లడించాయి. భారత్ తో సహా చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో కలిపి 25 దేశాలు పేదరికాన్ని సగానికి తగ్గించుకున్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే (2005-06- 2019-2021)లో 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో 55.1 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 16.4 శాతానికి పడిపోయినట్లు నివేదికి పేర్కొంది. 2005-06లో దేశంలో దాదాపుగా 64.5 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకి, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది. 110 దేశాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా MPIని రూపొందించారు.
కునోలో మరో చిరుత మృతి.. 3 నెలల్లో 7వ మరణం..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లో వరసగా చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఈ రోజు మరో మగ చిరుత మరణించింది. మూడు నెలల్లో కునోలో 7వ చిరుత మరణించింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో చిరుత మెడపై గాయాలు గమనించిన తర్వాత వైద్య బృందాన్ని అప్రమత్తం చేశారు. గాయానికి చికిత్స చేసేందుకు మత్తు మందు ఇచ్చి చికిత్స చేశారు. మగ చిరుత తేజస్ మధ్యాహ్నం 2 గంటలకు చనిపోయిందని, గాయాలపై దర్యాప్తు చేస్తుననట్లు, శవపరీక్ష తర్వాత మరణానికి కారణాలు తెలుసుకోవచ్చని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ JS చౌహాన్ తెలిపారు. మార్చి 27న సాషా అనే ఆడ చిరుత కిడ్నీ వ్యాధితో మరణించింది. అంతకుముందు ఏప్రిల్ 23న ఉదయ్ అనే చిరుత కార్డియో పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా మరణించింది. మే 9న దక్ష లనే ఆడి చిరుత మేటింగ్ సమయంలో మగ చిరుతల దాడిలో మరణించింది. మే 25న రెండు చిరుత పిల్లలు తీవ్ర వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాయి.
చికెన్ బిర్యానీ వదిలేసింది.. తులసి పూజ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ మహిళ
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(30), నోయిడా వ్యక్తి సచిన్ మీనాల(25) ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్జీ గేమ్ ఇద్దరు ప్రేమలో పడేందుకు కారణం అయింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్, సచిన్ మీనాతో ప్రేమలో పడింది. ఇద్దరు తొలిసారిగా నేపాల్ లో కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత సీమా పాకిస్తాన్ వెళ్లి, తన నలుగురు పిల్లలతో కలిసి మరోసారి నేపాల్ వచ్చి అక్కడ నుంచి బస్సు ద్వారా నోయిడాకు చేరుకుంది. ఇదిలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, ఇతర దేశాలకు చెందిన వ్యక్తి ఆశ్రయం కల్పించడం వంటి కేసులో సీమా, సచిన్ ఇద్దరు అరెస్టయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే సీమా తన భర్త హిందువు, భారతీయుడని, ఇప్పుడు నేడు కూడా హిందువు, భారతీయులరాలినే అని ప్రకటించింది. తాను ఇకపై పాకిస్తాన్ వేళ్లేది లేదని, ఇకపై భారతదేశమే నా దేశం అని ప్రకటించింది.
ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
గుర్రపు పందేలు, ఆన్ లైన్ గేమింగ్, కేసినోలపై 28 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్‌టీ కౌన్సిల్ 50వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, కేసినోలపై 28 శాతం జీఎస్‌టీని విధించాలని చాలాకాలం క్రితమే మంత్రుల బృందం జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేసింది. దీనిపై పలుమార్లు జీఎస్‌టీ కౌన్సిల్‌లో చర్చ కూడా కొనసాగింది. చివరకు 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోకి వీటిని తీసుకురావాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్‌టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమింగ్‌పై పూర్తి ఫేస్ వ్యాల్యూపై 28 శాతం పన్ను రేటును విధించేందుకు నిర్ణయించింది.. ఇది స్కిల్ అండ్ ఛాన్స్ గేమింగ్ మధ్య తేడా లేకుండా ఉంటుందని, పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య ధృవీకరించారు. ఆన్‌లైన్ గేమింగ్ మాత్రమే కాదు, కేసినోలు, గుర్రపు పందేలకు కూడా ఫుల్ ఫేస్ వ్యాల్యూపై 28 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, రేస్‌కోర్స్ లాంటి వాటిని 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోకి తీసుకురావాలన్న అంశంపై గతంలోనే మంత్రుల బృందం పలుసార్లు చర్చించింది.
పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇక సినిమాలుండవ్: విజయ్
గత కొన్ని వారాలుగా, తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలా ఆయన సినిమాలకు బ్రేక్ కూడా విరామం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ కనగరాజ్ ‘లియో’ తర్వాత, స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘తలపతి 68’ సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 2024 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టడానికి మూడు సంవత్సరాల విరామం తీసుకుంటారని ప్రచారం జరుగుతూ ఉండగా తాజాగా ఈ విషయం మీద తలపతి విజయ్ స్పందించారు. ఇక తన అభిమానులను ఉద్దేశించి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రవేశం తర్వాత ఇక సినిమాలు చేయను అని చెప్పినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు చెందిన విజయ్ మక్కల్ ఇయక్కం నేతలతో ఈరోజు విజయ్ సమావేశమయ్యారు. మధ్యాహ్నం చెన్నైలోని పనైయూర్‌లోని సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సమావేశంలో పాల్గొన్న ఓ సభ్యురాలు విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయం వచ్చినప్పుడు సినిమాల నుంచి తప్పుకుంటానని, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటానని విజయ్ ఈ సమావేశంలో చెప్పారని ఆమె వెల్లడించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఎప్పుడైతే ఆయన తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ కార్యచరణను ప్రారంభిస్తారని కూడా ఆమె అన్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రజనీకాంత్, అజిత్ కుమార్ అభిమానులు విజయ్‌కి మద్దతు ఇస్తారని విజయ్ అభిమానులు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు.
గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే.. ఎట్టా ఉంటాదో తెలుసునా.. ?
వైవా అనే చిన్న షార్ట్ ఫిల్మ్ తో ఫేమస్ అయ్యాడు హర్ష. ఆ షార్ట్ ఫిల్మ్ ఎంత ఫేమస్ అయ్యింది అంటే హర్ష ఇంటిపేరు వైవాగా మారిపోయింది. ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత వైవా హర్ష దశ మారిపోయింది. వరుస సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి కామెడీచేసి స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.ఇక ఇప్పుడు ఆ స్టార్ కమెడియన్ కాస్తా హీరోగా మారాడు. అవును వైవా హర్ష హీరోగా నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని RT టీమ్ వర్క్స్ మరియు గోల్ డెన్ మీడియా బ్యానర్స్ పై మాస్ మహారాజ రవితేజ, సుధీర్ కుమార్ కుర్రా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వైవా హర్ష సరసన దివ్య శ్రీపాద నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సుందరం మాస్టర్ గా వైవా హర్ష కనిపించాడు. ఇక కథ విషయానికొస్తే.. సుందరం మాస్టర్ ఒక సోషల్ టీచర్. అతనికి ఇంగ్లిష్ అస్సలు రాదు. అయితే అతనిని.. ఒక గిరిజన తెగ పిల్లలకు చదువు నేర్చపించడానికి ఇంగ్లిష్ టీచర్ గా పంపిస్తారు. సోషల్ టీచర్ అయిన సుందరం మాస్టర్ .. ఆ తెగలో ఉన్న పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా చదువు చెప్పాల్సి వస్తుంది. దీంతో సుందరం మాస్టారు.. వారికి ABCD చెప్పడం కోసం తంటాలు పడుతుంటాడు. ఈలోపే ఆ గిరిజనులు ఫ్లూయింట్ ఇంగ్లిష్ లో మాట్లాడడంతో సుందరానికి చెమటలు పడతాయి. అతనికి ఇంగ్లిష్ మాట్లాడడం రాదని తెలుసుకున్న గిరిజనులు అతడితో పనులు చేయిస్తూ ఉంటారు. మరి.. ఆ గిరిజనుల దగ్గర నుంచి సుందరం మాస్టర్ బయటపడతాడా.. ? అసలు ఎందుకు ఆ గ్రామానికి సుందరం వెళ్లాల్సి వచ్చింది.. ? గిరిజన యువతిని ప్రేమించిన మాస్టర్.. పెళ్లి చేసుకున్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ ను బట్టి ఇదొక కామెడీ సినిమాగా తెలుస్తోంది. టైటిల్ పాత్రలో వైవా హర్ష నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే..ఎంత అందంగా ఉంటుందో ఈ టీజర్ లో కనిపిస్తుంది. ఇక శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వైవా హర్ష ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.