రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 52 రైళ్లు రద్దు
తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే పలు రైళ్లును రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే మొత్తం 52 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే .. వీటితో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుణదల – విజయవాడ సెక్షన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా.. రైళ్లు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. రేపటి నుంచి అంఏ ఈ నెల 22వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసింది.. రద్దు చేయబడిన రైళ్లలో హైదరాబాద్- విశాఖపట్నం మార్గంలో ఉన్న జన్మభూమి, గరీబ్‌రథ్ వంటి రైళ్లు కూడా ఉన్నాయి..
ఎల్లుండి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో బరిలో దించే అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. అయితే.. ఇందులో ఏడుగురు సిట్టింగులను మార్చిన సీఎం కేసీఆర్.. వారి స్థానాల్లో వేరేవారికి అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్ సైతం ఎప్పుడూ పోటీ చేసి గజ్వేల్ స్థానం నుంచే కాకుండా.. ఈ సారి కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగనున్నారు. అయితే… కొంతమంది ఆశావాహులకు భంగపడడంతో వారిని సంతృప్తి పరిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీ అయిన ప్లేస్‌లో కేసీఆర్ కోసం కామారెడ్డి స్థానాన్ని వదులుకున్న గంప గోవర్ధన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిణామంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉండగా.. పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించడంలో భాగంగానే ఈ మంత్రి పదవిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. మంత్రి వర్గంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డిని తొలగిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చూడాలి మరీ ఎవరిని ఏ సీటు వరిస్తోందోనని.
ఏపీ సర్కార్‌పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన ఆయన.. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే అని విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ దుయ్యబట్టారు.. ఇప్పుడు ఏపీలో బీజేపీని హేళన చేసినట్టే గతంలో దేశవ్యాప్యంగా బీజేపీని హేళన చేశారు.. ఏమైంది? హేళన చేసిన పార్టీలే నామ రూపాల్లేకుండా పోయాయని సెటైర్లు వేశారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమన్న ఆయన.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో రెండు రాష్ట్రాల్లో దోపిడీ జరుగుతుందన్నారు బండి సంజయ్.. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది.. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సారి వైసీపీ అధికారంలోకొచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారని.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు. అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? ఆయనకు ‘పుష్ప’ సినిమా చూపించాలేమో..!
ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని విమర్శించారు బండి సంజయ్. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన కలిగిస్తోందన్నారు. భక్తులు తిరుమలకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? అంటూ టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై మండిపడ్డ సంజయ్.. ఆయన బిడ్డ పెళ్లి క్రైస్తవ ఆచార పద్ధతిలో చేసిన మాట నిజం కాదా? నేను నాస్తికుడిని అని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నడట.. మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో అని ఎద్దేవా చేశారు. నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా.. మీరు హిందువులుగా ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్.. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఒక మతానికే కొమ్ము కాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు..? జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండి అంటూ పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ కుమార్.
దొంగగా మారిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. ఇలా దొరికిపోయాడేంటి..?
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దొంగగా మారిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.. విజయనగరంలో పలు దొంగతనాలకు పాల్పడ్డ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును అరెస్టు చేశారు పోలీసులు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా 10 ఏళ్లు పని చేసిన శ్రీనివాసరావు.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.. ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడం.. జల్సాల కోసం దొంగతనాలకు తెగబడ్డాడు.. డబ్బుల కోసం దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్న శ్రీనివాసరావు.. నగరంలో 12 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఎలాంటి దొంగ అయినా.. ఏదో ఒక సమయంలో దొరకకపోడు కదా.. విజయనగరంలో అనుమానంగా తిరుగుతున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఇక, పోలీసుల విచారణలో శ్రీనివాసరావు క్రిమినల్ డేటా బయటకు వచ్చింది.. శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి.. 27 తులాలు బంగారం ఆభరణాలు, 6 కేజీల వెండి ఆభణాలు స్వాధీనం చేసుకున్నారు.
కేజ్రీవాల్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇప్పుడు అది కూడా ఫ్రీ
ఢిల్లీలోని జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఇప్పుడు ఉచిత చక్కెర లభించనుంది. సోమవారం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆహార భద్రత కార్డుదారులు ఉండి.. అత్యంత అట్టడుగు వర్గాల వారు ఉచిత చక్కెరను పొందగలరని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఉచిత చక్కెర పంపిణీ ప్రతిపాదనకు కేబినెట్ జూలైలో ఆమోదం తెలిపింది. మరోవైపు లబ్ధిదారుల కుటుంబాలకు ప్రస్తుతం గోధుమలు మరియు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఇప్పుడు ఉచితంగా చక్కెర ఇస్తుంది. ఢిల్లీలోని 68,747 మంది జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ప్రయోజనం చేకూరనుంది. అందులో మొత్తం 2,80,290 మంది ఉన్నారు. ఉచిత చక్కెర పంపిణీకి రూ. 111 కోట్లు కేటాయించానున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించడమే దీని లక్ష్యమని కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా.. పౌరులందరికీ అధిక స్థాయిలో ఆహార భద్రత కల్పిస్తామని.. అత్యంత అవసరమైన వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.
మోడీకి ఇంకా ఆరు నెలలే మిగిలి ఉంది.. ప్రధానిపై విమర్శలు
కోల్‌కతాలో ముస్లిం మత పెద్దలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూ పుజారులు, ముస్లిం మత పెద్దలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి నెలవారీ జీత భత్యాన్ని రూ.500 పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఇమామ్‌ల(ముస్లిం మత గురువులు) నెల జీతం రూ.2,500 కాగా.. మ్యూజిన్‌ల(ఇతరులను నమాజ్ కోసం పిలిచే వ్యక్తులు) జీతం రూ.1000గా ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్‌తో సహా పలువురు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సమాజాన్ని కలుపుకొని పోయే అభివృద్ధి పనులపై మమతా బెనర్జీ ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఇంతలోనే పుజారులు, ముస్లిం మత పెద్దల నెలవారీ జీత భత్యాలను పెంచడం గమనార్హం. అంతేకాకుండా రాష్ట్రంలోని 700 అన్ ఎయిడెడ్ మదర్సాలలకు కూడా ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని ఆమె ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర మొత్తం జనాభాలో 27.01% మంది ముస్లిం ఓట్లు బెంగాల్ ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
ఆసియా కప్ టీమ్ లో దక్కని చోటు.. చహల్ ట్వీట్ వైరల్
ఈ నెల 30వ తారీఖు నుంచి ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును నేడు ( సోమవారం ) సెలక్టర్లు ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఈ బృందంలో స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కు స్థానం దక్కలేదు. ఆసియా కప్ కు ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా స్వదేశంలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023లోనూ ఆడించే ఛాన్స్ అధికంగా ఉంది. దీంతో ప్రపంచ కప్ లో చహల్ ఆడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. చహల్ ను కాదని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి ఎంపిక చేశారు. చైనామాన్ స్పిన్నర్ తో పాటు ఆల్ రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లకు అవకాశం దక్కింది. ఆసియా కప్ లో తనకు స్థానం దక్కుతుందని చహల్ అనుకున్నాడు. కానీ తన ఆశ నిరాశ కావడంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరిని ఒక్క మాట అనలేదు.. కేవలం రెండు ఎమోజీలతో కూడిన ఓ ట్వీట్ ను చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు చహల్ ఏం పోస్ట్ చేశాడో తెలుసా..? ఆ రెండు ఎమోజీలు ఇలా ఉన్నాయి.. మబ్బుల చాటున దాగి ఉన్న సూర్యుడు ఎమోజీతో పాటు మబ్బులు తొలగిన తరువాత ప్రకాశించే సూర్యుడి ఎమోజీలను పోస్ట్ చేశాడు.
సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది..వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు తదితరాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ బ్యాంకు సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలు, పండగలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అయితే సాధారణంగా ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు ప్రతి రోజు ఏదో పని నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో ప్రతి నెల ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్న విషయం గమనించడం మంచిది.. టైం అవ్వదు..
చిరంజీవి బర్త్ డే.. పవన్ ఎమోషనల్ పోస్ట్..!
అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పెట్టిన పోస్ట్ విషయానికి వస్తే.. “అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..!” అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్పై గా వరుణ్ లుక్ హాలీవుడ్ హీరోను గుర్తుచేస్తుంది. చాలా గ్యాప్ తరువాత వరుణ్ తన కటౌట్ కు సరిపడా రోల్ లో కనిపించాడు. ఇక ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. నాజర్ మినిస్టర్ గా కనిపించాడు. ఏదో మిషన్ కోసం అర్జున్ పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మిషన్ కు సాక్షి వైద్య హెల్ప్ చేస్తున్నట్లు కనిపించింది. విలన్ వినయ్ రాయ్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేయగా.. దాన్ని అర్జున్ ఎలా తిప్పికొట్టాడు అనేది కథగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో వరుణ్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఇక మిక్కీ జె మేయర్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
చీరకట్టులో మెరిసిన అనుపమ.. హాట్ అందాలతో టెంపరేచర్ పెంచేస్తుందిగా…
కేరళ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. అనుపమా ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ తో పాటు మాస్ రాజా రవితేజ సరసన ‘ఈగల్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే తమిళం లో ‘సైరెన్’ అనే సినిమా కూడా చేస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.అటు వెండితెరపై వరుస సినిమాలలో అలరిస్తూనే ఉన్న అనుపమా ఇటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది.కొద్దికాలంగా అనుపమా అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ ఘాటైనా పోజులతో రెచ్చగొడుతుంది.. టెంప్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా అనుపమా షేర్ చేసిన ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో ఈ మలయాళీ ముద్దుగుమ్మ పరువాల ప్రదర్శన తో రెచ్చగొడుతుంది.కిల్లింగ్ లుక్స్ తో టెంపరేచర్ పెంచేస్తుంది. ఈ యంగ్ బ్యూటీ అందానికి ఫిదా అవుతూ నెటిజన్స్ హాట్ గా కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది. కొన్నేళ్లు కలిసి ఉన్న ఈ జంట కొన్ని విభేదాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. అయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణును వదినమ్మ అనే పిలుస్తారు. ఇక చాలా గ్యాప్ తరువాత రేణు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్యనే పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడితే .. వారికి గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. ఇక తాజాగా రేణు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. తనకు ఇష్టమైన దర్శకుడితో ఫోటో దిగినట్లు తెలిపింది. మూడు రోజుల క్రితం రేణు.. అమెరికాలో నిర్వహించిన బాహుబలి కన్సర్ట్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. అప్పుడు రాజమౌళి గురించి, బాహుబలి సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. ఇక అదే కన్సర్ట్ లో ఆమె.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కలిసినట్లు చెప్పుకొచ్చింది. ఆయనతో దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తూ.. “నార్వే ఆర్కెస్ట్రా ద్వారా బాహుబలి సంగీత కచేరీకి హాజరయ్యేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు మరియు ఉత్సాహంగా ఉన్నారు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇది మూడు రోజుల క్రితం జరిగిందని కూడా తెలిపింది. ఇక రాఘవేంద్రరావుగారితో ఫోటో దిగడం హ్యాపీగా ఉందని, ఫుల్ ఫ్యాన్ మూమెంట్ అని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫోటోలను అకీరా తీసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం రేణు దేశాయ్.. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.