*అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం..
అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం కన్నులపండగగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. అటు.. జనక్‌పూర్ ధామ్‌లోని జానకి ఆలయంలో కూడా దీపోత్సవం నిర్వహించారు. ఆ సమయంలోనే.. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా దీపాలను వెలిగించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో దీపావళి తరహా సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నివాసం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. ప్రధాని మోదీ కూడా దీపం వెలిగించారు. కాగా.. ఇటీవల, ప్రధాని మోదీ దేశ ప్రజలకు “ప్రాణ ప్రతిష్ట రోజు తమ తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని చెప్పారు. ఈ క్రమంలో.. దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు దీపాలను వెలిగించి రామభక్తిని చాటుకున్నారు. మరోవైపు.. మంత్రులందరూ తమ నివాసాలలో దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. అంతేకాకుండా.. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా తమ ఇళ్లలో దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని అన్నారురు. అంతేకాకుండా.. జనవరి 22 తర్వాత సంబంధిత పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ప్రజలను రైళ్లలో అయోధ్యకు తీసుకురావాలని ప్రధాని మోదీ అన్నారు.
*అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో.. మరో రామ మందిరం ప్రారంభం..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అశేష జనవాహిని హాజరైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా.. సినీ, రాజకీయ, స్పోర్ట్స్, వ్యాపార ప్రముఖులు అతిథులుగా వచ్చారు. శతాబ్ధాల హిందువుల కల నేటితో నిజమైంది. ఇదిలా ఉంటే అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలోని మరో రామ మందిరం ఇదే రోజున ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై గొప్ప రామ మందిరం నిర్మితమైంది. ఓ వైపు అయోధ్య రామ మందిర కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు ఒడిశా నయాఘర్‌లోని ఫతేగర్ గ్రామంలో మరో ఆలయం ప్రారంభమైంది. 165 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇచ్చిన విరాళాలతో ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల్లో సగం ఫతేగర్ వాసులే ఇచ్చారు. 2017లో ప్రారంభమై ఈ ఆలయంలో ఎంతో మంది పాలుపంచుకున్నారు. ఈ ఆలయం అనతి కాలంలోనే పర్యాటక క్షేత్రంగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు. సాంప్రదాయ ఒడియా నిర్మాణ శైలిలో ఆలయం నిర్మితమైంది. కోణార్క్ వంటి ప్రసిద్ధ ఆలయాలను ఇది గుర్తుకు తెస్తుంది. ఆలయంలో సూర్యదేవుడు, శివుడు, గణేశుడు, హనుమంతుడిని కూడా ప్రతిష్టించారు. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని ఇక్కడి ఆలయ కమిటీ చెప్పింది. ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్ధాలు పూజలు అందుకున్నాడని, 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన చెట్టను ఫతేఘడ్ నుంచి సేకరించినట్లు చెప్పారు.
*ప్రధాని కీలక నిర్ణయం.. కోటి ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయం
రామనగరి అయోధ్య నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. కాగా.. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గుతుందని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు ఇంధన రంగంలో కూడా భారతదేశం స్వావలంబన సాధిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం ముగిసింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సమక్షంలో పవిత్రోత్సవం నిర్వహించారు. రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత తన ట్వీట్ లో “ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశ భగవంతుడు శ్రీరాముని కాంతి నుండి శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా.. భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై వారి స్వంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది”. అని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు.
*భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే..
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. భూమిపై అత్యంత అదృష్టవంతుడని భావిస్తున్నానని ఆయన అమితానందం వ్యక్తం చేశారు. ఇదంతా కల మాదిరిగా అనిపిస్తోందని అన్నారు. “నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది’’ అని యోగిరాజ్ అన్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగిరాజ్ చెక్కిన బాలరాముని విగ్రహానికి ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. కాగా.. కర్ణాటకకు చెందిన శిల్పి యోగిరాజ్.. గతంలో ఎన్నో దేవాలయాల కోసం ఎన్నో విగ్రహాలను రూపొందించాడు. అయినప్పటికీ.. రామ్ లల్లా విగ్రహం కోసం యావత్ దేశం ఎదురుచూసిందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారని.. ఇలాంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదని శిల్పి చెప్పాడు. యోగిరాజ్ తన కుటుంబంలో ఐదవ తరం శిల్పి.
*అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలు.. టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం!
ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీల టెర్మినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 20 శాతం మంది అంగన్వాడీలు విధుల్లో చేరినట్లు సమాచారం. మొత్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తవారిని చేర్చుకునేందుకు 26వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీన అంగన్వాడీల టెర్మినేషనుకు సంబంధించిన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 25వ తేదీన కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిసింది. అంగన్వాడీల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఓ వైపు సుదీర్ఘంగా సమ్మె చేయడంతో పాటు.. ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వారిపై చర్యలకు సిద్ధం అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆర్డర్స్‌ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు. అందులో భాగంగా విశాఖ జిల్లాలోని అంగన్వాడీలకు షాక్ ఇచ్చారు కలెక్టర్.. ఎస్మా ఉల్లంఘనకు పాల్పడ్డ సిబ్బంది తొలగింపుకు చర్యలు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇళ్లకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
*అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్‌కు పిలుపు
అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి. ఈ పిలుపును రాష్ట్ర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, వివిద వర్గాల ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, టీఎన్టియూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్, తదితరులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మరోవైపు.. దీక్షలో కూర్చున్న అంగన్వాడీలను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారని ఏపీ అంగన్వాడీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి తీవ్రంగా మండిపడ్డారు. మహిళలని చూడకుండా రోడ్డుపై ఈడ్చి పారేసిన చర్యలను ఖండిస్తున్నామన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోటి సంతకాల సేకరించి సీఎంకు అందించాలని భావించామన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా మా పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. అనేక పోలీస్ స్టేషన్లకు తరలించినా అక్కడ కూడా మా అంగన్వాడీలందరూ ఆందోళన చేపడుతున్నారన్నారు. ఎంత దూరం వదిలేసినా మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగించి తీరుతామన్నారు. అంగన్వాడీ మహిళలందరూ కూడా ఇళ్లకు వెళ్ళవద్దన్నారు. ఎక్కడ అయితే అరెస్టు లో ఉన్నారో అక్కడే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్టేషన్ నుంచి వదిలిన వెంటనే మళ్లీ విజయవాడ తరలి రావాలని కోరుతున్నామన్నారు. మా ఉద్యమాన్ని అంచివేయాలని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నాయకులు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని అంటున్నారని.. పోలీసులు వాటిని నిరూపిస్తే… ఆ కోటి వాళ్లకే ఇస్తామన్నారు. పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. అంగన్‌వాడీలను తొలగించి, ఇరవై వేల మందిని కొత్తగా నియమించామని అబద్దాలు చెబుతున్నారని.. అంగన్వాడీ మహిళా ఉద్యమాల వెనుక ఎటువంటి రాజకీయ శక్తులు లేవన్నారు. హక్కులు సాధించుకునే వరకు ఈ పోరాటం, ఉద్యమం కొనసాగుతుందన్నారు.
*ఎమ్మెల్సీలుగా మహేష్ గౌడ్, వెంకట్ ఏకగ్రీవ ఎన్నిక
ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నేడు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నిక ధ్రువీకర పత్రం తీసుకున్నారు వెంకట్..మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని, బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందన్నారు శ్రీధర్ బాబు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 9 సంవత్సరాలు నాతో పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు బల్మూరి వెంకట్. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నా సేవలు గుర్తించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే పదవులు వస్తాయన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కౌన్సిల్ లో నా వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.
*ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రయంగా విసిరికొట్టిన నాపై.. మద్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు వెంకట్‌రెడ్డి. ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మోహం కిందకు వేసే అహంకారి వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్ లో అక్రమాలు, ఛత్తిస్ ఘడ్ కరెంట్ కొనుగోళ్ల దోపిడీలు బయట పెడుతున్నాననే నాపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరు ఆపలేరని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ప్యారాగన్ స్లిప్పర్లు వేసుకున్న వ్యక్తి ఇవ్వాల వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్ లు ఎట్లొచ్చినయి.. తెలంగాణ ప్రజలకి చెప్పాలే అని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో కేసియర్ కుటుంబం తర్వాత జైలు కు పోయే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో బావ బామ్మర్థులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కెసిఆర్ ఆడించే జోకర్ జగదీష్ రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర వ్యక్తి నిత్యం ప్రజల్లో, ప్రజల కోసం బతికే నాపై ఆరోపణలు చేస్తాడా.. నల్గొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.
*ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించాం..
తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఏపీలో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు. 18-19 మధ్య వయస్సున్న యువ ఓటర్లు- 8.13 లక్షల మంది ఉన్నారని.. యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందని.. దీనిపై ప్రచారం చేపడతామన్నారు. ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామని ఈ సందర్భంగా చెప్పారు. ఒకే ఇంట్లో పది మందికి పైగా ఓటర్లున్నారనే ఫిర్యాదులను సుమారు 98 శాతం వరకు పరిష్కరించామన్నారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. ఈ ఫిర్యాదులను పరిశీలించామని.. 5.64 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫాం-7 దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల పైనా ఫోకస్ పెట్టామన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలకపై ఏపీలో మొత్తంగా 70 కేసులు నమోదయ్యాయన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లని నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉంటే.. ఆ అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ప్రతి ఓటరు తన పేరుని ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవాలని ఏపీ సీఈవో ఎంకే మీనా సూచించారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ విషయంలో ఓ ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు సస్పెండ్ అయ్యారని ఆయన చెప్పారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారం వెనుక ఎవరున్నారోననే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
*ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కోహ్లీ, రోహిత్ శర్మకు దక్కని చోటు
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. సూర్యకుమార్ వరుసగా రెండో ఏడాది జట్టులో స్థానం సంపాదించి టీ20 పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో ఉన్నాడు. కాగా.. ICC పురుషుల T20 ప్లేయింట్ ఎలెవన్ లో జైస్వాల్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, వికెట్ కీపర్‌గా వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్, న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్‌మన్, జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, ఉగాండా ఆల్ రౌండర్ అల్పేష్ రంజానీ, ఐర్లాండ్‌కు చెందిన మార్క్ అడైర్, జింబాబ్వేకు చెందిన రిచర్డ్ నగర్వాను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయలేదు. మహిళల జట్టు విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన ఆటపట్టును కెప్టెన్ గా ఎంపిక చేశారు. టీమిండియా ఆటగాళ్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మను సెలెక్ట్ చేశారు. నలుగురు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు ఉన్నారు. బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎల్లీస్ పెర్రీ, యాష్ గార్డనర్, మేగాన్ స్కట్.. ఇంగ్లండ్‌కు చెందిన నాట్ స్కివర్-బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్ ఇద్దరు.. దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్, వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్, న్యూజిలాండ్ కెర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.