టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ..! నేడు తేలనుందా..?
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. శుక్రవారం రోజు ఢిల్లీ వేదికగా మూడు పార్టీల నేతల సమావేశం జరగాల్సి ఉండగా.. అది ఈ రోజుకు వాయిగా పడింది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బిజీ షెడ్యూల్ కారణంగా మీటింగ్ పోస్ట్‌పోయిన్ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ రోజు మూడు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు.. ఉదయం 11 గంటలకు పాట్నా పర్యటనకు వెళ్లనున్నారు అమిత్‌షా.. ఆలోగా ఈ సమావేశం జరగనుంది.. దీనిపై కోసం ఢిల్లీలోనే మకాం వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. మరోవైపు.. ఏపీలో 10 పార్లమెంట్ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.. కనీసం 8 ఎంపీ స్థానాలైనా తమకు ఇవ్వాలని కోరుతున్నారట కమలం పార్టీ నేతలు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మొన్న రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలనుకున్నా.. అది కూడా వాయిదా పడడంతో.. ఇవాళ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం విదితమే కాగా.. టీడీపీ, జనసేనల మధ్య ఇప్పటికే 118 చోట్ల సీట్ల పంపకాలు పూర్తి అయ్యాయి.. టీడీపీ 94 స్థానాలు, జనసేన 24 స్థానాల్లో పోటీకి సిద్ధం అయ్యాయి.. ఇక, లోక్‌సభ సీట్లలోనూ కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.. టీడీపీ 12 ఎంపీ స్థానాలు, జనసేన మూడు స్థానాల్లో పోటీకి రెడీ అవుతుండగా.. బీజేపీకి ఎన్ని సీట్లు అనేదానిపై క్లారిటీ వచ్చాక.. మిగతా స్థానాలపై టీడీపీ నిర్ణయం తీసుకోనుందట.. అయితే, బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న ఎంపీ స్థానాలపై ఇంకా అవగాహన కుదరలేదు.. విశాఖ లోక్‌సభ స్థానం కోసం బీజేపీ పట్టుబడుతోంది.. హిందూపురం, అనంతపురం, విజయవాడ స్థానాలు కూడా కావాలంటోంది. రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నరసాపురం, అరకు లోక్‌సభ స్థానాల్లో పోటీకి బీజేపీ ఏకాభిప్రాయంతో ఉందట. ఇక, జనసేనకు మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు.. అయితే, మూడు పార్టీల నేతలు నేడు తుది నిర్ణయం తీసపుకునే ఛాన్స్ ఉంది.
అరకులోయలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్దర జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.. రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. నందివలసలో జరిగిన జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. జాతరకు వెళ్లి వస్తున్న రెండు బైక్‌లను అరకులోయ నుంచి వెళుతున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొట్టింది.. నాలుగేళ్ల బాలుడు సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మృతులను చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి, గొల్లూరి అమలాకాంత్, లోతేరుకు చెందిన త్రినాధ్, భార్గవ్ గా గుర్తించారు.. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు.. మృతి చెందిన వారిలో ఇద్దరు 15 ఏళ్ల లోపు యువకులు, ఒకరికి 40 సంవత్సరాల వ్యక్తి కాగా.. అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడు భార్గవ్, మరో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.. మిగిలిన క్షతగాత్రులకు అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అరకులోయ పోలీసులు.
ఆస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!
ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది. అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తుంది. మార్చి 2న సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల.. ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఉజ్వల మరణించడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు వెంకటేశ్వరరావు, మైథిలి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు.
13000 అడుగుల ఎత్తు, రూ.825 కోట్లు… నేడు సెలా టన్నెల్‌ను ప్రారంభించనున్న మోడీ
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో 13000 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు అంటే శనివారం ప్రారంభించనున్నారు. సెలా టన్నెల్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగం తవాంగ్‌కు అన్ని వాతావరణ కనెక్టివిటీని అందిస్తుంది. దీంతో చైనా సరిహద్దుకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి ఈ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు. ఇది 13000 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన రెండు లేన్ల సొరంగం.. దీని తయారీలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఈ సొరంగం హిమపాతం వల్ల ప్రభావితం కాదు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో వేగవంతమైన, మరింత సమర్థవంతమైన రవాణా మార్గాలను అందించడమే కాకుండా దేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
అధికారులకు క్లాస్ పీకిన ఢిల్లీ జల మంత్రి అతిషి.. చర్యలు తప్పవని హెచ్చరిక
వేసవి కాలం రాబోతోంది. వేసవి తర్వాత రుతుపవనాలు వస్తాయి. వర్షాకాలం ఢిల్లీకి ఎప్పుడూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఢిల్లీ రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్షపు నీరు నిండిపోవడంతో పాటు మురుగు కాలువల సమస్య కూడా ఢిల్లీ ప్రజలకు కొత్త కాదు. ప్రతిరోజు మురుగు కాల్వలు మూసుకుపోవడంతో మురికి నీరంతా వీధుల్లోకి వస్తోంది. ఇదిలా ఉండగా, నగరంలో మురుగు కాలువలు, నీటికి సంబంధించిన సమస్యలపై తక్షణమే స్పందించాలని ఢిల్లీ ప్రభుత్వ నీటి శాఖ మంత్రి అతిషి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. మురుగు కాల్వలు, కలుషిత నీరు, పైప్‌లైన్ లీకేజీకి సంబంధించి ఒక్కరోజులోనే 80 ఫిర్యాదులు అందాయి. జలమండలి మంత్రి అతిశి ఫిర్యాదులన్నింటినీ ముఖ్య కార్యదర్శికి పంపి సమస్యల పరిష్కారానికి 48 గంటలపాటు అల్టిమేటం ఇచ్చారు. రాబోయే 48 గంటల్లో వాటర్‌బోర్డుకు సంబంధించిన ప్రజా సమస్యలన్నింటికీ స్వల్పకాలిక పరిష్కారం చూపాలని జలమండలి మంత్రి అతిషి ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వారం రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోయేలా కృషి చేయాలి.
మగువలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
బంగారం వెండి ధరలు మార్కెట్ లో ఎప్పుడు ఒకేలా ఉండవు.. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి..10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర పెరగగా.. కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్లు రూ.65,740, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,060, 24 క్యారెట్ల ధర రూ.66,610, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,410 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,890 గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రా బంగారం ధర రూ.60,260 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది.. వెండి ధరల విషయానికొస్తే.. ఈరోజు కిలో వెండి పై రూ.100 పెరిగింది.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000గా ఉంది. ముంబైలో రూ.75,000 ఉండగా.. చెన్నైలో రూ.78,500గా కొనసాగుతోంది. హైదరాబాద్, ధర రూ.78,500లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,600గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
పిల్లలతో శివరాత్రి జాగారణ చేయించిన రేణుదేశాయ్.. పోస్ట్ వైరల్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ల పిల్లల గురించి అందరికి తెలుసు.. వీరి గురించి చిన్న వార్త వచ్చిన తెగ వైరల్ అవుతుంది.. ఇక రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా శివరాత్రి సందర్బంగా ఒక పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మహా శివరాత్రి పండుగ రోజున అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే. రేణు దేశాయ్ కూడా ఉపవాసం, జాగారణ చేసింది. తన పిల్లలు అకిరా, ఆద్యలతో కూడా ఉపవాసం, జాగారణ చేయించింది. రాత్రికి సద్గురు లైవ్ షో చూస్తూ ఓం నమః శివాయ అంటూ అకిరా, ఆద్య కూర్చొని దైవ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేశారు.. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అఖిరా, ఆద్య ఇద్దరు ఓం నమ శివాయః అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆద్య, అకిరా నాతో కూర్చొని మెడిటేషన్ చేస్తూ జాగరణ చేశారు. పేరెంట్స్ గా మన కల్చర్ గురించి చెప్పి వాళ్ళని బాధ్యత గల వ్యక్తులుగా చేయడం మన బాధ్యత.. ఉదయం నుంచి కూడా నాతో పాటే నీళ్లు తాగుతూ కటిక ఉపవాసం ఉన్నారు అంటూ రేణు రాసుకొచ్చింది.. పండగల గురించి చెప్తూ ఇలాంటి నేర్పిస్తుందుకు రేణు పై పవన్ ఫ్యాన్స్ సైతం అభినందనలు తెలుపుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
నెలలోపే ఓటీటీలోకి వరుణ్ తేజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మన తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.. సినీ ప్రేక్షకులను ఈ అంశం బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకుంది. నాలుగు వారాల తర్వాత తెలుగు భాషలో అమెజాన్ లో ఆపరేషన్ వాలంటైన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీకి రానుందని సమాచారం.అదే హిందీలో మాత్రం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని తెలుస్తుంది. ఇక థియేటర్ రిజల్ట్ కారణంగా ఆపరేషన్ వాలెంటైన్ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు తెలిసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. వరుణ్ తేజ్ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.