పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో వాంజినాధన్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై గతేడాది సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం చేసిన సంగతి తెలిసిందే. సనాతన నిర్మూలన సభలో ముఖ్య అతిథిగా హాజరైన స్టాలిన్ మాట్లాడుతూ.. మనం డెంగీను, దోమలను, మలేరియాను లేదా కరోనాను వ్యతిరేకించలేం. వాటిని నిర్మూలించాల్సిందే. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలంటూ ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చెప్పారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు, మహిళా సాధికారతకు వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే ఈ మాటలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకగా, బీజేపీ నాయకులు అప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్ వింటేనే మాజీ మంత్రి మల్లారెడ్డి గుర్తొస్తారు. ఆయన సాధాణంగా మాట్లాడిన మాటలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అప్పటి నుంచి మల్లారెడ్డి ఏం మాట్లాడినా.. ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. తాజాగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాస్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మ గూడ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, స్థానిక శాశనసబ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థుణులు, మహిళల లతో కలసి ఆడి పాడి సందడి చేశారు.. మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఆవరణలో జరిగిన దసరా ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండుగ సంబరాలు, దాండియా కార్యక్రమం, డి.జే పాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కళాశాల విద్యార్ధుణులు, కళాశాల మహిళల సిబ్బందితో కలిసి పోటీ పడుతూ ఆటలు ఆడి, పాటలకు అనుగుణంగా డాన్స్ లు చేస్తూ అందరిని ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే సతీమణి చామకూర కల్పన రెడ్డి, చామకూర షాలిని రెడ్డి, ప్రిన్సిపాల్ మాధవిలత, కళాశాల సిబ్బంది, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.
కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడి హత్య
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న లోతు గడ్డ జంక్షన్ టేకుల తోట వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులు విచారణ చేపట్టడంలో అసలు విషయం తెలిసింది. మృతుడు రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్ (50)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఇద్దరు నిందితులు వెంకటేష్, పుష్ప రాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి నుంచి ముగ్గురు స్నేహితులు లోతు గడ్డ జంక్షన్‌కు వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. లోతు గడ్డ జంక్షన్ వద్ద మద్యం సేవించి ముగ్గురిలో ఒకరైన పుష్పరాజును అర్జున్ కులం పేరుతో దూషించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేష్, పుష్ప రాజ్‌లు ఇద్దరు కలిసి అర్జున్‌ను చింతలూరు సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి అర్జున్‌ను రాయితో మోది హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో పొహరాదేవికి వెళ్లారు. వాషిమ్ జిల్లాలోని పోహరాదేవిలో ఉన్న జగదాంబ మాత ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పొహరాదేవిలోని సమాధి వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్‌రావ్ మహారాజ్‌లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
హిజ్బుల్లాకు మరో చావుదెబ్బ.. నస్రల్లా వారసుడిని హతం..
లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని బీరూట్‌పై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 2000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ బీరూట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో హతమార్చింది. నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా, హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా చెప్పబడుతున్న హషీమ్ సఫీద్దీన్ కూడా తాజాగా జరిగిన దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ ఈ విషయాన్ని నివేదించింది. నస్రల్లా మరణించిన వారంలోపే కొత్త బాస్‌ని కూడా చంపేసింది. దక్షిణ బీరూట్‌లో జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు చెప్పింది. హిజ్బుల్లాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు భూగర్భ బంకర్‌లో సమావేశమవుతున్నారనే సమాచారంతో ఇజ్రాయిల్ దాడులు చేసింది. బీరూట్‌లోని దహీహ్ శివారులోని ఈ దాడి జరిగినట్లు ఆల్ హదత్ తెలిపింది.
దేశంలోనే టాప్-10 విమానాశ్రయాల్లో విజయవాడ ఎయిర్పోర్టు ఉండేలా చేస్తాం..
కృష్ణాజిల్లా జిల్లాలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ప్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ తో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి పది విమానాశ్రయాల్లో విజయవాడ ఎయిర్ పోర్టును ఒక్కటిగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతి వారం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాం.. అమరావతికి ప్రముఖుల రాకపోకలతో తాకిడి పెరుగుతున్నందున వీలైనంత త్వరగా నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు ఆదేశించడం జరిగిందని వెల్లడించారు.
రేవంత్ మొనగాడు అని హరీష్ ఒప్పుకున్నాడు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నాడని, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబమని ఆయన మండిపడ్డారు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం కి రాహుల్ గాంధీ ఇంటి ముందు దీక్ష చేసే హక్కులేదని, ఒక్క హామీ అమలు చేయని నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ఊరుకుంటామా? అని ఆయన ధ్వజమెత్తారు. నువ్వు..నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు.. కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర దీక్ష చేస్తా అని, నువ్వు ఢిల్లీ పోయినా రోజే..నేను మీ మామ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తా అని ఆయన అన్నారు. రేవంత్ మొనగాడు అని హరీష్ ఒప్పుకున్నాడని, మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్ అని, మీ మోసాల ముందు మేము ఏం పనికి రామని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేయడం లో నెంబర్ 1 మీరే అని, కేసీఆర్ ది రైతు గుండె అనడం అన్యాయం.. తొమ్మిదిన్నర యేండ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా..? హరీష్ అని ఆయన ప్రశ్నించారు.
కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు అని, గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా అని, ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని ఆయన మండిపడ్డారు. కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. 80వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాదని, ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కాకా అని, జాతీయ స్థాయిలో నెహ్రూ ను చాచా అని పిలిస్తే.. రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారన్నారు.
హైడ్రాకు చట్టబద్దత.. గెజిట్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు.. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్‌కి ఫైల్ పంపించిన ప్రభుత్వం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్సు పై సంతకం చేశారు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం గెజిట్ ముద్ర వేసింది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన హైడ్రాకు సంబంధించి చట్టబద్దత లేదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితం గెజిట్ విడుదల చేసింది. ఇటీవల హైడ్రా పెద్ద ఎత్తున ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో కూల్చివేతలు చేపట్టింది. నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ స్థలాలను కాపాడే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాను జీవో నెం.99 పేరుతో ఏర్పాటు చేశారు. దీనికి ఏజెన్సీని కూడా రూపొందించింది.
గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించ లేదు..
గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు (శనివారం) పలు విభాగాల అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తో మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశాల్లో కేంద్ర మంత్రి పెమ్మసానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించ లేకపోయిందని విమర్శించారు. ఇక, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. తెనాలి నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకు వచ్చి, ఒక అంచనా ప్రకారం వినియోగిస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను తీసుకు రావడంలో తన శక్తివంచ లేకుండా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.