నాల్గో రోజుకు చేరిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు.. పులివెందుల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. ఇప్పటికే మూడు రోజులుగా దిగ్విజయంగా సాగుతూ.. నాల్గో రోజుకు చేరుకుంది.. శుక్రవారం పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి వరకు సాగింది యాత్ర.. ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం జగన్.. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. ఇక, నాల్గో రోజులో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లాలో నుంచి అనంతపురంలోకి ప్రవేశించనుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయల్దేరనున్న సీఎం జగన్.. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశించనుంది.. గుత్తి శివారులో భోజనవిరామం ఉంటుంది.. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి.. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి.. ఓవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజాగళం యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.. ఇక, ఈ రోజు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులోప్రజాగళం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో ఉదయం11 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నేడు మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చేరుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బస్ స్టాండ్ సెంటర్ లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.. ఇక, నేడు శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత పర్యటన సాగనుంది.. శ్రీకాళహస్తిలోని బేరివీధి సర్కిల్ వద్ద జరిగే ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. రాత్రి కాళహస్తిలోనే బస చేయనున్నారు.
పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఓవైపు.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచి ముందుకు సాగుతుండగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో జనసేనాని పర్యటన కొనసాగనుంది.. తన పోటీపై ప్రకటన చేసిన తర్వాత తొలిసారి పవన్ పిఠాపురం వస్తుండడంతో.. ఆసక్తికరంగా మారింది. నేడు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గొల్లప్రోలుకు చేరుకుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తొలిరోజు శక్తిపీఠం పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అనంతరం దత్త పీఠాన్ని దర్శించుకుంటారు.. ఆ తర్వాత దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి.. ఆయనతో సమావేశం కానున్నారు.. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పొలిటికల్ హీట్ పెరిగినట్టు అయ్యింది.. ఈ పర్యటనలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు, నియోజకవర్గానికి చెందిన పలు వర్గాలతో మీటింగ్‌లు ప్లాన్ చేసింది జనసేన.. ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ కల్యాణ్..
నేడు జరగాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన విద్యాశాఖ ..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే డీఎస్సీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరోసారి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షల నిమిత్తం ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చిన తర్వాతనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. వీటితోపాటు సెంటర్ల ఎంపిక ఆప్షన్లను కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరీక్షల నేపథ్యంలోనే మార్చి 25న ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇదివరకే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. కాకపోతే ఈసీ నుండి ఎటువంటి అనుమతి రాకపోవడంతో.. రాష్ట్రంలో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముఖ్యంగా టేట్, డిఎస్సి పరీక్ష మధ్య కొద్దిగైన గ్యాప్ ఉండాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇదివరకు ఒకసారి పరీక్ష షెడ్యూల్ మార్చడం జరిగింది. మరోసారి ఎన్నికల కోడ్ రావడంతో మళ్లీ వాయిదా పడింది.
నేడు కాంగ్రెస్ లోకి గద్వాల్ విజయలక్ష్మి.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో..
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇవాళ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె తండ్రి కేశరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆమె మార్పుతో ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరినా ఆమె పదవికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు ఎన్నికైన పార్టీ నుంచి మరో పార్టీలోకి మారితే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది కానీ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల ప్రకారం కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌ల పాత్రలు మారినప్పటికీ వారి పదవులు కోల్పోయే అవకాశం లేదు.
కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఎప్పుడంటే..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.
ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 2న మోడీ సభ!
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్- ఉధమ్ సింగ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం రుద్రాపూర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య కొఠారి ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను తెలియజేశారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు బీజేపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. అయితే, ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రుద్రపూర్‌లో ప్రధాని బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు జైపూర్ రూరల్‌లోనూ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఏప్రిల్ 3వ తేదీన పితోర్‌గఢ్, వికాస్‌నగర్‌లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యం వహిస్తున్నారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలు కూడా పలు రాష్ట్రాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచో తెలుసా..?
భారత దేశంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఔషద మందుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణలు చేసినట్లు సమాచారం. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(NLEM) జాబితాలో ఉన్న మందులపై 0.0055 శాతం మేర ధరలు పెరగబోతున్నాయి. ఇక, ఈ ధరల పెరుగుదల ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతుంది. పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి 800కు పైగా యాంటీ బయాటిక్, యాంటీ ఇన్‌ఫెక్టివ్, పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్‌ల ధరలు పెరగబోతున్నాయి. అయితే, మందుల ధరలు గతేడాది 12 శాతం, 2022లో 10 శాతం పెరగడంతో పోల్చుకుంటే ఈసారి పెరిగే ధరలు స్వల్పంగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పుకొవచ్చు అన్నమాట. అయితే, ఈ లిస్టులో మొత్తం 384 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇందులో కొత్తగా 34 ఔషదాలను చేర్చారు. అంతకు ముందున్న 26 ఔషదాలని తొలగించారు. కాస్ట్-ఎఫెక్టివ్, క్వాలిటీ మెడిసిన్స్ అవైలబిలిటీని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం జాబితాను తయారు చేసింది.
వీరికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు: సునీల్ గవాస్కర్
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ గురించి అందరికి తెలిసిందే.. గత ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో గంభీర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే, ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా గంభీర్ బాధ్యతలను చేపట్టాడు. దీంతో కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్ అనగానే అందరి దృష్టి కోహ్లి- గంభీర్‌లపైకి వెళ్తాయి. కానీ, ఆర్సీబీ ఇన్నింగ్స్ వ్యూహ విరామ టైంలో ఈ ఇద్దరూ నవ్వుతూ పలకరించుకోవడం మైదానంలో కనిపించింది. ఇక, మైదానంలోకి వచ్చిన గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లి దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కోహ్లి కూడా నవ్వుతూ దగ్గరకు వెళ్లి గంభీర్‌ను హత్తుకున్నాడు. ఇద్దరూ కాసేపు ఏదో మాట్లాడుకున్నారు.. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మ్యాచ్‌లో అత్యుత్తమ సందర్భం ఇదేనంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్రీ బాక్స్ నుంచి వ్యాఖ్యనించారు. ఈ సందర్భానికి ఫెయిర్ ప్లే అవార్డు దక్కాలంటూ భారత జట్టు మాజీ కోచ్, వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొనగా.. కేవలం ఫెయిర్ ప్లే అవార్డే కాదు వీళ్లకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలంటూ గవాస్కర్ చమత్కరించాడు.
ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!
ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కాను తాజాగా ప్రకటించిన 96వ ఆస్కార్డు అవార్డులలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ హీరోయిన్ లతోపాటు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విభాలలో కూడా నామినేషన్లను దక్కించుకుంది. ఇందులో భాగంగా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ సినిమాకు కేవలం ఆస్కార్ అవార్డు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా కింగ్స్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. విటితోపాటు యూరోపియన్ ఫిలిం అవార్డ్స్, బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిలిం అవార్డ్స్, సిడ్ని ఫిలిం ఫెస్టివల్ ఇలా అనేక రకాల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగి చాలా చోట్ల బెస్ట్ సినిమా అవార్డులను దక్కించుకుంది.
నాని సినిమా విలన్ డేనియల్ బాలాజీ కన్నుమూత..
ప్రముఖ కొలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు.. గత రాత్రి గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో ఉండగానే మధ్యలోనే ప్రాణాలను విడిచారు..ఈయన మరణం ఇండస్ట్రీకి తీరన లోటు. ఒక పెద్ద విలన్ ను ఇండస్ట్రీ కోల్పోయింది.. ఈయన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా విలన్ గా చేశారు.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు.. మొదట సీరియల్ లో నటించిన ఆయన విలన్ గా మారి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు.. ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు.. తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు. తెలుగులో ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు.. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ మూవీలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించాడు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో వెంకీ ఘర్షణ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత చివరగా టక్ జగదీష్‌లో మెయిన్ విలన్‌గా డానియల్ బాలాజీ కనిపించాడు. ఫిలిం మేకర్ అవ్వాల్సిన అతను విలన్ గా సెటిల్ అయ్యాడు.. ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగున్నాయని సమాచారం..