ముగిసిన నామినేషన్ల స్క్రూట్నీ.. ఫైనల్‌గా బరిలో నిలిచింది ఎవరంటే..?
సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది.. నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు అధికారులు.. సరైన ఫార్మాట్ లో లేని నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల సంఘం అధికారులు.. దీంతో.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1,103 నామినేషన్ల దాఖలు అయ్యాయి.. అయితే, పార్లమెంట్ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 127 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు.. 301 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. మరోవైపు, 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 5,997 నామినేషన్ల దాఖలు అయ్యాయి.. అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్లల్లో 598 తిస్కరించిన అధికారులు.. 1381 నామినేషన్లకు ఆమోదం తెలిపారు.. ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడు.. ఇవాళ రాత్రికి సీఈవో కార్యాలయానికి పూర్తి స్థాయిలో వివరాలను అప్డేట్ చేయనున్నారు ఎన్నికల అధికారులు.. ఆ తర్వాత వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు.. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.. ఈ రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఇచ్చారు. ఇక, మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న విషయం విదితమే.
ఏపీ ఎన్నికలు 2024.. క్విక్ పోలీసింగ్ కోసం ఈసీ కొత్త యాప్
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు చకచకా అడుగులు ముందుకు పడుతున్నాయి.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు.. ఈరోజు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి చేశారు.. సరైన ఫార్మాట్, తప్పుగా ఉన్న నామినేషన్లను తిరస్కరించారు.. మరోవైపు.. ఎన్నికల ప్రచారంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. ఇక, మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కీలకమైన పోలింగ్ జరగనుండగా.. ఈ సమయంలో ఎటు వంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” (“SAMARTH”-Security Arrangement Mapping Analysis Response Tracking Hub) మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ను అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు వినియోగించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల వేళ స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ కై ఈ మొబైల్ యాప్ ఎంతగానో దోహదపడుతుందని, సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను ఎంతో సులభంగా గుర్తించ వచ్చని, తద్వారా మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలను తక్షణమే పంపించేందుకు అవకాశం ఉంటుందని మరియు కంట్రోల్ రూమ్ నుండే పోలీస్ బలగాల లొకేషన్ లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఈవో మీనా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వంటి స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ మొబైల్ యాప్ ను అభివృద్ది పర్చి ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లాలో వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌ని అభినందించింది ఈసీ.. బాపట్ల జిల్లా ఎస్సీ శ్రీ వకుల్ జిందాల్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి.. తమ జిల్లాలో ఉపయోగిస్తున్న ఈ సమర్థ్ మొబైల్ యాప్ విశిష్టతను, విశేషాలను వివరించారు.
గుడ్లూరులో బాలయ్య ప్రచారం.. ప్రభుత్వంపై పంచ్‌లు..
ఇప్పటికే ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.. ఈ రోజు నెల్లూరు జిల్లాలో క్యాంపెయిన్ చేశారు.. గుడ్లూరు, కందుకూరులో ఆయన బస్సు యాత్ర సాగింది.. గుడ్లూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై పంచ్‌లు వేశారు.. జగన్ రాక్షస పాలనని దించేందుకు ప్రతి ఒక్కరూ ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇక, “జగనన్న అంటూ జలగలా పీడించారు.. మామయ్య అంటూ మనోభావాలు తగలబెట్టాడు.. నవరత్నాలు అంటే నడుములు కుంగతీశాడు.. దళితులకు అండగా ఉంటానని వారి చావులతో తన ఆకలి తీర్చుకున్నాడు.. నా ఆడపడుచులంటూ వారి ఉసురుపోసుకుంటున్నారు..” అంటూ ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే.. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ.. ఎన్నికల్లో కందుకూరు అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావును, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని గద్దె దించే వరకు ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించాలి.. కూటమి అభ్యర్థుల విజయం కోసం అలుపుసొలుపు లేకుండా కష్టపడాలని సూచించారు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఈసీకి ఫిర్యాదు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు ఈనెల 24 న నెల్లిమర్లలో, ఈనెల 25వ తేదీన రాజంపేట, రైల్వేకోడూరులలో ఎన్నికల ప్రచారం సందర్బంగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగతంగా అనుచితవ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది వైసీపీ.. ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నప్పటికి వ్యాఖ్యలు చేశరని.. ఇది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ ప్రతినిధుల బృందం.
కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోయారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ను ఎలాగైనా గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పై ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విరుచుకు పడ్డారు. మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మటంతో పెద్ద నష్టం జరిగిపోయిందన్నారు. రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడుగ బలహీన వర్గాల అభివృద్ధి కి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలిపారు.
సీఎం చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తాం..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కు ఇంకా 14 రోజులు మాత్రమే సమయం ఉంది.. కార్యకర్తలు, నాయకులు బాగా కష్టపడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి 17 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ, అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు అందచేస్తామని చెప్పారు.
అఖిలేష్ ఆస్తులెన్నో తెలుసా! భార్యకు ఎంత అప్పు ఇచ్చారంటే..!
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవలే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఆయన భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పూరి నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. అఖిలేష్.. తన భార్యకు కూడా అప్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అఖిలేష్ రూ.26.34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ఆస్తుల మొత్తం రూ.15 కోట్లుగా ఉంది. మొత్తంగా వారిద్దరి సంపద విలువ రూ.41 కోట్లని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అఖిలేశ్.. చరాస్తులు రూ.9.12 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.17.22 కోట్లుగా ఉన్నాయి. రూ.25.61 లక్షలు నగదు రూపంలో ఉందని, రూ.5.41 కోట్లు బ్యాంక్‌లో ఉందని పేర్కొన్నారు. ఇక ఐదు సంవత్సరాల వార్షిక సగటు ఆదాయం రూ.87 లక్షలు కాగా.. డింపుల్ ఆదాయం రూ.65 లక్షలుగా ఉంది. ఇక అఖిలేష్.. తన భార్యకు రూ.54 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు.
రెండో దశ ఎన్నికల ముగిసిన వేళ మోడీ కీలక వ్యాఖ్యలు..
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశ ఎన్నికలు ఎన్డీయేకు కలిసి వచ్చిందని శుక్రవారం అన్నారు. అధికార పార్టీకి అసమానమైన మద్దతు లభించిందని చెప్పారు. పోలింగ్ ముగియగానే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘రెండో దశ చాలా బాగుంది. ఈ రోజు ఓటు వేసిన భారతదేశం అంతటా ప్రజలకు కృతజ్ఞతలు. NDAకి అసమానమైన మద్దతు ప్రతిపక్షాలను మరింత నిరాశకు గురి చేస్తుంది. ఓటర్లు ఎన్‌డిఎ సుపరిపాలనను కోరుకుంటున్నారు. యువత మరియు మహిళా ఓటర్లు బలమైన ఎన్‌డిఎ మద్దతును బలపరుస్తున్నారు’’ అని అన్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఓటింగ్ తర్వాత కూడా ప్రధాని ఇదే రకమైన స్పందనను వ్యక్తపరిచారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు రికార్డు స్థాయిలో ఎన్డీయేకు ఓటు వేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. తొలిదశలో దేశవ్యాప్తంగా 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగగా.. ఈ రోజు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి.
మాల్దీవులలో చైనా రీసెర్చ్ షిప్.. ముయిజ్జూ భారీ విజయం తర్వాత కీలక పరిణామం..
మాల్దీవుల్లోకి చైనా రీసెర్చ్ షిప్ మళ్లీ వచ్చింది. రెండు నెలల క్రితం ఇది మాల్దీవుల్లోని పలు రేవుల్లో తిరిగింది. ప్రస్తుతం ఇది మళ్లీ ద్వీప దేశ జలాల్లోకి వచ్చింది. జియాంగ్ యాంగ్ హాంగ్03 గురువారం థిలాఫుషి ఇండస్ట్రియల్ ఐలాండ్ హార్బర్‌లో డాక్ చేయబడింది. అయితే, ఈ నౌక తిరిగి రావడానికి గల కారణాలను ఆ దేశం వెల్లడించలేదు. ఈ నౌకకు సంబంధించి దాని మొదటి పర్యటనకు ముందే డాకింగ్ చేయడానికి పర్మిషన్ పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు చెందిన పార్టీ భారీ విజయం సాధించింది. పీపుల్స్ అసెంబ్లీలో 93 మంది సభ్యులకు గానూ 66 స్థానాలను గెలుచుకుంది. చైనా అనుకూలుడిగా ముద్ర పడిన ముయిజ్జూ గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఈ చైనా నౌక మళ్లీ మాల్దీవుల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ముయిజ్జూ గత ఏడాది ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే మాల్దీవుల్లో మానవతా కార్యక్రమాలని నిర్వహిస్తున్న భారత ఆర్మీ సిబ్బంది దేశం వదిలిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. ఆ తర్వాత చైనా పర్యటనకు వెళ్లి, ఆ దేశంతో సైనిక ఒప్పందంతో పాటు మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నాడు.
స్విగ్గీ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్…
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆన్ లైన్ కి అలవాటు పడ్డాం. ఇంట్లో వంట నచ్చకపోయినా.. కొత్తగా ఏమైనా తినాలన్నా వెంటనే స్విగ్గీలో ఆడర్ పెడతాం. బెంగళూరుకు చెందిన ఈ స్విగ్గీ మరో అడుగు ముందుకేసింది. త్వరలో స్విగ్గీ ఐపీఓ రానుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Swiggy IPO) కు వాటాదారులు ఆమోదం తెలిపారు. దీంతో ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ వ్యాపారం నిర్వహించే స్విగ్గీ.. రూ.3,750 కోట్ల మూలధనంతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ద్వారా రూ.6,664 కోట్ల (800 మిలియన్ డాలర్లు)ను సమీకరించాలని భావిస్తోంది. ఇక స్విగ్గీ కాస్త.. ఐపీఓకు ముందు స్విగ్గీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారనుంది. స్విగ్గీ 1 బిలియన్ డాలర్లను సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాని కోసం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.750 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, స్విగ్గీ ఇంకా సెబీ (sebi) కి తన ఐపీఓ (Swiggy IPO) ఫైలింగ్స్ ను సమర్పించలేదు. ఏప్రిల్ 23న జరిగిన స్విగ్గీ అసాధారణ సర్వసభ్య సమావేశం (EGM)లో ఐపీఓకు అంగీకరిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని షేర్ హోల్డర్లు ఆమోదించారు. స్విగ్గీ (Swiggy) లో టాప్ ఇన్వెస్టర్ గా నెదర్లాండ్స్ కు చెందిన ప్రోసస్ (Prosus) కంపెనీ ఉంది. స్విగ్గీలో దీనికి 35% వాటా ఉంది. తరువాత స్థానంలో సాఫ్ట్ బ్యాంక్ ఉంది. టెన్సెంట్, యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, మీటువాన్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కోట్యూ, ఆల్ఫా వేవ్ గ్లోబల్, ఇన్వెస్కో, హిల్హౌస్ క్యాపిటల్ గ్రూప్, జీఐసీ.. మొదలైనవి ఇతర వాటాదారులుగా ఉన్నాయి. కంపెనీ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మజేటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమినిలకు వరుసగా 4.2 శాతం, 1.6 శాతం, 1.2 శాతం వాటాలు ఉన్నట్లు డేటా ప్లాట్ ఫామ్ ట్రాక్సన్ తెలిపింది. 2020 లో, జైమిని తన కార్యకలాపాల స్థానాన్ని విడిచిపెట్టి పెస్టో టెక్ అనే కొత్త స్టార్టప్ ను ప్రారంభించారు.
అభిషేక్ శర్మ ప్రపంచకప్లో స్థానం లభించడం ఛాన్సే లేదు.. ఇంకా నేర్చుకోవాలి..!
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో 16 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన అభిషేక్ శర్మకు టీ20 ప్రపంచకప్ లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయా..?. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ప్రపంచకప్ లో స్థానం లభించడం ఛాన్సే లేదంటున్నారు. కాగా.. ఈ ఐపీఎల్ లో అభిషేక్ 218 స్ట్రైక్ రేట్ లో ఆడుతున్నాడు. తాను క్రీజులో ఉన్నంతసేపు బాల్ బౌండరీలు దాటాల్సిందే.. ప్రత్యర్థి బౌలర్లకు అతను చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో.. యువరాజ్ సింగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ, “అభిషేక్ దాదాపు ప్రపంచకప్ ఆడేంత వరకు చేరుకున్నాడు, కానీ అతను ప్రపంచ కప్ ఆడటానికి సిద్ధంగా లేడని నేను అనుకుంటున్నాను. ప్రపంచ కప్ కోసం మాకు అనుభవజ్ఞులైన జట్టు అవసరం. కొంతమంది యువ ఆటగాళ్ళు భారత్ తరుఫున ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రపంచకప్ తర్వాత భారత్ తరుఫున ఆడండి.. వచ్చే ఆరు నెలలు వారికి చాలా ముఖ్యమైనవి.” అని చెప్పుకొచ్చాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన యువరాజ్, అభిషేక్ తన బ్యాటింగ్‌కు ఇంకా కొంచెం పని చెప్పాల్సి ఉందన్నాడు. “సహజంగానే అభిషేక్ ప్రదర్శన మెరుగుపడింది. అతని స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, కానీ పెద్ద స్కోర్లు రావడం లేదు. ఇండియా తరుఫున ఆడాలనుకుంటే, ఈ రకమైన స్ట్రైక్ రేట్‌తో పెద్ద స్కోర్ చేయడం ముఖ్యం. భారత్‌కు ఆడాలంటే అభిషేక్.. కొన్ని పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడి తన విలువను నిరూపించుకోవాలి.” అని యువరాజ్ సింగ్ చెప్పాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో.. అభిషేక్ ఇప్పటివరకు 218 స్ట్రైక్ రేట్‌తో 288 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
నాలుగు రోజులుగా నటుడు మిస్సింగ్?
హిందీలో ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ అనే టీవీ సీరియల్‌లో సోధి పాత్రలో నటించి ఫేమస్ అయిన గురు చరణ్ సింగ్ గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని అతని తండ్రి ఢిల్లీ పోలీసులకు తెలిపారు. గురు చరణ్ సింగ్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురు చరణ్ సింగ్ సోమవారం ఇంటి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. అతను ముంబైకి బయలుదేరాడు కానీ అతను ముంబైకి చేరుకోలేదు లేదా ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. గురుచరణ్ సింగ్ తండ్రి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నటుడు తప్పిపోయినట్టు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ ప్రకారం ‘నా కొడుకు గురు చరణ్ సింగ్, వయస్సు: 50 సంవత్సరాలు, ఏప్రిల్ 22 ఉదయం 8:30 గంటలకు ముంబైకి బయలుదేరాడు. అతను విమానాశ్రయానికి వెళ్ళాడు, కాని ముంబైకి చేరుకోలేదు లేదా ఇంటికి తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా అందుబాటులో లేదు. అతను మానసికంగా స్థిరంగా ఉన్నాడు. మేము అతని కోసం వెతికాము, కానీ అతను కనిపించలేదు అని పేర్కొన్నారు. ఇక గురుచరణ్ సింగ్ చివరిసారిగా ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ అనే టీవీ షోలో రోషన్ సింగ్ సోధి పాత్రలో కనిపించాడు. తన తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా టీవీ షో నుంచి తప్పుకున్నాడు. తన సమయాన్ని కుటుంబంపైనే కేంద్రీకరించాలని కోరుకుంటున్నట్లు అప్పట్లో తెలిపాడు. అయితే, షో నుండి నిష్క్రమించిన ఇతర కళాకారుల మాదిరిగా, మేకర్స్ గురుచరణ్‌కు తమ బకాయిలు చెల్లించలేదు. ఇక ఢిల్లీలోని పాలం పోలీస్ స్టేషన్‌లో గురుచరణ్ సింగ్ మిస్సింగ్ రిపోర్టు నమోదైంది. ఈ ఫిర్యాదు ఏప్రిల్ 25న నమోదైంది.
థియేటర్లలోకి వకీల్ సాబ్ మళ్ళీ వస్తున్నాడు
అజ్ఞాతవాసి అనంతరం మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీ లాంచ్ అయ్యి సూపర్ హిట్ కొట్టారు. భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వలన సినిమాకి బ్రేక్ పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 2021న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా తెలుగు అండ్ తమిళ బాషల్లో రీమేక్ అవగా ఐఎండీబీ రేటింగ్స్ లో వకీల్ సాబ్ సినిమాకే టాప్ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించగా శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కం బ్యాక్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక మే నెల 1వ తేదీన అంటే బుధవారం నాడు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.