దేవాదాయ భూములపై చట్ట సవరణ.. ఇక, ఆ భూములు స్వాధీనం..
ఆక్రమణకు గురైన దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. దేవాలయ శాఖకు చెందిన భూములకు సంబంధించి సమగ్ర సమాచారం తీసుకుంటున్నాం.. ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములకు సంబంధించి ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్న ఆయన.. వారం రోజుల నోటీసుతో పోలీసు ఫోర్స్ తో వెళ్లి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.. దేవాలయ శాఖకు చెందిన భూములకు సంబంధించి సమగ్ర సమాచారం తీసుకుంటున్నాం.. ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం అన్నారు.. వారం రోజుల నోటీసుతో వాటిని స్వాధీనం చేసుకుంటాం.. ఈ కేసుల్లో 8 ఏళ్ల జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉందన్నారు. ఇక, వాణిజ్య సముదాయాలు అయితే అద్దె చెల్లింపును పరిగణలోకి తీసుకుంటాం అని తెలిపారు మంత్రి కొట్టు.. మఠాలు, సూత్రాలు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను పట్టణాల వారీగా ఇవ్వాలని ఆదేశించాం అన్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అన్నారు. మరోవైపు.. దేవాలయాల నిర్వహణకు ముందుకు వస్తే సానుకూలంగా స్పందిస్తాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ధర్మ ప్రచార కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా కొనసాగుతాయి.. ఈ నెల 6న అన్నవరం నుంచి ప్రారంభించాం.. ప్రపంచంలోనే హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది.. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని హితవుపలికారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని మరింత ప్రచారం చేయటం ముఖ్యం.. ధర్మ ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వోచ్చావా..? యార్లగడ్డపై సెటైర్లు
స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన బొబ్బిలిపులి సినిమాలో.. “ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..?” అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పాటకు మంచి ఆధరణ ఉంది.. అయితే, ఇప్పుడు ఆ పాట గురించి ఎందుకు? అనే అనుమానం రావొచ్చు.. విషయం ఏంటంటే.. ఆ పాటను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తు చేశారు. తాజాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు.. నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే.. అయితే, దీనిపై సెటైర్లు వేస్తూ ఆ పాటను గుర్తు చేసుకున్నారు కొడాలి నాని.. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ సినిమాలో ఓ పాట ఉండేది.. ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..? అన్నట్లుంది యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఇక, 2024 ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన చంద్రబాబు.. ఓట్ల తొలగింపును కారణంగా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు అని విమర్శించారు.. గన్నవరంలో లోకేష్ పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయ్యిందంటూ సెటైర్లు చేశారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేష్.. నువ్వా సీఎం గురించి మాట్లాడటమా..? అని ఫైర్ అయ్యారు. మరోవైపు.. 64 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే పది చోట్ల గెలిచిన టీడీపీ.. 175 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 22 చోట్ల తెలుస్తుందేమో అంటూ కామెంట్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.
మళ్లీ పోటీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. ఈ సారి..!
ఇంకా సర్వీసు ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు.. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగారు.. అయితే, మంచి ఓట్లు సాధించినా.. ఆయన విజయం సాధించలేకపోయారు.. ఆ తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు.. జనసేన పార్టీకి కూడా బైబై చెప్పేశారు. ఇక, ఆయన మళ్లీ పోటీ చేస్తారా? చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారు? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అసెంబ్లీ స్థానం బరిలోనా? లోక్‌సభ స్థానం నుంచి పోటీయా? అంటూ అనేక విషయాలపై చర్చ సాగుతూ వచ్చింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు లక్ష్మీనారాయణ.. న్టీఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.. అయితే, ఎక్కడ నుంచి అనేది త్వరలో చెబుతాను అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును వాడనప్పుడు.. ఓటు బ్యాంకింగ్‌గా మారుతుందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొనసాగేది అదే అన్నారు. ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి ఆదాయపన్ను పెంచడం లాంటి జరినామాలు కూడా విధించాలని సూచించారు. ఓటు హక్కుతో మంచి నాయకున్ని ఎంచుకొవాలి.. అది ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ
కాంగ్రెస్ పార్టీలో జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ కలకలం రేపుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకంలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఏఐసీసీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆ లేఖలో జనగామ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. జనగామ డీసీసీ అధ్యక్షుడుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని రద్దు చేయాలనీ కోరారు. మ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇద్దరు డీసీసీ ప్రతిపాదిత అభ్యర్థులు పార్టీ సీనియర్ కార్యకర్తలు, దశాబ్దాల నుంచి పార్టీకి తన విలువైన సమయాన్ని అందించారని పేర్కొంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్ ని తప్పుదారి పట్టించారు అని పేర్కొన్నారు. కానీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీతో పాటు ఇతర నాలుగు పార్టీలు మారిన తర్వాత అతను డిసెంబర్ 2018 కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని కాంగ్రెస్ విధేయుల లేఖలో తెలిపారు. ఇతర ఇద్దరు డీసీసీ ప్రతిపాదన అభ్యర్థులు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగాం జిల్లాకు చెందిన వారు కాదు.. అతను సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని అన్నారు.
ఫోన్ పోయింది.. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపే ఖాతా ఖాళీ అయ్యింది..!
విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఫోన్ పోగొట్టుకున్నాడు అద్దేపల్లి ఫణీంద్ర అనే వ్యక్తి.. అయితే, తన ఫోన్ పోయిందంటూ ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు.. కానీ, ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చేలోపే అతడి బ్యాంకు ఖాతా నుంచి లక్ష రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు.. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఫోన్ పొగొట్టుకున్న వ్యక్తి ఫోన్ నుంచి లక్ష రుపాయలు కాజేశారు.. ఫోన్ పే ద్వారా 50 వేల రూపాయల చొప్పున రెండుసార్లు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఏలూరు నాగేంద్రకాలనీలో నివాసం ఉండే యువకుల బ్యాంకు ఖాతాలో డబ్బులు పడినట్టు గుర్తించారు. జాగ్రత్త మరి.. అసలే స్మార్ట్‌ఫోన్ల కాలం.. ఆ ఫోన్‌లోనే అన్నీ.. ఇక, సులువుగా పని అయిపోయేందుకు అన్ని బ్యాంకు ఖాతాలతో లింక్.. ఫోన్ పోతే మరి అంతే అన్నట్టు.
ఢిల్లీ బాలిక రేప్ కేసు.. నిందితుడికి ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ
మైనర్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను మంగళవారం కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీమా రాణిని కూడా ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీంతో వారు డ్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కాత్యాయిని శర్మ కంద్వాల్ ముందు విడివిడిగా హాజరయ్యారు. 020 నవంబర్, 2021జనవరి మధ్య నిందితుడు బాలికపై చాలాసార్లు అత్యాచారం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆమె తండ్రి 2020 అక్టోబర్ లో మరణించిన తర్వాత ఆమె కుటుంబ స్నేహితుడైన నిందితుడి నివాసంలో ఉంటోందని పోలీసులు తెలిపారు. దీంతో బాధితురాలు వాంగ్మూలంతో దంపతులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడిపై పోక్సో చట్టం, సెక్షన్లు 376(2)(ఎఫ్) (రేప్), 509 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (బాధ కలిగించడం), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం చేయడం) 120 బి (క్రిమినల్) కింద కేసు నమోదు చేశారు.
క్వింటాళ్ల కొద్దీ టమోటాలు లూఠీ.. పోలీసులు వచ్చేసరికి ఖాళీ
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు పెరిగి.. గతవారం నుంచి మాములు స్థితికి వచ్చిన సంగతి తెలిసిందే. అయినా కొన్నిచోట్ల టమాటా దొంగతనాలు ఆగడం లేదు. భారీ ధరలు ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలలో టమాటాలు ఎత్తుకెళ్లిన సంఘటనలు మనం విన్నాం, చూశాం. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్‌ను కొట్టి తీసుకెళ్లారు. రగూడ గ్రామ సమీపంలోని నిర్జన ప్రాంతంలో టమోటాలు పెద్దఎత్తున పడి ఉన్నాయని సమీప గ్రామాల ప్రజలకు తెలిసింది. దీంతో వెంటనే సంచులు, కవర్లు పట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకుని టమాటాలను ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి అప్పటికే టమోటాలన్నీ లూఠీ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు డ్రైవర్ ను కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరిగింది. మొదటగా వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు.. టమాటాలను రోడ్డు పక్కన పడేశారని ఆ తర్వాత వాహనాన్ని ఎత్తుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.
సిటీ మొత్తం కాలి బూడిదైంది.. ఆ ఒక్క ఇల్లు తప్ప.. అది ఎలా సాధ్యమైంది..?
అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన మంటలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. వందేళ్లలోనే అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుగా చెబుతున్నారు.. ఈ కార్చిచ్చుతో లహైనా రిసార్టు సిటీ మొత్తం కాలిబూడిదైపోయింది.. వేగంగా విస్తరించిన మంటలతో ఇళ్లు కాలిబూడిద కావడమే కాదు.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే, ఇంత భయంకరమైన మంటల్లో విధ్వంసం జరిగినా.. ఓ ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు.. కనీసం గొడల కలర్ కూడా మారలేదు.. ఇప్పుడే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. హవాయిలోని మౌయ్‌లో విధ్వంసకర అడవి మంటలు విస్తృతమైన వినాశనానికి కారణమయ్యాయి. దాదాపు ప్రతి ఆస్తిని దగ్ధం చేసింది. కానీ, ఒక ఇల్లు చెక్కుచెదరకుండా ఉండిపోయింది. తెల్లటి గోడలు మరియు ఎర్రటి పైకప్పు ఉన్న రెండు అంతస్తుల ఇంటి ఫోటోలు దాని చుట్టూ ఉన్న విధ్వంసంమైన పరిస్థితులకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారిపోయింది. ఇల్లు, ఆ చుట్టూ ఉన్న తోట.. సమీపంలో కనిపిస్తోన్న బూడిద, కాలిపోయిన చెట్లకు భిన్నంగా పచ్చదనాన్ని నిలుపుకున్నట్లు కనిపిస్తుంది. ఈ అద్భుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఇది ఎలా సాధ్యమవుతుందని చాలా మంది వినియోగదారులు అడుగుతున్నారు. గత వారం అగ్నిప్రమాదం నుండి బయటపడటానికి ఆమె ఏమి సహాయపడిందని ఇంటి యజమాని వెల్లడించాడు. ది 100 శాతం చెక్క ఇల్లు కాబట్టి మేం దానిని ఫైర్‌ప్రూఫ్ లేదా మరేదైనా చేసినట్లు కాదు అన్నారు ఇంటి యజమాని.. శ్రీమతి అట్‌వాటర్ మిల్లికిన్ మరియు ఆమె భర్త డడ్లీ మూడేళ్ల క్రితం వందేళ్ల నాటి పురాతన ఇంటిని సొంతం చేసుకున్నారు.. అడవి మంటల గురించి ఆలోచించకుండా ఆ ఇంటిని పునరుద్ధరించారు. మిల్లికిన్ మాట్లాడుతూ.. మేం పాత భవనాలను ప్రేమిస్తున్నాం, కాబట్టి మేం భవనాన్ని గౌరవించాలనుకుంటున్నాం. మరియు మేం ఆ భవనాన్ని ఏ విధంగానూ మార్చలేదు.. మేం దానిని పునరుద్ధరించాం అంతే అన్నారు.. తారు పైకప్పును హెవీ-గేజ్ మెటల్‌తో చేసిన రూఫ్‌తో భర్తీ చేయాలని దంపతులు తీసుకున్న నిర్ణయం వినాశకరమైన విధిని నివారించడానికి సాయపడిందని చెబుతున్నారు.
విదేశాలకు పవన్ కళ్యాణ్.. దానికోసమేనట..?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ విదేశాలకు పయమయ్యినట్లు తెలుస్తోంది. పవన్ భార్య అన్నాలెజినావో రష్యాలో ఉంటుంది. పిల్లల చదువుల కోసం ఆమె ఎక్కువ సమయం అక్కడే గడుపుతోంది. అప్పుడప్పుడు పవన్.. అక్కడకు వెళ్లి కుటుంబంతో సమయం గడుపుతాడు. ఇక ఇప్పుడు కూడా సినిమాలకు, రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చి కుటుంబంతో గడపడానికి పవన్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఆయన పుట్టిన రోజున కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాడని టాక్. ఇక ఈ ట్రిప్ సెప్టెంబర్ 7 న ముగుస్తుందని, వచ్చిన వెంటనే షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
హార్ట్ కింగ్.. చరణ్ ఫ్యాన్స్ హార్ట్ ను విరిచేశాడే
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చరణ్.. రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, లీకైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం దిల్ రాజు భారీగా ఖర్చుపెడుతున్నాడు. శంకర్ వర్క్ ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే. ఈ మధ్యనే ఈ సినిమా గురించిన ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఒక్క సాంగ్ కోసమే శంకర్ కొన్ని కోట్లు ఖర్చు చేశాడంటూ చెప్పుకొచ్చారు. అందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. దిల్ రాజు మాత్రం దేనికి వెనుకాడేది లేదని.. ఎంత అయినా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పాడట. దీంతో శంకర్.. సినిమాను తనకు నచ్చినట్లు తీయడం ప్రారంభించాడు. ఇక ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు.. చరణ్ బర్త్ డే కు మాత్రం టైటిల్ రివీల్ చేసి పోస్టర్ ను రిలిజ్ చేశారు అంతే.. దీంతో చిత్ర బృందం ఎవరు కనిపించినా.. గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ అభిమానులు రచ్చ చేయడం మొదలుపెట్టారు. నిన్నటికి నిన్న దిల్ రాజు.. గాండీవధారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే.. గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ అరవడం మొదలుపెట్టారు. ఇక దీనికి దిల్ రాజు ఇచ్చిన సమాధానం విని.. చరణ్ ఫ్యాన్స్ గుండె ముక్కలు అయిపోయిందని చెప్పాలి. “మన చేతిలో లేదు డైరెక్టర్ గారు ఇచ్చినప్పుడే డీటెయిల్స్ బయటకు వస్తాయ్.. మనమేం చేయలేం అమ్మా” అంటూ చేతులెత్తేశాడు. హార్ట్ కింగ్ చెప్పిన సమాధానానికి ఫ్యాన్స్ హార్ట్ పగిలిపోయింది. నిర్మాతే ఈ రేంజ్ గా చెప్తే.. డైరెక్టర్ ఎప్పుడు సినిమా ఫినిష్ చేసేది.. ఎప్పుడు అప్డేట్ వచ్చేది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి శంకర్ అంతకు ముందు సినిమాల్లానే.. ఇది కూడా ఆలస్యం అవుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.