*ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదు
కారు ప్రమాదంలో మరణించిన బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పటాన్ చెరు పోలీస్‌స్టేషన్‌లో లాస్యనందిత సోదరి నివేదిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై 304ఏ ఐపీఎస్ సెక్షన్ కింద ఈ కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య మృతికి కారణమయ్యాడని కేసు నమోదు కాగా.. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు వెల్లడించారు. ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉందని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శివారు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాదంపై పలు విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. దర్గాలో పూజలకు వెళ్లి తిరిగి అల్పాహారం కోసం వెళుతుండగా ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు చెప్తామని అడిషనల్ ఎస్పీ వివరించారు.
*ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన
ఏపీలో ఎన్నికలకు కౌంట్‌డౌన్ దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్.. వై నాట్ కుప్పం అంటూ చంద్రబాబు అడ్డాలో అడుగుపెడుతున్నారు. కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు సీఎం జగన్. కుప్పంలో గెలుపుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా సంక్షేమం, ఇంటి స్థలాలు, గడప గడపకు ప్రభుత్వం వెళ్లేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పం కేంద్రంగా పలు నిర్ణయాలు ప్రకటించిన జగన్.. ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి అందించనున్నారు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన క్రెడిట్ వైసీపీదేనని చెబుతున్నారు. కుప్పంలో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తరువాత నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలకు సంసిద్దత పైన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సమీక్షించనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. తమ తొలి గెలుపు కుప్పంతోనే ప్రారంభం కావాలని ఇప్పటికే పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. కుప్పం, మంగళగిరితో పాటుగా పవన్ పోటీ చేసే అవకాశం ఉన్న భీమవరం పైన ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నారు. కుప్పంలో గెలవాలని నిర్ణయించుకున్న సీఎం జగన్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో జగన్ కుప్పం పర్యటనపై ఆసక్తి నెలకొంది.
*బైజూస్ సీఈఓ రవీంద్రన్‌పై వేటు.. తొలగించాలని ఇన్వెస్టర్ల ఓటు
ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తాజాగా సీఈఓ రవీంద్రన్ తొలగింపుకు ఇన్వెస్టర్లు ఓటేశారు. శుక్రవారం ప్రత్యేక అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చిన ఇన్వెస్లర్లు అతడిని తొలగించాలని ఓటేశారు. ప్రోసస్, జనరల్ అట్లాంటిక్, సోఫినా, పీక్ ఎక్స్ సహ భాగస్వాములుగా ఉన్న బైజూస్ వాటాదారులు దాని వ్యవస్థాపకుడైన జైజు రవీంద్రన్‌ని తొలగించడానికి మొగ్గు చూపారు. ఈ సమావేశాన్ని నిలిపేయాలంటూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, రవీంద్రన్‌కి చుక్కెదురైంది. అంతకుముందు కంపెనీలో చోటు చేసుకున్న వివాదాలపై ఎన్‌సీఎల్‌టీ బెంగళూర్ ధర్మసనాన్ని ఆశ్రయించింది. కంపెనీని నడిపించేందుకు రవీంద్రన్ సహా, ఇతర వ్యవస్థాపకులు అనర్హులుగా ప్రకటించాలని, కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్వెస్టర్ల హక్కులకు భంగం కలిగించేలా ఎలాంటి కార్పొరేట్ చర్యలకు కంపెనీ దిగకూడదని కోరుతూ నిలువరించాలని కోరారు. దాదాపుగా రూ. 9300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడినట్లు గత నవంబర్‌లో ఈడీ అభియోగాలు దాఖలు చేసింది. మరోవైపు రవీంద్రన్ విదేశాలకు పారిపోకుండా ఈడీ ఆంక్షలు విధించింది. లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది. ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీకి నాయకుడిగా ఉన్న రవీంద్రన్, దేశాన్ని తన వైపు ఆకర్షించారు. మహమ్మారి సమయంలో చాలా వేగంగా విస్తరించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, పాఠశాలలు ప్రారంభం కావడంతో ఆన్‌లైన్ ట్యూరోరియల్ డిమాండ్ పడిపోవడంతో బైజూస్ ఆర్థిక చిక్కుల్లో పడింది. కొంతమంది బోర్డు సభ్యులు రాజీనామా చేయగా.. ఉద్యోగుల జీతాల కోసం రవీంద్రన్ తన ఇంటితో పాటు అతని కుటుంబ సభ్యుల యాజమాన్యాన్ని తాకట్టుపెట్టాడు.
*స్పెయిన్‌లో ఘోరం.. మంటల్లో కాలి 24 మంది మృతి!
స్పెయిన్‌లో (Spain) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వాలెన్సియాలో (Valencia) అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది మరణించినట్లు తెలుస్తోంది. 14 అంతస్తుల ఎత్తైన అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే క్రమంలో ప్రజలు కిందకి దూకేసినట్లు తెలుస్తోంది. అలా పలువురు బాల్కనీల నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఇంకొందరు మంటల్లోనే సజీవదహనం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి నలుగురు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 14 మంది ఆచూకీ మాత్రం తెలియకుండా పోయిందని చెబుతున్నారు. మరో 13 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని పలువురిని కాపాడినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేశారు. తొలుత ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు సమాచారం. అగ్నికీలలు, పెద్దఎత్తున పొగ వెలువడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
*ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు.. ఎమర్జెన్సీ విధింపు
ఆస్ట్రేలియా అడవుల్లో (Australia Wildfires) కార్చిచ్చు చెలరేగింది. మంటలు దట్టంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రంగా నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు పరిస్థితులు అదుపు తప్పడంతో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి పశ్చిమాన ఈ కార్చిచ్చు చెలరేగింది. మంటల ఉధృతి పెరగడంతో ఆస్ట్రేలియా సమీప పట్టణాలకు వ్యాప్తిస్తున్నాయి. 28 చిన్న పట్టణాలను ఖాళీ చేయాలని ప్రజలకు ప్రభుత్వాధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. బలమైన గాలులు కారణంగా మంటలు నగరాలకు వ్యాప్తి చెందడంతో పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలకు తరలించారు. అలాగే విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ఖరీదైన ఆస్తులు కూడా మంటల్లో కాలిపోయే సూచనలు కనిపిస్తు్న్నాయి. ఇంకోవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు వెయ్యి అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపు చేస్తు్నారు. అలాగే 24 విమానాల ద్వారా కూడా అదుపు చేస్తు్న్నారు. ఈ మంటల్లో పలు పశువులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ రాజధాని మెల్‌బోర్న్‌కు వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బలమైన గాలులు వీచడం వల్లే ఈ మంటలు వేగంగా వ్యాపిస్తు్న్నాయని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను బట్టే అధికారులు ఎమర్జెన్సీ విధించారు. ఇదిలా ఉంటే ఈ వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విక్టోరియన్ అధికారులు ముందుగానే హెచ్చరించారు. 2019-2020లో కూడా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా వేలాది జంతువులు సజీవ దహనం అయ్యాయి. భారీ ఎత్తున ఆస్తుల నష్టం జరిగింది.
*భారతీయుల కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన గల్ఫ్ కంట్రీ..
గల్ఫ్ కంట్రీ యూఏఈ భారతీయులకు శుభవార్త చెప్పింది. దుబాయ్ ఇండియన్స్ కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు వ్యాపారం, విహారయాత్రలను సులభతరం చేయనున్నాయి. ఇటీవల కాలంలో గల్ఫ్ కంట్రీ యూఏఈ-భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతమవుతున్నాయి. మరోవైపు విహారయాత్రకు అనువైన ప్రదేశంగా భారతీయులు దుబాయ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. 2023లో భారతదేశం నుంచి దుబాయ్‌కి 2.46 మిలియన్ల సందర్శకులు వెళ్లారు. ఇది కోవిడ్ మహమ్మారి కాలంతో పోలిస్తే ఏకంగా 25 శాతం పెరుగుదల. ఇది దేశాన్ని నంబర్ వన్ సోర్స్ మార్కెట్‌గా నిలిపిందని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం(DET) డేటా గురువారం వెల్లడించింది. 2023కి ముందు ఏడాది దుబాయ్‌కి భారత్ నుంచి 1.84 మిలియన్ల మంది పర్యాటకులు వెళ్లారు. 2019లో 1.97 మంది పర్యాటకులు దుబాయ్ వెళ్లినట్లు డేటా చూపిస్తోంది. అనూహ్యంగా 34 శాతం వార్షిక వృద్ధితో ఒకే దేశం(భారత్) నుంచి దుబాయ్ వెళ్లిన అంతర్జాతీయ సందర్శకుల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు డీఈటీ డేటా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్, దుబాయ్ మధ్య ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయడానికి, నిరంతర ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటక, వ్యాపార-వాణిజ్య సంబంధాలను ప్రోతహించే నేపథ్యంలో దుబాయ్ భారతీయుల కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టినట్లు డీఈటీ తెలిపింది. 2-5 రోజుల్లో వీసా జారీ చేయబడుతుంది, ఒక వ్యక్తి 90 రోజుల పాటు దేశంలో ఉండటానికి అనుమతి లభిస్తుంది, ఇదే వ్యవధికి మరోసారి వీసా పొడగించవచ్చు. ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులు మించకుండా దుబాయ్‌లో ఉండేలా నిబంధనలు ఉన్నాయి. భారత్ నుంచి వచ్చే వారితో తమ పర్యాటక రంగం రికార్డు స్థాయి పనితీరుకు దోహడపడిందని, దుబాయ్ కీలకమైన మార్కెట్‌గా వ్యాపారం, పెట్టుబడుల మరింత అనుకూలంగా ఉందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ.. D33 ఎజెండా యొక్క లక్ష్యాలను సాధించడంలో మాకు సహాయం చేయడంలో భారతదేశం సమగ్ర పాత్ర పోషిస్తుందని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామీ చీఫ్ బాదర్ అలీ చెప్పారు.
*పేటీఎంకి ఊరట.. యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐకి ఆర్బీఐ కీలక సూచన..
డిజిటల్ లావాదేవీల్లో ఓ వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించ వద్దని ఆదేశించగా.. ఈ వ్యవధిని మార్చి 15 వరకు పెంచుతూ ఊరటనిచ్చింది. తాజాగా పేటీఎంకి మరో ఊరట లభించింది. పేటీఎం యాప్ UPI లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సూచించింది. ‘@paytm’ ఐడీతో యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదా ఇచ్చే అంశాన్ని ఎన్‌పీసీఐ పరిశీలించనుంది. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది. ఒక వేళ థర్డ్ పార్టీ స్టేటస్ ఇస్తే పేటీఎం యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేసే వీలు కలుగుతుంది. అలాగే, పేటీఎంను ఇతర బ్యాంకులకు మార్చుకునేందుకు వీలుగా అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగిన నాలుగైదు బ్యాంకులకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు సర్టిఫికేషన్ ఇవ్వాలని కోరింది.
*టాలీవుడ్ గర్వించేలా దుబాయ్ లో ‘గామా’ అవార్డ్స్ వేడుక
దుబాయ్‌లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుకను నిర్వహించనున్నారు. ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకుడు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీ లాంచ్ చేశారు. ఇక ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ..”గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని, మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు ఈ వేడుక నిర్వహించలేక పోయారు. కానీ ఈసారి టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకలు నిర్వహించబోతున్నారు. 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాల నుంచి – బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నారని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన అన్నారు. గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదికపై చాలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరిని ఈ వేడుకకు ఆహ్వానించామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డింపుల్ హయతి పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని, ఈ గామా అవార్డ్స్ లో భాగమవడం ఆనందంగా ఉందని డింపుల్ చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, గాయకులు మనో, ధనుంజయ్.. ఇంకా ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.