చంద్రబాబుపై సంచలన ఆరోపణలు.. పవన్‌పై పథకం ప్రకారం కుట్ర..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తాం అంటూ కామెంట్ చేశారు.. అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతుందని ప్రకటించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సొంత దేశంలోనే అరెస్టు అయ్యారని గుర్తుచేసిన ఆయన.. ఇక్కడా అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. ఇక, అవాకులు చెవాకులతో పవన్ కల్యాణ్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది.. ఆయన గ్రాఫ్ పడేసేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ను శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు ఆయనతో లేని పోని ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు.. అంతేకాదు.. ప్రజారాజ్యం పార్టీని మూయించే వరకూ చంద్రబాబు నిద్రపోలేదంటూ హాట్ కామెంట్లు చేశారు. ఇక, శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ తప్పు ఉంటే.. ప్రభుత్వం తప్పకుండా ఆమెపై చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై సీఎం సీరియస్.. ఇది తగునా..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్న విషయం విదితమే.. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలకు దిగాయి.. అంతేకాదు.. దాడులు కూడా చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, విబేధాల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన సీఎం వైఎస్ జగన్.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పిలిపించారు.. దీంతో.. ఈ రోజు ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎంపీ పిల్లి సుభాష్.. అయితే, ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.. రామచంద్రాపురం పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.. ఎంపీ పిల్లి బోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంతో జరిగిన సమవేశంలో మంత్రి వేణు గోపాలకృష్ణ తీరుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు బోస్.. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు. తన అనుచరుడు కోలమూరి శివాజీపై మంత్రి వేణు అనుచరుడు దాడి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రామచంద్రాపురం నుంచి బరిలో నిలబెట్టాలనే ప్రయత్నాల్లో ఆయన.. మంత్రి వేణుపై జగన్ దగ్గర కంప్లైంట్ చేయబోయారు.. అయితే, అప్పుడే తీవ్ర స్థాయిలో మండిపడ్డారట సీఎం జగన్.. మీ అబ్బాయిని ఎక్కడ నుంచి నిలబెట్టాలనే బాధ్యత నాది కదా అని ప్రశ్నించిన ఆయన.. పార్టీ గెలుపు కోసం రాష్ట్రం అంతా చూడాల్సిన స్థాయిలో ఉండి.. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవటం కరెక్ట్ కాదని హితవుపలికారు.. విభేదాలను పక్కనబెట్టి కలిసి పని చేసుకోవాలని సూచించారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..
పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏతో పవన్ కలవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం.. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్‌లా మారారని.. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ మధ్య అనుసంధానం చేసేందుకు పవన్ ఓ దళారీ అవతారమెత్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ రెండు పార్టీల్ని పవన్ కలిపితే.. ఏపీలో వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అవుతుందన్నారు. బీజేపీతో జతకట్టిన కూటమికి వ్యతిరేకంగా.. మైనారిటీలందరూ ఏకమై, వైసీపీని గెలిపించడం ఖాయమని తేల్చి చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పవన్ పోల్చారని.. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, ఆ హామీని ఇప్పటివరకూ నెరవేర్చని బీజేపీతో పవన్ ఎలా అంటకాగుతారని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. నిన్నటిదాకా చేగువేరా దుస్తులు ధరించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు దారి తప్పి మితవాద సంస్కరణల సావర్కార్ వైపు నడవడం సరికాదని హితవు పలికారు. పవన్ వైఖరి చూస్తుంటే.. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. పవన్‌కి రాజకీయ స్థిరత్వం లేదని.. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే, ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని ఎద్దేవా చేశారు. తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలపై సీబీఐ, ఈడీ సంస్థలతో దాడులు చేయించడం బీజేపీకి పవన్ మద్దతు పలకడం శోచనీయమని వెల్లడించారు.
సీమాను తిరిగి పంపకపోతే 26/11 తరహా దాడి హెచ్చరికలు.. కొందరిపై కేసు నమోదు!
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌ను తమ దేశానికి తిరిగి పంపకపోతే 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందని గత వారం హెచ్చరించిన కాల్‌కు సంబంధించి ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి ఈరోజు తెలిపారు. ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగా.. అతను ఉర్దూలో మాట్లాడాడు. మహారాష్ట్ర రాజధానిపై నవంబర్ 26, 2008 నాటి దాడి వంటి ఉగ్రదాడి జరుగుతుందని, దానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పాడు. బెదిరింపు కాల్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని పోలీసు అధికారి చెప్పారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, సంబంధిత నిబంధనల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులపై సోమవారం వర్లీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఒక యాప్ ద్వారా కాల్ చేశారని, కాల్ చేసిన వ్యక్తి ఐపీ చిరునామాను ట్రాక్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని గతంలో ఒక అధికారి తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీకి కోర్టు సమన్లు జారీ.. ఎందుకంటే?
ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల అక్రమ వివాహంపై కేసును కోర్టులో విచారణకు అర్హమైనదిగా పేర్కొంది. జూలై 20న వారిద్దరు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. సివిల్ జడ్జి ఖుద్రతుల్లా తీర్పును ప్రకటించి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ మహమ్మద్ హనీఫ్ ప్రకారం.. బుష్రా బీబీకి నవంబర్ 2017లో ఆమె మాజీ భర్త ఖావర్ మనేకా విడాకులు ఇచ్చారని, ఆమె ‘ఇద్దత్’ కాలం ముగియనప్పటికీ, జనవరి 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ను వివాహం చేసుకున్నారని, ఇది షరియా, ముస్లిం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇద్దత్ అనేది విడాకులు, మరణం లేదా ఆమె భర్త నుండి విడిపోవడం ద్వారా స్త్రీ వివాహం రద్దు అయిన తర్వాత 130 రోజుల నిరీక్షణ కాలం. ఆ సమయంలో స్త్రీ అవివాహితగా ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్‌తో వివాహానికి ముందు, బుష్రా ఖావర్ మనేకాను వివాహం చేసుకుంది. 2017లో అతనితో విడాకులు తీసుకుంది. ఇమ్రాన్, బుష్రా మధ్య వివాహం జరిపించిన మతాధికారి ముఫ్తీ మహమ్మద్ సయీద్ తన వాంగ్మూలాలలో ఇమ్రాన్‌ఖాన్ తన ఇద్దత్ సమయంలో బుష్రా బీబీని వివాహం చేసుకున్నారని కోర్టుకు సమర్పించారు. 2017 నవంబర్‌లో బుష్రా బీబీకి ఆమె మాజీ భర్త విడాకులు ఇచ్చారని, బుష్రా బీబీని పెళ్లాడితే పీటీఐ ఛైర్మన్ పాకిస్థాన్ ప్రధాని అవుతారన్న అంచనాలు కూడా ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో ముందుండే కంపెనీ, తాజాగా అన్-నౌన్ ఫోన్ నంబర్స్ ను సేవ్ చేయకుండానే.. ఆ నెంబర్ తో డైరెక్ట్ గా చాట్ చేసే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్, iOS స్టేబుల్ వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఇక నుంచి వాట్సాప్ యూజర్లందరూ తెలియని నంబర్లను అడ్రస్ బుక్‌లో సేవ్ చేసుకోకుండానే చాట్ చేసుకునే ఫెసిలిటిని వాట్సాప్ బీటా ఇన్ఫో తీసుకోచ్చింది. యూజర్లు ముందు వాట్సాప్‌లో కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసి.. సెర్చ్ బార్‌లో అన్ నోన్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి శోధించాలి.. ఆ కాంటాక్ట్‌కు వాట్సాప్ అకౌంట్ ఉంటే, ఓపెన్ చాట్ బటన్‌పై నొక్కి అప్పుడు ఆ ఫోన్ నంబర్‌తో చాట్ చేసుకోవచ్చు. సేవ్డ్ కాంటాక్ట్‌తో చాట్ చేసినట్లే ఆ అన్-సేవ్డ్ నెంబర్ తో కూడా చాటింగ్ చేసుకోవచ్చు. iOS, ఆండ్రాయిడ్ యూజర్లు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. తెలియని నంబర్లతో ఓపెన్ చాట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని అందరు గమనించాలి.. ఎందుకంటే, వారు స్కామర్ లేదా స్పామర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఫీచర్ వాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి తెలియజేస్తున్నారు.
మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన యూట్యూబ్
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. కొద్ది రోజల క్రితం యాంబియంట్ మోడ్, డార్క్ థీమ్ లాంటి అదిరిపోయే అప్డేట్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్‌లో స్టెబుల్ వాల్యూమ్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. దీంతో సడన్ చేంజ్‌లు లేదా వీడియో మొత్తం హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకునేలా అప్డేట్ చేసింది. ఇక, అధికారికంగా అనౌన్స్ చేయకముందే ఈ స్టెబుల్ వాల్యూమ్ సెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. అయితే, సాధారణంగా యూట్యూబ్‌లోని ఒక్కో వీడియో ఒక్కో శబ్దంతో ప్లే అవుతుంది. ఒక వీడియో చాలా పెద్ద సౌండ్‌తో వస్తే.. మరికొన్ని తక్కువ సౌండ్‌తో ప్లే అవుతాయి. దీనివల్ల సౌండ్ పెంచుతూ, తగ్గిస్తూ ఉండాల్సి పరిస్తితి నెలకొంటుంది. అప్‌కమింగ్ స్టెబుల్ వాల్యూమ్ ఫీచర్‌తో అన్ని వీడియోలలో వాల్యూమ్ ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. తద్వారా మనం సెట్ చేసుకున్న ఒకే సౌండ్‌తో అన్ని వీడియోలు ప్లే అవుతాయి. స్మార్ట్ టీవీలు, సౌండ్ సిస్టమ్స్, రోకు, ఇతర మీడియా ప్రొవైడర్లు ఇలాంటి ఫీచర్లను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాయి. యూట్యూబ్ కూడా ఈ సౌండ్ లెవలింగ్ ఫీచర్‌ను అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీడియో సెట్టింగ్స్‌లో యాంబియంట్ మోడ్ కింద ఈ ఫీచర్ కనిపించబోతుందని ఓ యూట్యూబర్ తెలిపారు.
అమెజాన్‌లో మళ్లీ ఊడుతున్న ఉద్యోగాలు..ఉద్యోగుల్లో టెన్షన్..
అధిక ద్రవ్యోల్బణం తో పాటు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని మేజర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు.. వివిధ విభాగాల్లోని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈసారి ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ లేఆఫ్‌లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్‌లను కంపెనీ తొలగించలేదని సమాచారం.. ఈ విషయం పై అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. క్వాలిటీ, సామర్థ్యం కోసం మా ప్రాసెస్‌ను నిరంతరం మెరుగుపర్చుకుంటాం. తద్వారా బెస్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కృషి చేస్తాం. తాజాగా అమెజాన్ ఫార్మసీ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాం. వనరులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. అని వెల్లడించారు.. అమెజాన్ జనవరిలో కూడా కొంతమంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.. ప్రధానంగా ప్రోగ్రామ్ మేనేజర్స్, రిస్క్ కంప్లయన్స్ మేనేజర్స్, బిల్లింగ్ మేనేజర్స్ వంటి జాబ్ రోల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో తొలగించారు. ఈ ప్రభావం డిజిటల్ హెల్త్ టూల్స్, హాలో హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్‌లపై పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా పడింది… ఆ తర్వాత మరో 9000 ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మేలో మరో 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. ఈ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ , హ్యూమన్ రిసోర్స్ అండ్ సపోర్ట్ ఫంక్షన్స్ విభాగంలోని ఉద్యోగులపై పడింది. తాజాగా మరోసారి ఫార్మసీ డివిజన్‌లోనూ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం..
రోజూ రూ.75 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.14 లక్షలు పొందవచ్చు..
తల్లి దండ్రులు తమ కూతురు కోసం ఈ ప్లాన్ ను తీసుకోవచ్చు.. అందుకు కోసం పాప వయస్సు ఏడాది ఉండాలి..తల్లిదండ్రుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అకౌంట్‌కి మినిమం గ్యారంటీడ్ అమౌంట్ రూ.1 లక్ష. 13 నుంచి 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీని కలిగి ఉండవచ్చు. లబ్ధిదారుడు సహజ కారణాలతో మరణిస్తే, LIC గ్రహీత కుటుంబానికి రూ.5 లక్షల డెత్ బెనిఫిట్ చెల్లిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా అందిస్తుంది.. అనుకోని కారణాలతో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..రూ.10 లక్షల డెత్ బెనిఫిట్ చెల్లిస్తుంది. ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీని కాస్త మెరుగుపరుస్తుంది.. ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ తేదీకి మూడు సంవత్సరాల ముందు వరకు లైఫ్ రిస్క్ కవరేజీని అందిస్తుంది. పాలసీ వ్యవధి అంతటా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి ప్రొటెక్షన్ ఉంటుంది.3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లిస్తూ, పాలసీ యాక్టివ్‌లో ఉంటే.. పాలసీ ఆధారంగా లోన్ పొందవచ్చు. ఈ ఫీచర్ అత్యవసర సమయంలో లేదా ఊహించని ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.. ఇకపోతే రూ.75 రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే కుమార్తె వివాహానికి రూ.14 లక్షలు కూడబెట్టుకోవచ్చు. నెలవారీ ప్రీమియం 25 సంవత్సరాల పాటు చెల్లించాలి..మరిన్ని వివరాలకు దగ్గరలోని lic లో తెలుసుకోవచ్చు..
కుర్రాళ్ళని నిద్ర పట్టకుండా చేస్తున్న బేబీ.. వీక్ డే కూడా దిమ్మతిరిగే కలెక్షన్లు
చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విరాజ్ అశ్విన్ మరో హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి సినిమాని నిర్పించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి, జర్నలిస్టు నుంచి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించారు. సుమారు నాలుగున్నర కోట్ల వరకు బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూనే కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు గట్టిగానే కనిపిస్తున్నాయి. మొదటి రోజు రెండు కోట్ల 60 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రెండు కోట్ల 98 లక్షలు మూడో రోజు మూడు కోట్ల 77 లక్షలు వసూలు చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సోమవారం నాడు అంటే వర్కింగ్ డే కూడా భారీగా వసూళ్లు రాబట్టి ఏకంగా మూడు కోట్ల 72 లక్షల వరకు వసూలు చేసింది. అంటే ఆదివారం కంటే కేవలం 5 లక్షలు మాత్రమే తక్కువ వసూలు చేసింది. వర్కింగ్ డే రోజు థియేటర్లకు జనాలను రప్పించడం అంత ఈజీ కాదు కానీ బేబీ ఈజీగా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను 13 కోట్ల ఏడు లక్షలు షేర్ వసూలు చేసిన ఈ సినిమా 22 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో మూడు రోజులకు 56 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో దాదాపుగా కోటి 78 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 41 లక్షలు షేర్ వసూలు చేసిన ఈ సినిమా 208 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ ఏడుకోట్ల 40 లక్షలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 8 కోట్ల నిర్ణయించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేయడమే కాదు 7 కోట్ల 41 లక్షల లాభాలతో ఈ సినిమా దూసుకుపోతోంది.
జగదేకవీరుడు – అతిలోక సుందరి రీరిలీజ్.. ఎప్పుడంటే.. ?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులకు, సినిమా వార్షికోత్సవాలకు సినిమాలను రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకోవడమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా అందుకున్నాయి. ఇక రీ రిలీజ్ అంటే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిరంజీవి కల్ట్ క్లాసిక్ మూవీస్ రీరిలీజ్ అంటే హడావిడి మాములుగా ఉండదు. ఇక తాజాగా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. చిరంజీవి, శ్రీదేవి జంటగా.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించాడు. 1990 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అతిలోక సుందరిగా శ్రీదేవి ఆహార్యం, అభినయం ఇప్పటికి ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోడు. అంతటి అందమైన వనితను ఈ భూలోకంలో ఎక్కడా చూసి ఉండరు అని ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు శ్రీదేవిని పొగుడుతూ ఉంటారు. ఇక రాజు గా చిరు నటన అయితే అద్భుతం. ఇళయరాజా సంగీతం.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆగస్టు 22 న చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. చిరు ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. అబ్బని తీయని దెబ్బ అంటూ.. థియేటర్ లోనే సాంగ్స్ కు డ్యాన్స్ వేస్తూ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి త్వరలోనే మేకర్స్ అధికారిక అనౌన్స్ మెంట్ ఇస్తారేమో చూడాలి.