గాయకుడు సాయిచంద్ కన్నుమూత.. రాతి గుండెల్లో కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా..
ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతిచెందారు.. నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు సాయిచంద్.. అయితే, తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి అస్వస్థకు గురైన ఆయనను.. వెంటనే చికిత్స కోసం నాగర్ కర్నూల్‌లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో గాయత్రి ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది.. అయితే, సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, సాయిచంద్ అప్పటికే మృతిచెందినట్టు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.. కాగా, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సాయి చంద్.. ఏ కార్యక్రమం జరిగినా సాయిచంద్ పాట ఉండాల్సిందే.. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తన పాట మాటతో చైతన్యవంతులను చేసిన కళాకారుల్లో ముందు వరుసలో ఉన్నారు.. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పథకాలపై ఎన్నో పాటలను రాశారు.. సీఎం కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించినా.. అక్కడ సాయి చంద్ మాటల తూటాలు పేలాల్సిందే.. ఆయన నోట పాట పాడాల్సిందే అనేలా కీలకంగా మారిపోయారు.. ముఖ్యంగా రాతి గుండెల్లో కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా.. అంటూ తెలంగాణ అమర వీరులపై సాయిచంద్ పాడిన పాట.. ఎన్నో హృదయాలను కదిలిచింది.. సీఎం కేసీఆర్ సైతం ఈ పాటకు కన్నీరు పెట్టుకున్నారు.. అమరవీరుల కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి.. మరోవైపు.. సాయిచంద్‌ను సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌ను చేసి గౌరవించారు. ఆయన కన్నుమూయడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపున్నారు.
సాయి చంద్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న పాలమూరు బిడ్డ సాయిచంద్ అని సీఎం కేసీఆర్ అన్నారు. సాయి చంద్ మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కోసం రూ. 3.70 లక్షల కోట్ల విలువైన పథకాలకు కేంద్రం ఆమోదం
పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఇక్కడ తెలిపారు. మీడియా సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ.. “రైతుల కోసం మొత్తం ₹ 3.70 లక్షల కోట్ల నిధులను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు. ఈ ప్యాకేజీలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల శ్రేయస్సు, ఆర్థిక మెరుగుదలపై దృష్టి సారించే విభిన్న భాగాలు ఉన్నాయి.” అని తెలిపారు. పన్నులు, వేప పూత ఛార్జీలు మినహాయించి రూ. 242/45 కిలోల బ్యాగ్‌ల ధరతో రైతులకు యూరియా నిరంతరం లభ్యమయ్యేలా యూరియా సబ్సిడీ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పైన ఆమోదించిన ప్యాకేజీలో రూ.3,68,676.7 కోట్లు ఉన్నాయన్నారు. మూడేళ్లపాటు (2022-23 నుంచి 2024-25 వరకు) యూరియా సబ్సిడీకి కట్టుబడి ఉన్నామని యూరియా సబ్సిడీ స్కీమ్ ఆమోదాన్ని హైలైట్ చేస్తూ, రైతులకు స్థిరమైన ధరకు యూరియా సరఫరా అయ్యేలా కేంద్రం చూస్తుందన్నారు.
3వారాల్లో 700శాతం పెరిగిన టమాటా ధరలు.. రాకెట్ వేగంతో పెరగడానికి కారణం ఏంటి?
ధనికుడికైనా, పేదవాడికైనా దేశంలోని ప్రతి ఇంటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కచ్చితంగా ఉండాల్సిందే. బంగాళదుంపలు, ఉల్లిపాయలు ప్రస్తుతం ప్రజల వంటగదిలో కనిపిస్తున్నాయి. కానీ వాటి జతగాడైన టమాటా మాత్రం అదృశ్యమయ్యాయి. వాటి ధర అమాంతంగా పెరగడమే కారణం. వాస్తవానికి గత 3 వారాల్లోనే టమాటా ధరలు 700 శాతం వరకు పెరిగాయి. 2020, 2021 సంవత్సరాల్లో పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు టమాటాలను రోడ్లపై పడేయాల్సి వచ్చింది. కానీ అకస్మాత్తుగా ఏమి జరుగుతుంది, కొన్నిసార్లు టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. ఇందుకు గల కారణాన్ని తెలుసుకుందాం. డిమాండ్-సప్లయ్ అనే ఈ గేమ్‌లో దేశంలోని రైతులకు తమ పంటలకు సరైన ధర ఎప్పుడూ లభించదు. ఆ రైతు ఉద్యమ కాలంలో ఉల్లి కథ కూడా గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో ఉల్లిపాయల విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఒక రైతు మండిలో దాదాపు 952 కిలోలు విక్రయించగా, అతనికి ప్రతిఫలంగా కేవలం రూ.2మాత్రమే వచ్చింది. అప్పట్లో టమాటా పరిస్థితి అంతే ఉండేది.. కొనే దిక్కులేక టమాటాలను వీధుల్లో పారేసేవారు. ఈసారి కూడా దేశంలోని రైతు ఈ డిమాండ్-సప్లై గేమ్‌లో చిక్కుకున్నాడు. వినియోగదారుల శాఖ లెక్కలను పరిశీలిస్తే.. ఈ రోజుల్లో దేశంలో టమాటా రిటైల్ ధరలు రూ.46 నుంచి రూ.122కి పెరిగాయి. వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్‌లో ఇచ్చిన ధరల ప్రకారం.. జూన్ 27న గోరఖ్‌పూర్, బళ్లారిలో కిలో టమాటా గరిష్టంగా రూ.122గా నమోదైంది. ఇప్పుడు మూడు వారాల ముందు దీని ధరలు 10 నుండి 15 రూపాయల మధ్య ఉన్నాయి. ఈ విధంగా గత 3 వారాల్లోనే టమాటా ధరలు 700 శాతం పెరిగాయి.
సంపాదనలో 25 శాతం డయాబెటిస్ వైద్యానికే ఖర్చు..
రోజు రోజుకి శారీరక శ్రమ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో రోగాలు పెరిగిపోతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో చక్కెర వ్యాధి ఉన్న వారు ప్రస్తుతం 10 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం బారినడపతున్నారు. ప్రస్తుత జీవన విధానంలో 25 సంవత్సరాల లోపు వారికి కూడా మధుమేహం వస్తోంది. కొన్ని సందర్బాల్లో 15 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా మధుమేహం వస్తోంది. మధుమేహంతో బాధ పడుతున్న వారు వారి సంపాదనలో 25 శాతం డయాబెటిస్ వైద్యానికే ఖర్చు చేస్తున్నారని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సుమారు 25 శాతం ఔషధాల కొనుగోలు, వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో 25 ఏండ్ల లోపువారికి కూడా డయాబెటిస్ వస్తున్నదని అనేక సర్వేల్లో బయటపడుతోంది. పని సామర్థ్యం తగ్గిపోవటమే డయాబెటిక్‌కు ప్రధాన కారణం. దేశంలో డయాబెటిక్ రోగులు పది కోట్లు దాటారు. మూడు నాలుగేండ్లలో వీరికి మరో 13 కోట్ల మంది జత కలుస్తారని ఐసీఎంఆర్ 12 ఏండ్లపాటు నిర్వహించిన పరిశోధనలో తేల్చింది. డయాబెటిక్ రోగులకు తోడు దేశంలో 30 కోట్లకుపైగా బ్లడ్ ప్రెషన్ (బీపీ) రోగులున్నారు. భారతదేశంలో 2022 నాటికి 10.01 కోట్ల డయబెటిస్ రోగులున్నారు. డయాబెటిస్‌పై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. దాంతో ఆ మహమ్మారి బారిన పడిన విషయం కూడా తెలియకుండా చాలామంది జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యాధి ముదిరి కళ్లు, గుండె, మూత్రపిండాలను దెబ్బతిన్న తర్వాతగానీ అసలు కారణం తెలుసుకోలేకపోతున్నారు. దీని మూలంగా వైద్య ఖర్చుల భారం మరింత పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు.
యూఎస్ కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి
సౌదీ అరేబియాలోని జెడ్డాలో యుఎస్ కాన్సులేట్ ముందు బుధవారం జరిగిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు, సాయుధుడు ఇద్దరూ మరణించారు. కాన్సులేట్ భవనం ముందు సాయుధుడైన వ్యక్తి కారులోంచి దిగి కాల్పులు జరిపాడని సౌదీ పోలీసు ప్రతినిధి తెలిపారు. అయితే, భద్రతా బలగాలు అతడిని కాల్చిచంపాయి. కాల్పుల్లో నేపాలీ సెక్యూరిటీ గార్డు మరణించాడు. కాన్సులేట్ భవనం ముందు సాయుధుడైన వ్యక్తి కారులోంచి దిగి కాల్పులు జరిపాడని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో అతడిని కాల్చిచంపారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజధానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర నగరమైన మక్కాకు వార్షిక హజ్ యాత్రలో దాదాపు 1.8 మిలియన్ల మంది ప్రజలు పాల్గొన్నప్పుడు జెడ్డాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అమెరికన్లు ఎవరూ గాయపడలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పులకు సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. “యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నందున సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి” అని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
హైదరాబాద్ నుంచి.. మరో క్రికెటర్ తనయుడు వచ్చేస్తున్నాడు!
భారత క్రికెట్‌లో ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్ల తనయులు ఆటలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్, రోజర్ బిన్నీ తనయుడు స్టువర్ట్ బిన్నీ, వినూ మన్కడ్ పుత్రుడు అశోక్ మన్కడ్, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్.. ఇలా చాలా మంది క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి భారత దిగ్గజ ఆటగాడు, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తనయుడు సర్వజిత్ లక్ష్మణ్ చేరాడు. సర్వజిత్ క్రికెట్ ప్రయాణం ఇప్పటికే మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌ల్లో సర్వజిత్ లక్ష్మణ్ తన తొలి సీజన్ ఆడుతున్నాడు. ఆడటమే కాదు తొలి సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. రెండు రోజుల లీగ్‌లో భాగంగా సికింద్రాబాద్ నవాబ్స్ తరపున అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సర్వజిత్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లో 30 పరుగులు చేసిన సర్వజిత్.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. బుధవారం ఫ్యూచర్ స్టార్ జట్టుతో ముగిసిన మ్యాచ్‌లో సర్వజిత్ లక్ష్మణ్ 104 రన్స్ చేశాడు. 209 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో శతకం సాధించాడు. మైదానం నలు మూలాల షాట్లు ఆడుతూ అలరించాడు.
ఆస్కార్ గెలవడం కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యారు…
దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం దక్కింది. వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న ఆస్కార్స్ 96 సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా 398 మంది కొత్త మెంబర్స్ ని అకాడెమీ, జ్యూరీలోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10,817 మంది మెంబర్స్ అకాడెమి జ్యూరీ లిస్టులో ఉన్నారు. లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398లో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. సౌత్ ఆసియా వాళ్లకి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్ లు జ్యూరీ మెంబర్స్ అవ్వడంతో ఇండియన్ మూవీ లవర్స్ మరియు మెగా-నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇండియా నుంచి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ లతో పాటు మరికొందరికి కూడా జ్యూరీ మెంబర్స్ గా చోటు లభించింది. ప్రస్తుతం ఉన్న 10,817 మందిలో 9375 మంది మాత్రమే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి ఓటు వేయనున్నారు. అయితే ఈ లిస్టులో రాజమౌళి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా అంత దూరం వెళ్లింది అంటే జక్కన ప్లానింగ్, అలాంటిది ఆయన టీం మెంబర్స్ కి జ్యూరీలో చోటు దక్కింది కానీ జక్కన కూడా మాత్రం దక్కలేదు. ఇప్పుడే ఆస్కార్స్ లో తన ప్రయాణం మొదలుపెట్టిన రాజమౌళి, SSMB 29 సినిమాతో తన స్థాయి ఏంటో ప్రపంచానికి మరోసారి తెలియజేయనున్నాడు.