NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా

హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్‌లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 430 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు స్టువర్ట్ బిన్నీ కూడా 11 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 400 స్ట్రైక్ రేట్‌తో 44 పరుగులు చేశాడు.

మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..

ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్ సంచలనంగా మారింది. మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు.. అవాస్తవాలు ఉన్నాయని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 నుండి #తెలంగాణలో దాదాపు దశాబ్దం పాటు బీఆర్ఎస్ దుష్పరిపాలన తర్వాత రాష్ట్రమంతా ఆనందం & ఆశలు వెల్లువెత్తాయని తెలిపింది. మేము బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం తన మొదటి మరియు రెండవ వాగ్దానాన్ని అమలు చేసిందన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణ విడుదల చేశామన్నారు. గత 11 నెలల్లో తెలంగాణలోని మా సోదరీమణులు.. తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్లకు పైగా ఉచిత బస్సు యాత్రలను చేపట్టారన్నారు. ఒక సంవత్సరం లోపు రూ. 3,433.36 కోట్లు ఆదా చేశారన్నారు.

దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..

దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి అవుతుందని.. నవంబర్ 6 వ తేది నుండి సమగ్ర సర్వే మొదలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంటు వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నారు. ఒక్క బిసీ నాయకుడికి బీఆర్ఎస్ పదవి ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ వారికి కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ కు ఏం ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఎవరికి భయపడ అవసరం లేదన్నారు. గతంలో ఏం మంత్రి కూడా దొరికేవారు కాదన్నారు. ఇప్పుడు మంత్రులు అందుబాటులో ఉంటున్నారన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

రోడ్ల మరమ్మతులకు సీఎం శ్రీకారం.. జనవరి కల్లా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేయాలి..

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలి.. 5 ఏళ్లు గుంతలు తవ్వాడు.. రాష్ట్రానికి ప్రమాదమైన గోతులు తవ్వాడు.. నరకానికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్ర రోడ్లు మార్చారు అని దుయ్యబట్టారు.. వెయ్యి కోట్లు మాత్రమే ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టాడు అంటే పరాకాష్ట.. రోడ్ల మీద డెలివరీలు అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. గుంతలు పడ్డ రోడ్లు ప్రయాణం ప్రాణాలతో చెలగాటం.. రోడ్డు ప్రమాదాలతో నిత్యం సమస్యలే.. రోడ్లు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు వస్తుంది, దళారులు దోచుకొకుండా ఉండి వ్యాపారాలు బాగుంటాయి .. జనవరి కల్లా రోడ్లు గుంతలు పూడ్చి వేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు..

శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ స్కూల్ పై కరెంటు లైన్ తెగిపడింది. ప్రమాదం గుర్తించిన యాజమాన్యం విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. దీంతో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు.

ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..

తెలంగాణ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో.. మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు… హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు… అని ట్వీట్ చేశారు. ఇది నియంతృత్వ రాజ్యం…నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం అన్నారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నదన్నారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామన్నారు.

తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ధ్వజం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో 1,61,000 పోస్టులను భర్తీ చేసింది. కానీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు. 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకొడుతున్నారు. మీరు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవే కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలు ఇచ్చి, అవన్నీ తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని 80 వేల అధికారులతో సర్వే చేస్తున్నాం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమగ్ర కులగణన ఇంటింటి సర్వే అవగాహన సదస్సుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు కులగణన గత ఎన్నికల్లో పిలుపునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగనన చేపడుతామని హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు. మూడు నెలల్లో హై కోర్టు కులగణన నివేదిక సమర్పిస్తామని, అన్ని వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఆది శ్రీనివాస్‌. రాష్ట్రంలోని 80 వేల అధికారులతో సర్వే చేస్తున్నామని, 50 ప్రశ్నలతో ఒక్క అధికారికి 150 ఇల్లులు చొప్పున కేటాయిస్తున్నామన్నారు.

మూడేళ్ల బాలికపై హత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న హోంమంత్రి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఆదివారం పరామర్శించనున్నారు . అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాన్ని కలిసి స్వయంగా ఆమె భరోసా అందించనున్నారు . మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ ను అందజేయనున్నారు. తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ఇక, రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు.

రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిని రేపుతోంది. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం నేరుకు రుషికొండకు చేరుకున్నారు. మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రుషికొండ భవనాలను ఏ అవసరాలకు వినియోగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. గత వైసీపీ సర్కారు హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లో రుషికొండకు వచ్చి భవనాలను పరిశీలించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు భవనాలను పరిశీలించడం గమనార్హం. ఈ భవనాలను ఏం చేయాలి.. ఏ విధంగా ఉపయోగించాలి?.. అనే దానిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ భవనాల వినియోగంపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.