NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి

యాదాద్రి పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై యాదాద్రి బదులు అన్ని రికార్డుల్లో యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను కోరారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను జగన్ ఓర్వలేకపోతున్నాడు..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు.. ఈనెల 11వ తేదీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే జగన్ రాయలసీమ బిడ్డగా ఒప్పుకుంటామని మంత్రి పేర్కొన్నారు. విలాసవంతమైన భవనాల్లో గడిపే జగన్‌కు.. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. మాజీ మంత్రులు రోజా, అంబటి, పేర్ని నాని, కొడాలి నానిలు తీసేసిన తహశీల్దార్లు అని విమర్శించారు. ప్రజాధనం దోచేసిన మాజీ మంత్రుల అవినీతిపై విచారణ జరుగుతోందని.. మాజీ మంత్రులందరూ జైలుకెళ్ళడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్‌

దశాబ్దాలుగా మూసీ నదిపై కాంగ్రెస్‌ దీర్ఘకాల నిర్లక్ష్యం, పునరుజ్జీవన ప్రాజెక్టు బాధితుల బాధల నుంచి దృష్టి మరల్చేందుకు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అభివర్ణించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. “మీ పాదయాత్ర గాయానికి దూరంగా మందు వేసినట్లే. మీ మూసీ ప్రాజెక్టు బాధితులు హైదరాబాద్‌లో ఉండగా, మీరు నల్గొండలో పర్యటిస్తున్నారు’’ అని అభివృద్ది ముసుగులో వేలాది కుటుంబాలను నిర్వాసితులకు తరలించేందుకు రేవంత్ రెడ్డిని బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానించారు. ఇళ్లు ఆపదలో ఉన్న వారి ఆందోళనలను పరిష్కరించే బదులు, వారికి దూరంగా పాదయాత్ర నిర్వహిస్తూ వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లుగా మూసీ నదిని కలుషితం చేస్తూ మూసీ నదిని డ్రైనేజీ కెనాల్‌గా మార్చేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు.

సీఎం రేవంత్‌ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం – భీమలింగం – ధర్మారెడ్డిపల్లి కెనాల్ – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి ముందు, సంగెం గ్రామంలోని మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, ఆయన పాదయాత్ర కొనసాగించారు. రేవంత్ రెడ్డి ఈ పాదయాత్రలో మూసీ నది కాలుష్య సమస్యపై అవగాహన కల్పించేందుకు, ప్రజలను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లోని ఒక హోటల్ గదిలో ఒక డాక్టర్ అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతుడిని డాక్టర్ దీపా భట్టాచార్యగా గుర్తించారు. ఝర్‌గ్రామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. మృతుడు ఐదవ అంతస్తులో నివసిస్తున్నాడు. హోటల్ సిబ్బంది ఉదయం అంతా అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించింది, అయితే అనుమానం రావడంతో పోలీసులు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

‘‘ఐక్యంగా ఉంటేనే సురక్షితం’’.. కాంగ్రెస్‌పై పీఎం మోడీ ఫైర్..

మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ధులేలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తద్వారా ప్రతీ సామాజిక వర్గం అభివృద్ధి చెందే అవకాశాలను దెబ్బతీస్తోందని ప్రధాని పేర్కొన్నారు. “ఏక్ హైన్ టు సేఫ్ హైన్ (మీరు ఐక్యంగా ఉంటే మీరు సురక్షితం)” అని నినాదమిచ్చారు. మహాయుతి కూటమిని మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టే ఆట ఆడుతోందని, దళితులు వెనకబడిన తరగతులు, గిరిజన వర్గాల జీవితాలు అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కి ఇష్టం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బిజెపి, శివసేన, ఎన్‌సిపి వర్గాలతో కూడిన మహాయుతి మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధికి హామీ ఇవ్వగలదని, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఇప్పటికే ఉన్న సంక్షేమ చర్యలు,పథకాలను రద్దు చేస్తుందని మోడీ ప్రకటించారు.

టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదు..

టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం నిరుగారిపోతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ18 వేల దరఖాస్తులు వస్తే కేవలం 620 మంది లబ్దిదారులకు మాత్రమే అందడం సిగ్గుచేటని మండిపడ్డారు. 45 రోజుల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేయకపోతే యాక్షన్ తప్పదని హేచ్చరించారు. GHMC పరిధిలో స్వచ్ఛ భారత్ లో భాగంగా టాయిలెట్ మైంటెనెన్సు పై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. స్వచ్ఛ భారత్ లో కేంద్రం వాటతో పాటు రాష్ట్ర వాటా కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

కార్ల రేసింగ్‌తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి?.. కేటీఆర్ పై పొంగులేటి ఫైర్..

కార్ల రేసింగ్‌తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణాల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ నాయకుడైనా శిక్ష అనుభవించక తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, కవిత ఎవరైనా సరే తప్పు చేసినట్టు తేలితే శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్‌ పాదయాత్రను స్వాగతిస్తామని తెలిపారు. తప్పులు చేసినవారు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కార్ల రేసింగ్‌తో వచ్చిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

వేణుస్వామికి మరోసారి నోటీసులు పంపిన మహిళా కమిషన్‌!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు.

సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పి.. ఆపై క్షమాపణలు కోరారు. ఈ క్రమంలోనే త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న అక్కినేని నాగ చైతన్య, శోబిత వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిశ్చితార్థం చేసుకున్న రోజునే.. చై-శోభిత మూడేళ్లలో విడిపోతారని అన్నారు. ఓ మహిళ ప్రమేయంతో 2027లో ఈ జంట విడిపోతారన్నారు. వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వేణుస్వామిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓలా ఈవీ షోరూం కు చెప్పుల దండ.. కస్టమర్‌ వినూత్న నిరసన..

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్‌ వినూత్న నిరసనకు దిగారు. బైక్ సర్వీస్ కోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. షోరూం వద్దకు వచ్చిన కస్టమర్‌ లు షోరూం కు చెప్పుల దండ వేశారు. వినూత్నంగా నిరసన తెలిపారు. బ్యాటరీ రేంజ్‌ పడిపోవడంతో.. ఓ కస్టమర్‌ నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చాడు. నెల రోజులు అయిపోయినా షో రూమ్ నుంచి స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయాడు. రోజూ ఫోన్‌ చేసి వాహనం గురించి అడిగి సిబ్బంది మాత్రం అతని కాల్స్‌ కు పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన కస్టమర్‌ ఏకంగా షోరూం వద్దకు వచ్చాడు. అయినా అక్కడ సిబ్బంది ఆయన్ను పట్టించుకోలేదు. చివరకు తనతో పాటు తెచ్చుకున్న చెప్పుల దండను షోరూంకి వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో ఈ వార్త రామ చంద్రపురంలో వైరల్‌ గా మారింది.

Show comments