భద్రాద్రి రాముడి అన్నదాన సత్రంలోకి వరద నీరు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి గోదావరి నదిలో వరద పోటెత్తుతోంది.. గత నెల 20వ తేదీ నుంచి గోదావరి దోబూచులాట ఆడుతోంది.. గోదావరిలో నీటిమట్టం భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరుకుంది. దీంతో అప్పుడే భద్రాచలం రామాలయం చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. స్లోయిస్ నుంచి నీళ్లు గోదావరిలోకి పోకపోవటంతో రామాలయం పడమర వైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ అన్నదాన సత్రంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా పడమర వైపు ఉన్న దుకాణాలు కూడా నీళ్లు వచ్చి చేరుకున్నాయి. నిన్నటి నుంచి భద్రాచలం పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది.. ఆ వర్షపు నీళ్లని గోదావరి కరకట్ట పక్కనే ఉన్న దగ్గరికి చేరుకుంటున్నాయి. అయితే గోదావరికి 44 అడుగులు చేరుకోవడంతో స్లోయిస్ లన్ని కూడా మూసుకుంటున్నాయి.. దీంతో స్లోయిస్ నుంచి గోదావరిలకి నీళ్లు పోయే దారి లేకపోవడంతో రామాలయం వరద నీరు పేరుకొని పోతుంది. ఇక, ఈ నీటిని మోటార్లతో గోదావరి నదిలోకి చేరవేయడం నిరంతర ప్రక్రియ.. కానీ, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యం వల్ల మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో వరద నీరంతా సత్రం వద్ద పేరుకుని పోయింది. ఇలా వరద నీరు పేర్కొనటంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడంతో ఆ సత్రాన్ని మూసివేయాల్సి వచ్చింది. అదేవిధంగా దుకాణ సముదాయంలోకి నీళ్లు రావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
ఆడవాళ్లపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. చిన్నారుల జీవితాలను సైతం చిదిమేస్తున్నారు కామాంధులు.. అయితే, కొన్ని కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా దిశా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఈ కేసులను సీరియస్‌గా తీసుకుంటున్నారు పోలీసులు.. ఇక, 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారిపై అఘాయిత్యం కేసులో.. నిందితుడు సూరిబాబుకి 20 ఏళ్ల జైలు శిక్ష , 10 వేల రూపాయలు జరిమానా విధించింది. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అభంశుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు సూరిబాబు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.. ఇక, విచారణ జరిపిన విశాఖ ఫోక్సో కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.. ఇక, ఏడాది గడవక ముందే కేసులో తీర్పు వెలువరించింది.. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు విశాఖ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి.. దీంతో.. న్యాయమూర్తి ఆనందికి ధన్యవాదలు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు.
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల ఫైన్..? అసలు విషయం ఇదే..
ఏపీ రవాణాశాఖ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. రూల్స్ పాటిస్తే.. ఈ ఫైన్ల గొడవ ఉండదని కొందరు చెబుతుంటూ.. సామాన్యులను బతకనివ్వరా? హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారా? ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ నిలదీసేవాళ్లు మరికొంతమంది.. ఇక, సోషల్ మీడియాలో జరుగుతోన్న ఆ ప్రచారంపై ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు.. ఇదంతా వట్టిదేనని కొట్టిపారేశారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.. అయితే, మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ దొరికిపోతే మొదటిసారి రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.. అంతేకాదు.. ఇలా పదేపదే పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధనలు.. ఎంతో కాలం నుంచి అమలు చేస్తున్నామని.. జరిమానా పెంపు ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణా శాఖ కమిషనర్.
పోలవరం, ఇతర ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే.. అనుకున్న సమయం కంటే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందని చెబుతూ వస్తోంది.. దానికి తోడు గత ఏడాది గోదావరిలో భారీ వరదలు కూడా నిర్మాణ పనులకు ఆటకం కలిగించాయి.. అయితే, ఈ రోజు పోలవరం ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి.. ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన.. పూర్తి చేయాల్సిన పనులు, నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు.. పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎస్.. అయితే, ఈ ఏడాది చివరకి 5 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిర్దేశిత గడువు ప్రకారం పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ జవహర్ రెడ్డి.
ఎస్సారెస్పీ మరో అరుదైన రికార్డు.. 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయని
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని.. జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టు వద్ద ఫ్లడ్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ (స్కాడా)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 40 కోట్లతో 4 లక్షల ఎకరాల కోసం 1963లో ఎస్సారెస్పికి అంకురార్పణ జరిగిందని తెలిపారు.1983లో రిజర్వాయర్ లో నీరు నింపారన్నారు. 2015లో పది లక్షల ఎకరాల అయకట్టుకు నీళ్లు అందిచేలా పనులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. ఎస్సారెస్పికి రివర్స్ పంప్ ద్వారా నీరు వస్తుందా అని సందేహలు వ్యక్తం చేశారు. పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామన్నారు. ఎస్సారెస్పీ ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేశామని.. ప్యాకేజీ 21, 22 ద్వారా ఉమ్మడి జిల్లాలోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను త్వరలో అందిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి భరోసానిచ్చారు. దీంతో పునర్జీవ పధకంతో రైతులకు భరోసా వచ్చింది.
బీసీ విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకనుంచి ప్రభుత్వమే ఫీజు చెల్లింపు
తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీలకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు అవుతుందని మంత్రి తెలిపారు.. ఈ పథకంకు సంబంధించి శుక్రవారం విధివిదానాలు ఖరారవుతాయని పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ లాగే పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యం లాంటి సౌకర్యాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విద్యకోసం ఉన్న స్కీంలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి లోగో, పేరు శుక్రవారం ఖరారు చేస్తామన్నారు. తెలంగాణ రాకముందు బీసీలకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో బీసీ కులాల వారు ఉన్నత చదువులకు దూరమై కపలవృత్తులకే పరిమితమయ్యేవారని ఆయన అన్నారు. తెలంగాణకు ముందు 19 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవని.. ఇప్పుడు 327 బీసీ గురుకులాలున్నాయని గుర్తు చేశారు.
పట్టించుకోవడం లేదని పాముతో నిరసన
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. దీంతో పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాలకు వరద, మురుగునీరు ఇళ్లలోకి వస్తుంది. ఆల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అంతేకాకుండా.. వరద నీరుతో పాములు కూడా వస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు పాములు, విష కీటకాలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. మరోవైపు తాజాగా ఈ విషయాన్ని అధికారులకు చెప్పడంతో ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఓపిక నశించి సంపత్ కుమార్ అనే వ్యక్తి వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. తన ఇంట్లోకి వచ్చిన పాముతో ఆల్వాల్ జీహెచ్ఎంసీకి తీసుకొచ్చాడు. కార్యాలయంలోని ఓ టేబుల్ మీద పామును విడిచిపెట్టి వినూత్న నిరసన చేపట్టాడు. ఆ పామును చూసిన కార్యాలయం సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఆకట్టుకుంటున్న రానా హిరణ్యకశ్యప్ కాన్సెప్ట్ టీజర్..
స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత నటుడుగా మంచి గుర్తింపు సంపాదించారు.కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా వున్నారు. అయితే తాజాగా రానా హిరణ్యకశ్యప అనే సినిమాను ప్రకటించాడు. కామిక్ కాన్ వేదిక పై హిరణ్య కశ్యప్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తుంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక గాధని ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతున్నారని సమాచారం.. అయితే తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ ని రానా విడుదల చేశారు.హిరణ్య కశ్యపుడి కార్టూన్ చిత్రాల రూపంలో ఉన్న వీడియో ను షేర్ చేశారు. ఈ వీడియోలో అనేక అంశాలు దాగి ఉన్నాయి. హిరణ్యకశ్యపుడిగా రానా లుక్ ఎంతో క్రూరంగా ఉండబోతుందని ఈ కాన్సెప్ట్ టీజర్ తో తెలియజేశారు. అసలు హిరణ్య కశ్యపుడు కఠోరమైన తపస్సు ఎందుకు చేశాడు అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది..ఈ కాన్సెప్ట్ టీజర్ లో ‘కాబట్టే అతడు కఠోరమైన తపస్సు మొదలు పెట్టాడు’ అనే లైన్ ఉన్న కార్టూన్ పిక్చర్ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ టీజర్ కి రానా ‘ రాక్షస రాజు ఆగమనం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు రానా ప్రకటించారు. హిరణ్య కశ్యపుడి వంటి రాక్షస రాజు లుక్ కోసం రానా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడని సమాచారం.ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన అందిస్తున్నారు.అయితే ఈ చిత్రాని కి దర్శకుడు ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.. ఈ చిత్రాన్ని రానా ప్రకటించిన వేంటనే దర్శకుడు గుణశేఖర్ స్పందించారు హిరణ్యకశ్యప చిత్రం కోసం నేను దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడ్డాను.నేను రూపొందించిన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే కనుక చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. మరీ ఈ చిత్రం కథ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.
అనుపమతో టిల్లుగాడి ఘాటు రొమాన్స్.. అదిరిపోయింది
ప్రతి హీరోకు అతని కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ జీవితాన్ని మార్చిన సినిమా అంటే డీజే టిల్లు. ఆ సినిమాలో టిల్లుగా సిద్దు నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక తన కెరీర్ లో తనను స్టార్ గా చేసిన సినిమాకు సీక్వెల్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. టిల్లు స్క్వేర్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టికెట్ ఏ కొనకుండా అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. “టిల్లు అన్న డీజే పెడితే” పాట లాగానే, “టికెట్ ఏ కొనకుండా” పాట కూడా పార్టీలు, పబ్‌ల అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ కు రామ్ మిరియాల అందించిన సంగీతంతో పాటు ఆయనే స్వయంగా పాడడం మరింత హైప్ ను తీసుకొచ్చింది. ఇక వీడియోలో అనుపమతో సిద్దు రొమాన్స్ మహా ఘాటుగా ఉంది. రొమాన్స్ కు, అందాల ఆరబోతకు దూరంగా ఉండే అనుపమ.. ఈ సినిమాలో హద్దులు చెరిపేసింది. టిల్లుతో రొమాన్స్ కు రెడీ అనడమే కాకుండా అందాల ఆరబోత కూడా చేసి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
ఆ రోజు వణికిపోయా.. మావయ్య దెబ్బకు సెట్ అయ్యా!
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ‘బ్రో’. తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చగా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టగా విలేకర్లతో ముచ్చటించాడు సాయి ధరమ్ తేజ్. ఈ క్రమంలో బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తేజ్ పంచుకున్నారు. మొదటిరోజు సెట్ లో అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది? అని అడిగితే మొదటిరోజు కంగారు పడ్డానని, వణికిపోయానని అన్నారు. అలాగే కేకు కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి తినిపించాల్సి వచ్చిందని అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు సార్లు టేక్స్ తీసుకోవడం జరిగిందని అన్నారు. పవన్ తనను మానిటర్ దగ్గరకు తీసుకుని వెళ్లి చూపించగా అప్పుడు చేతులు వణికిన విషయం అర్ధం అయిందని అన్నారు. ఇక కళ్యాణ్ మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు, నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కన పెట్టారని తేజ్ చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే సెట్ అయిపోయానని షూట్ సమయంలో సముద్రఖని గారు కూడా బాగా సపోర్ట్ చేశారని అన్నారు. కథ ఓకే అయ్యే సమయానికి నాకు యాక్సిడెంట్ జరగలేదని, అది యాదృచ్చికంగా జరిగిందని అన్నారు. టైం విషయంలో మాత్రం కనెక్ట్ అయ్యానని పేర్కొన్న తేజ్ కుటుంబంతో సమయం గడపటానికి ఇష్టపడతానని, మా అమ్మగారితో గానీ, నాన్న గారితో గానీ రోజులో ఏదొక సమయంలో కాసేపైనా గడుపుతానని అన్నారు. నా దృష్టిలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపడం కంటే విలువైనది ఏదీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.