పిఠాపురం కమిషనర్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. నేను చీపురు పట్టి తుడవాలా..?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? నేను అయితే ఇలాంటి చోట ఒక్క రోజు కూడా ఉండలేను. అసలు నేను చీపురు పట్టి రోడ్లు తుడవాలా? అంటూ అధికారులను నిలదీశారు. ఇక, పిఠాపురంలో పారిశుధ్య నిర్వహణ విఫలమవుతున్న నేపథ్యంలో.. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ కార్యక్రమాన్ని కూడా తానే స్వయంగా నిర్వహించాలా? అని పవన్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ప్రకటించినా, దాని అమలు విషయంలో వేగం లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ-పరమైన అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా? అభివృద్ధి కోసం ప్రభుత్వం గట్టి అడుగులు వేయొద్దా? అని అధికార పార్టీ నేతలను, యంత్రాంగాన్ని నిలదీశారు. కాలనీల్లో నడుచుకుంటూ సమస్యలు తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, పవన్ కల్యాణ్ పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, చెత్త నిర్వహణ, మౌలిక వసతుల కొరతపై ప్రజలు చెప్పిన అంశాలను ఆయన నోట్ చేసుకున్నారు. అయితే, పిఠాపురం పారిశుధ్య వ్యవస్థను వెంటనే మెరుగుపర్చాలని, అధికార యంత్రాంగం ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కంటే.. వందే భారత్‌లో బెజవాడ వెళ్లడమే ఈజీ..!
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి కూటమి గాలి తీసేంత పనిచేశారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం వేదికైంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కంటే.. వందే భారత్ లో విజయవాడ వెళ్లిపోవడమే సులభం అన్నారు విష్ణుకుమార్ రాజు… ఇందు కోసం ఎంపీ భరత్ చొరవ తీసుకుని అదనంగా రెండు వందే భారత్ రైళ్లు వచ్చేలా చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్గత రహదారులు నిర్మాణం పూర్తి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని విష్ణు చేసిన సూచన చర్చనీయంశంగా మారింది. అలాగే, ప్రస్తుతం వున్న విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకం అన్నారు విష్ణు. ఈ దిశగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని గట్టిగా వాదించడం సహచర ఎమ్మెల్యేల్లో చర్చకు కారణం అయింది. ఇటీవల ప్రభుత్వం కు మైలేజ్ వస్తుందని భావిస్తున్న అంశాల మీద బీజేపీ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఏపీ టెట్ ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ లో టెట్ (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి.. ఏపీ టెట్ గతేడాది డిసెంబర్ 10 నుంచి 21 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలు ఈ రోజు ప్రకటించారు.. టెట్‌కు మొత్తం అభ్యర్థులు 2,48,427 హాజరు కాగా.. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో 97,560 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.. ఇక, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాశారు.. ఇన్-సర్వీస్ (పని చేస్తున్న టీచర్లు) విభాగంలో 31,886 మంది పరీక్షలు రాయగా.. అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్య 15,239గా ఉంది.. అంటే, ఇన్-సర్వీస్ అభ్యర్థులలో 47 శాతం పైగా టెస్ట్‌లో అర్హత సాధించారు. ప్రాథమిక కీలు విడుదలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత కన్వీనర్ అధికారికంగా తుది ఫలితాలను వెలువరించారు. అభ్యర్థులకు ఇప్పుడు ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తనిఖీ చేసే అవకాశం ఉంది. కాగా, AP TET 2025–26 పోటీ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21వ రోజు వరకూ నిర్వహించబడ్డాయి. తెలంగాణలో టీచర్ అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం హాజరు అవుతుంటారు, మరియు ఏపీ ప్రశ్న పరీక్షల ప్రాముఖ్యత ఎప్పుడూ ఉన్నదే.
మరో కీలక సమావేశానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు.. 12న హెచ్వోడీలు, సెక్రటరీలు, కలెక్టర్లతో భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై మరోసారి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన అన్ని శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (HODs), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) లక్ష్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఈ భేటీకి అన్ని శాఖల మంత్రులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన సూచనలు జారీ అయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, జిల్లాల వారీగా పెండింగ్ పనుల వేగవంతం, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన పరిపాలనా నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశం వర్చువల్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక శాఖలకు సంబంధించిన ప్రజా సేవలు, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం.. ఇప్పుడు పరిపాలనా యంత్రాంగాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, లక్ష్యాల సాధనపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ స్థాయిలో క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో.. సీఎం నేరుగా అధికారులతో సమావేశం నిర్వహించడం, ప్రాధాన్య అంశాలపై పురోగతిని సమీక్షించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, అలాగే 2026–27 నాటికి GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పరిపాలనలో సమన్వయం, వేగం, పారదర్శకత కీలకమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. ఈ భేటీ ద్వారా అధికార యంత్రాంగానికి మరోసారి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనం
భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) జయశేఖర్ సమక్షంలో కోర్టు ఆయనకు బెయిల్‌ను డిస్మిస్ చేసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అసిస్టెంట్ పీఫీ జయశేఖర్ వాదనలు ఇలా ఉన్నాయి.. నెయ్యి సరఫరా చేస్తున్న కొంత కంపెనీల పనితీరు బాగా లేకపోతే కూడా విజయభాస్కర్ రెడ్డి వారికి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.. పనితీరు మంచిదని, నెయ్యి క్వాలిటీ సరైనది అంటూ సర్టిఫికేట్లు ఇవ్వడం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇకక, సిట్ విచారణలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు కూడా అంగీకరించారు. 2023లో భోలే బాబా కంపెనీ నుండి రూ.75 లక్షలు లంచంగా తీసుకోగా.. ప్రిమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకున్నారని.. అల్ఫా డైరీ కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారం లంచంగా తీసుకున్నట్లు కూడా గుర్తించారు.. ఇక, మొత్తం నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్లు సిట్ గుర్తించింది.
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు..!
తెలుగు రాష్ట్రాలు చలి పంజాతో గజగజ వణికిపోతున్నాయి.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, రాయలసీమ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ తీవ్ర వాయుగుండం రేపు అనగా జనవరి 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఏపీపై కొనసాగి, రెండు రోజుల పాటు వర్షాలు పడే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మెకు తెర..
ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. అదనపు భారం పడుతున్నందున.. నెలకు ఒక్కో బస్‌కు 15 వేల నుంచి 20 వేలు అదనంగా ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను కొంత కాలంగా కోరుతున్నారు. ఒక్కో బస్‌కు నెలకు 5,200 అదనంగా ఇచ్చేలా జారీ చేసిన సర్క్యులర్ పై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకస్మికంగా ఒక సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ పై పునరాలోచిస్తామని ఎండీ తెలిపారని, అయితే.. జనవరి 20 నాటికి ఒక పరిష్కారం ఇస్తామనడంతో, పండుగను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమిస్తున్నామని, బస్సుల కొరత ఉండదని అద్దె బస్సుల యజమానుల యూనియన్లు తెలిపాయి.. మేం అడిగిన దానికంటే మేం ఊహించని విధంగా 5200 అద్దె పెంచుతూ ఇచ్చిన సర్క్యులర్ పై మరోసారి ఆలోచిస్తామని తెలిపారన్నారు.. ఇన్సూరెన్స్ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకుంటామని, ఇబ్వంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. కేఎంపీఎల్ రేటు పెంచమని అడిగాం.. మైలేజీ పెంచాలని అడిగామని తెలిపారు.. మొత్తంగా ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి బస్సులకు అద్ధె కష్టాలు రాకుండా, అద్దె బస్సుల యజమానులు సమ్మె విరమించారు.
నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన వారు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు పడిన అష్టకష్టాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా? నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి, పరీక్షల పేరుతో వేధించి, నిరుద్యోగుల యవ్వనాన్ని రోడ్ల పాలు చేసింది మీరు కాదా?” అని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ (TGPSSC) క్వశ్చన్ పేపర్లను బజారులో పప్పుబెల్లాల్లా అమ్ముకుంటుంటే కళ్లు అప్పగించి చూసిన పాపం బీఆర్ఎస్ నేతలదేనని ఆయన మండిపడ్డారు. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థత గత ప్రభుత్వానిదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీని ఒక ‘పవిత్ర కార్యం’లా చేపట్టిందని శ్రీధర్ బాబు తెలిపారు. “మేము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కడా ఎలాంటి లీకేజీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికే 70 వేల మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాం. త్వరలోనే గ్రూప్-3 నియామక పత్రాలు కూడా అందజేస్తాం” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికులు బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
‘‘ నెతన్యాహూను కిడ్నాప్ చేయండి’’.. ట్రంప్‌ను కోరిన పాకిస్తాన్..
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అమెరికా కిడ్నాప్ చేయాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ కోరారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లే నెతన్యాహూను కూడా కిడ్నాప్ చేయాలని అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా చెత్త నేరస్తుడు అని నెతన్యాహూను పాక్ నిందించింది. టర్కీ కూడా నెతన్యాహూను కిడ్నాప్ చేయలగలదని, పాకిస్తానీయులు దాని కోసం ప్రార్థిస్తున్నారని అన్నారు. గురువారం ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయని అన్నారు. గత 4000-5000 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ పాలస్తీనియన్లకు చేసినట్లుగా ఎవరూ చేయలేదని, నెతన్యాహూ మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని, ప్రపంచం ఇంతకన్నా పెద్ద నేరస్తుడిని చూడలేదని దుయ్యబట్టారు. ఇలాంటి నేరస్తులకు మద్దతు ఇచ్చే వారి గురించి ఏం చెబుతాం అని అనడంతో యాంకర్ కలుగజేసుకున్నారు. పరోక్షంగా ఇవి ట్రంప్‌ను తిట్టే పరిస్థితి రావడంతో యాంకర్ హమీద్ మీరు ఆపారు. ఇజ్రాయిల్‌ను పాకిస్తాన్ ఎప్పుడూ గుర్తించలేదు, ఇరాన్‌తో తమ సంబంధాలు సోదరభావం, భాగస్వామ్య ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించిందని పాక్ రక్షణ మంత్రి అన్నారు.
అమిత్ షా “పెన్‌డ్రైవ్” నా దగ్గర ఉంది.. అది బయటకు తెస్తే..
కోల్‌కతాలో ఐ-ప్యాక్ ఆఫీస్, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ దాడులు సంచలనంగా మారాయి. దాడులు జరుగుతున్న సమయంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ )అధినేత్రి అక్కడి రావడం, ఆఫీసు నుంచి ఫైళ్లను తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. దీనిపై ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. కీలకమైన పత్రాలను, ఆధారాలను మమతా, స్టేట్ పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు, అమిత్ షా కావాలని తమను టార్గెట్ చేసినట్లు మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. తమ ఎన్నికల వ్యూహాలను ఈడీ అధికారుల చేత దొంగిలిస్తున్నారని మండిపడుతోంది. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ మరో బాంబ్ పేల్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా తన వద్ద ‘‘పెన్ డ్రైవ్’’ ఉందని శుక్రవారం చెప్పింది. తనను, తన ప్రభుత్వాన్ని హద్దు దాటేలా ఒత్తిడి చేస్తే బొగ్గు స్కామ్‌లో అమిత్ షా పాత్రకు సంబంధించిన వివరాలను బయటపెడుతానని హెచ్చరించింది. తన వద్ద పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని, తన రాజ్యాంగబద్ధ పదవికి గౌరవం ఇస్తూ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని, తనను ఒత్తిడి చేస్తే , అన్ని బయటపెడుతానని, దేశం మొత్తం షాక్ అవుతుందని అన్నారు. ఈ రోజు ఈడీ దాడులకు వ్యతిరేకంగా కోల్‌కతాలో మమతా భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం, కోల్‌కతాలో ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు, కోట్ల రూపాయల హవాలా చేసిందనే ఆరోపణలపై సోదాలు జరిగాయి.
సెన్సార్ బోర్డుపై రామ్‌గోపాల్ వర్మ ఫైర్..!
దళపతి విజయ్ చివరి సినిమాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘జన నాయగన్’.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ రోజు థియేటర్లలోకి రాలేకపోయింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మొదట్లో 27 కట్స్‌తో U/A రేటింగ్ సూచించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా రివైజింగ్ కమిటీకి పంపడంతో ఒక్కసారిగా సంగతులు తారుమారయ్యాయి. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సింగిల్ జడ్జి CBFCకు U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అదే రోజు సాయంత్రానికి CBFC అప్పీల్ చేయడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ ఆ ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఇప్పుడు మరో హియరింగ్‌కు షెడ్యూల్ అయ్యే వరకు సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో సెన్సార్ బోర్డుపై ఫైర్ అయ్యారు. “ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో ఎక్కడపడితే అక్కడ అన్రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ఫ్రీగా తిరుగుతుంటే.. సినిమాలకు మాత్రం సెన్సార్ బోర్డు ఎందుకు? కట్స్ కాదు.. ఏజ్ రేటింగ్స్, వార్నింగ్స్ చాలు. ఇది రాజ్యాంగంలోని ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్‌కు వ్యతిరేకం” అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక ఈ వివాదం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఇదే ఆయనకు ఆఖరి చిత్రంగా చెబుతున్నారు. అందుకే ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రిపబ్లిక్ డే స్పెషల్‌గా వస్తుందా? లేకపోతే ఈ డేట్‌కు కూడా మరోక ట్విస్ట్ ఉందా? ప్రస్తుతం సెన్సార్ బోర్డు విధానాలు, డిజిటల్ యుగంలో సినిమా స్వేచ్ఛపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం.. తమ దళపతి చివరి జర్నీని గ్రాండ్‌గా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
నవ్వకుండా ఉండలేరంతే.. పురుషః టీజర్ చూసేయండి..!
ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న పురుషః (Purushaha) ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలను దర్శకుడు వీరు వులవల ఎంతో వినోదాత్మకంగా మలిచారు. వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, ఎన్టీఆర్ ‘పెద్ది’ చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. పెళ్లి తర్వాత పురుషుల జీవితం ఎలా తలకిందులు అవుతుందనే అంశాన్ని కామెడీ జోడించి చూపించినట్లు అర్థమవుతోంది. కేవలం నవ్వులే కాకుండా.. సంసారంలో భార్యల ప్రాముఖ్యత ఏంటనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ (బత్తుల) హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ పవన్ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ జోడీలుగా కనిపించి వినోదాన్ని పంచనున్నారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ కామెడీ తారాగణం ఉంది. వెన్నెల కిశోర్, విటివి గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, జబర్దస్త్ వినోద్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇంకెందుకు ఆలశ్యం అవుట్ అండ్ అవుట్ కామెడీ టీజర్ ఇక్కడ చూసేయండి..
‘జన నాయగన్’కు హైకోర్టు షాక్.. జనవరి 21 వరకు నో రిలీజ్..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ సినిమా యూనిట్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో ‘జన నాయగన్’ సినిమా విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది హైకోర్టు. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అవసరమైన మార్పులు చేసిన అనంతరం సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి CBFCను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం “ప్రమాదకర ధోరణి” అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన CBFC సినిమాలో సాయుధ దళాలకు సంబంధించిన చిహ్నాలు (Armed Forces Emblems) ఉన్నాయని, అవి నిపుణుల కమిటీ ద్వారా సమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. అలాగే రివైజింగ్ కమిటీతో మరోసారి చిత్రాన్ని పరిశీలించాలని కోరుతూ తక్షణ విచారణ కూడా అభ్యర్థించింది. తాజా విచారణ అనంతరం కోర్టు జనవరి 21 వరకు ‘జన నాయగన్’ సినిమా విడుదల చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా యూనిట్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.