నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ రోజు మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సమీక్షించనున్న ఆయన.. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు.. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఆరా తీయనున్న ఏపీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేయనున్నారు.. అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్, అరకు కాఫీ చైన్ షాప్స్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. ఈ సమావేశంలో ఆ దిశగా చర్చలు జరపనున్నారు. ఇక, మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేతపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఎస్సీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేయనున్నారు.. ఎస్సీ వర్గాలకు అందచేయాల్సిన అంశంపై కసరత్తు జరగనుంది.. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు అంశంపై కీలక ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉంది..
జనసేన ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి.. తీవ్రంగా ఖండిచిన పవన్ కల్యాణ్..
జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది.. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో బాలరాజు కారు అద్దం ధ్వంసమైంది.. ఈ అయితే, ఈఘటనను తీవ్రంగా కండించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు.. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అయితే, ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ ప్రతాప్ కిషోర్.. అది ఆకతాయిల పనిగా తేల్చారు.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాయి విసిరిన ఘటనతో హుటాహుటిన పోలవరం డీఎస్పీ సురేష్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారని.. మరోవైపు.. ఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ప్రాథమిక విచారణ చేశారని ఎస్పీ వెల్లడించారు.. ఇక, ఎస్పీ ఆదేశాలతో పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి, పోలవరం సీఐ క్రాంతికుమార్ అప్రమత్తం అయ్యారు. తక్షణమే పోలీసు రంగ ప్రవేశం చేశారు. ఆపై విచారణ ప్రారంభించారు.. దాడి జరిగింది అనుకునే ప్రాంతానికి జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ వెళ్లారు. అక్కడి పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు అయితే ఏమీ లేనట్టుగా సమాచారం. అయినా, సరే పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు. అయితే, కారు పై రాయి పడడంతో వెనకగా ఉన్న అద్దాలు పగిలిపోయాయి.. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉన్నాయి. దీంతో.. ఇది ఆకతాయిల పనే అయిఉండొచ్చు అంటున్నారు.. అయితే, ఏదేమైనా పోలీసు విచారణ అయితే పూర్తి స్థాయిలో చేసేందుకు ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు పోలీసులు.
కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల ఛేజ్..
కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది.. బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేశారు దుండగులు.. ఎమ్మిగనూరు రహదారిలో వున్న వెంకటేష్ దుకాణాలు బాడిగకు కావాలంటూ కారులో తీసుకెళ్లారు.. అయితే, వెంకటేష్ అక్కడ దుకాణం చూయిస్తుండగా దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తు్నారు.. అయితే, గూడూరులో కలకలం రేపిన నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.. కిడ్నాప్ కు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసుల.. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీ అయ్యారని చెబుతున్నారు.. సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు పోలీసులు.. అనుమానాస్పదంగా వెళ్లున్న కారును పోలీసులు వెంబడించారు.. పోలీసులను చూసి వాహనం స్పీడ్‌ను మరింత పెంచారు కిడ్నాపర్లు.. దీంతో ఆ కారును పోలీసులు తమ వాహనంలో వెంబడించారు.. చనుగొండ్ల ఎల్ఎల్సి కాలువపై కిడ్నాపర్ల వాహనాన్ని పోలీసుల వాహనం ఢీకొట్టింది.. ఈ ఘటనలో టైర్ బరస్ట్ కావడంతో వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు ఇద్దరు కిడ్నాపర్లు.. కారులో ఉన్న ఓ కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించారు.
కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నిన్న ఉదయం సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి అబడ్జెట్ పై చర్చించారు. 19 శాఖల పద్దుల పై చర్చ కొనసాగింది. కాగా.. సాయంత్రం 4.40 నుండి 5. 50 వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది. అయితే నిన్న సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు కొనసాగడంతో రికార్డ్ క్రియేట్ అయ్యింది. నిన్న శాసనసభ సుమారు 17 గంటలకు పైగా సాగింది. దీంతో కేసీఆర్ రికార్డును తెలంగాణ సీఎం రేవంత్ బ్రేక్ చేశారు. అయితే అప్పట్లో అధికారంలో వున్న బీఆర్‌ఎస్ సర్కార్ గతంలో అర్థరాత్రి వరకు సభ కొనసాగింది. దాంతో అప్పట్లో అది రికార్డ్ బ్రేక్ సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ సర్కార్ బ్రేక్ చేసింది. సోమవారం ఉదయం ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్ తరువాత మంగళవారం తెల్లవారు జామున 3.15 వరకు కొనసాగించారు. దీంతో కేసీఆర్ సర్కార్ రికార్డ్ ను సీఎం రేవంత్ సర్కార్ బ్రేక్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోనే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు.
నేడు అసెంబ్లీలో 9 శాఖల పద్దులపై చర్చ..
నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. నిన్నటి సమావేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, అధికార పార్టీ మధ్య మాటల యుద్దం జరిగింది. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. నిన్న 17 గంటలకు పైగా శాసనసభ సాగింది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు మండలిలో సమస్యలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో తొమ్మిది శాఖల సమస్యలపై చర్చించనున్నారు. మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.
నేడు రెండో విడత రైతు రుణమాఫీ.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ..
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రుణమాఫీ పై అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభా ప్రాంగణంలోనే కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. లక్షన్నర లోపు బకాయి ఉన్న దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా లక్షన్నర కేటగిరీ రైతుల రుణాలను మాఫీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన నిధుల సమీకరణ చేపట్టారు. ఈ నెల 15న జీవో నెంబర్ 567 జారీ కాకముందే రూ.10 వేల కోట్లు సర్దుబాటు చేసి.. మొదటి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ.6,099 కోట్లు విడుదల చేశారు. మిగిలిన నిధులతో పాటు ఈ నెల 23న రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఫలితంగా రూ. 7 వేల కోట్లు ఖజానాకు గండి పడింది. ఈ నిధులు రెండో విడతకే సరిపోవన్న ఉద్దేశంతో మంగళవారం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డేటా ప్రాసెసింగ్ సమాచారం ప్రకారం… లక్ష నుంచి లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతులు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.6,500 కోట్లు సరిపోతాయని అంచనా. 6,500 కోట్లకు సంబంధించిన బిల్లులు సోమవారం సాయంత్రం ట్రెజరీకి చేరాయి. వ్యవసాయ శాఖ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. రైతుల వివరాలు, వారి ఖాతాలు, జమ చేసిన నిధులను ట్రెజరీకి అందజేశారు. మరోవైపు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రుణమాఫీ లబ్ధిదారులు, రైతులు, పార్టీ కార్యకర్తలతో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాల ఉదయం రెండో విడతలో అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ ప్రకటించనుంది.
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన మూడు కోచ్‌లు
జార్ఖండ్ రాష్ట్రం చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైలులోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం. సంఘటనను ధృవీకరిస్తూ.. చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ..ప్రమాదం గురించి సమాచారం అందుకున్న చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ అధికారులు, వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరారు. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా.. రైలు నంబర్ 12810 పట్టాలు తప్పిన ప్రమాదంలో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 0651-27-87115 ను కూడా జారీ చేసింది. కాగా.. సోమవారం బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా దాని కప్లింగ్ లింక్ తెగిపోయింది. కొద్దిసేపటికే రైలులోని రెండు కోచ్‌లు విడిపోయాయి. రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే, రైలు కోచ్‌లు విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సోమవారం దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క్ క్రాంతి రైలు ఖుదీరామ్ బోస్, పూసా సమస్తిపూర్‌లోని కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్, ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్ మధ్య రెండు భాగాలుగా విడిపోయింది. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు.
భారత జెర్సీలో చివరి మ్యాచ్ ఆడేశా: రోహన్ బోపన్న
భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడినట్టు చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో శ్రీరామ్ బాలాజీతో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన బోపన్న.. తొలి రౌండ్ కూడా దాటలేకపోయారు. భారత్ జోడీ తమ ఆరంభ మ్యాచ్‌లో 7-5, 6-2తో మోన్‌ఫిల్స్-రోజర్ వాజెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం 44 ఏళ్ల బోపన్న మాట్లాడుతూ.. దేశం తరఫున ఇదే తన చివరి మ్యాచ్ అని తెలిపారు. ‘భారతదేశం తరఫున ఇదే నా చివరి మ్యాచ్. నేను ఏ స్థితిలో ఉన్నానో ఈరోజు అర్థమైంది. ఇకపై కుదిరినంత కాలం టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదిస్తా. రెండు దశాబ్దాల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు. 2002తో మొదలుపెట్టి ఇప్పటివరకు భారత్‌కు ఆడినందుకు ఎంతో గర్విస్తా’ అని రోహన్ బోపన్న చెప్పారు. దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించినా ప్రొఫెషనల్ గ్రాండ్‌స్లామ్, ఏటీపీ టోర్నీలలో మాత్రం కొనసాగనున్నారు. 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ సింగిల్స్ కాంస్య పతకాన్ని సాధించారు. అప్పటి నుంచి భారత టెన్నిస్‌లో మరో పతకం లేదు. 2016లో మిక్స్‌డ్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జోడీ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం మిస్ అయ్యారు. డేవిస్ కప్ 2010లో రికార్డో మెల్లోపై విజయం సాధించడం తన కెరీర్‌లో టాప్ మూమెంట్‌గా బోపన్న ఎంచుకున్నారు.
మరో పతకం వేటలో మను భాకర్..భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ ఒకే పతకం తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్‌లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఇప్పుడు నాలుగో రోజు మను భాకర్ నుంచి మరోసారి కాంస్య పతకం ఆశిస్తున్నారు. ఆమె ఈరోజు (జూలై 30)10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను భాకర్ పోటీపడనుంది. ఆమె భాగస్వామి సరబ్‌జోత్ సింగ్. దీంతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పెయిర్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా నేడు బరిలోకి దిగనున్నారు. నాలుగో రోజు భారత్ పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం.. బ్యాడ్మింటన్‌లో సోమవారం జరగాల్సిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి గ్రూప్-స్టేజ్ మ్యాచ్ రద్దయింది. ప్రపంచ నంబర్-3 సాత్విక్-చిరాగ్ తమ రెండో గ్రూప్ గేమ్‌లో జర్మనీకి చెందిన మార్క్ లామ్స్‌ఫస్, మార్విన్ సీడెల్‌లను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ లామ్స్‌ఫస్ మోకాలికి గాయం కావడంతో సీడెల్ ఉపసంహరించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చిరాగ్-సాత్విక్ జోడీ అడ్వాంటేజ్‌గా నిలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
మంచు విష్ణు కీలక నిర్ణయం.. ప్రశంసించిన మీనా!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మా రద్దు చేసింది. మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ హీరోయిన్ మీనా ప్రశంసలు కురిపించారు. మంచు విష్ణు చాలా మంచి పనిచేశారని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘అసత్య వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతోన్న అంకితభావం అభినందనీయం. ఈ విషయంలో ఎందరో నటీనటులు ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెగెటివ్ కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలి. మీ మద్దతు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మంచు విష్ణు చాలా మంచి పని చేశారు’ అని మీనా పేర్కొన్నారు. మీనా వ్యక్తిగత విషయాలపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టానుసారంగా రాసుకొచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, వారి కుటుంబాలను టార్గెట్ చేసి.. విమర్శలు, అసత్య వార్తలను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పోస్ట్ చేశాయి. అలా చేసిన ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను మా ముందుగా రద్దు చేసింది. తాజాగా మరో 18 ఛానళ్లను రద్దు చేసింది. ట్రోలింగ్ వీడియోలను 48 గంటల్లోగా డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మా హెచ్చరించింది.
రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?
రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్‌లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన విడుడల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించారు నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాల మధ్య పోటీగా విడుదల కానుంది మిస్టర్ బచ్చన్. కాగా ఈ చిత్రంలో ఓ యంగ్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అతడెవరో కాదు DJ టిల్లు, టిల్లు -2 వంటి సూపర్ హిట్లు కొట్టిన సిద్దు జొన్నలగడ్డ. ప్రస్తుతం రవితేజ, సిద్దు జొన్నలగడ్డ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ, సిద్దు మధ్య వచ్చే సన్నివేశాలు మిస్టర్ బచ్చన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ టాక్. ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు హారిష్ శంకర్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ‘తెలుసు కదా’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ శ్రీమతి నీరజ కోన ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టనున్నారు. మాస్ మహారాజ, టిల్లు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.