గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇలా అందరిపై ఆరోపణలు గుప్పించారు.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. అయితే, ఎస్వీ గోశాలలో గోవులు మృతిచెందాయంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన టీటీడీ.. గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేసింది..
పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే 33 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేసినట్లు తెలిపారు. రైతుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ ప్రభుత్వమే చేపట్టనుందని వెల్లడించారు. రైతులు అనుమతి లేని కంపెనీల విత్తనాలు, లూజ్ విత్తనాలు తీసుకోకుండా, ప్రభుత్వం అందించే నాణ్యమైన విత్తనాలే వాడాలని సూచించారు. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజల సహకారం లేకే శ్రీకాకుళం వెనుకబడింది.. మంత్రి ఆవేదన..!
శ్రీకాకుళంజిల్లా అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్నా , ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం అన్నారు మంత్రి అచ్చెంనాయుడు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే జెండాపట్టుకోని లేస్తున్నారు.. ఎక్కడ అభివృద్ది జరగుతుంది..? దీనిపై చర్చజరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగాలన్నా , పేదరికం పోవాలన్నా పారిశ్రామికీకరణ జరగాలన్నారు. పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తే తప్ప ఇంకో డబ్బై సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది. ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం, అభివృద్దికి ఆటంకం కలిగించాలని చూడటం మంచి విధానం కాదన్నారు. వెనుకబాటుతనం, తలసరి ఆదాయంపై చంద్రబాబు మాట్లాడితే చిన్నబోయానన్నారు. మమాత్మా జోతిరావ్ పూలే జయంతి సందర్బంగా 5 కోట్లతో నిర్మించిన బీసీ భవన్‌ను ప్రారంభించారు మంత్రి..
మా ప్రభుత్వం వచ్చాక కార్మికుల సంక్షేమంలో రాజీలేదు
మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ నలుమూలల నుండి భక్తులు తరలి వచ్చే పవిత్ర క్షేత్రమని అన్నారు. ఇలాంటి ధార్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాగ్దానాలు చేసి కూడా ఒక్క రూపాయి కూడా ఆలయానికి మంజూరు చేయలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రకటనలూ లేకుండానే బడ్జెట్ లో నేరుగా వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిందని తెలిపారు.
ఇందిరమ్మ ప్రభుత్వంలో భూ హక్కుల కోసం చారిత్రాత్మక అడుగులు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా, మూడు నెలలు కూడా పూర్తవకముందే దానికి సంబంధించిన విధానాలు రూపొందించడంలో ప్రభుత్వం చూపిన వేగాన్ని మంత్రి వివరించారు. అంబేడ్కర్ జయంతి రోజున శిల్పారామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.
గ్రేటర్ విశాఖలో వైసీపీకి ఊహించని షాక్..!
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం. అయితే, తిప్పల వంశీ రెడ్డి తండ్రి తిప్పల నాగిరెడ్డి 2019 ఎన్నికల్లో.. గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించారు. గత ఎన్నికలో టిక్కెట్ లభించకపోయినా జగన్మోహన్ రెడ్డి వెన్నంటే వున్నారు. ప్రస్తుతం వంశీ సోదరుడు దేవన్.. గాజువాక వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. మరో ముగ్గురు కార్పొరేటర్లను తమవైపు తిప్పుకో గలిగితే కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువయినట్టే లెక్క. మరోవైపు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఇటీవల కూటమిలో చేరిన వాళ్లకు టచ్‌లోకి వెళ్లింది. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎటువంటి ఒత్తిళ్లు లేకుండానే కార్పొరేటర్లు.. తమ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పారు. మేయర్ పీఠం మారుతుందనే కాన్ఫిడెన్స్ తమకు ఉందన్నారు పల్లా శ్రీనివాస్..
తప్పు చేశాం.. క్షమించండి.. ఎట్టకేలకు దిగొచ్చిన యాంకర్ రవి..
యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో గుడిలో సీన్ ను స్పూఫ్ చేయగా.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీశారంటూ రవి, సుధీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. ఇదే టైమ్ లో రవికి సంబంధించిన ఆ ఆడియో లీక్ అయింది. అందులో తాను తప్పు చేయలేదని.. తాను ఇండియన్ అని రవి అన్నాడు. ఇది వైరల్ అయిన కొద్ది సేపటికే రవి నేరుగా వీడియో ద్వారా స్పందించాడు. ‘మేం కావాలని ఆ వీడియో చేయలేదు. అది స్క్రిప్ట్ కూడా కాదు. సినిమాలోని సీన్ ను స్పూఫ్ గా చేశాం. అంతే. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చేయలేదు. కానీ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మేం తప్పు చేశాం. ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగదు. క్షమించండి. జై శ్రీరాం’ అంటూ అందులో తెలిపాడు. రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి సారీ చెప్పాడు.. మరి సుధీర్ ఎప్పుడు చెబుతాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదంపై సుధీర్ ఇంకా స్పందించలేదు.
హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గౌలిగూడలోని శ్రీ రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై, నగరంలోని పలు కీలక ప్రాంతాల గుండా సాగుతూ తాడ్‌బండ్‌లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగుస్తుంది. శోభాయాత్ర మార్గం పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట రోడ్, పారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా సాగుతూ తాడ్‌బండ్‌లోని హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది.
ముగిసిన జోగి రమేష్ సీఐడీ విచారణ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..
వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు 10 మంది నిందితులు సీఐడీ విచారణకు హాజరయ్యారు.. గంటపాటు జోగి రమేష్‌ను విచారించారు సీఐడీ అధికారులు.. ఇక, విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను.. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.. రెడ్ బుక్ శాశ్వతం కాదు.. ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్లు చేశారు.. మంచి చేస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది.. లేకపోతే ఉండదు అనే విషయం తెలుసుకోవాలన్న ఆయన.. జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.. ఎల్లకాలం కూటమి అధికారంలో ఉంటుందని అనుకోవద్దు.. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు.. ఇది మోసాల ప్రభుత్వం.. సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అని స్పష్టం చేశారు.
వారికి అదే చివరిరోజు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు… సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.. ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరిస్తున్నా అన్నారు.. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వాలని.. చేతనైతే విలువలు నేర్పించాలన్నారు.. వైఎస్ భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.