రేపు సాలూరుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కానుంది.. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్ కల్యాణ్.. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరు చేరుకుంటారు.. ఉదయం 11.30 గంటలకు సాలూరు డిగ్రీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు.. సాలూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మక్కువ మండలం బాగుజోల చేరుకుంటారు… అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కల్యాణ్.. అనంతరం అక్కడ గిగిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రం నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు.. ఉదయం 9.30కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కానుండగా.. తిరిగి 3.10 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నారు..
ఏపీ క్రీడా యాప్ లాంచ్.. ఇక, వారికి చెక్..!
రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేశామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ క్రీడా యాప్ లాంచ్ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. శాప్ ఎండీ గిరీష్ కుమార్.. నూతన ప్రభుత్వం ద్వారా క్రీడలలో ప్రాధాన్యత పెరిగిందని.. దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారని.. దేశంలో అధిక మొత్తంలో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.. క్రీడా రంగంలో పారదర్శకంగా సేవలను అందించేందుకు క్రీడా యాప్ ఆవిష్కరిస్తున్నాం.. క్రీడాకారులకు వెన్నుదన్నుగా అన్ని డిజిటల్ సేవలు అందనున్నాయన్నారు శాప్ ఎండీ గిరీష్ కుమార్.. ఇక, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం.. రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేశామన్నారు రాంప్రసాద్‌రెడ్డి.. రాష్ట్రంలో ప్రోత్సాహకాల విషయంలోను, ఉద్యోగ అవకాశాల విషయంలోను అన్ని అంశాలు క్రీడా విధానంలో ప్రవేశ పెట్టడం జరిగింది.. అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ క్రీడా పోటీలు జరిపించే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో హయంలో రాష్ట్రంలో క్రీడా శాఖ అనేది లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో క్రీడాకారులు, అసోసియేషన్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం ద్వారా క్రీడా రంగంలో ఉన్న అందరికీ ఐదు సంవత్సరాలు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే క్రీడా పాలసీ, క్రీడా యాప్ తీసుకొని రావడం జరిగింది.. విద్య, క్రీడా శాఖల అనుసంధానంతో గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు నేషనల్ గేమ్స్ ఆడే వారికి మంచి రోజులు వస్తాయని తెలిపారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి..
ముంబై నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ.. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. ఇప్పటి వరకు ఈ కేసులో A2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజ నేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు.. అంతేకాదు.. సీతారామాంజనేయులు ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు కదా? అని పీపీని ప్రశ్నించారు న్యాయమూర్తి.. కాగా, ముంబై నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న కాంతిరాణా, విశాల్‌గున్నీ, న్యాయవాది, ఏసీపీ, సీఐలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఏ2గా ఉన్న సీతారామాంజనేయులు మాత్రం ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది.. ఈ నేపథ్యంలో ఎందుకు అరెస్టు చేయలేదని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. జత్వానీ కేసులో వాదనలు విన్న హైకోర్టు.. ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది..
గూగుల్లో చెప్పేదే నిజం అనుకుంటారు.. పుస్తకాల్లో దొరికేదే నిజమైన సమాచారం
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అశోక్ నగర్‌లో చిన్న స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫెయిర్.. ఈ రోజు ఈ స్థాయికి చేరినదుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు చేరువ కావాల్సిన పనిలో తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ చాలా పుస్తకాలతో ఎంతో విజ్ఞానం ఉంది.. ఇప్పుడు ఉన్న జనరేషన్ కేవలం గూగుల్ పైనే ఆధారపడుతున్నారు.. గూగుల్‌లో చెప్పేదే నిజం అనుకుంటారు.. కానీ పుస్తకాల్లో దొరికేదే నిజమైన సమాచారం అని సీఎం తెలిపారు. వారిని వారు గొప్పగా చూపించుకోవడానికి చరిత్రను మార్చి పెట్టుకోవడం గత 10 సంవత్సరాలు చూశాం.. ఈ పుస్తక ప్రదర్శన కోసం అవసరమైన భవనం ఏర్పాటుకు తన సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు అవసరమైన విషయాలను ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించాలని కోరుతున్నానని సీఎం అన్నారు.
ఫార్ములా ఈ- కార్ రేస్ కేసుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..
ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా తనపై కేస్ అని లీక్‌లు ఇస్తున్నారు.. నాలుగు గోడల మధ్య ఎందుకు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి అని అడిగానన్నారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని కేటీఆర్ తెలిపారు. అయినా చర్చకు వచ్చే దమ్ము లేదు ప్రభుత్వానికి అని పేర్కొన్నారు. అసలు ఏమి జరిగిందో ప్రజలకు చెప్పాలని మీడియా సమావేశం పెట్టానన్నారు. హైదరాబాద్‌లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలో జరిగాయి.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాడన్నారు. 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఈవోను కలిసి హైదరాబాద్ కు రావాలని అడిగారు.. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ రేసింగ్ రాలేదని తెలిపారు. అప్పట్లోనే గోపన్ పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాల్లో రేవంత్ రెడ్డికి కూడా15 ఎకరాలు ఉందని కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్‌కు రేసింగ్ రాలేదని చెప్పారు. మన దేశంలో కూడా ఈ రేసింగ్ రావడం కోసం ఎంతో అడిగారు.. ఉత్తరప్రదేశ్‌లో 2009, 10, 11లో రేసింగ్ జరిగిందన్నారు. అందుకోసం యూపీలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.. ఈ రేసింగ్ కోసం దేశంలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది.. ఇక ఈ రేసింగ్ కోసం ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయన్నారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకు రావాలని ప్లాన్ చేశామని తెలిపారు. ఆటోమొబిల్ రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా చేయాలి అనుకున్నామని కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్‌పై పీసీ యాక్ట్, ఐపీసీ యాక్ట్ కింద కేసులు.. ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను A-1గా పేర్కొంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదు చేసింది. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. RBI గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఎఫ్‌ఈవో కంపెనీకి రూ.45 కోట్లు HMDA చెల్లించిందని కేసులు పెట్టారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టు కేటీఆర్‌పై అభియోగాలు మోపపడ్డాయి. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది. ఐఏఎస్ అరవింద్‌కుమార్.. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి రూ.8కోట్ల ఫైన్ వేసింది ఆర్బీఐ.. అధికారంలోకి వచ్చాక RBIకి రూ.8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. అయితే, కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి. నిన్న సాయంత్రం ఏసీబీకి 5:30కు ఫిర్యాదు అందింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ MAUD ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం విచారణ చేయగా అవకతవకలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిధులు రూ. 54 కోట్ల 88లక్షల 87 వేల 043 అక్రమ బదిలీలు అయినట్లు గుర్తించింది. యూకేకి చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీకి.. రెండు విడతల్లో చెల్లింపు చేసినట్లు గుర్తించారు. మొదట 3/10/2023న 22కోట్ల 69లక్షల 63వేల 125, రెండవ విడత 11/10/2023 న 23కోట్ల 01 లక్షల 97వేల 500 బదిలీ అయినట్లు గుర్తించారు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి బదిలీ అయ్యాయి. విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్ఎండీఏకు అదనపు పన్ను భారం పడింది. రూ. 8 కోట్ల 6 లక్షల 75వేల 404అదనపు పన్ను భారం పడింది. రూ. 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్ధిక శాక అనుమతి అవసరం ఉంటుంది. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేక పోవడంతో HMDA నిధులను మల్లించారు.
అజిత్ పవార్ ఏదొక రోజు సీఎం అవుతారు.. ఫడ్నవిస్ జోస్యం
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామం జరిగింది. అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు. అజిత్ పవార్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారంటూ ఫడ్నవిస్ జ్యోసం చెప్పారు. ఇటీవలే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ అయితే ఆరోసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మహారాష్ట్రలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అజిత్ పవార్‌ను చాలా మంది శాశ్వత డిప్యూటీ సీఎం అంటూ వ్యాఖ్యానిస్తారని.. కానీ ఏదో ఒక రోజు అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. అజిత్ పవార్ ఏ విధంగా పని చేస్తారో.. ఏక్‌నాథ్ షిండే ఏ విధంగా ఉంటారో.. తాను ఏ విధంగా పని చేస్తానో ప్రజలందరికీ తెలుసన్నారు. అజిత్ పవార్ ఉదయాన్నే లేచి పనులు చక్కబెడతారని.. షిండే అయితే రాత్రంతా పని చేస్తారని.. తాను మాత్రం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పని చేస్తానని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు.
రాహుల్ కాన్వాయ్‌ను వెంబడించిన అతుల్ స్నేహితులు.. ప్రతిపక్ష నేత ఏం రిప్లై ఇచ్చారంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ను అతుల్ సుభాష్ సన్నిహితులు కారులో వెంబడించారు. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారించినా.. పట్టించుకోకుండా వెంటాడారు. అతుల్ ఫొటో చూపిస్తూ.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి రాహుల్ స్పందించారు. ఒక చాక్లెట్‌ను వారి మీదకు విసిరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనెల 9న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్.. భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. 90 నిమిషాల వీడియో మెసేజ్, 40 పేజీల లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. భార్య నికితా సింఘానియా, అత్త కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులను ప్రస్తావించాడు. హత్య, లైంగిక వేధింపులు, డబ్బు కోసం వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులతో సహా పలు సెక్షన్ల కింద తన భార్య తనపై అనేక కేసులు పెట్టిందని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలను తప్పుగా ఉపయోగించడంపై చర్చకు దారితీసింది. అయితే ఈ విషాద ఘటనపై ఇప్పటి వరకు ఏ రాజకీయ నేతల నుంచి స్పందన లేదు. అయితే అతుల్‌కు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున నెటిజన్లు.. భార్యను, కుటుంబ సభ్యులను నిందించారు.
14 రోజుల్లో పుష్ప రాజ్ ఎంత కొల్లగొట్టాడు అంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. పుష్ప రాజ్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో ఉంది పుష్ప -2. సినిమా కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా 14 రోజులకు గాను రూ. 1508 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏపాటిదో మరోసారి తెలియజేసింది. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. అటు బాలీవుడ్ లోను పుష్ప రాజ్ ర్యాంపేజ్ మాములుగా లేదు అని చెప్పాలి. అక్కడి స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ల సినిమాల ను సైతం వెనక్కి నెట్టి రికార్డ్ కలెక్షన్స్ అందుకుంది. ఇక 14 రోజులకు గాను ఒక్క హిందీలో రూ. 618.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండవ వారంలో కూడా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన మరో రికార్డును సాధించింది. ఈ లెక్కన చుస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో రూ. 2000 కోట్ల మార్క్ ను అందుకున్న ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.