మీకోసం 124 సార్లు బటన్ నొక్కా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి..!
మీకోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 124 సార్లు బటన్ నొక్కా.. నేరుగా అక్క, చెల్లెమ్మల ఖాతాల్లో సొమ్ములు జమ చేశాను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు.. ఈ ఎన్నికల్లో జగనన్న కోసం మీరు పనిచేయాలి.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ జగనన్న రావాలి.. మనం జగనన్న కోసం రెండు బటన్లు (అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో..) నొక్కలేమా అని అందరినీ అడగాలి.. ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు సీఎం జగన్.. ఇక, వాళ్లంతా నాన్ ఆంధ్ర రెసిడెంట్స్.. పెద్ద మనిషి సైకిల్ తొక్కడానికి ఇద్దరినీ, తోయ్యడానికి ఇద్దరినీ పిలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. పొత్తులు లేకపోతే 175స్థానాల్లో పోటీ చేసే ధైర్యం వారికి లేదు.. ఈ యుద్ధం ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి పై కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచం.. వంద బాణాలను, కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రజలను ప్రశ్నించారు. రా కదలి రా అంటూ చంద్రబాబు ప్రజలను కాదు పిలిచేది.. ప్యాకేజీ ఇస్తా అంటూ రా కదలి రా అంటూ దత్త పుత్రుడు, వదినమ్మని పిలుస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు సీఎం జగన్.. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ కు ఫ్యాన్ మీద ఓటు వేస్తే చంద్రముఖి రాష్ట్రం నుంచి శాశ్వతంగా పోతుంది.. గ్రహణం పోతుంది.. లేదంటే పేదల జీవితాల్లో లకలక అంటూ అబద్ధపు హామీలతో పట్టి పీడిస్తుంది అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చెప్పుకోడానికి ఏమిలేక పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తు వస్తున్నారు.. వెన్నుపోటు పొడిచేది ఆయనే.. అని మండిపడ్డారు. మహిళ సాధికారిత అంటే దిశా యాప్ చూసినపుడు గుర్తుకు వచ్చేది మీ జగన్.. వైఎస్ఆర్ తీసుకు వచ్చిన మంచి పథకాలకు మరో నాలుగు అడుగులు ముందుకు వేసి మరిన్ని పథకాలు తీసుకు వచ్చాం.. ఎప్పుడు వినని పారిశ్రామిక అభివృద్ధి మొదలయ్యింది.. నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవాలు కాదా అని ఆలోచించి ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళాలి.. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేశాం అన్నారు సీఎం వైఎస్ జగన్.
ఆ నలుగురు కాంగ్రెస్ శవాన్ని మోస్తున్నారు.. ఇంకెవరైనా ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుంది..!
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది.. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారు.. ఆ నలుగురికి ఇంకెవరైనా తోడు ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారని గుర్తుచేసిన ఆయన.. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతవరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణం అని ఆరోపణలు గుప్పించారు. అసలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబే మూల కారణంగా పేర్కొన్నారు.. వైఎస్ జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టడానికి, రాష్ట్రం విడిపోవడానికి కూడా చంద్రబాబే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఒక్క ఛాన్స్ ప్లీజ్..! కాంగ్రెస్‌లో ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉంటేనే.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా బాగుంటుందని ప్రచారం మొదలు పెట్టింది.. మరోవైపు.. అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభ బరిలో దిగేందుకు భారీగా పోటీ కనిపిస్తోంది.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను.. 306 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.. అయితే, చివరి రోజు అయిన శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం లోక్ సభ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు.. మల్కాజ్‌గిరి నుంచి బండ్ల గణేష్, ఖమ్మం నుంచి టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్.. నాగర్‌కర్నూల్ నుంచి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ, మల్కాజ్‌గిరితో పాటు వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఇలా ప్రముఖులు సైతం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. మరి టికెట్ దక్కేది ఎవరికో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
5 రూపాయల గుట్కా కోసం గొడవ.. దారుణంగా చంపేశాడు..!
గుట్కా గొడవ ప్రాణం తీసింది. కళ్లు తాగిన తర్వాత గుట్కా కోసం జరిగిన గొడవలో.. కేవలం ఐదు రూపాయల గుట్కా ఓ ప్రాణాన్ని తీసింది.. ఆ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన లాలాజీ రమేష్, పురం శెట్టి యోగేష్.. ఇద్దరు కలసి తెల్ల కళ్ళు తాగారు. గ్రామంలో బట్టిలో తాగి బయటకు వచ్చే సమయంలో యోగేష్ ని రమేష్ గుట్కా అడగాడు. యోగేష్ ఇవ్వకపోవడంతో అదే విషయం మనసులో పెట్టుకొని ఎప్పుడు అడిగినా గుట్కా ఇవ్వవని రమేష్ ఎలాగైనా చంపుతానని తిట్టసాగాడు.. ఆ తర్వాత గుండె భాగంలో పిడుగులు గుద్దగా.. యోగేష్ సృహ తప్పి కిందికి పడిపోయాడని స్థానికులు తెలిపారు.. ఆటు వైపు వెల్తున్న యోగేష్ అమ్మ గొడవను గమనించి కింద పడ్డ అతన్ని గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా అతను మెరుగైన చికిత్స కోసం బైంసాకు పంపారు.. అయితే, భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్ధారించారు. కాగా, గ్రామాల్లో విచ్చల విడిగా తెల్లకల్లు బట్టీలు వెలిశాయి.. అలాంటి బట్టి వద్ద తాగిన మత్తులు గొడవలు సర్వసాధారణం అయ్యాయి.. గొడవలు జరిగినా న్యూసెన్సు జరుగుతున్నా ఎవ్వరు పట్టించుకునే వారు లేరు.. పైగా బట్టీల వ్యాపారం చేసే వారితో కొంతమంది కుమ్మక్కు కావడం అక్కడేం జరిగినా బయటకు రావడం లేదు అంటున్నారు స్థానికులు.. తాజాగా జరిగిన వ్యక్తి హత్య తాగిన మత్తులో జరగడం వివిధ రకాల చర్చకు దారితీస్తుంది.. బట్టిలో తెల్లకళ్లు తాగి బయటకు వచ్చాక గొడవ జరిగిందని మృుతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.. దీన్ని ఆధారంగా యోగేష్ మృతికి కారణం అయిన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మరోవైపు, నిర్మల్ జిల్లాతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో తెల్లకళ్లు బట్టీల విచ్చలవిడి నిర్వాహణ తాగి మైనకం లో గొడవలు తరుచూ జరుగుతున్నాయి.. ఎక్కడో ఒక్కటి బయటకు వచ్చినా దాన్ని బట్టి నిర్వహకులతో మిలాకత్ అయిన సంబందించిన శాఖ లేదా పోలీసులు వెలుగులోకి రాకుండా తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారు
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. మోడీ విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా… అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందామని, మెజార్టీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గెలినేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు… ఓటు వృధా అవుతుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీ అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఉగ్రవాదం పెరిగింది… ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైందని, అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరాలని కోరుతున్నారన్నారు. దేశం కోసం మోడీ కి ఓటు వేయండని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలంగాణ లో రాజకీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కిషన్ రెడ్డి అన్నారు. హిందువుల కోసం భారత దేశం తప్ప మరో దేశం లేదని, హిందుత్వ అంటే జీవన విధానమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉగ్రవాదం పెరిగిందని, ప్రపంచ దేశాల ముందు భారత్ నవ్వుల పాలైందని ఆయన గుర్తుచేశారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందామని, దీనికి ప్రజల మద్దతు కావాలని ఆయన కోరారు. అలాగే పార్టీలో భారీగా చేరికలు జరగాలన్నారు.
రాహుల్ గాంధీ బంగ్లా చొరబాటుదారుల్ని ఏకం చేస్తూ.. హిందువులకు అన్యాయం చేస్తున్నాడు..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను ఏకం చేస్తున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన యాత్రలో ముస్లింలు అందరూ పాల్గొంటున్నారని, దానికి సంబంధించిన వీడియో రుజువు తన వద్ద ఉందంటూ చెప్పారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ముర్షిదాబాద్, మల్దా, కిషన్ గంజ్, కతిహార్, పూర్నియా, పాకూర్, సాహిబ్ గంజ్, గొడ్డాలో పర్యటించారని, ఇవన్నీ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు కేంద్రాలుగా ఉన్నాయని బీజేపీ ఎంపీ అన్నారు. ‘‘మీరు హిందువు కాదు, మీరు మిమ్మల్ని హిందువుగా ప్రకటించుకోవాలంటే దాన్ని స్వాగతిస్తాం. హిందువులను రక్షించండి, ముస్లింలు మీతో ఉండరు’’ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించింది. 00 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మణిపూర్‌తో పాటు, యాత్ర నాలుగు ఈశాన్య రాష్ట్రాలలో యాత్ర సాగింది. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రల మీదుగా యాత్ర కొనసాగి మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.
కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ కౌంటర్
ఢిల్లీ కేంద్రంగా బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ లోటస్-2.0’ అంటూ ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తాజాగా కౌంటర్ ఇచ్చింది. ఆప్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలను రూ.25 కోట్లకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన ఆధారాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కానీ నోటీసు తీసుకునేందుకు సీఎం నిరాకరించారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కోలేక కేజీవ్రాల్ తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన పెద్ద అతినీతిపరుడని ప్రజలకు అర్థమైందని చెప్పుకొచ్చారు. క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ఇచ్చిన నోటీసులను కూడా తీసుకునేందుకు ఆయన నిరాకరించారని.. విచారణ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారని షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
దేశంలో తొలి “టర్బో పెట్రోల్ CNG” కార్‌గా టాటా నెక్సాన్..
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా పాసింజర్ వెహికల్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పెట్రోల్, డిజిల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వెర్షన్లలో కార్లను విడుదల చేస్తోంది. ఇతర ఆటోమేకర్ ఇలా చేయలేకపోతున్నాయి. ఇప్పటికే ఈవీ కార్లలో టాటా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్ ఈవీ వాహనాలు ఉండగా.. త్వరలో హారియర్ ఈవీ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టాటా CNG కార్లపై కూడా దృష్టి సారించింది. టాటా నుంచి ఇప్పటికే టాయాగో, టిగోర్, పంచ్ మోడళ్లలో CNG కార్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తన నెక్సాన్‌ని CNGలో తీసుకురాబోతోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2024లో నెక్సాన్ iCNG కారుని ఆవిష్కరించింది. భారతదేశంలో తొలిసారిగా “టర్బో పెట్రోల్ CNG” కారుగా నెక్సాన్ రాబోతోంది. దీంతో పవర్ పరంగా నెక్సాన్ ఏ మాత్రం పెట్రోల్ కార్లకు తీసిపోకుండా ఉండబోతోంది. నెక్సాన్ CNG 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 118 bhp శక్తిని మరియు 170 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. Nexon iCNG టాటా యొక్క ప్రసిద్ధ ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. టాటా 230 లీటర్ల బూట్ స్పేస్‌ని క్లెయిమ్ చేస్తోంది. ట్విట్ సిలిండర్ టెక్నాలజీ ద్వారా బూట్ స్పేస్‌ని పెంచుతోంది. భవిష్యత్తులో డీజిల్ నిలిపివేయగల సెగ్మెంట్లలో CNGని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు టాటా ఇంతకుముందు పేర్కొంది. త్వరలోనే Nexon iCNG కారుని మార్కెట్లో చూసే అవకాశం ఉంది. నెక్సాన్ ప్రత్యర్థిగా పరిగణించబడుతున్న మారుతి సుజుకి బ్రెజ్జాలో ఇప్పటికే సీఎన్‌జీ అందుబాటులో ఉంది.
ముగిసిన రెండో రోజు ఆట.. ఆధిక్యంలో భారత్
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతున్న టీమిండియా రెండో టెస్టు రెండు రోజు ఆధిక్యంలో నిలిచింది. భారత్‌ను మొదటి సెషన్‌లోనే ఆలౌట్ చేసి ఆ తర్వాత విజృంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు ఆరు వికెట్ల (6/45)ను సమర్పించుకున్నారు. ఇదే కోవలో కుల్‌దీప్ యాదవ్ మూడు వికెట్లు (3/71) తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో.. 253 రన్స్‌కే ఇంగ్లండ్ ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లు ఆడి వికెట్లు ఏమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం ఓవరాల్‌గా 171 పరుగులకు చేరింది. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ (5), ఓల్లీ పోప్ (23), బెయిర్ స్టో (25), కెప్టెన్ బెన్ స్టోక్స్ (47), టామ్ హార్ట్ లే (21), జేమ్స్ ఆండర్సన్ (6) లకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా, తొలి టెస్టు సెంచరీ హీరో ఓల్లీ పోప్ ను బుమ్రా అవుట్ చేసిన యార్కర్ అద్భుతమనే చెప్పాలి. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. యువకెరటం యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ చేయడం రెండో రోజు తొలి సెషన్ లో హైలైట్ గా నిలిచింది.
నేను చేస్తుంది సేవ.. రేట్లు ఎక్కువ అన్నవారిపై కిర్రాక్ ఆర్పీ ఫైర్
జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక కామెడీ షోలు అన్ని పక్కన పెట్టి నెల క్రితమే కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఊహించని విధంగా ఈ కర్రీ పాయింట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి వచ్చే జనాన్ని ఆపలేక ఆర్పీ బౌన్సర్లను కూడా పెట్టాడు. దాదాపు లక్షల్లో లాభాలను ఆర్జించడం మొదలుపెట్టాడు ఆర్పీ. నెల్లూరు నుంచి ఫ్రెష్ చేపలను తెచ్చి.. మంచిగా వండుతుండడంతో జనాలు కర్రీ పాయింట్ కు క్యూ కట్టారు. ఇక ఆ తరువాత మొదలయింది అసలు సమస్య. ఇప్పుడు కుమారి ఆంటీ ఎలాగో అప్పుడు ఆర్పీ కూడా అలాగే తన షాప్ ను మూసివేయాల్సి వచ్చింది. అయితే ఆర్పీ మాత్రం చిన్న షాప్ ను పెద్దది గా చేసి షాక్ ఇచ్చాడు. ఇలా హైదరాబాద్ లో మూడు బ్రాంచ్ లను ఓపెన్ చేశాడు. ఇప్పుడు వేరే ఊర్లలో కూడా బ్రాంచ్ లను ఓపెన్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే .. చేపల పులుసు టేస్ట్ ఏమో కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయని చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ విమర్శలపై కిర్రాక్ ఆర్పీ స్పందించాడు. ” మీరు కిలో చికెన్ కొంటే కిలో చేతికి వస్తుంది. మటన్ కెలో కొంటే కిలో చేతికి వస్తుంది. కానీ కిలో చేప తీసుకుంటే మాత్రం కిలో చేతికి రాదు. తలకాయ, తోక పోతాయి. మధ్యలో ఉండే పీసులే నేను అమ్మాలి. ఇతర కూరల్లో వేసిన దానికి వంద రెట్లు ఎక్కువగా చేపల కూరలో నూనె వాడాలి. రుచి కోసం మామిడి కాయలను యాడ్ చేయాలి. అవి కూడా చాలా రేట్లు పలుకుతున్నాయి. ఇవొక్కటే కాదు.. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆఖరిలో వేసే మసాలా, కొత్తిమీర.. ఇలా చేపల కర్రీకి ఉపయోగించే పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే నా కర్రీపాయింట్‌లో ధరలు ఉన్నాయి. ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల వ్యాపారం జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి అల్లం పేస్ట్ కలిపి ఊరికే కూడా ఇస్తాను. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది. నేను లాస్ అవ్వలేను.. నేను చేస్తుంది కూడా సేవతో సమానమే. చికెన్,మటన్ దొరికినట్లు చేప అన్ని ప్రదేశాల్లోనూ దొరకదు. అవన్నీ ఎక్కడెక్కడ నుంచో తెప్పించి.. కూరలు చేసి అమ్ముతున్నాం.. ఇదొక రిస్కీ బిజినెస్.. అందుకే ఆ రేట్లు ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పూనమ్ చావుదెబ్బ.. ఉరుకులు పరుగులు పెట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు
శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చేయబడింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనమ్ ను కోల్పోయాం అని అందులో రాసి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కూడా చెప్పారు. మొదట్లో ఎవరూ నమ్మలేదు, కానీ వార్తా సంస్థలు కూడా ఈ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తలను ధృవీకరించడమే కాదు, ఆమె మేనేజర్ కూడా వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ తన మరణ వార్తను ధృవీకరించారు. అయితే అనేక అనుమానాల నేపథ్యంలో శనివారం, పూనమ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. తాను సజీవంగా ఉందని తెలియజేసింది. తనకు క్యాన్సర్ కూడా లేదని నటి స్వయంగా వెల్లడించింది, అయితే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఇదంతా చేశానని పేర్కొన్నారు. అయితే నిన్న పూనమ్ పాండే కాన్పూర్ వాసి అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ముంబైలో ఆమె మృతదేహం ఎక్కడుందో తెలియకపోవడంతో ఒక వేళ కాన్పూర్ తీసుకు వస్తారేమో అని అక్కడి పోలీసులు అలెర్ట్ అయ్యారు. శుక్రవారం, కాన్పూర్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ బృందాలు పూనమ్ పాండే యొక్క కాన్పూర్ కనెక్షన్ కోసం రోజంతా వెతికినా, ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒక రోజు మొత్తం విచారణ చేసిన తర్వాత పూనమ్ పాండేకి కాన్పూర్‌తో ఎలాంటి సంబంధం లేదని తేలిందట. కాన్పూర్ నగరంలోని స్థానిక పోలీసులతో పాటు నిఘా విభాగం కూడా నిన్న చురుగ్గా పనిచేసి ఉరుకులు పరుగులు పెట్టింది. పూనమ్ పాండే యొక్క కాన్పూర్ కనెక్షన్ కోసం బృందాలు వారి సంబంధిత మూలాల నుండి వెతుకుతూనే ఉన్నా కానీ ఏమీ తెలియలేదు.
మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!
వివాదాస్పద నటిగా ముందు నుంచి ఫేమస్ అయిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు నిన్న ఉదయం ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చావు విషయంలో ఎవరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె చనిపోయిందని కొందరు నమ్మితే ఆమె గత చరిత్రను బట్టి ఏదైనా ప్రాంక్ చేస్తుందేమోనని కొందరు భావించారు. ఈ ప్రచారాలన్నింటికీ బ్రేక్ వేస్తూ ఈ ఉదయం తాను బతికే ఉన్నానని గర్భాశయ క్యాన్సర్ గురించి జనాల్లో అవగాహన తీసుకురావడం కోసమే చనిపోయినట్లు ప్రకటించానని చెబుతూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే తాను చనిపోయానని తన మేనేజర్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించిన పూనం పాండే, ఆమె చెప్పగానే అందులో పోస్ట్ చేసిన మేనేజర్, ఈ ఇద్దరి మీద కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారని ఫేక్ వార్త ఇండియన్ సినీ పరిశ్రమలో ఉన్న అందరిని ఆందోళనకు గురి చేసింది. పబ్లిసిటీ కోసమే ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశానని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ ఫేక్ న్యూస్ నమ్మి ఆమె మరణానికి నివాళులు అర్పించిన వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆమె మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఆమె మీద, ఆమె మేనేజర్ మీద కేసు నమోదు చేసి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.