నేటి నుంచి బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారానికి జనంలోకి జగన్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఆపై పొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ వద్ద రాత్రి శిబిరానికి ఆయన చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ లోనే రాత్రి జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా రోజుకొక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పనితీరుపై ఆయన భిన్న అభిప్రాయాలు అడిగి తెలుసుకోబోతున్నారు.
నేటి నుండి చంద్రబాబు సుడిగాలి పర్యటనలు..
నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారం సాగిస్తున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభం అవుతుంది. 31 వరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు చంద్రబాబు. ముఖ్యంగా వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు చంద్రబాబు. దీంతో పాటు కూటమి అధికారానికి రావడం.. రాష్ట్రానికి ఎంత అవసరమో తన ప్రసంగాల్లో ప్రజలకు వివరించనున్నారు. ఎక్కడిక్కడ కూటమి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ .. ముందుకు సాగనున్నారు చంద్రబాబు.
టీడీపీలో ఏలూరు ఎంపీ టికెట్ చిచ్చు..! వైసీపీ వైపు మాజీ ఎంపీ చూపు..!
ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీల్లో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్ రాని నేతలు.. పార్టీపై తిరుగు బాటు ఎగుర వేస్తున్నారు. నాలుగు నెలల క్రితం బస్సు యాత్రలో భాగంగా తన ఇంటికి వచ్చి మేమంతా మీతోనే ఉన్నాం మీరే మా ఎంపీ అభ్యర్థి బాబు.. అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. పార్టీ ఇచ్చిన హామీని.. ఇప్పుడు కాదంటున్నారు. యనమల రామకృష్ణుడు తన అల్లుడిని ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎలా తీసుకువచ్చారని మాగంటి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. తనతో ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థిత్వం మార్చడం బాధాకరమని మాగంటి అంటున్నట్లుగా సమాచారం. మాగంటి వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, తనకు అత్యంత ఆప్తుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై మాగంటి బాబు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మాగంటి యాక్టీవ్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల మాగంటి బాబు తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా… ఏలూరు ఎంపీ అవమానకరంగా భావిస్తున్నారని సమాచారం. కాగా, పొత్తులో భాగంగా టీడీపీ.. జనసేన, బీజేపీకి కేటాయించిన మరికొన్ని స్థానాల్లో కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.. మరోవైపు.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ.. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట..
నేడు తెలంగాణ హైకోర్ట్ కొత్త భవనానికి శంకుస్థాపన.. సీజేఐ హాజరు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇవాళ (బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో నూతన హైకోర్టును నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనికి రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. కాగా, లోక్‌సభ ఎలక్షన్ కోడ్ కారణంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీం కోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు నేటి సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. కాగా, హైకోర్టు నూతన భవనాన్ని వందేళ్ల పాటు పటిష్ఠంగా ఉండే విధంగా నిర్మించేలా ప్రణాళికలను రూపొందించారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రెడీ చేశారు. ప్రస్తుతం హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కోర్టు హాళ్లను నిర్మించాల్సి ఉంది. జడ్జిల నివాస భవనాలతో పాటు రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, ఆడిటోరియం, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫైలింగ్ సెక్షన్‌లు, రికార్డుల గదులు, పార్కింగ్, తదితర అవసరాలకు తగిన విధంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. కాగా, హైకోర్టు కొత్త భవనం వరకు మెట్రో రైలును కూడా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
నేడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా!
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ లో సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. ఇక, 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ తీసుకుంటుంది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థిత్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపించనుంది. అయితే, ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు ఏఐసీసీకి సిఫారసు చేశారు. కాగా, సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఇక, బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉండటంతో మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచనలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తీసుకెళ్లినట్లు టాక్. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక, ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
అమెరికా వంతెన ప్రమాదంలో అలా చేయడంతో తప్పిన పెను ప్రమాదం..!
సింగపూర్ దేశానికి చెందిన గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఒక కార్గోనౌక దాలీ బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. ఇక ఈ కార్గో షిప్ మంగళవారం నాడు ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జికు ఉన్న పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జి కుప్పకూలింది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో బ్రిడ్జి పై ఉన్న చాలా తక్కువ కారులు, మరికొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటనలో భాగంగా అక్కడ అధికారులు ఇద్దరిని కాపాడారని.. అందులో ఒకరి పరిస్థితి కాస్త విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ ఘటన లో మొత్తం 6 గురు మరిణించినట్లు సమాచారం. ఇక ఘటన జరిగిన తర్వాత వంతెనను ఢీకొనడంతో నౌకలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే ఈ సంఘటనను ముందుగానే గుర్తించిన ఆ నౌక ఇబ్బంది అధికారులకు ముందుగా హెచ్చరించడం ద్వారా పెను ప్రమాదమే తప్పిందన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద నేపథ్యంలో భాగంగా మేరి ల్యాండ్ గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందుకోసం ఫెడరల్ ప్రభుత్వ సహకారం కూడా తాము తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫారెన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI ) సంఘటన స్థలానికి చేరుకుందని, అయితే ఘటనకు సంబంధించి ఎలాంటి ఉగ్రవాద కోణం ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన సహాయక చర్యలు నిలిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అతి త్వరలో చర్యలు మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు.
ముంబైతో సన్‌రైజర్స్ ఢీ.. ఉప్పల్‌లో బోణీ కొట్టేదెవరో!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఢీ కొట్టనున్నాయి. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్, ముంబై టీమ్‌లూ సీజన్‌లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా.. చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడంతో మైదానంకు అభిమానులు పోటెత్తనున్నారు. మరి ఉప్పల్‌లో బోణీ కొట్టేదెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. టాప్ ఆర్డర్‌లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్ దూకుడు పెంచితే తిరుగుండదు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైకి సన్‌రైజర్స్ బౌలింగ్ పరీక్షగా నిలువనుంది. భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సన్, టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్‌లతో బలమైన బౌలింగ్ ఉంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు ఇదే మొదటి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో రోహిత్, బ్రెవిస్ సత్తాచాటినా మిగతా వాళ్లు విఫలమయ్యారు. ఇషాన్ కిషన్, నమన్ ధీర్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఇక పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రాలతో బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఇక ఐపీఎల్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్ 9, ముంబై 12 మ్యాచ్‌లు గెలిచాయి. చివరి 5 మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు ముంబై గెలిచింది.
హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (బుధవారం) జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు అంత సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నేటి సాయంత్రం 7. 30 గంటలకు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా, స్టేడియంలో 2800 మంది సిబ్బందితో భద్రత, 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా మ్యాచ్ సమయంలో భారీ వాహనాలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, మ్యాచ్‌కు మూడు గంటల ముందు నుంచే స్టేడియంలోకి పర్మిషన్ ఇస్తామన్నారు. భద్రతలో భాగంగా ప్రేక్షకులు తమ వాహనాలను నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. బ్లాక్‌లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు. అలాగే, ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నేటి సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.. అలాగే, నాగోల్ నుంచి వచ్చే వాహనాలు మెట్రోస్టేషన్ నుంచి యూ టర్న్ తీసుకొని, భగాయత్ లేఅవుట్ నుంచి వెళ్లాలని సూచించారు. తార్నాక నుంచి వచ్చే వెహికిల్స్ హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం వైపు మళ్లించనున్నట్ల చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
42 ఏళ్ల వయస్సులో ఎంఎస్ ధోనీ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్!
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుత వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో కూడా కుర్రాడిలా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 8వ ఓవర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డారిల్ మిచెల్ వేశాడు. ఈ ఓవర్లోని మూడో బంతిని డారిల్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని సాధించగా.. విజయ్ శంకర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు దూసుకెళ్లింది. కీపర్ ఎంఎస్ ధోనీ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ధోనీపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు, వాటే క్యాచ్, ధోనీ గ్రేట్, ధోనీని మించిన కీపర్ లేడు అని కామెంట్స్ చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు!
నేడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రామ్ చరణ్ దంపతులు శ్రీవారిని దర్శించున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రమే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రామ్ చరణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంకన్న సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటిసారి రామ్‌చరణ్ శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.