వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది.. మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారు.. అయితే, ఇవాళ అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది.. ఇక, సీఎం వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ముగ్గురు రాజ్యసభ వైసీపీ అభ్యర్థులు.. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో వైఎస్ జగన్‌ను కలిసిన గొల్ల బాబు రావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి.. తమ పేర్లను రాజ్యసభ ఎన్నికలకు ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని పాఠశాలలక ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాఠశాలలకు చేరుకున్నారు. ఈ పాఠశాలల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిపించి తిరిగి ఇంటికి పంపించారు. ఈ విషయం తెలియగానే పిల్లల తల్లిదండ్రులు పరుగుపరుగున వచ్చి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, ఈమెయిల్స్ పంపిన నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. చెన్నైలోని ఐదు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలకు ఓ అనామక వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపడంతో కలకలం రేగింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు పంపిన వ్యక్తిని కనుగొనడానికి ఆపరేషన్ ప్రారంభించబడింది.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత ఎలా చెప్తారు..
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం.. టీడీపీలో పని చేసిన పాల్వాయి రజినినీ ఎలా నియమించారు.. ఆంధ్ర వ్యక్తి నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారు.. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. ఆంధ్ర వాళ్ళను కాంట్రక్టులను పెంచి పోషించినది కేసీఆరే అని ఆమె విమర్శించారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే, మీరు డీజీపీగా ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు.. టీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారు అంటూ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హస్తినలో పొలిటికల్ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హస్తినలో హీట్ పెంచుతున్నాయి.. నిన్నటి నిన్న ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చలు జరిపారు.. ఈ రోజు ఉదయం ఆయన హస్తిన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్ మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి..
గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది..
ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏ చేస్తుందొ గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది.. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది.. నిరుద్యోగ భృతి ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదు.. ప్రజావాణీ కార్యక్రమం తుస్సుమంది అని ఆయన మండిపడ్డారు. మంత్రులు, ఐఏఎస్ లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు.. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీ లు అమలు అవ్వడం లేదు.. మహాలక్ష్మీ కింద మూడు గ్యారెంటీలు ఉంటే ఒక్క దానిని మాత్రమే ఇచ్చారు అని హరీశ్ రావు పేర్కొన్నారు. స
చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా భేటీ.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. అర్ధరాత్రి సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పనిచేసే దిశగా చర్చలు సాగించారు. అయితే, ఈ భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుజనా చౌదరి (వైఎస్ చౌదరి).. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చంద్రాబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య చర్చలు చాలా “పాజిటివ్” గా జరిగాయని తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన స్థానాల కంటే కూడా ఎక్కువగానే సాధిస్తుందని నా అంచనా అన్నారు.
ఎన్నికల వేళ పాక్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్న సమయంలో బలూచిస్థాన్, ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. బలూచిస్థాన్‌లో రోడ్డు పక్కనే దాడి జరిగినట్లు సమాచారం. ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు మరణించాడు.
పాకిస్థాన్ వ్యాప్తంగా 90 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఓటింగ్ పూర్తవ్వగానే లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.
ముగిసిన బీఏసీ సమావేశం.. ఎల్లుండి బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం పై చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొ్న్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, హరీష్ రావు.. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తాము ఎవరిని బీఏసీ సమావేశం నుండి వెళ్ళమని చెప్పలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ.. బీఆర్ఎస్ నుండి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇద్దరు ఎవరో నిర్ణయం తీసుకోండి అన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుండి కేసీఆర్.. కడియం పేర్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ రావడం లేదు కాబట్టి.. తాను వస్తా అని హరీష్ రావు అన్నారన్నారు.
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. కాగా.. ఈ సమావేశాల్లో గురువారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ బడ్జెట్‌పై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈనెల 5 న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపింది. మూడోరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకాలేదు.
మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పెట్టడానికి KRMB ఇష్యూ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛాంబర్ ఇవ్వాలి ఇచ్చామని, కానీ ఇక్కడే ఇవ్వాలి అని కానీ..ఇది ఇవ్వద్దు అని లేదన్నారు. ఇప్పటి వరకు నాలుగు రోజులు సభ అని, స్పీకర్ తర్వాత నిర్ణయం తీసుకుంటారన్నారు. శ్వేతపత్రం మీద మంత్రి చెప్తారని, మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పెట్టడానికి krmb ఇష్యు తీసుకుంటున్నారు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. . నీ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి జగన్ తుపాకులు పంపి గుంజుకునే పని చేశారని, మూడు రోజులు పోలీసులు ఉన్నారన్నారు. అప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ రోజు 12 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించే పని చేసింది.. కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
ఈనెల 13న విశాఖకు సీఎం జగన్.. ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలకు హాజరు
ఈనెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ముగింపు వేడుకలు విశాఖలోని ACA స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే.. రేపటి నుంచి విశాఖ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్ జరుగనున్నాయి. ఈ పోటీల్లో 5 కేటగిరీల్లో 3వేల మంది క్రీడాకారులు పాల్గోనున్నారు. రేపు విశాఖ రైల్వే గ్రౌండ్ లో ప్రారంభ వేడుకలను క్రీడల శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. అందుకోసం కలెక్టర్ మల్లిఖార్జున షెడ్యూల్ ప్రకటించారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ కు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందజేస్తారు.
రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. 13వ తేదీ రోజు అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు కనీసం 12 రోజులు సమవేశాలు పెట్టాలని మేము అడిగామన్నారు. అవసరం అయితే మరొక సారి 13 వ తేదీ BAC పెడుదామనీ అన్నారు…కానీ అసెంబ్లీ పని రోజులు పెడతామని అని అయితే చెప్పడం లేదన్నారు కడియం శ్రీహరి. చాలా గ్రామాల్లో తాగు నీటి సమస్య, అధికారికంగా కరెంట్ కోతలు ఉంటున్నాయని, రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు.
ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. భావోద్వేగానికి లోనైన స్పీకర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. మూడురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కాగా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం నుండి నాల్గవ వ్యక్తిగా పని చేసే అదృష్టం దక్కిందని తెలిపారు. సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చాను.. సభలో జవాబుదారీగా వ్యవహరించానని స్పీకర్ తెలిపారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుంది
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు బీజేపీకి ప్రధాన పార్టీ అని, బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్ అరకొర సీటు గెలిచిన, ఒడినా తెలంగాణకు ఒరిగేది పోయేది ఏం లేదని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ కుటుంబం కోసం పని చేసే పార్టీ.. కుటుంబ అవశ్యకత పూర్తి అయిపోయిందన్నారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు.