*మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం..
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయమైనట్లు తెలుస్తోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే ఫైల్స్ మిస్సింగ్ పై ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖలోని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాగా.. ఫైల్స్ నిన్ననే మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఘటనాస్థలంలో డీసీపీ శ్రీనివాస్ ఆధారాలు సేకరించారు. కాగా.. డైరెక్టర్‌ను సెంట్రల్ డీసీపీ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఫైల్స్ అదృశ్యంపై తమకు సమాచారం లేదని డైరెక్టర్ తెలిపారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
*హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు బోనస్ ఇచ్చారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్లలో మోసం చేశారని, క్వింటాల్ కు 10 కిలోలు కటింగ్ చేసి.. రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదన్నారు. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్నవారికే బెనిఫిట్ అవుతుందని చెప్పారు. పెద్ద ఫాంహౌస్ ల ఓనర్లు, మాజీ మంత్రులు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా లక్షల కోట్లు అప్పులు చేశారని, విలాసవంతమైన భవనాలు కట్టుకుని దర్జాగా ఉన్నారని మంత్రి సీతక్క చెప్పారు.
*తెలంగాణ ఆడబిడ్డ ముఖంలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యాచరణ మొదలైంది.. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం.. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
*బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో ఫైల్స్ చోరీకి యత్నం
హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. కాగా.. ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వారిని చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు ఆగంతకులు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆటోలో ఉన్న ఫైల్స్ ఎవరివి, ఎక్కడివి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
*ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం.. 15 రోజుల లోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాను సమర్పిస్తూ.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖలు పంపించారు. కాగా.. వారి రాజీనామాలను ఆయన ఆమోదించారు. ఇదిలాఉంటే.. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి 2021లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. వారి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. మరోవైపు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2015, 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన పదవీకాలం కూడా 2027 వరకు ఉంది. ఇప్పుడు వీరు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
*ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం
సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే.హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్.రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి మంత్రికి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద సృష్టించడం, సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు.. ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని తెలిపారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్ తో.. మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి.. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది.. అయినప్పటికీ చాలెంజ్ గా ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని మంత్రి భట్టి పేర్కొన్నారు. అనేక సవాళ్ళను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనందరం కలిసికట్టుగా సాధిద్దామన్నారు. రాష్ట్రంలో తన పాదయాత్ర చేసిన సందర్భంగా.. అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి వారి సమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారెంటీలు అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించామని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానన్నారు. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదు.. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామని భావించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి.. అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆరోగ్య తెలంగాణగా.. ఈ రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పారు. మిగతా గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.
*బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళపై దాడి.. బాధితురాలిని కలిసిన సీఎం..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే పరిమితమైంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళను కుటుంబసభ్యులే చితకబాదారు. బాధిత మహిళను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో కలిశారు. సమీనా బీ, ఆమె ఇద్దరు పిల్లల్ని, సీఎం చౌహాన్ పరామర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినందుకు, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినందుకు ఆమె కుటుంబం ఆమెను కొట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీఎం ఆమెను కలవాలని నిర్ణయించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆమె భద్రతపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. నా పిల్లలపై శ్రద్ధ చూపినందుకు మరోసారి కూడా బీజేపీకే తాను ఓటేస్తానని సీఎం చౌహాన్‌తో చెప్పినట్లు సమీనా బీ వెల్లడించారు. ‘‘నేను బీజేపీకి ఓటేశానని తెలుసుకున్న నా బావ జావేద్ నాపై దాడి చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీకి ఓటు ఎందుకు వేశావని అతను ప్రశ్నించాడు’’ అని మహిళ చెప్పింది. చౌహాన్ భయ్యా ఎప్పుడూ తప్పు చేయలేదని అందుకే తాను బీజేపీకి ఓటేసినని చెప్పారు. నాలుగు సార్లు ఎంపీ సీఎంగా పనిచేసిన చౌహాన్ తాను ప్రస్తుతం సీఎం రేసులో లేనని, తాను పార్టీ సేవకుడినని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 29 లోక్‌సభ స్థానాలు సాధించడమే బీజేపీ లక్ష్యమని, అందుకోసం పనిచేస్తానని చెప్పారు.
*”మహువాను బహిష్కరించడం నాకు సంతోషం కాదు”.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుందనే అభియోగాల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ సిఫారసులతో నిన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో మహువామోయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, బిలియనీర్ అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. ఇంతే కాకుండా ఆమె తన వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను పంచుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహువా మోయిత్రాపై ఎథిక్స్ కమిటీ విచారించి, ఆమెను బహిష్కరించింది. ఇదిలా ఉంటే మహువా బహిష్కరణపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇది సంతోషకరమైన రోజు కాదు, బాధాకరమూన రోజు’’ అని అన్నారు. అవినీతి, జాతీయ భద్రత సమస్యపై ఒక ఎంపీని బహిష్కరించడం తనకు బాధ కలిగిస్తోందని, నిన్న సంతోషకరమైన రోజు కానది, విచారకరమైన రోజని అన్నారు. అయితే మహువా తన బహిష్కరణ తర్వాత ఎథిక్స్ కమిటీ, బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. ఎథిక్స్ కమిటీ అన్ని ఉల్లంఘటనకు పాల్పడిందని ఆరోపించారు, సాక్ష్యం లేకుండా తనను శిక్షించారని అన్నారు. దర్శన్ హీరానందానీ మౌకికంగా సాక్ష్యం చెప్పకుండా, ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించడాన్ని తప్పుపట్టారు.
*అంధకారంలో శ్రీలంక దేశం.. సిస్టమ్ ఫెయిల్యూర్‌తో విద్యుత్ అంతరాయం..
ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ద్వీపదేశం శ్రీలంక, ఇప్పుడు కరెంట్ కష్టాలను ఎదుర్కొంటోంది. విద్యత్ సిస్టమ్ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా కరెంట్ లేకుండా పోయింది. శ్రీలంక మొత్తం అంధకారంలో ఉంది. దేశంలోని విద్యుత్ గుత్తాధిపత్య సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సిఇబి) విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తోందని సిఇబి ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. వ్యవస్థ వైఫల్యం కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిందని ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఒక్కసారి దేశవ్యాప్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇంధనం, మెడిసిన్స్, ఆహారపదార్థాలు ఇలా అన్నింటికి కొరత ఏర్పడింది. విదేశీమారక నిల్వల కొరత కారణంగా ఇంధన రవాణాకు కూడా డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. రోజుకు 10 గంటల పాటు కోత విధిస్తున్నారు. ఇటీవల ఈ కోతల్ని 13 గంటలకు పొడగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం కారణంగా అక్కడి ఆస్పత్రుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.