*వైసీపీ ఆరో జాబితా విడుదల
ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. 4 ఎంపీలు, 6 అసెంబ్లీ ఇన్‌ఛార్జులను వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు.
జాబితా ఇదే..
రాజమండ్రి(ఎంపీ)-గూడూరి శ్రీనివాస్
నర్సాపురం(ఎంపీ)-అడ్వకేట్ ఉమా బాల
గుంటూరు (ఎంపీ) – ఉమ్మారెడ్డి వెంకట రమణ
చిత్తూరు(ఎంపీ)- ఎన్.రెడ్డప్ప
మైలవరం(ఎమ్మెల్యే) – తిరుపతి రావు యాదవ్
మార్కాపురం( ఎమ్మెల్యే)- అన్నా రాంబాబు
నెల్లూరు సిటీ( ఎమ్మెల్యే)- ఎండీ ఖలీల్
ఎమ్మిగనూరు ( ఎమ్మెల్యే)- బుట్టా రేణుక
గిద్దలూరు ( ఎమ్మెల్యే)- కుందూరు నాగార్జున రెడ్డి
జీడీ నెల్లూరు( ఎమ్మెల్యే) -కె.నారాయణస్వామి
*ఇంద్రవెల్లి సభలో సీఎం కీలక ప్రకటన..
ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో లక్షమంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా.. గూడాలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. అమర వీరుల కుటుంబాలకి రూ.5 లక్షల ఇచ్చి అండగా నిలిచాం.. కేసీఆర్ 10 ఏళ్లలో ఆదివాసిల గురించి ఒక్క రోజైనా ఆలోచించావా అని ప్రశ్నించారు. తోటల్లో అడవి పందులు పడి ఎలా విధ్వంసం చేస్తాయో అలా రాష్ట్రాన్ని కేసీఆర్ వాళ్ల కుటుంబం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మీరు నీళ్ళు ఇస్తే 65 వేల కోట్లు నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది అని ప్రశ్నించారు. నీ బిడ్డలు, నీ దోపిడీ, ఫార్మ్ హౌస్ ఎలా కట్టాలని ఆలోచించావు తప్పా.. ప్రజల కోసం ఆలోచించలేదని మండిపడ్డారు. 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు తాము ఇచ్చామన్నారు. నిరుద్యోగుల బాధ చూడలేక కోర్టుల్లో ఉన్న కేసుల్ని పరిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రెండు నెలలు కాలేదు.. ఇప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదు అంటున్నారన్నారు. కడెం రిపేర్ చేస్తాం.. సదర్మాట్, కుప్టి నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడుతా అంటున్నారు.. ఎవ్వడు వచ్చేది.. ప్రజల ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. కాళేశ్వరం గాలికి పోయింది.. నువ్వు నీ ఖానదాన్ వచ్చినా ఏం చేయలేరని మండిపడ్డారు. జన్మలో మళ్లీ కేసీఆర్ సీఎం కాలేడని విమర్శించారు. మతం పేరుతో ఒకరు.. మద్యం పేరుతో మరొకరు వస్తారు.. ప్రతీ తండా, గూడెంలో రోడ్లు వేసే బాధ్యత తమదని సీఎం తెలిపారు. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
*గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ధరణితో భూములు కోల్పోతే..!
ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం చేశాం.. సభల్లో స్పష్టం చేశామన్నారు. అధికారంలోకి రాగానే ఇదే అమరుల స్తూపం సాక్షిగా నాగోబా దేవాలయం సాక్షిగా అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నేటి ఇంద్రవల్లి సభ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ కాగా.. తాము అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుస్తాం అని ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించామన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఇచ్చిన మాట మరవకుండా వంశస్తుల నాగోబా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అమరుల స్తూపం సాక్షిగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గోండుల జీవితాల్లో మార్పు రావాలని తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ తాను పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అమరుల స్తూపం వద్ద గద్దర్ ప్రమాణం చేయించారని గుర్తు చేసుకున్నారు. గోండుల జీవితాల్లో మార్పు కోసం తాను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్రను ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించిన సంఘటనను భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. ఐటీడీఏల పునరుద్ధరణ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సాయం పెంచడం, త్రివేణి సంగమం అభివృద్ధి చిహ్మాన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేడు కోరారు. ఈ పనులన్నీటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.
*ఇండియా కూటమి లోక్‌సభకే పరిమితం
ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకేనని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా రామ్‌పుర్‌హట్‌లో జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడారు. 27 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి పూర్తి మనుగడలో ఉందని.. కలిసికట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర రాజకీయ కార్యక్రమం కానప్పటికీ పార్టీకి కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మహారాష్ట్రలోనే కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాయని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీకి ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఎన్నడూ సహకరించని ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిని పరిరక్షించేందుకు బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని జైరాం రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో భాగమైన జేడీయూ ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. బీహార్‌లో బీజేపీతో కలిసి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక కూటమిలో భాగస్వామ్యం అయిన తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించాయి. ఇక సమాజ్‌వాది పార్టీ అయితే ఎలాంటి చర్చలు లేకుండానే 16 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. ఇలా ఎవరికి వారే కూటమితో సంబంధం లేకుండా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికల సమయానికి ఇండియా కూటమి కొనసాగుతుందో.. లేదో వేచి చూడాలి.
*ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి.. కేటీఆర్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యపై తన లేఖలో ప్రస్తావించారు. ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు. ఆటోలు ఎక్కేవాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా ? అని ప్రశ్నించారు. గురువారం ఒక గిరిజన ఆటోడ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందన్నారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? అని మండిపడ్డారు. అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా.. పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలోని 6.50 లక్షల మంది ఆటోడ్రైవర్ల పక్షాన కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది డ్రైవర్లకు ప్రతినెలా 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. 15 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నామన్నారు.
*లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 సీట్లు గెలుస్తుందా.? మమతా సవాల్..
బీజేపీని గద్దె దించాలని, ప్రధాని నరేంద్రమోడీకి అధికారాన్ని దూరం చేయాలని ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండియా కూటమి’ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల కాలంలో కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే కూటమితో జతకట్టారు. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ పార్టీలు కాంగ్రెస్‌తో సీట్లను పంచుకోమని తెగేసి చెప్పాయి. ఇదిలా ఉంటే, తాజాగా బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు విబేధాల తర్వాత ఆమె ఆ పార్టీపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు అయినా గెలుచుకుంటుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో బెనర్జీ మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ 300 సీట్లలో 40 సీట్లు గెలుస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకు అంత అహంకారం.? మీరు బెంగాల్ వచ్చారు. మనం ఇండియా కూటమిలో ఉన్నాము, కనీసం నాకు చెప్పంది. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి. మీరు గతంలో గెలిచిన చోట్ల ఓడిపోతారు.’’ అని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క స్థానం లేదు, రాజస్థాన్‌లో మీరు గెలవలేదు, వెళ్లి ఆ సీట్లు గెలవండి, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను, వారణాసి, అలహాబాద్‌లో గెలవాలని, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను అని ఆమె సవాల్ విసిరారు.
*”సనాతన వ్యాఖ్యల”పై ఉదయనిధికి కోర్టు సమన్లు..
గతేడాది డీఎంకే పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు. ఇదిలా ఉంటే, బెంగళూర్ కోర్టు ఉదయనిధికి సమన్లు జారీ చేసింది. బెంగళూర్ వాసి పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంత్రికి సమన్లు జారీ చేసింది. మార్చి 4న జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది. ఉదయనిధి స్టాలిన్ గతేడాది ఓ కార్యక్రమం మాట్లాడుతూ.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాతో పోల్చాడు, దాన్ని నిర్మూలించాని పిలుపునిచ్చాడు. సెప్టెంబరు 2023లో జరిగిన ఒక సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మం సామాజిక న్యాయం మరియు సమానత్వానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు.
*మా హయాంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది- ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024ని సందర్శించి, భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఈవెంట్‌ని నిర్వహించిన ఆటోమొబైల్ పరిశ్రమను ప్రధాని అభినందించారు. ఎక్స్‌పోని పలు స్టాల్స్ తనని ఆకట్టుకున్నాయని, అయితే తాను పూర్తిగా అన్ని స్టాల్స్‌ని చూడలేకపోయానని అన్నారు. తాను ఎప్పుడూ కార్ కొనలేదని, చివరకు సైకిల్ కూడా కొనలేదని ప్రధాని అన్నారు. భారత్ 2047లో ‘విక్షిత్ భారత్’ కావడానికి ముందుకెళ్తోందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోందని, మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని వెల్లడించారు. భారతదేశంలో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న నియో మిడిల్ క్లాస్ ఏర్పడిందని చెప్పారు. భారతదేశంలో మధ్యతరగతి పరిధి కూడా పెరిగిందని, వారి ఆదాయం వేగంగా పెరుగుతోందని ప్రధాని వెల్లడించారు. 2014కి 10 ఏళ్ల ముందు దేశంలో సుమారు 12 కోట్ల వాహనాలు విక్రయించబడితే.. 2014 నుంచి 21 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయని, 10 ఏళ్ల క్రితం దేశంలో 2000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే, ప్రస్తుతం 12 లక్షల ఎలక్ట్రిక్ వాహానాలు అమ్ముడయ్యాయని, గత 10 ఏళ్లలో పాసింజర్ వాహనాల్లో 60 శాతం వృద్ధి నమోదైందని ప్రధాని అన్నారు. 2014లో, భారతదేశ మూలధన వ్యయం రూ. 2 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది. నేడు 11 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. అటల్ టన్నెల్ నుంచి అటల్ సేతు వరకు అనేక ఇంజనీరింగ్ అద్భుతాలను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, సముద్రాలు, పర్వతాలను సవాల్ చేస్తున్నామని ప్రధాని అన్నారు. గత 10 ఏళ్లలో 75 కోట్ల విమానాశ్రయాలు నిర్మించబడ్డాయని, దాదాపుగా 4 లక్షల గ్రామీణ రోడ్లను నిర్మించామని వెల్లడించారు. ట్రక్కులు, టాక్సీలు నడిపే డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం. తరచుగా ఈ డ్రైవర్లు గంటలు కొద్దీ నిరంతరంగా ట్రక్కులను నడుపుతారు, వారికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతోందని, ఈ పథకం కింద అన్ని జాతీయ రహదారులపై డ్రైవర్ల కోసం కొత్త సౌకర్యాలతో, ఆధునిక భవనాలను నిర్మిస్తామని ప్రధాని చెప్పారు.
*హీరో విజయ్ కొత్త పార్టీపై అన్నాడీఎంకే కీలక వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాట మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ (Vijay) ఎట్టకేలకు శుక్రవారం కొత్త పార్టీని స్థాపించారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో నూతన పార్టీని నెలకొల్పారు. ఈ మేరకు విజయ్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సందర్భం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వబోమని చెప్పుకొచ్చారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. విజయ్ స్థాపించిన కొత్త పార్టీపై అన్నాడీఎంకే (AIADMK )విమర్శలు గుప్పించింది. ఇన్నాళ్లకు పిల్లి బయటపడిందని ఆ పార్టీ నేత కోవై సత్యన్ వ్యాఖ్యానించారు. విజయ్‌కి ఎప్పుట్నుంచో రాజకీయ కోరికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నాక.. హీరో రజనీకాంత్‌ను లాక్కోవాలని చూశారని.. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదని చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ గ్లామర్ కావాలని బీజేపీ (BJP) ప్రయత్నించిందని.. అందులో భాగంగానే ఇప్పుడు విజయ్ తెరపైకి వచ్చారని పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగాలంటే కచ్చితంగా సినీ ప్రపంచం నుంచి ఎవరొకరు కావాలి.. ఆ ప్లాన్‌లో భాగంగానే ఇప్పుడు విజయ్ వచ్చారు. ఏదేమైనా బీజేపీకి.. విజయ్‌కి గుడ్ లక్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
*పూనమ్ చనిపోలేదు.. బాడీ గార్డ్ సంచలన వ్యాఖ్యలు
నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సడెన్ గా మృతి చెందింది. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పూనమ్ మృతి వార్త విన్న ఆమె బాడీ గార్డ్ ఆమె లేదు అన్న విషయాన్నీ నమ్మలేకపొతున్నాడు. పూనమ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఆమె చనిపోయినట్లు ఎందుకు చెప్పడం లేదని అతను ప్రశ్నిస్తున్నాడు. పూనమ్ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్ ఖాన్ మాట్లాడుతూ.. ” పూనమ్ చనిపోలేదు.. ఆమె చనిపోయింది అంటే నేను నమ్మను.. ఆమెతో నేను ఎన్నో ఏళ్ళు కలిసి పనిచేసాను. పూనమ్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు.. జనవరి 31 న మేము కలిశాం. ఒక మాల్ లో ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నాను. పూనమ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫిట్ గా ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. ఆమెకు అసలు అనారోగ్యం ఉందన్న విషయం కూడా నేనెప్పుడూ వినలేదు. ఉదయం నేను కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను. వెంటనే పూనమ్ సోదరి ఇంటికి వెళ్లి.. నిజమెంటో తెలుసుకుందామని ప్రయత్నించాను. కానీ, ఆమె నా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. కొన్నిరోజుల క్రితం పూనమ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా నార్మల్ గానే కనిపించింది. ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేసింది. అసలు నిజాలు తెలియాలంటే.. పూనమ్ సోదరి చెప్పాల్సిందే” అని చెప్పుకొచ్చాడు. మరి పూనమ్ సోదరి మీడియా ముందుకు వస్తుందేమో చూడాలి.