విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు.. నేడు సీఎం సమక్షంలో ఒప్పందం..
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. 2025 జూన్ లో ఒకటవ తరగతికి IBలో విద్యాబోధన చేపట్టనున్నారు.. ఇక, జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో విద్యాబోధన అందించేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.. క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి ఐబీ సిలబస్ అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇలా 2037 నాటికి 12వ తరగతి వరకు ఐబీ సిలబస్ ప్రారంభించనున్నారు.. అంతేకాకుండా.. విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ అందించనున్నారు.
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..!
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది.. కేబినెట్ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చించి.. టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.. తాజాగా, ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.. మరోవైపు.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో.. 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. ఈ నేథప్యంలో.. బడ్జెట్ సమావేశాల తేదీలను ఏపీ కేబినెట్ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు..
అవసరం అనుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మళ్లీ పిలుస్తా.. స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అవసరం అనుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మరోసారి పిలుస్తాం అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిలిపించాం.. లాంచనంగా కన్‌క్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది.. అందుకే రెండు పార్టీలలో అటు ఇటు వెల్లిన వారిని పిలిపించాం. మేం అడగాల్సింది అడిగాం, వారు చెప్పాల్సింది చెప్పారని తెలిపారు.. కానీ, బయటకు వెళ్లిన తర్వాత విమర్శలు ఏం చేస్తున్నారు..? ఆ విమర్శలకు ఏం తక్కువ లేదు అని మండిపడ్డారు.. ఆ విషయాలపై తిరిగి మేం మాట్లాడితే భరించలేరని వ్యాఖ్యానించారు.. లోపల మాట్లాడింది బయటకు చెప్పకూడదు. అది పెద్ద నేరం.. వారు చెప్పినవన్నీ చేసుకుపోతే అసలు అసెంబ్లీయే మిగలదు అని వ్యాఖ్యానించారు. ఎవరేం అనుకున్నా తమ్మినేని కరెక్ట్ గా చేశారు.. నా పరిది దాటలేదన్నారు స్పీకర్.. అవసరం అనుకుంటే మరోసారి పిలుస్తాం అని స్పష్టం చేశారు. ఇక, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై స్పందిస్తూ.. గంటాకు ఆరోజే చెప్పాను రిజైన్ చేసావు కదా తర్వాత నిర్ణయం తీసుకుంటామని.. దాని అనుగుణంగానే ఆ రాజీనామాకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
నేటితో ముగియనున్న సర్పంచుల పదవికాలం..
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టితో గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. ఇక పాలనను అధికారులకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తమనే పదవిలో కొనసాగించాలని సర్పంచుల సంఘం కోరింది. అయితే పొడిగింపుపై తెలంగాణ సర్కార్ స్పందించలేదు.. గత ప్రభుత్వ హయంలో సకాలంలో నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీలు దీవాల తీశాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు తమ పదవిని పొడిగించాలన్న సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు కోరుతున్నారు. ఇక, రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే, మరికొద్ది గంటలలో సర్పంచులు తమ పదవి కాలం ముగియడంతో చాల మంది అప్పులు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. కొత్త గ్రామ పంచాయతీల నిర్మాణం, శ్మశాన వాటిక, ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలని గత ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది. దీంతో చాలా మంది సర్పంచులు ఈ పనులను పూర్తి చేసి అప్పుల పాలయ్యారు. కానీ బిల్లుల మంజూరులో కేసీఆర్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి తొడు రెండేళ్ళు కరోనా కారణంగా శానిటేషన్ ఇతర పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఆ నిధులు కూడా మంజూరు కాలేదు.. దీంతో సర్పంచులే ఏదో విధంగా నిధులని జమ చేసుకున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచుల సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. అయితే కేటీఆర్‌కి కాంగ్రెస్- బీజేపీ పార్టీల నేతలు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయంలో చేసిన తప్పుల కారణంగానే గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడాయని ఆరోపించారు.
నేటి నుంచి ఏసీబీ కస్టడీకి శివ బాలకృష్ణ
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు. అయితే, శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా 8 రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు చంచలగూడ జైలు నుంచి శివ బాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత? అతని ఆస్తులు ఎంత? అనే దానిపై విచారణ చేయనునన్నారు. ఇక, ఇప్పటికే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, హెచ్ఎండీఏ, ఎంఏయుడీ, రేరాల్లో ఆయన పని చేసిన సమయంలో అనుమతులు ఇచ్చిన ఫైళ్ళపై ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు. శివ బాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచేందుకు ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ నగర శివారులో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయబోతున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయ్యడం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రేపు (గురువారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. అయితే, తొలి రెండు రోజులు ఉభయ సభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ పార్లమెంట్ వ్యవహరాల శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది.
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 50కి పైగా విమానాలకు అంతరాయం!
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు సున్నాకి పడిపోయింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు కూడా తోడవ్వడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 10-11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. మరోవైపు నేడు, రేపు రాజధానిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీరో విజిబిలిటీ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. జీరో విజిబిలిటీ కారణంగా 50కి పైగా విమానాలకు అంతరాయం కలిగింది. దట్టమైన పొగమంచు కారణంగా 50కి పైగా విమానాలు ఆలస్యమైనట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని విమానాలను జైపూర్, అహ్మదాబాద్, ముంబైలకు మళ్లించారు. విమాన సమాచారం కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
తమిళనాడులో దారుణం.. బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త!
గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్తే కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. గర్భంతో ఉన్న మహిళ రోడ్డుమీద పడి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆదివారం (జనవరి 28) చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంబార్‌పట్టికి చెందిన వెళ్లమెయ్యన్ కుమారుడు పాండియన్ (24), కల్‌వెలిపట్టికి చెందిన బాలమురుగన్ కుమార్తె వలర్మతికి (19) ఎనిమిది నెలల కిందట వివాహమైంది. వలర్మతి ప్రస్తుతం 5 నెలల గర్భిణి. దంపతులు ఇద్దరు ఆదివారం దిండిగల్ నుంచి పొన్నమరావతికి వెళ్లేందుకు గోపాల్‌పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న పాండియన్.. గర్భిణి అయిన వలర్మతితో గొడవపడ్డాడు. గొడవ పెద్దదైంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పాండియన్.. కనవాయిపట్టి సమీపంలో కదులుతున్న బస్సులోంచి తన భార్యను తోసేశాడు. రోడ్డుపై పడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది..
మరో క్షిపణిని ప్రయోగించిన నార్త్ కొరియా..
నార్త్ కొరియా నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఉత్తర కొరియా ఈ నెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి.. ఈ నెల 24, 28వ తేదీలలో జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల క్రూజ్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ నెల 14న ఘన ఇంధనంతో నడిచే మధ్యశ్రేణి క్షిపణిని సైతం నార్త్ కొరియా పరీక్షించింది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యల నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల త్రివిధ దళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
ఇండియన్ రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది.. వేల సంఖ్యలో ట్రైన్ డ్రైవర్ అంటే అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలోనూ ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 19వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అర్హతలు, జీతం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు కనీసం ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఏఐసీటీటీ గుర్తింపు ఉన్న ఏదైనా విద్యాంస్థ నుంచి పైన పేర్కొన్న బ్రాంచ్‌లలోనే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.. 18ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. అయితే కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.. ఈ పోస్టులకు దరఖాస్తులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.. జనవరి 20నుంచే ఆన్‌లైన్లో సైట్ ఓపెన్ అయ్యింది. ఫిబ్రవరి 19 వరకూ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు అభ్యర్థులకు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్-సర్మీస్‌మెన్‌తోపాటు మహిళలకు రూ.250.. మిగిలిన వారికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది..
‘కుమారి ఆంటీ’ ఫుడ్ బిజినెస్ క్లోజ్.. కారణం ఏంటో తెలుసా?
‘కుమారి ఆంటీ’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘మీది రూ.1000 అయ్యింది.. రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా’ అనే వీడియోతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కుమారి ఆంటీ పేరు మార్మోగిపోయింది. దాంతో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ బిజినెస్ మరింత ఊపందుకుంది. యువతతో పాటు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నెట్టింట ప్రచారం సాగింది. బిగ్‌బాస్ రాబోయే సీజన్‌లో కుమారి ఆంటీని తీసుకెళ్లాలని కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఫుల్ పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీనే కుమారీ ఆంటీని కష్టాల్లోకి నెట్టింది. కుమారి ఆంటీ వద్ద భోజనం చేసేందుకు జనాలు ఎగబడడంతో.. రద్దీ భారీగా పెరిగిపోయింది. భోజనం చేసేందుకు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా కారు దిగి అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీపై హైదరాబద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో కుమారి ఆంటీ, ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేశారు. దాంతో కుమారీ ఆంటీ ఎమోషనల్ అయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ‘మీడియా ద్వారానే నాకు పేరొచ్చింది. ఇప్పుడు కూడా మీడియానే నాకు సాయం చేయాలి. వాహనాలు పక్కన పెట్టాలని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దని నా కస్టమర్లకు చెబుతున్నాను. ఇక్కడ చాలామంది ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. అయితే పోలీసులు నా స్టాల్‌ను మాత్రమే క్లోజ్ చేయాలని చెబుతున్నారు. నాకు న్యాయం చేయండి’ అని అన్నారు.