ఇరాన్‌లో భారీ స్థాయిలో సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యంగా..
పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, అణుస్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీని వల్ల సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్‌స్పేస్ విభాగంలో పని చేసిన మాజీ సెక్రటరీ ఇరాన్ మీడియాకు తెలిపారు. మా అణు స్థావరాలు సైబర్ దాడులకు గురయ్యాయని వెల్లడించారు. అలాగే, ఇంధనం సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్కులపై సైబర్ దాడులు చేసినట్లు చెప్పుకొచ్చారు.
అలసత్వం వద్దు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముంది..
దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు (శనివారం) విజయ దశమిని పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో గల సుక్నా కాంట్‌ను ఆయన సందర్శించారు. ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ చేసిన తర్వాత వారినుద్దేశించి ప్రసంగం చేశారు. సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా విధులు నిర్వర్తిస్తుందన్నారు. దేశ భద్రత విషయంలో మనం దృఢంగా నిలబడాలని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
మాది పవిత్రబంధం.. అదంతా రాజకీయ కుట్రే..!
మాది అపవిత్రబంధం కాదు.. పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తాజాగా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట.. అక్కడ ఫొటోలు, వీడియోలకు పోజులు ఇవ్వడం చర్చగా మారింది.. అదే వివాదాలు తెచ్చిపెట్టింది.. దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమెపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రత్యేకంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని ప్రశ్నించింది.. కానీ, కొండమీద రీల్స్ చేయలేదు. ఒక్కఫొటో అయినా ఉందా..? నేను ఫొటోగ్రాపర్స్ ని తీసుకువెళ్లలేదన్నారు మాధురి.. వద్దని చెబుతున్నా.. కొందరు నా వెంటపడి వీడియోలు, ఫొటోలు తీశారన్నారు.. అయితే, మాది అపవిత్ర బంధం కాదు.. పవిత్రబంధంగా చెప్పుకొచ్చారు..
తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం ఇప్పిస్తాం..
తల తాకట్టు పెట్టి అయినా పంట భీమా పధకం ఇప్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 1986 లో ఎన్టీఆర్ పెదవేగి లో మొక్క నాటారు. 1990 తర్వాత తెలంగాణ లో వేశామన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతులు వచ్చాయన్నారు. టన్ను ఇరవై వేలు ధర ఉండేలా దృష్టి పెడతామన్నారు.
ప్రీ వెడ్డింగ్ షూట్‌పై దువ్వాడ హాట్ కామెంట్స్.. నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు..!
తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కథాలు వచ్చాయి.. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడమే కాదు.. రీల్స్ చేశారంటూ దివ్వెల మాధురిపై కేసు కూడా నమోదు చేశారు.. అయితే, ప్రీవెడ్డింగ్ షూట్ విషయంలో హాట్ కామెంట్లు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసిఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారు. తిరుమల కొండపై ఎలాంటి తప్పు , అపచారం చేయలేదని స్పష్టం చేశారు.. నాలుగు రోజులు తరువాత మాపై కేసులు పెట్టారు. వ్యక్తిగత అంశాలను పార్టీ పట్టించుకోదు. పార్టీకి నేనే చెప్పాను.. వైసీపీ నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదన్నారు.. పార్టీకి వ్యక్తి గత అంశాలను ముడిపెట్టవదన్నారు దువ్వాడ..
బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల కాంగ్రెస్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‘‘అర్బన్ నక్సల్స్’’ పార్టీ అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. ‘‘మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ని అర్బన్ నక్సలైట్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అయితే, ఆయన సొంత పార్టీ సంగతేంటి..? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదు.’’ అని ఖర్గే అన్నారు.
గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..
శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు.. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు..
అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడలిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టినట్లు హోంమంత్రికి ఎస్పీ వివరించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని హోం మంత్రికి ఎస్పీ రత్న తెలిపారు. బాధిత మహిళలకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్న హోం మంత్రి సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్ మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఉపాధి కోసం బళ్లారి నుంచి వచ్చింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచం మొత్తం థర్మల్ పవర్ నుండి గ్రీన్ పవర్ వైపుగా అడుగులు వేస్తోంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ ఇస్తున్నామని, దసరా బహుమతిగా పామాయిల్ కర్మాగారం లో పవర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనంద దాయకమన్నారు భట్టి విక్రమార్క. ప్రపంచం మొత్తం థర్మల్ పవర్ నుండి గ్రీన్ పవర్ వైపుగా అడుగులు వేస్తోందని, రాబోయే ఐదేళ్ళల్లో తెలంగాణా లో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 1990 లో పామాయిల్ సాగు కోసం ఆలోచన చేశారని, మలేషియాకు ఇక్కడి బృందాలను పంపి పామాయిల్ తీసుకువచ్చే ఏర్పాట్లకు పునాది నాడే పడిందన్నారు భట్టి విక్రమార్క.
సీఎం రేవంత్ రెడ్డికి స్వగ్రామంలో ఘన స్వాగతం
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుని, అక్కడ జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారు. సీఎం గా రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఆయన కొండారెడ్డిపల్లిలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించబడిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్న ప్రారంభించనున్నారు. ప్రధాన భవనం ముందు మామిడి మొక్కను నాటారు. రూ. 18 కోట్లతో చేపట్టనున్న గర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.