NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చంద్రయాన్ – 3 ఎఫెక్ట్.. 145 నిమిషాల్లో రూ.1166 కోట్లు ఆర్జించిన ప్రభుత్వ సంస్థ

చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 22న చంద్రుడు 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ వెలుగు చూడవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ వార్తల రాకతో చంద్రయాన్ 3 మిషన్‌ను విజయవంతం చేసిన ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రిక్ షేర్లు పెరగడం ప్రారంభించాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఈ స్టాక్ దాదాపు 2 శాతం పెరిగింది. వాస్తవానికి చంద్రునిపై సూర్యకాంతి 14 రోజుల పాటు వస్తుంది. ఆపై 14 రోజులు చీకటిగా మారుతుంది. మిషన్ సూర్య కాంతితో నడుస్తోంది. అందువల్ల ఇది 14 రోజుల పాటు స్లీప్ మోడ్‌లోకి వెళ్లింది. ఇప్పుడు మరోసారి యాక్టివ్ మోడ్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. శివశక్తి పాయింట్ వద్ద సూర్యోదయం మళ్లీ రానుంది.

ఆ గ్యారెంటీ కార్డులను నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుంది!

సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ కార్డులను కనుక నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలనలోనే తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ కోటాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారన్నారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల అనంతరం సభలో పాల్గొన్నమంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు.

‘తెలంగాణలో ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాధాయపడుతున్నారు. గడచిన 50 ఏళ్లలో 10, 11 అవకాశాలు ఇచ్చినా ఏం చేశారు?.. దేశాన్ని సంకనాకిచ్చారు. కాంగ్రెస్ పరిపాలనలో నేతన్నలు ఉరికంబాల పాలయ్యారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలనలోనే తీవ్ర అన్యాయం జరిగింది. ఆ కోటాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ కార్డులను నమ్మితే.. ముందుకెళ్లిన తెలంగాణ మళ్లీ వెనక్కి వస్తుంది’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

నేను ఎవరికీ శత్రువును కాదు.. ఎవరన్న ఊహించుకుంటే ఏమీ చేయలేను

ఏ రాజకీయ నాయకుడైనా హమీలు ఇచ్చాడంటే అమలు చేయాలి.. మోడీ పట్టు బడితే చేస్తాడు అనే దానికి నిదర్శనం మహిళ రిజర్వేషన్ బిల్లు అని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. వాటిని ఎందుకు అమలు చేయలేదు మనసు లేకనా అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం కాదు అమలు చేయడం ముఖ్యమన్నారు. ఎన్నికల ముందు 10 లక్షల డబల్ బెడ్ రూం లు ఇస్తానన్నాడు కేసీఆర్. వాటి జాడే లేదు. ఉద్యోగం లేని వారికి 3016రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించాడు.

ఓట్ల అప్పుడు ఉండే ప్రకటనలు చేతల్లో ఎందుకు లేదో అడగాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పాడు. రైతులకు చేస్తానన్న రుణ మాఫీ చేయకపోవడంతో రైతులు గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు లేక నే ఇవ్వన్నీ ఇవలేక పోతున్నారని ఈటల అన్నారు. అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ కూడా హామీలు ఇస్తుంది… కాంగ్రెస్ నేతలే రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారు. మరి మీరిచ్చే హామీలు డబ్బులు లేకున్నా అమలవుతాయా అని ప్రశ్నించారు. ప్రతి మహిళకు రూ.2,500, అర్హులకు నాలుగు వేల పింఛన్, ఒకే సారి రైతు రుణమాఫీ ఎలా చేస్తారో అర్థం కావడం లేదన్నారు. ఒకే సారి రుణమాఫీ చేయడం బ్రహ్మ దేవుడికి కూడా సాధ్యం కాదన్నారు.

‘వాట్సాప్ ఛానల్’ని స్టార్ట్ చేసిన హీరోలు వీళ్లే…

నిద్ర లేచింది మొదలు… మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులోనూ వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ గ్రూపులు, సరదా కబుర్లు, అకేషన్ అప్డేట్స్, స్టాటస్ అప్డేట్స్.. ఎవరేం చేస్తున్నారు? ఇలా ఒక్కటేమిటి ప్రతి సమాచారాన్ని తెలిపే ఏకైక ఆప్షన్ వాట్సాప్. ఇది లేని మొబైల్‌ ఉండనే ఉండదు. అందుకే వాట్సాప్‌లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎవ్వరైన సరే ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు.

అక్కడ బుర్ఖా వేసుకుంటే ఇకపై ఫైన్

బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇకపై నేరంగా పరిగణింపబడుతుంది. అయితే అది మన దేశంలో కాదు.. స్విట్జర్లాండ్ లో. బుధవారం ఉదయం స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బురఖాలతో సహా ముఖ కవచాలపై నిషేధాన్ని విధించింది. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్-వింగ్ పాపులిస్ట్ స్విస్ పీపుల్స్ పార్టీ సమర్థించింది.  కొంత మంది దీనిని వ్యతిరేకించినప్పటికి అనుకూలంగా 151-29 ఓట్లతో దీనికి గణనీయమైన మద్దతు లభించింది.

మీసం తిప్పి, తొడగొట్టిన బాలయ్య.. ఫ్లూటు జింక ముందు ఊదు అంటూ రోజా కౌంటర్

ఏపీ అసెంబ్లీ వేదికగా మీసాలు మెలేయడాలు.. తొడగొట్టే ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఓవైపు నందమూరి బాలకృష్ణ రెచ్చగొట్టాడని వైసీపీ ఆరోపిస్తుంటే.. మరోవైపు.. మంత్రి అంబటి రాంబాబే నన్ను రెచ్చగొట్టాడు.. దానికి ప్రతిగా నేను స్పందించా.. నా వృత్తిని అవమానించే విధంగా వ్యవహరించారని బాలయ్య మండిపడుతున్నారు.. అయితే, బాలయ్య వ్యవహారంపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్‌ విసిరేసి, బాటిల్స్‌ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందని దుయ్యబట్టారు..

కెనడాకు భారత్ షాక్.. ఆ దేశ పౌరులకు వీసాలు నిలిపివేత..

ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియా కారణం అంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. అయితే ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత ఆరోపణలుగా ఖండించింది. ఇదిలా ఉంటే కెనడాకు భారత్ షాక్ ఇచ్చింది. కెనడా పౌరులకు భారతీయ వీసాలను సస్పెండ్ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాల ప్రక్రియను నిలిపేసింది. ఆపరేషనల్ కారణాల వల్ల వీసాలను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలో షోప్ టాప్ తప్పితే.. ఇండ్లు కూడా ఇవ్వడంలేదు

డబుల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల రెండో విడుత పంపిణీ జరిగిందని, కేటీఆర్.. ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మీరు తెలంగాణలో ఎంతమందికి ఇండ్లు ఇస్తున్నారని ప్రశ్నించిన రాజాసింగ్‌.. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా అన్నారు. ఒకసారి తెలుసుకోండని, 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందన్నారు. కానీ లక్ష ఇండ్లు కూడా కట్టలేదని ఆయన హెద్దేవ చేశారు. తెలంగాణ ప్రజలు ఇండ్లు కావాలని అంటున్నారని, మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూం ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం అని, మీరు మంచి చేస్తే ప్రజలు మీకే ధన్యవాదాలు చెబుతారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. 25 లక్షల మందకి పైగా ప్రజలు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారని, అందులో ఎంతమందికి కేసీఆర్ సర్కార్ ఇండ్లు ఇస్తుందో చెప్పాలన్నారు రాజాసింగ్‌.

నా మరణం మిమ్మల్ని బాధపెడుతోంది అని తెలుసు.. మీరా ఆంటోనీ సూసైడ్ లెటర్ స్వాధీనం..?

కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్, స్ట్రెస్ తో బాధపడుతూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోలీవుడ్ ను మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని విషాదంలోకి నెట్టేసింది. మీరా.. ఇలాంటి పని చేయడం చాలా బాధాకరమని ప్రముఖులు సైతం బాధపడుతున్నారు. ఇక మీరా సూసైడ్ పై పోలీసులు అనుమానాస్పద కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. అసలు ఆమె చావుకు గల కారణాలు ఏంటి అనే కోణంలో విచారిస్తున్నారు. మీరా ఫ్రెండ్స్, టీచర్స్, కుటుంబ సభ్యులను ఆరాలు తీస్తున్నారు. టీచర్స్ .. మీరా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె బరువు ఉన్నాననే ఆత్మన్యూన్యతాభావంతో బాధపడుతున్నట్లు తెలిపారు