కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు
కోకాపేటలోని నియో పోలిస్ ఫేస్-2లోని భూములు హెచ్‌ఎండీఏకు కోట్లు కురిపించాయి. రికార్డు స్థాయిలో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరానికి రూ.100 కోట్లు ధర పలికింది. నియో పోలిస్‌లో హెచ్‌ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గురువారం ఉదయం 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది. సాయంత్రం నుంచి 10,11,14 నెంబరు ప్లాట్లకు వేలం నిర్వహించారు. 18.47 ఎకరాలకు వేలం నిర్వహించగా.. 10 వ నెంబరు ప్లాట్‌కు హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.100 కోట్లు పలికింది. స్థిరాస్తి దిగ్గజ సంస్థల పోటీ చూస్తుంటే ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కోకాపేట భూముల ఈ వేలంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో 10వ నెంబర్ ప్లాట్‌కు ఓఆర్‌ఆర్‌కు కనెక్టివిటీ వస్తుండడంతో ఇంత డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
గుడ్‌న్యూస్.. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.. మొత్తం 3,295 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు.. నవంబర్ 15వ తేదీ నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు సీఎం జగన్.. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ఇక, విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఇలా ఉండనుంది.. ఆగస్టు 23వ తేదీన యూనివర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.. సెప్టెంబర్ 3, 4 వారాల్లో పరీక్షలు నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించబోతున్నారు.. అక్టోబర్ 10వ తేదీ నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. రిటన్ టెస్ట్ ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 15 నాటికి ఇంటర్వ్యూలు సహా నియామక ప్రక్రియ పూర్తి చేసి.. అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను డిస్‌ప్లే చేయనున్నాయి ఆయా యూనివర్సిటీలు. ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్త మరి.. ఇంకే ముందు.. ఇప్పటికే ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్లు మరింత దృష్టి పెట్టండి.. మరోసారి పుస్తకాలను తిరగేయండి.
ట్యాక్సీ డ్రైవర్‌తో ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి కానిస్టేబుల్‌ను హత్య చేసిన భార్య
క్షణిక సుఖాల కోసం చాలా మంది పండంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు.. సాఫీగా సాగుతోన్న సంసారంలో మరో వ్యక్తి ప్రవేశంతో గొడవలు చోటు చేసుకోవడం.. ఆ తర్వాత హత్యలకు దారి తీసిన ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, విశాఖపట్నం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు.. ప్రియుడు, అతని స్నేహితుడు సహాయంతో కానిస్టేబుల్ అయిన తన భర్తను భార్య హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్త కానిస్టేబుల్ రమేష్‌ణు పక్కా స్కెచ్ వేసి భార్య హతమార్చినట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ వన్‌టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న రమేష్.. ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. నిద్రలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది భార్య.. అయితే, రమేష్ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.. ఇంట్లో నే పథకం ప్రకారం తలగడా దిండుతో భార్య శివజ్యోతి అలియాస్ శివాని హత్య చేసినట్టు గుర్తించారు.. హత్య చేసి గుండెనొప్పిగా చిత్రీకరించారు.. గత కొంత కాలంగా ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శివాని.. ఆ హత్యకు పూనుకుందని తెలుస్తోంది.. భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడైన ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు, అతడి స్నేహితుడి సహాయం కూడా తీసుకుందట.. అంతేకాదు.. గుట్టుచప్పుడుగా అంతక్రియలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.. ఎంవీపీ పోలీసుల విచారణలో శివాని అక్రమ సంబంధం బాగోతం వెలుగుచూడడంతో.. హత్య కేసు మిస్టరీ వీడినట్టు అయ్యింది. కాగా, 2009లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు బర్రి రమేష్.. ఇక, రమేష్-శివాని దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
వరదలపై సీఎం సమీక్ష.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. క్యాంపు కార్యాలయం నుంచి వరదలపై అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం.. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం.. టీఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది.. దీని తర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం.. ఆ తర్వాత నేను వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను అని తెలిపారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను.. ఈ సారి కూడా నేను వస్తాను అని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను.. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి అని ఆదేశించారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలన్న ఆయన.. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్ అందించాలన్నారు. దీంతో పాటు తాగునీరు కూడా అందించాలి.. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదని స్పష్టం చేశారు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలన్న సీఎం.. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలన్నారు. వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు.. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు బ్రేక్‌లు.. సర్కార్ కీలక నిర్ణయం
ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ వేసింది ఏపీ హైకోర్టు పడింది.. హైకోర్టు తీర్పుతో ఆర్ 5 జోన్ జగనన్న లేఅవుట్స్ లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.. అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఈ రోజు వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. అక్కడ యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.. అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దీనిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. హైకోర్టు తీర్పుపై కచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు బ్రేక్ వేయడంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. బయట వాళ్లకు ఇక్కడ (అమరావతి) ఎందుకు ఇళ్లు ఇస్తున్నారని అడుగుతున్నారు.. కాలేజీలకు, ప్రైవేటు సంస్థలకు అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చారు.. మరి వాళ్లు బయటి వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పై కచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేసిన ఆయన.. అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే.. సజీవమైన నగరం అభివృద్ధి అయ్యేటట్లు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.. ఆర్ 5 జోన్‌లో భూములు ఇచ్చింది ఎవరికో ఆలోచించండి.. పేదలు, దళితులకు కాదా? అని ప్రశ్నించారు. పేదలను కాదని ఒక రాజకీయ పార్టీ ఎలా మనగలుగుతుందో అర్ధం కావటం లేదని.. కోర్టు తీర్పుపై సంబరాలు చేసుకునే వాళ్ల కంటే విచిత్రం ఉంటుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల.
నెక్ట్స్ వైజాగ్ నుంచి.. డేట్ ప్రకటించిన జనసేనాని
వారాహి విజయ యాత్రతో రాష్ట్రం కలియ తిరిగేందుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే.. రెండు విడతల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను చుట్టేశారు.. ఇక, ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు.. ఈ సారి ఉక్కు నగరం విశాఖను ఎంచుకున్నారు.. వైజాగ్ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభించనున్నట్టు ప్రకటించారు పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో సమావేశం నిర్వహించారు జనసేనాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ నుంచి వారాహి యాత్ర మూడో విడత ప్రారంభం అవుతుందన్నారు. విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది.. అదే రోజు విశాఖపట్నంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహించనున్నారు. విశాఖ జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకూ వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ సందర్శిస్తారని.. విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని జనసేన ప్రకటించింది. విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు పవన్ కల్యాణ్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో విశాఖలో విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దాం అంటూ విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో నిర్వహించిన సమావేశంలో పిలుపునిచ్చారు పవన్.. వారాహి యాత్ర గురించి దేశం మొత్తం చెప్పుకోవాలి.. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేలా చేద్దాం అన్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థను చంపేందుకే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోకసభ ఆమోదం… బిల్‌కి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును.. ఢిల్లీ సేవల బిల్లు, అధికారికంగా ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023 అని పిలుస్తారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదించబడింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా వాకౌట్ చేశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చాలా సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణను ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను భర్తీ చేసే ప్రస్తుత ఆర్డినెన్స్. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీకి ‘పూర్తి రాష్ట్ర హోదా’ ఇస్తామని బీజేపీ గతంలోనే హామీ ఇచ్చిందని అన్నారు. బదిలీ పోస్టింగ్‌లపై రాష్ట్ర నియంత్రణను తీసివేసే బిల్లుపై నిరాశను వ్యక్తం చేసిన కేజ్రీవాల్, “ఈ రోజు, ఈ వ్యక్తులు (బిజెపి) ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు” అని అన్నారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. 2014లో మోదీ స్వయంగా ప్రధాని అయ్యాక ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఢిల్లీ ప్రజల వెన్నుపోటు పొడిచారు. ఇక నుంచి మోదీ జీని నమ్మొద్దు’’ అని అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు)లో పేర్కొన్నారు.
ఆ వస్తువుల దిగుమతులపై బ్యాన్.. అసలు కారణం ఇదే
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే (ఆగస్టు 3వ తేదీ నుంచే) అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా.. స్థానిక తయారీని ప్రోత్సాహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. ఒకవేళ.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ తదితర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెక్ట్స్‌ని దిగుమతి చేసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం చాలా రంగాల్లో దేశీయ తయారీని ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. వివిధ రంగాల్లో స్థానికంగా తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్న వారికి కేంద్రం భారీఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. అయినప్పటికీ.. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి చౌకగా దిగుమతులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంప్యూటర్స్, ల్యాప్‌టాబ్స్, ట్యాబ్లెట్ల దిగుమతులు 6.3 శాతం పెరిగి.. 19.9 బిలియన్ డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.1.6 లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఫలితంగా.. దేశీయ తయారీపై గట్టి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. దేశీయ తయారీని ప్రోత్సాహించడంలో భాగంగా ఆ మూడింటిపై కేంద్రం ఆంక్షలు విధించింది.
రష్యా దాడుల్లో 10 వేల మంది మృతి.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధం
రష్యా దాడుల్లో 10 వేల మంది ఉక్రెయిన్ వాసులు మృతి చెందారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా సేనలు చేసిన 98 వేల యుద్ధ నేరాలను నమోదు చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో సుమారు 10 వేల మంది మృతి చెందారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో 499 మంది పిల్లలు ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయంలో యుద్ధ నేరాల విభాగం అధికారి యూరియ్ బెల్‌సోవ్ తెలిపారు. ఉక్రెయిన్ భూభాగాలను తమ సేనలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏడాది క్రితమే పెళ్లి.. నటి భర్త మృతి.. షాకింగ్ రీజన్ వెలుగులోకి?
తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ నటి శృతి షణ్ముగప్రియ భర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వెల్లడి కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నటి శ్రుతి షణ్ముగప్రియ అభిమానులు అయితే షాక్ అయ్యారు. ఎందుకంటే షణ్ముగప్రియకి పెళ్లయి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. ఆమె గత ఏడాది మే నెలలోనే ఏడడుగులు వేసింది. నటి శృతి షణ్ముగప్రియ గత ఏడాది మే నెలలో అరవింద్ శేఖర్‌ను వివాహం చేసుకుంది. తరచూ తన భర్తతో కలిసి రొమాంటిక్ రిలీజ్ వీడియోలను పోస్ట్ చేసే ఆమె గత వారం రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ఇలాంటి తరుణంలో షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ చనిపోయాడని వార్తలు వచ్చాయి. స్వతహాగా బాడీ బిల్డర్ అయిన అరవింద్ శేఖర్ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. కఠోరమైన వ్యాయామం చేయడంలో దిట్ట అయిన ఈ షణ్ముగప్రియ భర్తకి గుండె పోటు ఎలా వచ్చిందనే విషయంపై నెటిజన్లు అయోమయంలో పడ్డారు. షణ్ముగప్రియ భర్త బాడీ బిల్డింగ్ కోసం ఏమైనా స్టెరాయిడ్ తీసుకున్నారా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అరవింద్ శేఖర్ మరణ వార్త విని స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు అందరూ షాక్ అవుతున్నారు. పెళ్లయిన ఏడాదికే భర్తను కోల్పోయిన శృతి షణ్ముకప్రియకు పలువురు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరి రొమాంటిక్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. శ్రుతి సన్ముగప్రియ కల్యాణ పరిషత్ భారతికన్నమ్మతో సహా పలు సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాదించింది. రియాల్టీ షోలలో కంటెస్టెంట్‌గా, ప్రత్యేక అతిథిగా కూడా ఆమె పాల్గొనేది.
మంగ్లీ కూడా మొదలెట్టేసిందిగా..
సింగర్ మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది.. ఎప్పుడు పద్దతిగా కనిపించే మంగ్లీ ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో ఆమెను అలా చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయ్యారు. మంగ్లీ హీరోయిన్ గా స్వేఛ్చ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ ను అందుకుంటుంది.. గత నాలుగేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా సాంగ్స్ విపరీతమైన ఆదరణ పొందాయి.. ఆమె తో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించాలని డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు.. సింగర్ మంగ్లీ పాటకు మూడు లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఆమెకు అంత డిమాండ్ ఉంది. తన సంపాదనతో సొంత ఊరిలో దేవాలయం కట్టించిందట. సామాజిక సేవకు కూడా మంగ్లీ డబ్బులు ఖర్చు చేస్తారని సమాచారం. మంగ్లీ సింగర్ గా అభిమానులను సంపాదించుకుంది.. స్టార్ సింగర్ మంగ్లీ తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది.. మంగ్లీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది..