నేడు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇడుపులపాయలో ఏర్పాట్లు
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మార్పుచేర్పుల్లో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక, ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులర్పించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉదయం 10గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు రానున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ వెళ్తారు. 12 గంటల 40 నిమిషాలకు వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల నుంచి ఒంటి గంటా 20 నిమిషాల వరకు వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు సీఎం జగన్. ఆ తర్వాత కాసేపు గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి కడపకు బయల్దేరతారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం వెళ్తారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. స్వస్థలానికి మృతదేహం..
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి కొంతమంది ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయి.. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు దుండగుల చేతుల్లో.. ఇంకాకొందరు సన్నిహితుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు.. ఇప్పుడు అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్.. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య చేయబడ్డాడు.. అభిజిత్ వయస్సు 20 ఏళ్లు.. ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అభిజిత్‌ను హత్యచేసినట్టుగా తెలుస్తోంది.. అయితే, సెల్ నంబర్ ఆధారంగా మృతదేహాన్ని అడవిలో గుర్తించారు అమెరికా పోలీసులు.. ఇక, శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహాన్ని తరలించారు పోలీసులు.. అభిజిత్ మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు, బంధువులు.. ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన కుమారుడు.. ఇలా హత్యకు గురికావడంతో వారిని దుఖాన్ని ఆపడం ఎవరివల్ల కావడం లేదు.
నేడు విశాఖలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. అయితే, వైజాగ్ సభలో రేవంత్ రెడ్డి ఏం కామెంట్ల చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరణకు పూనుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను.. ఆ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తన గురువైన మాజీ సీఎం చంద్రబాబుపై రేవంత్‌రెడ్డి ఎలాంటి విమర్శలు చేస్తారు అనేది చర్చగా మారింది.. టీడీపీని వీడినా.. అంతకు ముందు ఎప్పుడూ చంద్రబాబును విమర్శించలేదు రేవంత్‌రెడ్డి.. ఇక, టీడీపీకి బీజేపీతో పొత్తుకుదుర్చానంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏ విధంగా విమర్శిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
కొత్తపల్లి గీతకు కొత్త కష్టాలు.. ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దు..!
అరకు ఎంపీ సీటు బీజేపీకి తలనొప్పిగా మారింది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న కొత్తపల్లి గీతకు టికెట్ ఇవ్వద్దంటూ ఆ ప్రాంత వాసులే తేల్చిచెబుతుండడం.. పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే అక్కడ సమస్యల పరిష్కారంలో ముందుంటున్న డాక్టర్ హేమానాయక్ కు సీటివ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డాక్టర్ కూడా సీటు కోసం అంతే ప్రయత్నాలు చేస్తున్నారట.. డాక్టర్ హేమానాయక్ ఆదివాసీ తెగకు చెందిన వాడు కావడం.. స్ధానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తుండటంతో అక్కడి వారంతా అతనికే సీటివ్వాలంటున్నారు.. స్ధానికంగా అరకు ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడంతో చాలా కాలంగా ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. ఇప్పుడు బిజెపి తీసుకునే నిర్ణయం పార్టీకి కూడా బలం చేకూరుస్తుందని కేడర్ చెబుతోంది. బిజెపి 400 ఎంపి స్ధానాల టార్గెట్ పెట్టుకోవడంతో టిడిపితో పొత్తులోకి వచ్చింది.. అయితే టిడిపి బ్యాక్ గ్రౌండ్ కూడ కొత్తపల్లి గీతకు ఉండటంతో అది ఆమెకు బిజెపి టికెట్ ను దూరం చేస్తుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. బిజెపి ఎంపీగా పోటీ చేయాలంటే మొదటి అర్హత ఆ వ్యక్తి పూర్తిస్థాయి బిజెపి వ్యక్తి కావడం.. పదుల సంవత్సరాలుగా బిజెపి నే నమ్ముకుని పని చేస్తున్న డాక్టర్ హేమానాయక్ కు సీటివ్వాలని స్ధానిక బిజెపి క్యాడర్ ఆశించడం వెనుక ఆ కారణం కూడా ఉందని అంటున్నారు… కొత్తపల్లి గీతకు నిరసన సెగ ఎక్కువ కావడంతో ఆ అంశంపై బిజెపి అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం..
నేడు టీడీపీ గూటికి ఎంపీ మాగుంట..
ఇటీవలే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.. దానికి అనుగుణంగా నేడు సైకిల్ ఎక్కబోతున్నారు ఎంపీ మాగుంట.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి.. వైసీపీలో సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించక పోవటంతో ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. మరోవైపు.. తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించానని.. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోనంటూ ఇప్పటికే ప్రకటించారు ఎంపీ మాగుంట.. కానీ, తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. ఎంపీ టికెట్‌పై ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు ముగిశాయని.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఎంపీ మాగుంటకు టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అది సాధ్యం కాకపోవడంతో.. క్రమంగా వైసీపీకి దూరం అయిన మాగుంట.. ఆ తర్వాత టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు.. ఇక, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన నేపథ్యంలో టీడీపీలో చేరబోతున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించిన విషయం విదితమే.
కవిత అరెస్టు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయా ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోర్టు వేళలు ముగిసిన తర్వాత సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని. న్యాయ పోరాటం చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు.
కవిత అరెస్ట్.. నేడు ఢిల్లీకి బీఆర్ఎస్ అధికార నేతలు..
ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, మరికొందరు కీలక నేతలు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. అరెస్ట్ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. కవిత అరెస్టుతో పాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోడీ-బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఈడీ అక్రమంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరపున వాదిస్తున్న లాయర్ మోహిత్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారానికి వాయిదా వేసినట్లు వివరించారు. ఈ కేసులో కవితపై కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలోనే కోర్టుకు హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తప్పవని ఈడీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగా కవితను సోదాల పేరుతో అరెస్ట్ చేసి, విమాన టిక్కెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు.
కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమానికి హర్భజన్ కౌంటర్!
భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లో కూడా ఐపీఎల్‌కు ఫాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఐపీఎల్‌ని వీక్షిస్తుంటారు. అయితే భారత టీ20 లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందని ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో బయటపెట్టాడు. పాక్ ఆటగాళ్లు భారత టీ20 టోర్నీలో ఆడితే చూడాలనుందని అతడు పేర్కొన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)లో విరాట్ కోహ్లీతో పాటు బాబర్ అజామ్ ఆడితే చూడాలని ఉందని పాక్ అభిమాని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అంతేకాదు షాహిన్ అఫ్రిదీ, జస్ప్రీత్ బుమ్రా కలిసి ముంబై ఇండియన్స్‌కు ఆడాలని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీతో మొహ్మద్ రిజ్వాన్ ఉంటే బాగుంటుందని తన కోరికల చిట్టాను వివరించాడు. ఇది భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల కల అంటూ పలు జెర్సీల్లో క్రియేట్ చేసిన ఫొటోలను పంచుకున్నాడు.
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం: ఎలీస్ పెర్రీ
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌కు వెళ్లినందుకు ఆనందంగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అన్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం అని, స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని ప్రశంసించారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా అని పెర్రీ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్ళింది. మ్యాచ్ అనంతరం ఎలీస్ పెర్రీ మాట్లాడుతూ… ‘డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం. అమ్మాయిలు అందరూ ప్రశాంతంగా ఆడారు. ముఖ్యంగా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అదే మేం చేశాము. గత రెండు మ్యాచ్‌లలో నేను బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. మేము ప్రశాంతంగా ఉన్న విధానం అసాధారణమైనది. గత సీజన్ ఓటమి తర్వాత పుంజుకున్న విధానం బాగుంది. మైదానం, వెలుపల ఒకరినొకరం సహకరించుకున్నాం. పెద్ద గేమ్‌లో పరుగులు చాలా ముఖ్యం. మొత్తానికి ఫైనల్ చేరినందుకు సంతోషం. ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.
ఫారిన్ లో సోలోగా ఎంజాయ్ చేస్తున్న ఢీ బ్యూటీ..
దీపికా పిల్లి పేరు అందరికి సుపరిచితమే.. ఒకప్పుడు డ్యాన్స్ షో ఢీ లో ఈ అమ్మడు సందడి చేసింది.. ఆ సీజన్ తర్వాత యాంకర్ గా పలు షోలకు వ్యవహారిస్తుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా సోలోగా ఫారిన్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో వదిలింది… అవి కాస్త వైరల్ అవుతున్నాయి.. టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఢీ లో ఛాన్స్ కొట్టేసింది.. వచ్చిరాగానే హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. తన అందంతో క్యూట్నెస్ తో యూత్ ను ఆకట్టుకుంది.. ఇక తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఢీ తర్వాత యాంకర్ గా రానిస్తుంది.. ఇక సినిమాల్లో కూడా ఛాన్స్ లు ఆమెను వరిస్తున్నాయి.. ఇక తాజాగా ఈ అమ్మడు ఫారిన్ ట్రిప్ కు వెళ్లింది.. అక్కడ అందాలను చూసి మురిసిపోయింది.. ప్రతి లొకేషన్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. నడుము, థైస్ అందాలతో పిచ్చెక్కించింది..సూపర్‌స్టయిలీష్ లుక్‌లో కనిపించింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.. ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
ఘనంగా జరిగిన వెంకటేష్ కూతురి పెళ్లి..ఫోటోలు వైరల్..
తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవల సైందవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. ఇదిలా ఉండగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి నిన్న రామానాయుడు స్టూడియోలో జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడ కు చెందిన ఓ డాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు.. కానీ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేశారు.. హీరోల ఇంట పెళ్లి అంటే హాడావిడి మాములుగా ఉండదు.. కానీ వెంకటేష్ ఎందుకు సింపుల్ గా చేశారో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.. హయవాహిని పెళ్లి మార్చి 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు మాత్రమే హాజరైయారు.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే , వెంకటేష్,నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..