ముసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ మూసీ ప్రవాహం.. సమీప కాలనీల్లో టెన్షన్ టెన్షన్
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ముసారాంబాగ్ వంతెనను తాకుతూ నది ప్రవహిస్తూనే ఉంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. అంబర్ పేటలోని లంకా బస్తీ, కమలానగర్, కృష్ణానగర్, తులసీరాంనగర్, అంబేద్కర్ నగర్ తదితర మూసీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు టెన్షన్‌కు గురవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్‌పేటలోని మహారాణా ప్రతాప్ హాల్‌లో వీరికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్, శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపే కౌంట్‌డౌన్ స్టార్ట్
చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించేదుకు సిద్ధమైంది.. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను కక్షలోకి పంపనుంది ఇస్రో.. రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే రిహార్సల్స్ ముగిశాయి.. రేపు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇక, ఈ ప్రయోగం కోసం ఈ రోజు శ్రీహరికోటకు రానున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.
వరదలో చిక్కుకున్న లంక గ్రామలు.. నీట మునిగిన కాజ్ వేలు, రాకపోకలు బంద్..
గోదావరిలో వరద పోటెత్తడడంతో లంక గ్రామాల్లో కష్టాలు మొదలయ్యాయి.. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతుంది. కొద్దీ గంటలుగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.3 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహం కొనసాగుతోంది.. బ్యారేజీ నుండి 13 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రవాహం రెండో ప్రమాద హెచ్చరికను మించి కొనసాగుతుంది. వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ సిబ్బంది విధుల్లోకి చేరారు. ఇక, కోనసీమలో పొంగిపొర్లుతున్నాయి గోదావరి నదులు.. కోనసీమలోని వైనయతే, వశిష్ఠ, గౌతమి, వృద్ధగౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి.. వరద ఉధృతికి కాజ్ వేలు నీటమునిగిపోవడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.. ఇక, వరదలో పలు లంక గ్రామాలు చిక్కుకున్నాయి.. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక, అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం కాజ్ వే లు పూర్తిగా నీట మునగడంతో పడవలపై ప్రయాణం చేస్తున్నారు స్థానికులు.. అయితే, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. పి గన్నవరం మండలంలో వరద ఉధృతికి కాజ్‌వేలు నీట మునిగాయి.. జి పెదపూడి లంక బూరుగులంక అరికెలవారి పాలెం దగ్గర ప్రమాదమైన కాజ్‌వేలను దాటుతున్నారు ప్రజలు.. పి గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది.. వరద ప్రవాహానికి కాజ్‌వేలు నీటమునగడంతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.. ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు జి పెదపూడి లంక, బూరుగులంక, అరికెల వారి పాలెం గ్రామస్తులు ప్రయాణాలు సాగిస్తున్నారు.. ప్రమాదకరమైన కాజ్‌వేలను విద్యార్థులు దాటాల్సిన పరిస్థితి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే లంక గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు.. అయితే, వ్యవసాయ పనులు నిమిత్తం రాకపోకలు తప్పడం లేదంటున్నారు స్థానికులు.
హైదరాబాద్-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
ఇటు తెలంగాణతో పాటు.. అటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నరాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ఇక, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి.. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి.. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలకే కాదు.. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై నుంచి మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. విజయవాడ – హైదరాబాద్ హైవేపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. కీసర దగ్గర హైవేపై నుంచి మున్నేరు వరదనీరు పారుతుండడంతో.. విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోలకు సాగించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు పోలీసులు.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా వెళ్లేవారు, హైదరాబాద్, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దాడేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంటుంది.. ఇక, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వయా విజయవాడ వెళ్లే వాహనాలు.. విశాఖపట్నం – రాజమండ్రి – ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ-దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి రూట్‌లో హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ – హైదరాబాద్ హైవేపై మున్నేరు వరద మరింత పెరిగింది.. 2008 తర్వాత ఈ ఏడాదే ఈ స్థాయిలో వరద నీరు వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు.. ఇక, నిన్నటితో పోల్చితే ఇవాళ 10 మీటర్లు మేర హైవే పై నీటి ప్రవాహం పెరిగినట్టు చెబుతున్నారు.. రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.. గతంలో మూడు రోజుల పాటు ఇలానే వరద నీరు హైవే పై ప్రవహించినట్టు స్థానికులు చెబుతున్నమాట.. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు..
ఉత్తర కొరియా అధ్యక్షుడితో రష్యా రక్షణ మంత్రి భేటీ.. ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్స్ పరిశీలన
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఇరువురు చర్చించారు. రష్యా రక్షణ మంత్రికి ఐసీబీఎంను కిమ్ చూపించారు. ఉత్తర కొరియా ఆయుధ ప్రదర్శన రష్యా మంత్రికి చూపించింది. తమ వద్ద ఉన్న ఆయుధాలను రష్యా, చైనా రక్షణ దళాల ముందు ప్రదర్శించింది. హాసాంగ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా రక్షణ మంత్రికి కిమ్ చూపించారు. రెండు దేశాలు పలు రక్షణ అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు.
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడేజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. జడ్డూఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. విండీస్‌పై వన్డేల్లో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టగా.. జడేజా 44 వికెట్లు పడగొట్టాడు. 42 మ్యాచ్‌లలో కపిల్ 43 వికెట్స్ తీయగా.. జడేజా 30 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఇక భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును జడేజా సమం చేశాడు. వాల్ష్, జడేజా ఖాతాలో చెరో 44 వికెట్లు ఉన్నాయి. వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కుల్‌దీప్ యాదవ్ (4/6), ఆర్ జడేజా (3/37) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. షై హోప్ (43; 45 బంతుల్లో 4×4, 1×6) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (52; 46 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంటిరీతో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తీసుకుంటే ఆ సమస్యలు దూరం..
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పోషకాల నిధి.. ఇది మట్టి వాసన వస్తుందని ఎక్కువ మంది తినడానికి తీసుకోవడానికి ఆసక్తి చూపించరూ.. అందులో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అయాన్లు, ఫైబర్, సహజ చక్కెరలు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం నిధిగా చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు రోజూ ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ను తీసుకుంటే, దాని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది… ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈరోజుల్లో అధిక మంది బాధపడే వారికి ఇది బెస్ట్ మెడిసిన్..బరువు పెరగడం, పొట్ట, నడుము కొవ్వుతో ఇబ్బంది పడే వారు ఉదయాన్నే బీట్‌రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అతిగా తినడం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తినాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పోషకాల శోషణ పెరుగుతుంది. ఇది ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ని కలిగించదు.శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.. అందుకే ఈ మధ్య దానికి డిమాండ్ పెరిగింది..
ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న హేబా పటేల్..
హాట్ బ్యూటీ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ బ్యూటీ కన్నడ చిత్రం ‘అధ్యక్ష’ సినిమాతో సినీ ఇండస్ట్రీ కీ పరిచయం అయింది.ఈ మూవీలో హేబా ‘ఐశర్య’ అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత ఓ తమిళం సినిమాలో కూడా నటించింది..తెలుగు ఇండస్ట్రీకీ ‘అలా ఇలా’ సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర సరసన అద్భుతంగా నటించి మెప్పించింది.ఆ తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన `కుమారి 21ఎఫ్`లో నటించి తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈ భామ బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమా తరువాత తెలుగులో వరుస చిత్రాల్లోనే అవకాశాలు దక్కించుకుంది.హీరో నిఖిల్ సిద్దార్థ్ సరసన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఈ భామ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ‘ఈడోరకం ఆడో రకం’ అంధగాడు, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలు కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమాలో నటించి మెప్పించింది.కానీ ఆ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి.రామ్ పోతినేని ‘రెడ్’ చిత్రంలో సడెన్ గా ఐటెం సాంగ్ తో అలరించింది. రామ్ తో గ్లామర్ స్టెప్పులేసి ఈ భామ ఎంతగానో అలరించింది.. ఆ తరువాత ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాతో మంచి విజయం అందుకుంది.. అలాగే రీసెంట్ గా ఓటీటీ లో విడుదల అయిన ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సిరీస్ జీ5లొ స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియాలో కూడా హేబా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తోంది. హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.అయితే తాజాగా ట్రెడిషనల్ వేర్ లో కనిపించి మెప్పించింది.. బ్లూ చుడీదార్ లో ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
‘సూపర్ స్టార్’ తుఫాన్ కి సిద్ధమైన చెన్నై…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’ మరో రెండు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. తలైవర్ నుంచి సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో హంగామా ఉంటుంది. రిలీజ్ కి వారం ముందు నుంచే ఫెస్టివల్ వైబ్స్ ఇస్తూ రజినీకాంత్ థియేటర్స్ లోకి వస్తాడు. గవర్నమెంట్స్ కూడా సెలవలు ప్రకటించే రేంజ్ హడావుడితో రజినీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వాడు. అలాంటిది జైలర్ సినిమా మాత్రం చాలా తక్కువ సౌండ్ చేస్తోంది. సందడి లేదు, సంబరాలు లేవు చడీ చప్పుడు లేకుండా ప్రమోషన్స్ జరుపుకుంటూ ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది జైలర్. రజినీ కెరీర్ లోనే ఇంత లో ఫేజ్ ని చూడడం ఇదే మొదటిసారి అనిపించే అంత వీక్ గా ప్రమోషన్స్ సాగుతున్నాయి. అనిరుద్ ఇచ్చిన సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కానీ హైప్ మాత్రం పెరగట్లేదు. ట్రైలర్ బయటకి వస్తే కానీ బజ్ కనపడేలా లేదని కొందరు ట్వీట్స్ చేస్తుంటే… మే హూ నా అంటూ లైన్ లోకి వచ్చేసింది ఆడియో లాంచ్. రజినీకాంత్ స్పీచ్ లకి, ఆయన ఆఫ్ లైన్ ఫొటోస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికే గ్రాండ్ ఆడియో లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు సాయంత్రం జైలర్ ఆడియో లాంచ్ జరగనుంది. ఈ ఈవెంట్ తో జైలర్ సినిమాపై అంచనాలు పెరగడం గ్యారెంటీ. ఆ అంచనాలని ట్రైలర్ రిలీజ్ తో మరింత పెంచితే చాలు రజినీ సినిమా రిలీజ్ హంగామా స్టార్ట్ అయిపోతుంది. ఆ హైప్ కి తగ్గట్లు జైలర్ సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవ్వడం ఖాయం.
ఆ డౌట్ తీసేసారు ‘బ్రో’…
సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది బ్రో మూవీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండడేమో అనే అనుమానం చాలా మందిలో ఉండేది కానీ ఆ అనుమానాలని చెరిపేసాయి బ్రో మోర్నింగ్ షోస్. సినిమా స్టార్ట్ అయిన 10-15 నిమిషాలకే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండడం, ఆయన స్వాగ్ అండ్ స్టైల్ ని సముద్రఖని సూపర్బ్ గా వాడడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్లు అయ్యింది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ అంత స్టైల్ గా కనిపించడం, కామెడీ టైమింగ్ ని పూర్తిగా చూపించడం ఇదే మొదటిసారి అండ్ పవన్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ కి థమన్ ఇచ్చిన థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ అందరినీ శాటిస్ఫై చేసింది. ఓల్డ్ సినిమాల రిఫరెన్స్ కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వింటేజ్ వైబ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే థియేటర్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మంచి జోష్ లో థియేటర్ నుంచి బయటకి వస్తాడు. ఆ రేంజ్ బొమ్మ చూపించారు బ్రో సినిమాతో. పవన్ కళ్యాణ్ మాములుగా కనిపిస్తేనే ఫ్యాన్స్ రచ్చ చేస్తారు అలాంటిది వింటేజ్ వైబ్స్ ఇచ్చే రేంజులో కనిపిస్తున్నాడు అంటే వర్షాలని కూడా లెక్క చేయకుండా థియేటర్స్ కి క్యూ కట్టడం గ్యారెంటీ. మరి పవన్ మేనియాని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ ఇస్తారో చూడాలి.