NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు
ఆదివాసీలది విశిష్టమైన జీవన విధానం.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రకృతితో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు. ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. తాజాగా.. మేడారం జాతర- 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు.అదే రోజు పునుగొండ నుంచి పగిద్దరాజు, కొండాయి గ్రామానికి చెందిన గోవిందరాజులను అర్చకులు మేడారం గద్దలపైకి తీసుకువస్తారు. 22వ తేదీ గురువారం.. సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి.. 23వ శుక్రవారం వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. అమ్మవార్లను పొలాల్లో కొలువుదీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు వస్తుంటారు. పసుపు కుంకుమ, ఎండు బియ్యం మరియు బంగారం (బెల్లం) సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలి ఇస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలో ఎగవేసి ఆరగింపు చేస్తారు. 24వ తేదీ శనివారం.. సమ్మక్క, సారలమ్మ పగిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వానప్రస్వానికి చేరుకుంటారు. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు కొన్ని నెలల ముందు కూడా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు చిరుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు.కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతరులు కూడా జాతరకు రావడం ప్రారంభించారు. అప్పటి నుంచి మేడారంలో జాతర జరుగుతోంది.

గుంటూరులో దారుణం.. గొడుగు ఇస్తానని పిలిచి ఆరేళ్ల బాలికపై..!
చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ మధ్య ఈ కేసులో మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా, గుంటూరులో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ బాలుడు.. వర్షంలో తడవకుండా గొడుగు ఇస్తానని చెప్పి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.. అభశుభం తెలియని ఆ బాలికను పాడుచేశాడు.. తనపై జరిగిన దారుణానికి తల్లిదండ్రులకు చెప్పడంతో.. పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పేదకాకాని పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా.. ఏదో ఓ చోట ప్రతీరోజు.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్న విషయం విదితమే. కేసులు నమోదు అవుతున్నా.. శిక్షలు పడుతున్నా కూడా దారుణమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధామ్‌తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బొలెరో ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది అక్కడిక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. వివరాల్లోకి వెళితే ఒకే కుటుంబానికి చెందిన వారంతా బొలెరోలో సోరం నుంచి మర్కటోలాకు వెళ్తున్నారు. బలోద్ జిల్లాలోని గత్రా సమీపంలో కాంకేర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బొలెరో ఢీకొట్టింది. దీంతో 10 మంది అక్కడిక్కడే మరణించారని బలోద్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రమాదానికి కారణం అయిన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పురూర్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎస్‌సీ‌ఓ సమావేశాలకు గోవా సిద్ధం.. హాజరుకానున్న పాకిస్తాన్ మంత్రి
షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్‌సీ‌ఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. రష్యా, చైనా, కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మే 4న ఉదయం గోవా విమానాశ్రయానికి చేరుకుంటారని తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశకంకర్, సెర్గీ లావ్రోవ్ తో భేటీ కానున్నారు. పుతిన్ పై హత్య ప్రయత్నం తర్వాత ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశ వేదికగా రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇరు నేతల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. రష్యాతో పాటు చైనా, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక సమావేశాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో ఎలాంటి భేటీ ఉండదని ఉండదని తెలుస్తోంది.

స్టేడియంలో ఆప్ ఎంపీ.. లవర్ తో ఎంజాయ్
బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్న భామ ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 13న ఈ ప్రేమజంట ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఇప్పటికే బీ టౌన్ లో తెగ చర్చ జరుగుతుంది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్ లోనే వివాహబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన పరిణితీ చోప్రా, రాఘవ్ మరోసారి సందడి చేశారు. ఈ సారి ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో కనిపించి అభిమానులకు కనువిందు సర్ ప్రైజ్ చేశారు. పంజాబ్ లోని మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్ కు ఈ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ పెట్టుకొవడంతో అవి ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్-ముంబాయి ఇండియన్స్ టీమ్స్ తలపడ్డాయి. కాగా.. గతంలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చాలా సార్లు జంటగా మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఈ లవ్ బర్డ్స్ కు ఆప్ నేతలు సైతం ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఫోన్‌పే కీలక నిర్ణయం.. ఈ చెల్లింపులకు పిన్‌ అవసరంలేదు..
క్యాష్‌ వాడకం తగ్గిపోయింది.. ఇప్పుడంతా డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడ్డారు.. టీ షాపు నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌ వరకు ఎక్కడైనా డిజిటల్‌ చెల్లింపులే.. అయితే, చిన్న మొత్తం చెల్లించినా పిన్‌ ఎంట్రీ చేయాల్సిన పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఫోన్‌ పే కీలక నిర్ణయం తీసుకుంది.. డిజిటల్‌ చెల్లింపులు రూ.200 లోపు ఉన్నప్పుడు పిన్‌ నమోదు చెయ్యాల్సిన అవసరం లేకుండా యూపీఐ లైట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పే దాని అతిపెద్ద పోటీదారు పేటీఎం ప్లాట్‌ఫారమ్‌తో ప్రత్యక్ష ప్రసారం అయిన రెండు నెలల తర్వాత చిన్న లావాదేవీల కోసం వేగవంతమైన చెల్లింపులను ప్రారంభించడానికి తన అప్లికేషన్‌లో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లైట్ చెల్లింపుల ఫీచర్‌ను ప్రారంభించింది. కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ UPI లైట్ ఖాతా నుండి పిన్‌ను నమోదు చేయకుండా ఒక్క ట్యాప్‌తో రూ. 200 లోపు తక్కువ-విలువ చెల్లింపులను ప్రారంభించవచ్చని వాల్‌మార్ట్-ఆధారిత చెల్లింపుల డెకాకార్న్ మే 3న ఒక ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్-ఆధారిత Paytm ఫిబ్రవరి చివరి వారంలో UPI లైట్‌ను ప్రారంభించింది.. UPI లైట్ ద్వారా, వినియోగదారుల బ్యాంకుల (రిమిటర్ బ్యాంక్) కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లను రియల్ టైమ్‌లో ప్రమేయం లేకుండా ఆన్-డివైస్ UPI లైట్ బ్యాలెన్స్‌ను డెబిట్ చేయడం ద్వారా లావాదేవీ నేరుగా ప్రాసెస్ చేయబడుతుంది.

బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధర
పసిడి ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో జాతీయంగా పసిడికి డిమాండ్‌ పెరిగిపోయింది.. దీంతో.. ఈ రోజు అమాంతం ధర పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2000 డాలర్ల పైనే ట్రేడ్‌ అవుతుండగా.. భారత మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.880 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.800 పెరిగింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది.. కిలో వెండి రేటు ఈ రోజు రూ.700పైకి కదిలించింది.. ఇక, ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.56,650కు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790గా ఉంది.. హైదరాబాద్‍ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.61,640కి ఎగిసింది.. ఇక, విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,640గా ఉంది. మరోవైపు.. కోల్‍కతా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పడిసి ధర రూ.61,640 దగ్గర కొనసాగుతోంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,060గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,240 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,550గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,690గా ఉంది.. ఇక, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,550గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,690 దగ్గర కొనసాగుతోంది.

అందంతో పిచ్చెక్కిస్తున్న త్రిష.. స్టైలిష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా
జోడీ సినిమాలో చిన్న పాత్రలో యాక్టింగ్ చేసిన త్రిష హీరోయిన్ గా తన తొలి సినిమాను 2002 సంవత్సరంలో చేసింది. అంటే త్రిష సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయ్యింది అన్నమాట. సాధారణంగా హీరోయిన్స్ అయిదు నుంచి పది సంవత్సరాలు కొనసాగడం గొప్ప విషయం. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ త్రిష విషయంలో ఆ విషయం తప్పు అని తేలిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. త్రిష అందం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూస్తే మరోసారి అర్థం అవుతుంది. స్టైలిష్ కూల్ డ్రెస్ లో అంతకు మించిన స్టైలిష్ షేడ్స్ ను ధరించిన త్రిష స్మైల్ ను చూసి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. అలా నిలబడిన స్టైల్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ లో ఉన్న స్టైల్ కు అభిమానులు మాత్రమే కాదండోయ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టకుండా ఉండలేక పోతున్నారు.