*ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే ఆగం అయ్యింది..
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ బడ్జెట్ ప్రిపరేషన్ పై చర్చ జరిగిందని అన్నారు. పేదవాడికి బియ్యం సప్లై చేసే శాఖ పై గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 2014-15లో రూ.383 కోట్లు ఏరియర్స్ ఉంటే.. సంవత్సరానికి పెరుగుతూ వచ్చిందనని తెలిపారు. రూ.14వేల కోట్లు బకాయి పడిందని మంత్రి భట్టి విక్కమార్క చెప్పారు. గతంలో సివిల్ సప్లై వాళ్ళు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే వారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కానీ.. 2016 -17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. సివిల్ సప్లై శాఖకు ఒక్కో సంవత్సరం రూ.6 వేల కోట్లు , 8 వేల కోట్లు, 11వేల కోట్లు, 45 వేల కోట్లు, 45 వేల కోట్లు, 50 వేల కోట్లు భారం పడిందని తెలిపారు. మొత్తంగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ రూ. 58, 860 కోట్లు అని భట్టి తెలిపారు. ఉన్న పాత బకాయిలు కట్టడం కోసం.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వం మళ్ళీ అప్పు తీసుకున్నారని ఆయన చెప్పారు. దీంతో.. సివిల్ సప్లై పై భయంకరమైన భారం పడిందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు గ్యారెంటీ ఇస్తే తప్ప.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. కాగా.. ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే రాష్ట్రం ఆగం అయ్యిందని దుయ్యబట్టారు. ఇంత భారం ఉన్నా.. లబ్ధిదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సివిల్ సప్లై శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం.. ఎన్ని కష్టాలు పడ్డ ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
*తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్సే..
రాష్టాన్ని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అలా చేయడం తగదని మంత్రి ఉత్తమ్ సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు భారం పెంచిందని తెలిపారు. ఇదిలా ఉంటే.. కృష్ణా బోర్డు పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. పదేళ్ళలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఏపీ డైవర్ట్ చేసుకున్నారన్నారు. ఏపీ వాళ్ళు 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతుంటే బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తెలంగాణకు వస్తుంటే కాదని.. లక్ష కోట్లతో గోదావరి నీటిని వాడుకుంటామని కాళేశ్వరం కట్టారని విమర్శించారు. బీఆర్ఎస్.. చేసిన ద్రోహాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కాగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి ఏడు మండలాలు పోయాయని ఉత్తమ్ తెలిపారు.
*ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పని చేస్తాం
హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఆర్భాటంగా ప్రారంభించిన పథకాల పైన చర్చ జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఇరిగేషన్ పైన చర్చించామన్నారు. మిషన్ భగీరథ, కాలువలు తవ్వని అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఫారెస్టు క్లియరెన్స్ కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించామన్నారు. అంతేకాకుండా.. 6 గ్యారెంటీల పథకాల కోసం సేకరించిన దరఖాస్తులు గురించి చర్చించామని మంత్రి పేర్కొన్నారు. కాగా.. సమ్మక్క సారక్క మహాజాతరకు రూ.105 కోట్లతో పనులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం వారి అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులు పరిస్థితి పైనా సమలోచన చేశామని పేర్కొన్నారు. ఏవి సాధ్యం.. ఏవి కాదు అనే అంశం చర్చకు వచ్చిందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పని చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 30 ఏళ్ళుగా రాజకీయల్లో ఉన్నాను.. ప్రజల సమస్యలను అనుకూలంగా కాంగ్రెస్ పని చేస్తోందని అన్నారు. రూ.300 కోట్లు పనులు శిలాఫలకాలు వేసి వెళ్లిపోయారు.. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలలో అర్ధం కావడం లేదని తెలిపారు. అధికారుల వారి సమస్యలు చెప్పుకొనే స్వచ్ఛ ఈరోజు వచ్చిందని సీతక్క అన్నారు.
*ఎన్నికల కమిటీలను వేసిన జనసేన.. జోనల్ వారీగా కమిటీల నియామకం
2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జోనల్ వారీగా ఎన్నికల కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, గోదావరి, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలను నియమించారు. ఈ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో లీగల్, డాక్టర్ సెల్స్ తరఫున సభ్యులు ఉంటారు. ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జోనల్ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. రేపు జోనల్ కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పవన్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా కమిటీల ఏర్పాటు చేశారు.
*విజయవాడ పశ్చిమ టికెట్.. టీడీపీ-జనసేన కూటమిలో పెరుగుతున్న పోటీ
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం టిక్కెట్ విషయంలో పెరుగుతున్న పోటీ. విజయవాడ పశ్చిమ టికెట్ కోసం అంతర్గతంగా టీడీపీ-జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది. ఆ సీటు తమదేనంటూ టీడీపీ నాయకులు బహిరంగంగా ప్రకటనలు ఇస్తుండగా.. మరో వైపు పశ్చిమ సీటు తమదేనంటూ జనసేన పార్టీ నాయకులు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేనకు కేటాయిస్తారన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయితే కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సీటు విషయంలో ఎవరికి వారు తమదేనంటూ బహిరంగ వేదికలపై పోటీపడి ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే జనసేన తరపు నుంచి పోతిన మహేష్ బరిలో ఉన్నారు. ఈ క్రమంలో జనసేనకు కాకుండా టీడీపీకి టిక్కెట్ కేటాయించాలంటూ అధిష్టానంపై టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. విజయవాడ పశ్చిమం టికెట్ తనకు ఇవ్వాలని.. తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తానని బుద్దా వెంకన్న నారా లోకేష్‌ను కోరినట్లు తెలిసింది. ఇరు పార్టీల నేతలు విజయవాడ పశ్చిమ టికెట్ తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం ఆ రెండు పార్టీల నేతల మధ్య దూరం పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభంకాక ముందే ఈ విధమైన గలాటాలు ఆ పార్టీ శ్రేణులను గందర గోళానికి గురిచేస్తున్నాయి.
*వైసీపీ పార్టీని వీడే ఆలోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్నారు. అలాగే కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా టీడీపీలో చేరిపోయారు. తాజాగా వైయస్సార్సీపీ పార్టీ వీడే ఆలోచనలో పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల టికెట్ ఆశిస్తున్నారు. అధిష్ఠానం నుంచి ఏవిధమైన స్పందన లేకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్సీ జంగా.కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ తీర్ధం పుచ్చుకొనే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి ఉన్నట్లు సమాచారం. గుంటూరులోని ప్రముఖ హోటల్లో తన ముఖ్య అనుచరులుతో, పార్టీ కార్యకర్తలుతో జంగా కృష్ణమూర్తి కీలక భేటీ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో తన కుమారుడు జంగా కోటయ్య పిడుగురాళ్ల జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
*వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరా..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల అన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద వైఎస్ షర్మిల నివాళులర్పించారు. రేపు విజయవాడలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే ముందు నాన్న ఆశీర్వాదం తీసుకున్నానని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం, వైఎస్సార్ ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు పోరాటం ఆగదని షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నిలబెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన రాజకీయ గురువు రాజశేఖర్ రెడ్డి కోసం కాంగ్రెస్‌లో చేరినట్లు అహ్మదుల్లా తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..”వైఎస్ కుటుంబంతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కుటుంబాలు ఒకే బాటలో నడిచాయి. రాజకీయ విభేదాలు ఉన్నా సాన్నిహిత్యం వీడలేదు. వైఎస్ షర్మిల మేనకోడలు మాత్రమే కాదు కూతురితో సమానం. కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా షర్మిల నిలబడి దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ షర్మిల. రాజశేఖర్ రెడ్డి ఆత్మాభిమానూలు షర్మిలపై ఉండాలి.. రాష్ట్రంలో పూర్వ వైభవం షర్మిలతో సాధ్యం అవుతుంది. ” అని కేవీపీ అన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ..”రాహుల్ ప్రధాని కావాలన్న కోరిక కోసమే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇది రాజశేఖర్ రెడ్డి కల. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పురుడు పోసుకుంటుంది. మాజీ నేతలంతా తన వెంట నడవడానికి సిద్ధం. రాష్ట్రం హక్కులు సాధించడంలో షర్మిల పాత్ర కీలకం కావాలి. ఎర్రకోటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి ఆ విధంగా అందరం కృషి చేస్తాము. అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబం గతంలో చాలా భాద్యతలు తీసుకొని పార్టీ కోసం కష్టపడ్డారు. అహ్మదుల్లా చేరిక ప్రారంభమే ఇంకా పార్టీలోకి చేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు.” అని ఆయన అన్నారు.
*మయన్మార్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేస్తాం..
భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు. గత మూడు నెలల్లో దాదాపు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించారు. పశ్చిమ మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో అరకాన్ ఆర్మీ మిలిటెంట్లు సైనిక స్థావరాలను చేజిక్కించుకున్న తర్వాత వందలాది మంది సైనికులు మిజోరాంలోని లాంగ్‌ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందారు. మరోవైపు ఇటీవల మణిపూర్ ఘర్షణల్లో కూడా మయన్మార్ మిలిటెంట్ల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలను అడ్డుకోవడానికి ఫ్రీ మూమెంట్ రెజిమ్(ఎఫ్ఎంఆర్)ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారతదేశం-మయన్మార్ సరిహద్దులో నివసించే ప్రజలు కుటుంబ మరియు జాతి సంబంధాలను కలిగి ఉన్నందున 1970లలో FMR తీసుకురాబడింది. 2021లో మయన్మార్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దెదించి, కీలక నేత అంగ్‌సాంగ్ సూచీని అక్కడి సైన్యం అరెస్ట్ చేసి పాలనను తమ చేతుత్లోకి తీసుకుంది. దీంతో అప్పటి నుంచి జుంటా పాలకులకు వ్యతిరేకంగా చాలా మంది తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సైనికులు తిరుగుబాటుదారుల దెబ్బకు ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.
*గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..
బిగ్గరగా “గురక” పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి. 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్, క్రిస్టోఫర్ కేసీ(55) ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్నారు. అయితే వాలెస్ గురకపై పలుమార్లు కేసీ ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఈ వివాదంపై ఇరువురి మధ్య తీవ్రవివాదం చోటు చేసుకుంది. జనవరి 15న కేసీ, వాలెస్‌ని కత్తితో పొడిచాడు. కత్తిపోట్లకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు స్పందించారు. అప్పర్ మోర్‌ల్యాండ్ టౌన్‌షిప్‌లో కేసీ ఇంటి సమీపంలో వాలెస్ తీవ్రగాయాలతో కనిపించాడు. దాడి చేస్తున్న సమయంలో కేసీకి కూడా గాయాలయ్యాయి. వీరిద్దర్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స సమయంలోనే వాలెస్ మరణించాడు. జనవరి 18న కేసీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంటి ముందు కత్తి, రక్తపు మరకల్ని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ వాలెస్ మరణానికి కారణం అనేక కత్తిపోట్లు అని నిర్ధారించిన తర్వాత, కేసీని గురువారం అరెస్టు చేశారు.