గుండె చికిత్సలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు..
గుండె పోటు చికిత్సలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఇటీవల బాగా పెరుగుతున్న గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. యువతపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది గుండెపోటు.. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో గుండెపోటు చికిత్స కోసం ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది.. గుండె పోటు వచ్చిన మొదటి గంట గోల్డెన్ హవర్‌గా చెబుతున్నారు వైద్యులు.. దీంతో, మొదటి గంటలో ట్రీట్మెంట్ అందించడంపై స్టెమి (STEMI) ప్రాజెక్ట్ తీసుకురానున్నారు.. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్స అందించనున్నారు. 40 వేల రూపాయల విలువ చేసే స్పెషల్ ఇంజక్షన్ల కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి 94 పోస్టులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గుండెపోటు మొదటి గంట ట్రీట్మెంట్ పై చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు.. వచ్చే నెలాఖరులోగా పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.
విజయవాడలోని మూడు స్థానాలకు అభ్యర్థులు వీరే.. సజ్జల ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిపోయింది. పాలక, ప్రతిపక్షాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి.. ఇక, అధికార పార్టీ మరింత దూకుడు పెంచేసింది.. సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తున్నారు.. విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ రోజు ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయవాడ పాతబస్తీ పంజాసెంటర్ లో నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. సీసీ రోడ్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాస్‌ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులను కూడా గెలిపించాలని పిలుపునిస్తూనే.. ఆ ముగ్గురు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్.. సీఎం జగన్ హాజరు, చంద్రబాబు దూరం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్.. రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇక, ఈ రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఈ రోజు రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు.. రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం దంపతులకు స్వాగతం పలికారు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు.. ఇక, గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాజ్ భవన్‌లో తొలిసారి ఎట్ హోమ్ జరిగింది.. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనలోఉన్న కారణంగా ఎట్ హోమ్‌కి దూరంగా ఉండగా.. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులులతో పాటు పలువురు హాజరయ్యారు. ఎట్ హోమ్‌కు హాజరైన అతిథులను స్వయంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పలకరించారు.. ఒక్కో టేబుల్ దగ్గరకు వెళ్లి వారితో ముచ్చటించారు. ఇక, సీఎం వైఎస్ జగన్ దంపతులతో గవర్నర్ దంపతులు ముచ్చట్లలో మునిగిపోయారు.
మాకు అణా పైసా కూడా వద్దు.. టీటీడీపై లక్షిత తాత షాకింగ్ కామెంట్స్
తిరుమల నడక దారిలో చిరుత దాడిలో ప్రాణాలు విడిచిన చిన్నారి లక్షిత తాత శ్రీనివాసులు.. టీటీడీ, రాజకీయ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.. తిరుమల నడక మార్గంలో మా బిడ్డ (మనవరాలు) చిరుత దాడిలో మరణిస్తే.. అటవీ శాఖ, టీటీడీ తప్పు లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు.. అంతేగాక రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు చెప్పారు.. మీరు ఎవరికి ఇచ్చారు.. ఎవరికి అందచేశారు. ఏ లబ్ది కోసం ఇలా చేస్తున్నారు.. ఎందుకు ఇలాంటి తప్పుడు మెసేజ్‌లు ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మా పాప విలువను రూ.10 లక్షలుగా నిర్ణయించారు.. మా పాప ప్రాణాల విలువ రూ.10 లక్షలా? అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కానీ, మాకు ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్ వ్యక్తుల నుంచి గానీ రూపాయి సాయం అవసరం లేదు.. చివరకు అణా పైసా సాయం కూడా తీసుకోవడానికి మేం సిద్ధంగా లేమంటూ మండిపడ్డారు. ఇక, జింకలకు ఇచ్చే రక్షణ మనుషులకు ఎందుకు ఇవ్వడం లేదు? అని టీటీడీని నిలదీశారు శ్రీనివాసులు.. జింకలను స్వేచ్ఛగా వదలాలి.. అప్పుడే మనుషుల కోసం చిరుతలు, పిలులు రావన్నారు.. అసలు జింకలను బంధించడానికి మీరు ఎవరు? అడవిలో వాటిని వదిలేయండి.. అప్పుడు మనుషుల కోసం జంతువులు రావు కదా? అని సూచించారు. పులి దాడులు జరుగుతున్నట్లు పత్రికల్లో వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ టీటీడీని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని హితవు పలికారు. కంచ వేసి ఉంటే నా బిడ్డకు ఏమీ అయ్యుండి కాదన్నారు.. ఎందుకు మీకు ఆలోచన రాలేదు అంటూ టీటీడీ, రాజకీయ నేతలపై విరుచుకుపడ్డారు శ్రీనివాసులు. మరోవైపు.. నాయకులు వస్తే.. వారికి భద్రత కలిపిస్తారు.. ఎందుకంటే మేం ఓట్లు వేయడం వల్ల వాళ్లు ప్రజాప్రతినిధులు అయ్యారు.. కానీ, మేం ఓటర్లం కాబట్టే.. మా లాంటి వాళ్ల ప్రాణాలకు రక్షణ ఉండదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు లక్షిత తాత శ్రీనివాసులు.
సీఎం స్పీచ్కు అడ్డుతగిలిన యువకుడు.. ఎందుకో తెలుసా..?
బీహార్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఎం నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు హైసెక్యూరిటీ జోన్‌లోకి దూసుకు వచ్చాడు. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని విచారించింది. అతనిని ముంగేర్ జిల్లాకు చెందిన నితీశ్ మండల్(26)గా పోలీసులు గుర్తించారు. ఓ పోస్టర్‌ను పట్టుకొని దూసుకు వచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. యువకుడి తండ్రి రాజేశ్వర్ పాశ్వాన్ బిహార్ మిలిటరీ పోలీసు విభాగంలో పనిచేస్తూ.. 1996 ఎన్నికల సమయంలో డ్యూటీలోనే మృతి చెందారని నితీశ్ మండల్ తెలిపాడు. ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిని కలిసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని యువకుడు తెలిపాడు. చాలా రోజులుగా వేచి చూస్తున్నానని, కనీసం ఇలాగైనా వెళ్తే ముఖ్యమంత్రి దృష్టిలో పడి, తనకు ఉద్యోగ సమస్య తీరుతుందని తనకు కొంతమంది చెప్పారని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పాడు. తన తండ్రి చనిపోయినప్పుడు తాను మైనర్ బాలుడినని, అందుకే అప్పుడు ఉద్యోగం రాలేదన్నాడు. అయితే అతను కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసే ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు గుర్తించారు. సీఎం సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు.
రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్లో పేలుడు ప్రమాదం.. 27 మంది మృతి
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంత రాజధాని మఖచ్కల శివార్లలో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. రష్యా కాలమానం ప్రకారం.. రాత్రి 9:40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు ప్రారంభమై సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించడంతో పేలుడు సంభవించిందని రష్యా ప్రభుత్వ అధికారులు. అయితే ఈ పేలుడు దాటికి 600 చదరపు మీటర్ల వరకూ మంటలు చెలరేగాయని నివేదికలు పేర్కొన్నాయి. గ్యాస్ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు. హీట్ కారణంగా మళ్లీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 250 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ కొందరినీ చికిత్స కోసం మాస్కోకు విమానంలో తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా అధికారులు నేర విచారణ ప్రారంభించారు.
సౌతాఫ్రికా సిరీస్ నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ఔట్..! అతడికే జట్టు పగ్గాలు..?
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్ టీమ్ సారథిని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. గాయం నుంచి కోలుకుంటాడని దక్షిణ ఆఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు కమిన్స్‌ను సెలక్షర్లు ఎంపిక చేశారు. అతని తాజా పరిస్థితిని సమీక్షించి వన్డే జట్టు నుంచి తప్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు టాక్. పాట్ కమిన్స్ స్థానంలో టీ20 టీమ్ సారథి మిచెల్ మార్ష్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వర్గాలు భావిస్తున్నాయట. వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు మరింత రెస్ట్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆలోచన చేసిందని తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ కు ముందు భారత్‌తో జరిగే వన్డే సిరీస్ సమయానికి సిద్ధంగా ఉండాలని పాట్ కమిన్స్ కు సీఏ సూచించినట్లు తెలుస్తోంది. కాగా, ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా టీమ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అనంతరం సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ టూర్ కి రానుంది. యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్ సందర్భంగా గాయపడిన కమిన్స్ వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్ వరకు రెడీ అయి.. అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
టీమిండియాలోకి రిషబ్ పంత్ రీఎంట్రీ..?
స్వాతంత్య్ర దినోత్సవం రోజు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ టైంకి పంత్ ఫిట్‌గా ఉంటాడనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి సైతం చెప్పినట్లు సమాచారం. కాగా, గతేడాది డిసెంబర్ 30న ఘోర రోడ్డు యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం 70 శాతం వరకు కోలుకుని, ఫిట్‌నెస్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అయితే, పంత్ ఇంకా ప్రాక్టీస్ ప్రారంభించకుండానే జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. పంత్ వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయాని కంటే ముందే టీమిండియాలో జాయిన్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.. బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంక్ బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరగనున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కన్నా ఎక్కువ బ్రాంచ్ లను స్టార్ట్ చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.. ఈ క్రమంలో కొత్తగా 300 బ్రాంచులను ప్రారంభించాలని బ్యాంక్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశ వ్యాప్తంగా 22,405 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. విదేశీల్లో కూడా ఎస్‌బీఐకి బ్రాంచులు ఉన్నాయి. 235 వరకు బ్రాంచులు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బ్రాంచుల పరంగా చూస్తే ఎస్‌బీఐ కూడా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోందని చెప్పుకోవచ్చు.. డిజిటల్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని చూస్తున్నాం. అలాగే ఫిజికల్ బ్రాంచుల సంఖ్యను కూడా మరింత పెంచుకుంటాం. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలో 300 బ్రాంచులను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఎక్కడ అయితే బ్యాంక్ బ్రాంచ్ అవసరం ఉందో అక్కడ కొత్తగా బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని బ్యాంక్ చైర్మన్ అధికారికంగా ప్రకటించారు..
స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..
విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ఇక ప్రమోషన్స్ విషయంలో విజయ్ తన రూటే సపరేట్ అనేలా చేస్తాడు అన్న విషయం తెల్సిందే. అప్పుడెప్పుడో డియర్ కామ్రేడ్ సినిరంకు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించి సెన్సేషన్ సృష్టించిన విజయ్.. అదే ఫార్ములాను ఖుషీకి కూడా ఫాలో అయ్యాడు. ఖుషీ మ్యూజికల్ కన్సర్ట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ ఈవెంట్ కు విజయ్, సమంత విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మొట్ట మొదటిసారి సమంత, విజయ్ తో కలిసి డ్యాన్స్ వేసింది. స్టేజిపైకి ఎక్కగానే విజయ్ షర్ట్ విప్పి.. సమంత ను పట్టుకొని తిప్పుతూ రొమాంటిక్ గా స్టెప్పులు వేశాడు. ఖుషీ టైటిల్ సాంగ్ కు సామ్, విజయ్ కాలు కదిపారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తర్వాత ఇద్దరూ కలిసి అభిమానుల మధ్యలో ఖుషీ సాంగ్ అభిమానులతో కలిసి పాడారు. ఇక ఈవెంట్ మొత్తానికి సమ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.
చేస్తే అలా చెయ్… లేదంటే ఇంట్లోనే కూర్చో.. కౌంటర్ ఎవరికో
చివరిగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రూత్ ప్రభు ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలిన ఆమె ఆ తర్వాత తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లి అక్కడ కొన్నాళ్లపాటు గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆమె మొట్టమొదటిసారిగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. హైదరాబాదులో హైటెక్స్ లో జరుగుతున్న ఖుషి సినిమా లైవ్ కాన్సర్ట్ లో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఒక సాంగ్ పర్ఫార్మ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రోగ్రాం కంటే ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో విజయ్ దేవరకొండ సమంత ఇద్దరూ చాలా సమయం వెచ్చించారు.. అయితే దీనికోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసి పెట్టిన ఒక క్యాప్షన్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదైనా చేస్తే పెద్దగా చేయాలి లేదంటే ఇంట్లో కూర్చోవాలి అని అర్ధం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. అదిప్పుడు చర్చనీయాంశం అయింది.
అనిల్ సుంకరకు చిరంజీవి భరోసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాళం సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ అందుకుంది. ఒకరకంగా ఈ సినిమాతో భారీ ఎత్తున నిర్మాత అనిల్ సుంకర నష్టపోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు నిజానికి ఈ సినిమాను ముందుగా అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు కలిసి నిర్మించాలని అనుకున్నారు. చిరంజీవి రెమ్యూనరేషన్తో పాటు వాటాదారుడుగా కూడా ఉండాలని అనుకున్నారు. అయితే ముగ్గురు మీద వాటర్ కుదరక కేవలం రెమ్యూనరేషన్ తీసుకుని నటిస్తానని చెప్పి 60 కోట్లు రెమ్యూనరేషన్ గా ఫిక్స్ చేసుకున్నారు. ఆ తరువాత కేఎస్ రామారావు సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే మామూలుగానే ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రిలీజ్ కి ముందు దాదాపు మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ అంతా క్లియర్ అయింది. అయితే విడుదల అయ్యాక సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో పాటు నష్టాలు వస్తున్నాయి అనే విషయం తెలుసుకొని కొంత అమౌంట్ వెనక్కి ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనిల్ సుంకర దృష్టికి తీసుకు వెళ్తే ఆయన దానికి ఒప్పుకోలేదని అంటున్నారు. తనతో మరొక సినిమా చేసే అవకాశం ఇవ్వాలని అని చిరంజీవిని కోరగా వెంటనే దానికి చిరంజీవి ఒప్పుకున్నారని కచ్చితంగా ఆయనతో కలిసి సినిమా చేస్తానని హామీ ఇచ్చారని అంటున్నారు, చిరంజీవి హీరోగా ఆయన కుమార్తె సుస్మిత నిర్మాతగా ఈ నెల 22వ తేదీన ఒక సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత అనిల్ సుంకర నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి దర్శకుడు ఎవరు? కథ ఏమిటి? వంటి కాంబినేషన్లు ఇంకా సెట్ కాలేదని కానీ సుస్మితతో చేయబోయే సినిమా తర్వాత సినిమా మాత్రం ఖచ్చితంగా అనిల్ సుంకర నిర్మాణంలోనే ఉండబోతుందని తెలుస్తోంది.