NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చంద్రబాబు భావోద్వేగం.. మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా..
సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు.. భావోద్వేగానికి గురయ్యారు.. మళ్లీ జన్మ అనేది ఉంటే.. కుప్పం ముద్దుబిడ్డగానే పుడుతాను అన్నారు.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. మీ అభిమానం మరువలేనిది.. కుప్పం ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నాను అన్నారు. కుప్పం నుండి ఎనిమిది సార్లు నన్ను ప్రతిసారి భారీ మెజారిటీతో గెలిపించారు.. మళ్లీ జన్మ అనేది ఉంటే.. కుప్పం ముద్దుబిడ్డగానే పుడుతాను.. మీ రుణం తీర్చుకుంటాను అని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు.. ప్రజాసామాన్యంలో ఎవరైనా అతిగా విర్రవీగితే వైసీపీకి పట్టిన గతే పడుతుంది.. కేవలం 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశారు.. చిత్తూరు జిల్లాలో ఏడుకి ఏడు సీట్లలో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. నా రాజకీయ జీవితంలో కుప్పం ఒక ప్రయోగాశాలగా చూస్తాను అన్నారు సీఎం చంద్రబాబు.. ఏ అభివృద్ధి పని అయిన ఇక్కడ నుండే ప్రారంభిస్తాను అన్నారు.

కుప్పంపై సీఎం వరాల జల్లు..
తన సొంత నియోజకవర్గంపై కుప్పంపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం, బాధ్యతల స్వీకరణ, ఎమ్మెల్యేగా ప్రమాణం.. ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. తొలిసారి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయన.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. ఓవైపు వర్షం జల్లు పడుతుండగా.. మరోవైపు.. వరాల జల్లు కురిపించారు సీఎం.. కుప్పంలో ఔటర్‌ రింగ్ రోడ్డు వేస్తాం… అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా.. కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాను.. కుప్పం అభివృద్ధి పనులు ఈరోజు నుండే ప్రారంభిస్తాం.. ప్రతి ఇంటి తాగునీరు అందిస్తాం.. పచ్చదనానికి కేరాఫ్ కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించారు. 730 కిలోమీటర్ల నుండి శ్రీశైలం నుండి వీకోట వరకు హాంద్రనీవా కాలువ ద్వారా నీళ్లు తెచ్చాను అని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఐదేళ్ల వైసీపీ పాలనా కేవలం ఐదు కిలోమీటర్ల పనులు చేశారు.. ఎన్నికల ముందు సినిమా సెట్టింగ్ లు వేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. హాంద్రీనీవా ద్వారా నీళ్లను కుప్పానికి తీసుకోస్తాను అని హామీ ఇచ్చారు. ఇక, కుప్పానికి ఎయిర్‌పోర్టు తీసుకొని రావాలి అన్నది నా కల.. కానీ, వైసీపీ నేతలు ఆ కలను నాశనం చేశారని మండిపడ్డారు. వీలైనంత త్వరగా కుప్పానికి విమానాశ్రయం తీసుకొని వస్తాను. ఎయిర్ కార్గ్ ద్వారా మన పంటల్ని విదేశాలకు పంపేలా చూస్తాను.. పది లక్షల ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం.. కుప్పంలో కాడా ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేక ఐఎఎస్ అధికారితో అభివృద్ధి చేస్తాను.. కుప్పంలో మరో కొత్త రెండు మండలాలను ఏర్పాటు చేస్తాను.. కుప్పంలో మొత్తం విద్యుత్ బస్సులు నడిచేలా ప్రణాళిక రూపొందించమని చెప్పినట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను మోయలేనంత భారం నామీదా ఉందన్న ఆయన.. మొత్తం ఖజానా ఖాళీ చేశారు.. ఎక్కడెక్కడ అప్పులు చేశారో ఎవరికి అంతుపట్టడం లేదు.. మీరు అనుకున్నంత ఆశాజనకంగా అక్కడ పరిస్థితి లేదన్నారు.. నేను, పవన్‌ కల్యాణ్‌ సంకల్పం తీసుకున్నాం… అభివృద్ధి లక్ష్యంగా రేయింబవళ్లు పనిచేస్తాం అన్నారు. ఇక, రాష్ట్ర పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చంద్రబాబు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, మద్యం పాలసీ, భూగర్బ ఖనిజ సంపదైన ఇసుక, గ్రానైట్‌.. సహా ఇతర వాటిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.. కుప్పం ద్రావిడ వర్శిటీని ప్రక్షాళన చేస్తాను అని ప్రకటించారు సీఎం చంద్రబాబు.. రామకుప్పంలో వైసీపీ దొంగలు గంజాయి సాగు చేస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తాను అన్నారు. కుప్పంలో హింస, అవినీతి, దౌర్జన్యాలు ఇకమీదట జరగకూడదు అని స్పష్టం చేశారు. చాలాచోట్ల 90 వేలకుపైగా మెజారిటీ వచ్చింది.. 57 శాతం వన్ సైడ్ ఓట్లు చేశారని తెలిపారు. నలభై ఏళ్లుగా ఎప్పుడూ రాని నా సతీమణి భువనేశ్వరి.. తొలిసారి కుప్పంలో ప్రచారానికి వచ్చారని గుర్తుచేశారు. ఇక, ఒకటో తేదీన నూతన పెన్షన్ విధానం అమలు చేస్తున్నాం.. సచివాలయ సిబ్బందితో నేరుగా ఇంటి దగ్గరికే రూ.7 వేల పెన్షన్ ను అందిస్తాం అన్నారు.. డబ్బు కాదు ముఖ్యం మానవత్వం ముఖ్య అన్నారు.. ఇక, ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 185 అన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

స్పీకర్‌ ఎన్నికలో బిగ్‌ ట్విస్ట్..! ఎన్డీఏకు వైసీపీ మద్దతు
లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని కోరింది భారతీయ జనతా పార్టీ.. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ.. అయితే, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.. దీంతో, ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది.. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది.. వైసీపీ సభ్యుల సపోర్ట్‌తో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయ్యింది. కాగా, అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ.. ఇప్పుడు స్పీకర్‌ ఎన్నిక విషయంలో అనూహ్యంగా ఎన్డీఏకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ పరిణామం.. జాతీయ రాజకీయాల్లోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లోనూ ఆసక్తికరంగా ఉంది.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్‌ ఫిగర్‌ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కుతుంది. అయితే, స్పీకర్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్‌ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది.. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతోనే వైసీపీ మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కాగా, రేపు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనున్న విషయం విదితమే.

స్పీకర్‌ ఎన్నిక.. ఎంపీలకు విప్‌ జారీ చేసిన టీడీపీ
లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది తెలుగుదేశం ‌పార్టీ. తమ పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది టీడీపీ.. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌లో పేర్కొన్నారు పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి.. రేపు ఉదయం 11 గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని, ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్నారు హరీష్ బాలయోగి.. రేపు ఉదయం 9.30 గంటలకు టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు టీడీపీపీ నేత శ్రీకృష్ణ దేవరాయలు.. ఈ సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్ కు వెళ్లనున్నారు టీడీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీకి చెందిన బీజేపీ, జనసేన సభ్యులను కూడా సమావేశానికి ఆహ్వానించింది టీటీడీపీ..

జీడీపీ అధికంగా వచ్చే రంగాలపై దృష్టి సారించాలి..
వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి.. అందుకు గల కారణాలను డిప్యూటీ సీఎం సమావేశంలో వ్యవసాయ అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు.. రాబోయే సీజన్ కు పంటల భీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్ల పై చర్చించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం సమావేశంలో తీసుకున్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం.. అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలు.. ప్రభుత్వం తదితర రంగాలపై చేస్తున్న ఖర్చులను డిప్యూటీ సీఎం అధికారుల ద్వారా విచారించారు. ఇక రైతు భరోసా కు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిది అనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని.. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములను చేయాలని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తపరిచారు.

బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’
బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తన భర్య ‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడని 26 ఏళ్ల మహిళన తన భర్తపై ఆరోపణలుచేసింది. బీజేపీకి సపోర్టు చేస్తున్నాననే కోపంతో తన భర్త ఇలా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకుంది. తనకు 8 ఏళ్ల క్రితం పెళ్లి అయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు మహిళ పేర్కొంది. గత కొంతకాలంగా వారి మధ్య సంబంధం సాధారణంగానే ఉందని, ఆ తర్వాత ఆమె భర్త, అత్త, ఆడపడుచులు ఏదో సమస్యపై వెక్కిరించడం, కొట్టడం ప్రారంభించారని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గోల్హాని సోమవారం విలేకరులు సమావేశంలో చెప్పారు. తనను ఏడాదిన్నర క్రితం ఇంటి నుంచి గెంటేశారని, తన భర్తతో కలిసి అద్దె గదిలో ఉంటున్నానని ఆ మహిళ పేర్కొంది. అయితే, మహిళ, భర్త ఇష్టానికి వ్యతిరేకంగా బీజేపీకి ఓటేసింనందుకు ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఆల్కహాల్ వల్ల ప్రతీ ఏడాది 30 లక్షల మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ
ఆల్కహాల్ వినియోగం ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతీ ఏడాది ఆల్కహాల్ వల్ల దాదాపుగా 30 లక్షల మంది చనిపోతున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇటీవల సంవత్సరాల్లో కొద్దిగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ సంఖ్య ఆమోదయోగ్యం కాని అధికంగానే ఉన్నట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ మద్యం, ఆరోగ్యంపై తాజాగా నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20 మంది మరణిస్తే అందులో ఒకరు ఆల్కహాల్ వల్లే చనిపోతున్నారని తెలిపింది. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం, దీని వల్ల చెలరేగే హింస, దుర్వినయోగం, ఇతర వ్యాధులు, రుగ్మతలు ఇందులో ఉన్నాయి. 2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల 2.6 మిలియన్ల మరణాలు సంభవించినట్లు నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది మొత్తం మరణాల్లో 4.7 శాతం ఆల్కహాల్ వినియోగం వల్ల చోటు చేసుకున్నాయి. ఈ మరణాల్లో మూడోవంత పురుషులే అని చెప్పింది. మత్తుపానీయాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఇవన్నీ నివారించగల మరణాలే అని అన్నారు.

పాక్‌లో హిందువులు, సిక్కులు సురక్షితంగా లేరు..ఆ దేశ మంత్రి ఆందోళన..
ఇటీవల పాకిస్తాన్‌లో దైవదూషణ చేస్తున్నాడనే నెపంతో ఓ స్థానిక పర్యాటకుడిని ప్రజలు అత్యంత దారుణంగా కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మతం పేరుతో ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై చాలా విమర్శలు వచ్చాయి. బాధితుడు మహ్మద్ ఇజ్మాయిల్ బహిరంగంగా మతోన్మాద గుంపు కాల్చి చంపింది. తీవ్రవాద భావజాలంపై సొంత దేశ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోమవారం మాట్లాడుతూ.. దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, చిన్న ముస్లిం వర్గాలు, ఇతర మైనారిటీ సమూహాలు మతం పేరుతో టార్గెటెడ్ హింసకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మతం పేరుతో జరుగుతున్న హింసపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై
ప్రముఖ భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన డార్జిలింగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్ పార్టీలో విలీనం చేశాడు. రాజకీయాల్లో తాను మన్నన పొందలేనని భూటియా చెప్పారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలో ఆరోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బార్‌ఫుంగ్‌లో 4,346 ఓట్ల తేడాతో భూటియా ఓడిపోయారు. సిక్కిం ప్రజల కోసం వాగ్దానాలు అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

గూజ్ బంప్స్ తెప్పించేలా థీమ్ ఆఫ్ కల్కి 2898 AD
మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD విడుదలకు కేవలం రెండు రోజులే ఉండటంతో ప్రేక్షకులు, సినీ వర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుండి “థీమ్ ఆఫ్ కల్కి” అనే కొత్త పాటను వదిలి అభిమానులను ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ చూస్తే శ్రీకృష్ణునికి సంబంధించినది. ఈ పాటను కాల భైరవ పాడగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆకట్టుకునే సాహిత్యం మరియు చెవులకు అమృతంలా అనిపించే ఆత్మీయమైన సంగీతంతో, ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఈ పాట సినిమా యొక్క ఇతివృత్తాన్ని మరియు సారాన్ని సంపూర్ణంగా ప్రేక్షకులకు చేర్చేదిలా కనిపిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి అగ్రతారలెందరో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్ర థీమ్‌ని ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు. ‘కల్కి’ గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగిన అద్భుతంగా ఉందని చెప్పాలి. సినిమా పూర్తి కథని ఈ సాంగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నిర్మాత విశ్వప్రసాద్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ టెక్ గ్రూప్ అధినేత TG విశ్వ ప్రసాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యువ హీరోలు, అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని దాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి, నిర్మాత TG విశ్వప్రసాద్ కి ముందు నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ భారీగా గెలవడంతో సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం ఉంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ ని కలిసి సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలు చర్చించారు. అనంతరం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి ఇలాంటి ఘన విజయం సాధించినందుకు అభినందించారు. పవన్ కళ్యాణ్ తో నిర్మాత విశ్వప్రసాద్ గారు గతంలో ‘బ్రో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన పార్టీకి కూడా విశ్వప్రసాద్ అండగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంటుంది.

జాన్వీ ఇలా ఉందేంటి మామా.. కటౌట్ అదిరిపోయింది..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతుంది.. నెట్టింట గ్లామర్ డోస్ పెంచేసింది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. తన టాలెంట్ తో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. గ్లామర్‌లో తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన జాన్వీ కపూర్ లుక్ ఫోటోలకు మంచి స్పందన లభించింది… ఈ సినిమా విడుదల కాకముందే వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. దేవర తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో RC16లో నటించబోతుంది జాను. ఈ రెండు సినిమాల తర్వాత ఖచ్చితంగా టాలీవుడ్‌లో జాన్వీకి వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక తాజాగా అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో అందాల ఆరబోత చేసింది.. బ్లాక్ డ్రెస్సులో, ఉప్పొంగే ఎద అందాలతో కిర్రాక్ ఫోటోలను షేర్ చేసింది.. అవి క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.. జాన్వీ కపూర్ ఫోటోలు ఎలా ఉన్నాయో వాటి పై ఒక లుక్ వేసుకోండి..