దంచికొడుతున్న ఎండలు.. ఏప్రిల్‌ను మరిపిస్తున్న ఫిబ్రవరి..!
ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. సార్వసాధారణంగా.. ఏప్రిల్‌లో నమోదు అయ్యే ఎండలు.. ఫిబ్రవరి రెండో వారంలోనే సుర్రుమనిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ నెల 16వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవవకాశం ఉందని.. ఈ వేసవి మరింత హీట్ పెంచుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీలకు మించకుండా ఉంటాయి.. కానీ, ఈ ఏడాది ఇప్పటికే 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఏపీలో గడిచిన రెండు మూడు రోజులుగా పరిశీలిస్తే.. రాయలసీమ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నాయి.. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో.. ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రమైన ఎండలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటున్నారు.. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.. ఇక, ఎండల తీవ్రతతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తు్న్నారు. మరోవైపు.. వేసవి తాపంతో.. క్రమంగా విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతోంది.
మైనర్ బాలికపై అఘాయిత్యం..! ఇద్దరు వీఆర్వోలపై ఫోక్సో కేసు
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ వీఆర్వోగా పనిచేస్తున్న ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో గా పనిచేస్తున్న పార్ల వెంకటరావులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. విజయనగరానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు అందింది, సదరు బాలికను విచారించగా నిడదవోలుకు చెందిన షేక్ అఖిలాండేశ్వరి, బండారి లలిత, దాడిశెట్టి దుర్గారావు.. ఈ బాలికకు డబ్బులు ఎరగా చూపి వ్యభిచార కూపంలోకి దింపినట్లు తెలిపింది. దీనిలో భాగంగానే ఈ మైనర్ బాలికను పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో పార్ల వెంకటరావు.. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారట.. వారిని డబ్బులు అడగగా ఇవ్వని కారణంగా నిడదవోలు పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబును నిడదవోలు గణపతి సెంటర్ లో దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి కొట్టినట్లు పోలీసులకు తెలిసింది. సదరు మైనర్ బాలికను వ్యభిచారం కూపంలోకి దింపిన ముగ్గురు సభ్యులను, అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు విఆర్వోలపై Cr. No: 52/2024, IPC SEC 366 A, 370 A, 376 D R/W 34, 5 & 6 R/W 17/ ఫోక్సో యాక్ట్, 5/ITP యాక్ట్ కేసులు పోలీసులు నమోదు చేశారు. వీరిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా వీఆర్వో పై దాడి చేసిన దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమందిపై IPC SEC 341, 323, 506 R/W 34 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసును డీఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేపడుతున్నట్టు పోలీసులు అధికారులు చెబుతున్నారు.
నేడు తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్.. బడ్జెట్ వేళ గులాబీ బాస్ ఎంట్రీపై ఉత్కంఠ
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్లో ఉన్నాయి.. ఈ ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక, నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అడుగు పెట్టనున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాల్గొంటారు. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాగా గత రెండు రోజుల నుంచి కేసీఆర్ ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే, నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డిసెంబర్ 8వ తేదీన బాత్రూంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ కాగా, వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.. ఇక, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు. ఇక, రాష్ట్రంలో అధికార పార్టీపై దూకుడు కొనసాగించడానికే కేసీఆర్ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతున్నారని గులాబీ శ్రేణులు ప్రకటించారు.
ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో అంగకంగ వైభవంగా జాతర ప్రారంభమైంది. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు. మేస్రం వంశీయులు ఆలయ గర్బగుడిలో నవధాన్యాలు, పాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయగా.. ఇక, నవదాన్యాలు, పాలకలశం పై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగ శేషుడు ఆశీర్వాదం దొరికిందని ప్రధాన పూజను నాగోబా ఆలయ మేస్రం పూజరులు ఆరంభిస్తారు. ఇక, పుష్యమాస అమవాస్య నాడు అర్ధరాత్రి నాగోబా దేవాలయంలో సంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్దలతో మెస్రం వంశ పూజారులు పూజలు నిర్వహిస్తారు. ఏడు కావిడిలతో నెయ్యి, పుట్ట తేనే, బెల్లం, గానుగ నూనేతో పాటు 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాద్య దైవం నాగోబాకు అభిషేకం చేస్తారు. కాగా, నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లరా చూసి తన్మయత్వం చెందుతారు. అయితే, ఈ ప్రత్యేక పూజలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిపాబాద్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌసం ఆలంలు హాజరు అయ్యారు.
నేటి నుంచి బండి సంజయ్ తొలివిడత ప్రజాహిత యాత్ర.. మేడిపల్లి నుంచి షురూ..
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. సంజయ్ ఇవాల ఉదయం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు కొండ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మేడిపల్లి గ్రామంలో తన మొదటి దశ ‘ప్రజాహిత యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఆయన పాదయాత్ర మొదటి దశ ఫిబ్రవరి 15న ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పొడవునా ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. నేటి నుండి 15 వరకు జరిగే యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివ్రుద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈనెల 20 నుండి మలి విడత యాత్రకు చేపట్టనున్నారు. మరోవైపు యాత్ర సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా యాత్ర చేసేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
పాత ఇళ్లకు ఫుల్ డిమాండ్..! కొత్త వాటితో పోటీగా సేల్స్..!
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు.. ఉద్యోగానికి వెళ్లినా.. ఇంకా ఏదైనా పనిపై వెళ్లినా.. మరేదైనా టూర్‌కు వెళ్లినా.. విహార, విజ్ఞాన యాత్రలు ఇలా ఎటూ తిరిగినా.. చిన్నదో.. పెద్దదో.. రేకులదో.. పూరి గుడిసె.. ఏదైనా సొంత గూటికి చేరితే ఉండే ప్రశాంతతే వేరుగా ఉంటుంది.. అయితే, మొదట ఇల్లు ఉంటే చాలు.. ఆ తర్వాత ఫ్యామిలీ అవసరాల కోసం ఓ పెద్దు ఇల్లు తీసుకుంటే ఎలా ఉంటుంది.. మనం అలాంటి ఇల్లు కొనుగోలు చేస్తే బాగుంటుందిగా.. ఇల్లు ఇలా కట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది కదా? అనే రకరకాలుగా కలలు కనివారు ఉంటారు.. అయితే, విశ్వనగరంగా మారుతోన్న హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. నివాస స్థాయిలు కూడా మారిపోతున్నాయి.. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు.. ఇప్పుడు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇదే సమయంలో.. కాలనీల్లో నివాసం ఉండేవారు గేటెడ్ కమ్యూనిటీల వైపు చూస్తున్నారు.. ఆర్థికంగా తమ వెసులుబాటు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన, అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారట.. కొత్త ఇళ్ల కోసమే వెతకడం కాదు.. తమ అభిరుచికి అనుగుణంగా ఉన్న పాత ఇళ్లను సైతం చూస్తున్నారు.. కొనుగోలు చేస్తున్నారట.. దీంతో.. హైదరాబాద్‌లో పాత ఇళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఉద్యోగం వచ్చినప్పుడో.. వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు.. ఆర్థిక పరిస్థితిని బట్టి మొదట్లో ఎక్కువ మంది సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తీసుకున్నవారు ఉంటారు.. అయితే, తమ పరిస్థితి ఇప్పుడు మరింత మెరుగు పడడంతో మూడు పడక గదుల ఇళ్లను కొనాలని ప్లాన్ చేస్తున్నారట.. ఈ నేపథ్యంలో పాత ఇళ్ల లభ్యత పెరిగింది. మరికొందరు 100 అడుగులు, 50 అడుగుల వెడల్పు రోడ్డులో ఉండే ఇళ్లు, అపార్టుమెంట్ శిథిలావస్థలో ఉన్నా.. వాటిని కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారట.. ఇప్పుడు కాకపోయినా.. ఆ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే లాభదాయకంగా ఉంటుందని.. కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు..
భారత్‌లోనే మిస్ వరల్డ్ పోటీలు!
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘మిస్ వరల్డ్’ పోటీలు భారత్‌లో జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఢిల్లీ మరియు ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్‌లో చివరిసారిగా 1996లో ఈ పోటీలు నిర్వహించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని అశోక్ హోటల్‌లో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ప్రస్తుత మిస్ వరల్డ్ సహా నలుగురు మాజీ విజేతలు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ సుందరి కరోలినా బిలాస్కా (పోలెండ్)తో పాటు మాజీ విజేతలు తోని అన్ సింగ్ (జమైకా), వనెస్సా పోన్సీ డి లియోన్ (మెక్సికో), మానుషీ చిల్లర్ (భారత్), స్టిఫేనీ డెల్ వాలీ (ప్యూర్టో రికో)లు 71వ మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు సీఈఓ జూలియా మోర్లీ మాట్లాడుతూ… ‘భారతదేశం పట్ల నాకున్న ప్రేమ అమితమైంది. 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ను ఇక్కడ నిర్వహించడం నాకు చాలా ప్రత్యేకం. భారత్ ఒక అందమైన దేశం. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న ఢిల్లీలో ‘ది ఓపెనింగ్ సెర్మనీ’, ‘ఇండియా వెల్‌కమ్స్ ది వరల్డ్ గాలా’ కార్యక్రమాలతో మిస్ వరల్డ్ పోటీలు మొదలవనున్నాయి. మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు. 1951లో మిస్ వరల్డ్ పోటీలు ఆరంభం అయ్యాయి.
మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం ముఖ్యం!
మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం చాలా ముఖ్యం అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలన్నాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే నమ్మకం పొందగలమని మహీ చెప్పాడు. భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో కూడా ధోనీ ఓ లెజెండ్. టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2023 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా టీమిండియాను అగ్రస్థానానికి చేర్చాడు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ పలు విషయాలపై స్పందించాడు. ‘విధేయత, గౌరవంకు చాలా సంబంధం ఉంది. మన పట్ల వ్యక్తుల్లో గౌరవం ద్వారానే విధేయత వస్తుంది. డ్రెస్సింగ్ రూంలో సహాయక సిబ్బంది లేదా ఆటగాళ్లు మిమ్మల్ని గౌరవిస్తే తప్ప విధేయతను పొందడం కష్టం. నువ్ ఏమీ మాట్లాడకున్నా.. నీ ప్రవర్తన గౌరవాన్ని సంపాదించుకోగలదు. గౌరవం సంపాదించడం ముఖ్యమని నేను ఎప్పుడూ భావిస్తాను. గౌరవం అనేది హోదాతో రాదు, మన ప్రవర్తనతోనే వస్తుంది. మనం కేవలం మాటలు చెబితే సరిపోదు, ఏదైనా చేతల్లోనే చూపించాలి’ అని ధోనీ చెప్పాడు.
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.8 లక్షలు మీ సొంతం..
పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్టాఫీస్… ఈ పోస్టాఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ స్కీమ్ లు జనాల ఆదరణ పొందాయి.. వీటిలో RT స్కీమ్ కూడా ఒకటి.. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పథకం ను ఎంపికైన చేసుకోవచ్చు.. తాజాగా దానిపై వడ్డీ రేటును పెంచడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్టులో కేవలం 10 నెలల్లోనే రూ.8 లక్షలకు పైగా సొంతం చేసుకోవచ్చు.. ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు 6.5 శాతం నుండి 6.7 శాతానికి 5 సంవత్సరాలకు పెంచింది.. మీరు సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడి 100 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకం యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు, అయితే ఈ వ్యవధి ముగిసేలోపు మీరు ఖాతాను మూసివేయాలనుకుంటే ఆ సౌకర్యం కూడా ఉంది.. ఉదాహరణకు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 5,000, మీరు దాని మెచ్యూరిటీ వ్యవధిలో మొత్తం రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తారు.. ఐదు సంవత్సరాలు వడ్డీ రేటు 6.7 శాతం..రూ.56,830 అదనంగా రూ. అంటే ఐదేళ్లలో మీ మొత్తం ఫండ్ రూ.3,56,830 అవుతుంది. ఇలా పదేళ్లు కూడా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు..10 సంవత్సరాలలో మీ మొత్తం డిపాజిట్ చేసిన నిధులు రూ.8,54,272 అవుతుంది. పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించబడతాయి.. ఇంకా ఆదాయంతో పాటుగా అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
పేటీఎం యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఆర్బీఐ స్పెషల్ ప్లాన్
ఫిబ్రవరి 29 నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కంపెనీకి కష్టాలు పెరిగాయి. దీని నుంచి బయటపడి తన కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. సమస్యాత్మక Paytm నుండి వ్యాపారులు, వినియోగదారులను సురక్షితంగా ఖాళీ చేయగలిగేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే వారం దేశంలోని హైవే అథారిటీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI)తో సమావేశం నిర్వహిస్తుందని ఒక నివేదిక పేర్కొంది. ఫాస్టాగ్ సేవను నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అలాగే ఇతర వాటాదారుల మధ్య యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అవస్థాపనను పర్యవేక్షించే NPCI ఈ సమాచారాన్ని అందించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఖాతాల కోసం వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) అలాగే PPBLకి లింక్ చేయబడిన మర్చంట్ క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌లను బ్యాంకింగ్ భాగస్వాములు ఇతర ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉంటుందని Paytm గత వారం తెలిపింది. ఇది కాకుండా, PPBL ద్వారా జారీ చేయబడిన ఫాస్టాగ్, వాలెట్‌లను కూడా ఇతర బ్యాంకులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. మార్చి 11, 2022 నుండి Paytm పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్‌లను జోడించకుండా నిషేధించబడింది.
స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న రకుల్.. మైండ్ బ్లాక్ స్టిల్స్..
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి… స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాయి.. ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫెమస్ అయ్యింది.. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.. తాజాగా రకుల్ డేరింగ్ ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు ‘మెట్రో పాలిటన్’ మ్యాగజైన్ కవర్ ఫొటోకు ఫొటోషూట్ చేసింది. ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది.. న్యూ హెయిర్ స్టైల్ తో చూపరులను ఆకర్షస్తుంది.. అవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం ‘ఆయాలాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనే టాక్ ను అందుకుంది.. నెక్ట్స్ ‘ఇండియన్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. ఇకపోతే తన ప్రియుడితో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది..