గుడ్‌న్యూస్.. నేటి నుండి పెన్షన్ల పంపిణీ
పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3న ఇంటికే పింఛన్ డబ్బులను తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాకు అకౌంటు ఆధార్ లింక్ కాని వారికి ఇంటివద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు సిబ్బంది.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. నేడు మరో మూడు జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించి.. రాష్ట్రాన్ని చుట్టేశారు.. ఇదే సమయంలో రోడ్‌షోలు, బహిరంగ సభల్లోనూ ప్రసంగించారు.. ఇక, ఇప్పుడు రోజుకు మూడు జిల్లాల చొప్పున విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం.. ఈరోజు ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలో సభకు హాజరవుతారు.. సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ఇక, అక్కడ నుంచి ఏలూరు వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిల ప్రణాళికలపై స్పీడ్ పెంచింది భారతీయ జనతా పార్టీ.. 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్షేత్రస్ధాయి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు బీజేపీ నేతలు.. 251 మండలాలలో రెండేసి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లకు రంగం సిద్ధం చేశారు.. మొత్తం 500 కు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల నిర్వహణకు ఇంఛార్జిగా విష్ణువర్ధన్ రెడ్డిని నియమించింది బీజేపీ.. కేంద్ర ప్రభుత్వ పాలన, ప్రజలకు అందిన సంక్షేమంపై క్షేత్ర స్ధాయిలో నిర్వహించే మీటింగ్‌లలో వివరించనున్నారు.. ప్రతీ బూత్ స్ధాయిలో 20 మంది కార్యకర్తలను గుర్తించి వారితో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు దిశగా ప్రణాళిలలో తలమునకలౌతున్న రాష్ట్ర నాయకత్వం.. ఇప్పటికే అన్ని జిల్లాలతో సమావేశం అవుతున్నారు ఎన్నికల కన్వీనర్లు.. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పార్టీలతో కలిసి బీజేపీ బరిలోకి దిగిన విషయం విదితమే. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు పార్టీల నేతలు కలసి ప్రచారం నిర్వహిస్తున్నారు.. మంగళవారం రోజు మూడు పార్టీలకు చెందిన నేతలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను సైతం విడుదల చేసిన విషయం విదితమే.
నేడు జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
నేడు జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల శివారులో జరగనున్న కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరుకానున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేసి మన చిత్త శుద్దిని చాటుకున్నామన్నారు. సెమీ ఫైనల్ లో ఆరోజు కేసీఆర్‌ను ఓడించి బుద్ధి చెప్పామని, ఈ ఫైనల్ లో గుజరాత్ నుండి వచ్చిన మోడీ నీ ఒడగొట్టాలన్నారు. ఈ గడ్డ పైనా గుజరాత్ పెత్తనం ఏంటి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కు చేయాల్సిన అన్యాయం చేశారని, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడా అని ఆయన అన్నారు.
నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి.. రాత్రికి హైదరాబాద్‌లోనే బస..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో లాల్ దర్వాజ చేరుకోనున్నారు. లాల్‌దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గంటపాటు ఈ రోడ్‌షో సాగనుంది. రోడ్ షో అనంతరం అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి 9:15 గంటల నుంచి 10:15 గంటల వరకు చేవెళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
నేడు గుజరాత్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు ఇంకా వారం రోజులే మిగిలి ఉంది. మే 7వ తేదీన మూడో దశకు ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా, ఇవాళ (బుధవారం) గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత, సబర్‌కాంతలలో నిర్వహించే ర్యాలీలలో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోడీ ప్రచారంతో బీజేపీ ఎన్నికల క్యాంపెన్ కు మరింత ఆదరణ లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఇక, గుజరాత్‌లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాలకు గాను 26 స్థానాలను కైవసం చేసుకుంటుంది. 1998 నుంచి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది. అయితే, కేవలం 26 స్థానాల్లో మళ్లీ విజయం సాధించడం బీజేపీ యొక్క లక్ష్యం కాదు.. ఈసారి రాష్ట్రంలో – ప్రతి లోక్ సభ సీటులో సుమారు 5 లక్షల ఓట్ల తేడాతో గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఢిల్లీలో పాఠశాలకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు
ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా పిల్లలను బయటకు తీశారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో పాఠశాలలో బాంబు ఉందని రాసి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్వేషణ కొనసాగుతోంది. అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదు.
మణిపూర్లో పోలీసులది ప్రేక్షకపాత్ర.. అల్లరిమూకలకే సహకరించారు..
దేశవ్యాప్తంగా మణిపుర్ రాష్ట్రంలో హింసాత్మక దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంతో పాటు సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకపోగా.. అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ తన ఛార్జిషీటులో తెలిపింది. కాంగ్‌పోక్పీ జిల్లాలో మైతీ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీతెగ మహిళలను పోలీసు సిబ్బందే అల్లరిమూకలకు అప్పగించినట్లు ఛార్జిషీటులో పేర్కొనింది. కాగా, ఆ తర్వాతే ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో వివరించింది. బాధితురాళ్లలో ఒకరు తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని కార్గిల్ యుద్ధవీరుడి భార్య పోలీసులను కోరగా.. ‘జీపు తాళాలు లేవు’ అని వారు తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది. అల్లరిమూకల చేతికి చిక్కిన మూడో మహిళ ఈ అఘాయిత్యం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. గతేడాది మే 4వ తేదీన జరిగిన ఈ ఘటన జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మే 3 నుంచి ఆరంభం!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబందించి ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్‌లో బ్యానర్‌లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందించనుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై రాయితీలు, ఆఫర్లు భారీగా ఉండనున్నాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా కార్డులపై ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చు. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్స్ అందించనుంది. మరోవైపు అమెజాన్ కూడా సేల్‌ను ప్రకటించింది. ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే’ సేల్ మే 2న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌లు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4, వన్‌ప్లస్ 12 ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 3 లాంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా రాయితీలు ఉన్నాయి.
రింకూ సింగ్‌కు అవకాశం రాకపోవడానికి కారణం అతడే?
టీ20 ప్రపంచకప్ 2024 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండగా.. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషబ్ పంత్.. పొట్టి ప్రపంచకప్‌తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న సంజూ శాంసన్‌కు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. ఇక స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఫినిషర్ రింకూ సింగ్‌లను స్టాండ్‌బై లిస్ట్‌లో చేర్చింది. గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో ఉన్న రింకూ సింగ్‌ను పక్కనపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రింకూను పక్కనపెట్టడానికి కారణం ఐపీఎల్ 2024 ప్రదర్శనే అని ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ తరఫున రింకూ పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 17వ సీజన్‌లో రింకూకు పెద్దగా ఆడే అవకాశం రాలేదనే చెప్ప్పాలి. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్ ఆడుతుండడంతో రింకూ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం రాలేదు. మరోవైపు చెన్నై ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుత ప్రదర్శన కూడా రింకూ సింగ్ ఎంపికను అడ్డుకుందనే చెప్పాలి. ఐపీఎల్ 2024లో సీఎస్‌కే తరఫున ఫినిషర్‌గా ఆడుతున్న దూబే.. సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ ఆరంభం నుంచే భారీ సిక్సులు బాదుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 9 మ్యాచ్‌ల్లో 350 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 172.41 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు దూబేనే కావడం విశేషం. రింకూ సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగిన దూబే వైపే బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే రెండవ భాగం కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పట్లో ఆ సినిమా ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. ఎందుకంటే ప్రభాస్ లైనప్లో చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి సలార్ 2 సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరి కొద్ది రోజుల్లోనే సలార్ 2 సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల షెడ్యూల్ తో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గత మూడు నెలల నుంచి ప్రశాంత్, అతని టీం మొత్తం కలిసి సలార్ 2 స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని అది ఒక కొలిక్కి రావడంతో ఈ నెలాఖరు నుంచి పది రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే ఈ ఏడాదిలో సలార్ 2 షూటింగ్ పూర్తి చేస్తారని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే దాదాపుగా ప్యాచ్ వర్క్ లు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళతారని చెబుతున్నారు.
వరలక్ష్మీ కాబోయే భర్త కండలపై కామెంట్స్.. ప్రభాస్ పేరు చెప్పి నోరు మూయించేసిందిగా!
వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆమె నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. వరలక్ష్మి ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్‌దేవ్ గ్యాలరిస్ట్, బాడీ బిల్డర్ కూడా. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మీతో ప్రేమలో పడడంతో అది పెళ్లికి దారి తీసింది. వరలక్ష్మి మే మూడో తేదీన శబరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేంద్ర అనే కొత్త నిర్మాత ఈ సినిమాని నిర్మించాడు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో మీమర్స్ తో ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఒక మీమర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పేరు లాగుతూ ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. సదరు మీమర్ లీడర్ సినిమాలో కండలు పెంచిన వారికి మంచి మనసు ఉండదు అనే ఒక డైలాగ్ ఉంటుంది. కానీ మీరు చేసుకోబోయే వ్యక్తి అలాగే కండలు పెంచి కనిపిస్తున్నారు. అంతలా ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ మీకు కనిపించాయి అని ప్రశ్నిస్తే ఈ మాటే లాజికల్గా లేదని వరలక్ష్మి కొట్టిపారేసింది. తాను ప్రభాస్ గురించి చాలా మంచి మాటలు విన్నానని, ప్రభాస్ కూడా కండలు పెంచి కనిపిస్తూ ఉంటాడు కదా. మరి ఆయనది మంచి మనసే కదా, అసలు మీరు చెబుతున్న లాజికే కరెక్ట్ గా లేదు అంటూ ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చింది.