పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది. వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్ జెండర్. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు కోటి 63 లక్షల వెయ్యి 705మంది. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 2,676. తెలంగాణలో మొత్తం సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944. అలాగే 18-19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 9 లక్షల 99 వేల 667. పోలింగ్ కేంద్రాల సంఖ్య 35 వేల 655. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు 21 వేల 686 వీల్‌ఛైర్లు సిద్ధం చేశారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు వుంచుతున్నారు. ఇదే సమయంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 120 పోలింగ్ కేంద్రాలను నిర్వహించేది కేవలం దివ్యాంగులే. అలాగే 597 పోలింగ్ కేంద్రాలను మహిళలే నిర్వహించబోతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఫోకస్..
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. మంగళవారం 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం జగన్. ఇక.. ఇవాళ అంటే వరుసగా రెండోరోజు కూడా.. ఏపీ సీఎం జగన్.. పలు పరిశ్రమలకు శంకుస్థానలు చేయనున్నారు.. అలాగే.. మరికొన్నింటిని ప్రారంభిస్తారు. వరుసగా రెండో రోజు పలు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. ఇవాళ 1,072 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్.. మరోవైపు.. రేపు నంద్యాల, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకోనున్నారు. అవుకు రెండో టన్నెల్ నుంచి నీటి పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టింది ఏపీ సర్కార్.. ఆ తర్వాత ఆయన కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.. కడపలో పెద్ద దర్గాను దర్శించుకుని.. తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
హైకోర్టులో నేడు చంద్రబాబు కేసులపై విచారణ..
ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు కేసులపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయనుంది న్యాయస్థానం. అయితే, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.
పొగమంచు కమ్ముకుంటుంది.. చలి పెరుగుతుంది.. దేశంలో వాతావరణం ఎలా ఉందంటే?
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు సాయంత్రం తర్వాత సూర్యోదయం వరకు పొగమంచు కొనసాగుతోంది. దీని కారణంగా దృశ్యమానత తగ్గుతుంది. దీని కారణంగా డ్రైవర్లు వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని సూచించారు. బుధవారం నైరుతి తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. విభాగం తరపున, మైక్రో బ్లాగింగ్ సైట్‌లో చెప్పబడింది ఇది కాకుండా ఉత్తర మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పరిసర విదర్భ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13.6 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. దీంతో ఢిల్లీలో చలి పెరుగుతుంది. రానున్న 24-48 గంటల్లో రాజధానిలో వర్షాలు కురిసే అవకాశం లేదు. అయితే, రాజధాని ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీని కారణంగా పగటిపూట చలి నుండి కొంచెం ఉపశమనం ఉంటుంది. ఇది కాకుండా, భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 19 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండబోతోంది. సాయంత్రం పొగమంచు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ కారణంగా తక్కువ దృశ్యమానత కారణంగా, డ్రైవర్లు నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని సూచించారు.
చావు నోట్లో నుంచి బయట పడ్డట్లుంది.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆవేదన
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరూ మంగళవారం సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 400 గంటల పాటు మృత్యువుతో పోరాడి కార్మికులు బయటకు రాగానే వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. అందరూ చిరునవ్వుతో బయటకు వచ్చారు. కార్మికులను వెంటనే ఆసుపత్రికి పంపారు. అయితే అందరూ సురక్షితంగా ఉన్నారు. బయటకు వచ్చిన తరువాత కొంతమంది కార్మికులు వారి కుటుంబాలతో ఇన్ని రోజులు వాళ్లు అనుభవించిన కష్టాలను వివరించారు. 17వ రోజు బయటకు వచ్చిన బీహార్‌కు చెందిన దీపక్ తన బాధను చెప్పుకోగానే గుండెలు దడదడలాడాయి. సొరంగంలో చిక్కుకున్న మొదటి ఐదు రోజులు ఏమీ తినలేదు, తాగలేదు. శరీరం వణుకుతోంది, నోటి నుంచి మాటలు సరిగా రావడం లేదు. బయటివారితో సంబంధాలు పూర్తిగా పోయాయి. మృత్యువు దృశ్యం అందరి కళ్ల ముందు కనిపించింది. ఈ సారి తప్పించుకోవడం కష్టంగా అనిపించింది. మరో రెండు రోజులు భయంతో గడిచిపోయాయని దీపక్ చెప్పాడు. ఏడవ రోజు బయట నుండి కొంత స్వచ్ఛమైన గాలి రావడంతో తమలో మనోబలం పెరిగిందని… మొబైల్ ఫోన్ల ద్వారా బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడినప్పుడు బతుకుపై ఆశ కనిపించింది. వారిని కాపాడేందుకు బయటి నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరూ భావించడం ప్రారంభించారు.
భారీగా అనుమానాస్పద లావాదేవీలు.. 70 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్..
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిజిటల్ మోసాలు, వాటిని ఎదుర్కోవడంలో తలెత్తుతోన్న సవాళ్లకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను పటిష్ఠపరచుకోవాలని వివేక్ జోషీ సూచించారు. ఆధార్ ఆధారిత పేమెంట్లలో మోసాలు, సమాచార భద్రతపై దృష్టి సారించాలని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. వ్యాపారుల కేవైసీ ప్రామాణీకరణంపైనా ఈ సమావేశంలో చర్చించామన్నారు. మరోవైపు ఇటీవల యూకో బ్యాంక్ నుంచి ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్ల నగదు జమ అయింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఖాతాదారుల నుంచి రూ.649 కోట్ల వరకూ రికవరీ చేశారు. అయితే, ఇది సాంకేతిక సమస్య కారణంగా జరిగిందా? లేక హ్యాకింగ్ కోణం ఉందా? అన్న విషయంపై బ్యాంకు నుంచి స్పష్టత రాలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదించినట్లు యూకో బ్యాంక్ తెలిపింది.
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,560 గా ఉంది.. వెండి రూ. 78,500 లుగా కొనసాగుతోంది. ఇక వెండి కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,500 గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.81,500, బెంగళూరులో రూ.76,250 ఉంది. కేరళలో రూ.81,500, కోల్‌కతాలో రూ.78,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.81,500 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
ఇషాన్ కిషన్ తప్పిదమే ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది!
గువాహటి వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న భారత్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో చివరి బంతికి ఓడాల్సి వచ్చింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై డబుల్ సెంచరీని గుర్తుకు తెచ్చేలా మూడో టీ20లో మ్యాక్స్‌వెల్ అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో బౌండరీలు, సిక్సులు బాది ఊహించని విజయాన్ని ఆస్ట్రేలియాకు అందించాడు. అయితే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన ఓ తప్పిదం ఆసీస్‌కు కలిసొచ్చింది. ఆస్ట్రేలియా 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని మాథ్యూ వేడ్ ముందుకు వచ్చి ఆడబోయాడు. బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ స్టంపింగ్ చేసి అప్పీల్ చేశాడు. రిప్లేలో వేడ్ నాటౌట్‌గా తేలాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్.. స్టంప్స్ కన్నా ముందుకు రావడంతో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకున్న వేడ్.. భారీ సిక్స్ కొట్టాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి బైస్ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి.
సంచలనాల దిశగా ‘కాంతార చాప్టర్ 1’ టీజర్
రిషబ్ శెట్టి మరోసారి వెండి తెరపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన కాంతార చాప్టర్ 1ని ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశాడు. ఈ టీజర్ విడుదలైన తర్వాత అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ టీజర్ అంతటా సంచలనం రేపుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ సినిమాపై అభిమానుల్లో జోరుగా చర్చ సాగుతోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ టీజర్‌కు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హోంబలే ఫిల్మ్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.