మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ
మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశానని, క్రైస్తవ సోదరులకు బీఆర్‌ఎస్ పార్టీకి పేగు సంబంధం ఉందన్నారు కవిత. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని, మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు మెదక్‌కి వచ్చాయని, అమ్మగారి ఊరు కాబట్టి మెదక్ కి రావాలని ఉంటుందన్నారు కవిత. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గోదావరి జలాలతో సింగూరు నింపి మెదక్ జిల్లాకి నీళ్లు తెచ్చారని, కాళేశ్వరం పనులు మెదక్ జిల్లాలో సగంలోనే నిలిచిపోయాయన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్యాకేజీ 19 కింద జిల్లాలో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కేసీఆర్ పై కోపంతో పనులు ఆపేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. ప్రభుత్వాలు మారినా పనులు ఆపడం సరైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కాలువ పనులను అపొద్దని మేము కోరుతున్నామని, సీఎం జిల్లాకి వస్తున్నారంటే ఆడబిడ్డగా మాకేమైన వరాలు ఇస్తాడేమో అనుకున్నామన్నారు. నెలకు 2500, తులం బంగారం ఇస్తాడేమో అని మహిళలు అనుకున్నారు..కానీ ఏమీ లేదని ఆమె అన్నారు. పింఛన్ 4 వేలు ఇస్తామన్నారు.. ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారు.. మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ అని కవిత ఆరోపించారు. కేసీఆర్ కిట్లు అడబిడ్డలకు ఇస్తలేరని ఆమె మండిపడ్డారు.
విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. మిగతా వారంతా సేఫ్!
కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 42 మంది మృతి చెందినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా వారంతా క్షేమంగానే ఉన్నట్లు పేర్కొంది. ప్రమాద సమయంలో విమానం రెండు ముక్కలైపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిపోగానే భారీగా మంటలు ఎగిసిపడి రెండు భాగాలుగా విడిపోయింది. ఓ భాగం నుంచి ప్రయాణికులు బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. ఇంకో భాగంలో మాత్రం మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపు చేశారు.
అలవికాని హామీలు అమలు చేయలేక డ్రామాలు.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలవి కానీ హామీలు అమలు చేయలేక డ్రామాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఎజెండా సృష్టించి ఫేక్ ప్రచారాలు చేస్తు ప్రజల తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలు కడిగితే పోవని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. కొత్త వేషం వేసుకొని కమ్యూనిస్టు అవతారం ఎత్తారన్నారు. పాకిస్తాన్, చైనా భూ ఆక్రమణ ఇప్పుడు జరగలేదన్నారు. ప్రధాని కోసం మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టింది నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలు దురదృష్ట కరం అన్నారు.
పులివెందులలో క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న వైఎస్ జగన్
కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడులు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, భారతి దంపతులతో పాటు వైఎస్ విజయమ్మ.. వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఉదయం 8.45 గంటల నుండి 11 గంటల వరకు తల్లి వైయస్ విజయలక్ష్మి, సతీమణి భారతి, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు..
అప్పుడు పీసీసీగా.. ఇప్పుడు సీఎంగా.. మెదక్ చర్చిలో రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా ముందుగా ఏడుపాయల అమ్మావారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ కేథడ్రల్ చర్చికి చేరుకున్నారు. చర్చికి చేరుకున్న అనంతరం పాస్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ చర్చి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గతేడాది పీసీసీ హోదాలో వచ్చి సీఎంగా వస్తానని మొక్కుకున్నా అన్నారు. ఈ ఏడాది సీఎం హోదాలోనే మెదక్ చర్చికి వచ్చానని అన్నారు. మెదక్ చర్చి వందేళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు..
అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ శత జయంతి కార్యక్రమంలో భాగంగా.. అయన చిత్రపటానికి పూలమాలవేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపి లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నికేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, బండి సంజయ్, లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారన్నారు.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్.. నిమిషాల్లోనే కోటా పూర్తి..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తు ఉంటారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి పది రోజులపాటు మాత్రమే భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి హిందూ భక్తుడు పరితపిస్తూ ఉంటారు. దీనితో వైకుంఠ ద్వార దర్శనానికి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉంది. ఈ ఏడాది కూడా టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది టీటీడీ. గత ఏడాది తరహలోనే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాటు చేస్తుంది టీటీడీ.. ఆన్‌లైన్ సంబంధించిన టికెట్లను 23 ,24వ తేదీలలో విడుదల చేయగా ఆఫ్‌లైన్‌కు సంబంధించిన టికెట్లను జనవరి ఎనిమిదో తేదీ రాత్రి నుంచి విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40 వేల టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ కి 14 లక్షల హిట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. స్వామివారి దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్. కోటా ముగిసిన భక్తులు టిక్కెట్లు కోసం ప్రయత్నిస్తూనే వున్నారు.
శ్రీతేజ కుటుంబానికి రెండు కోట్లు ఆర్ధిక సాయం
సంధ్య థియేటర్ తొక్కిసలాట లో గాయపడిన శ్రీ తేజ నీ కిమ్స్ ఆసుపత్రిలో అల్లు అరవింద్, దిల్ రాజ పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ” వైద్యులను శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై అడిగాము, వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అని అన్నారు. విపత్తు అనంతరం ఆ అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని అనుకున్నాం. అందులో భాగంగా శ్రీతేజ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు.. మైత్రీ నిర్మాతలు రూ.50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ ప్రతినిధిగా దిల్ రాజుకి ఇస్తున్నాం’ ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన మేము అండగా ఉంటాం’ అని అన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల హరీష్ రావు ఫైర్
రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామిని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. ‘సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారూ… టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి.’ అని హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. కండువా వేసుకోవడమే కాదు.. బాధ్యతలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.