సిట్టింగ్‌లకు సీఎం కేసీఆర్ వార్నింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఎన్నికలపై నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలి. లేకుంటే ఓడిపోతామని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కోస్తామని హెచ్చరించారు. అయితే.. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చిరించారు. ఆ 42 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసునని, ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో ఆ 42 ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. బాగా పని చేసుకుంటే మీకే మంచిదని, లేదంటే మీకే నష్టం అని పార్టీ శ్రేణులకు క్లాస్ తీసుకున్నారు. కాగా నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ తెప్పించుకున్న కేసీఆర్ అందులో 42 మందిపై వ్యతిరేకత ఉన్నట్టు.. అది కూడా వ్యక్తిగత కారణాలతోనే కొంత సమస్య ఉందని తెలియడంతో.. హెచ్చరికలు జారీ చేసినట్టు పార్టీ వర్గాల అంచనా వేస్తున్నాయి. అయితే.. కే కేశరావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. అనంతరం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టారు.
దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు.. చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు చైర్మన్ కర్నాటి రాంబాబు.. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకి త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నాం.. దీనిపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, సాయంత్రం సమయంలోనూ అన్నదానం నిర్వహించాలని నిర్ణయించాం.. భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.. మరోవైపు.. భక్త జన దర్బార్ ప్రతి నెలా రెండవ గురువారం నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.. దాతలకు నెలకు ఒకసారి అంతరాలయ దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. కొండపై భాగంలో విధంగా కొండ దిగువున పొంగళ్ల షెడ్డు ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని మే 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడలో మహాయగ్నం నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు చైర్మన్ కర్నాటి రాంబాబు..
కుప్పంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగింత..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం.. ఆ పార్టీ కంచు కోటగా భావిస్తారు.. సుదీర్ఘ కాలంగా అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు చంద్రబాబు.. అయితే, గత ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ తగ్గింది.. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి మరి పనిచేస్తోంది.. 175కి 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.. ఇక, ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేకపోవడంతో.. చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. కుప్పం టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు కంచర్ల శ్రీకాంత్.. 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. ఇక, కుప్పంలో చంద్రబాబు నాయుడుకు లక్ష ఓట్ల మెజార్టీ సాధించే లక్ష్యంతో కమిటీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్న కంచర్ల శ్రీకాంత్.. వారంలో మూడు రోజులు పాటు కుప్పంలోనే స్టే చేస్తున్నారు. తాజాగా, మరోసారి కుప్పంలో పర్యటించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.. ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.. వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్న ఆయన.. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్న ఏ ఒక్క పోలీసును వదిలిపెట్టబోం.. అందరిపై ప్రైవేటు కేసులు బుక్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
రామనవమి హింసపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశం…
రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్‌ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది. విచారణకు సంబంధించి అవసరమైన అన్ని పేపర్లను రెండు వారాల్లో ఎన్ఐఏకి అందించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ పశ్చిమబెంగాల్ పోలీసులను ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌లు, సీసీటీవీ ఫుటేజీలను ఎన్‌ఐఏకి అందజేయాలని సంబంధిత పోలీసు స్టేషన్‌లను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ రాగానే ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ హింసాకాండపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.
ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. రైతుగా లక్షల్లో సంపాదిస్తున్న టెక్కీ..
వ్యవసాయం.. ప్రస్తుతం చాలా మందిలో పనికి రాని రంగంగా భావిస్తుంటారు. ఏం చేతకాని వాడు మాత్రమే వ్యవసాయం చేస్తాడనే అపోహా చాలా మందిలో ఉంది, కానీ చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఎలాంటి అద్భుతాలు చేయగలడో చాలామంది చేసి నిరూపించారు. ఇప్పటికీ భారత సమాజంలో సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగాలంటే మోజు. రైతు అంటే ఆమడదూరం వెళ్తున్నారు. 20కి మించి ఎకరాలు ఉన్న వ్యక్తికి కనీసం పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయంపై మక్కువ ఉన్నా కూడా చాలా మంది యువత సిటీల్లో ఏదో జాబ్ చేస్తూ బతుకీడుస్తున్నాడు. ఇదిలా ఉంటే కొందరు మాత్రం తమకు మక్కువ ఉన్న రంగంలోకి వెళ్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు వెంకటసామి విఘ్నేష్. ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలో ఉద్యోగం నెలకు రూ. 40,000 జీతం అయినా ఇవన్నీ వదిలేసి తనకు మక్కువ ఉన్న వ్యవసాయ రంగంలోకి వెళ్లేందుకు ఉద్యోగం మానేశాడు. తల్లిదండ్రులు మొదట్లో భయపడ్డా కూడా ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ.. వారి భయాలను దూరం చేశాడు.
ముద్దు పెట్టబోయాడు.. అంతలోనే..!
మనం ప్రతీ రోజు సోషల్ మీడియీలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరి కొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపిస్తాయి. అయితే ఇటీవల కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళుతున్న యువతులనే టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సెమ్ ఇలాంటి ఘటన ఒకటి రిసెంట్ గా చోటు చేసుకుంది. అది ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియారాలేదు. కానీ ఆ వీడియో సీసీటీవీలో రికార్డు అయింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువతి సింగిల్ గా రోడ్డు మీద నడుచుకుంటూ బస్టాప్ దగ్గరకు వస్తున్నట్లు మనం చూడవచ్చు. అయితే ఆమె వెనకే ఓ పోకిరి వెంటపడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ముద్దు పెట్టకోబోయాడు.. దీంతో అగలేదు.. సదరు యువతిని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి.. ఆమెను తోసేశాడు. ఇదంతా జరుగుతుండగా అక్కడ ఓ బస్సు అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది. యువతిని వేదించిన అతడ్ని ఎవ్వరూ ఏం చేయలేదని అనుకోవద్దు.. బస్సు పక్క నుంచి ఓ ముగ్గురు వ్యక్తులు పరుగున వచ్చి ఆ పోకిరి దగ్గరకు చేరుకుని.. తన్నులతో బుద్ది చెప్పారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటి వరకు 28.3 మిలియన్ల వ్యూస్ రాగా.. నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
ఎంఎస్ ధోని వల్లే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు రహానే..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనరల్ ఆడే భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 7-11 మధ్య లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 15 మంది సభ్యలతో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటిచింది. అయితే జట్టులో రెండు, మూడు మార్పులు మినహా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడిన జట్టునే దాదాపు కొనసాగించింది. వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను తీసుకున్న సెలక్టర్లు.. ఇషాన్ కిషన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లపై వేటు వేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అనూహ్య పరిస్థితుల్లో రహానే తిరిగి టీమిండియాలోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో లాస్ట్ గా భారత్ కు ప్రాతినిథ్యం వహించిన అజింక్యా రహానే పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. దాంతో అతని కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ రంజీ ట్రోఫీలో సత్తా చాటిన రహానే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ధోని సారథ్యంలో రహానే చెలరేగిపోతున్నాడు.
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ధర
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర మరోసారి పెంచేసి యూజర్లకు షాకిచ్చింది.. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఏకంగా 67 శాతం మేర పెంచేసింది. త్రైమాసిక ప్లాన్‌ను కూడా సవరించింది. కానీ, వార్షిక ప్లాన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.. ఇక, పెంచిన ధరలు వెంటనే అమల్లోకి తెచ్చింది అమెజాన్. పెరిగిన సబ్‌స్ర్కిప్షన్ ధరల విషయానికి వస్తే.. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ చందా ఇప్పటి వరకు రూ.179గా ఉండగా.. ఇప్పుడు ఏకంగా అది రూ.299కు చేరింది.. ఇక, 3 నెలల చందా ఇప్పటి వరకు రూ.459గా ఉంటే.. దానిని రూ.599కు పెంచేసింది.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1499 ఉండగా.. అందులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు ఆ సంస్థ.. అయితే, ఇప్పటికే సబ్‌స్క్రైబ్ అయిన వారికి 2024 జనవరి 15 వరకు పాత రేట్లే వర్తింపజేయనున్నారు.. కానీ, ఏదైనా కారణంతో రెన్యువల్ ఫెయిల్ అయితే మాత్రం కొత్త ధర వర్తింపజేయనున్నారు.. ఇక, అమెజాన్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రూ.999కు లభిస్తోంది. ఇందులోనూ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి.. కానీ, ప్రైమ్ వీడియో కంటెంట్‌ను ఎస్‌డీ క్వాలిటీలో చూడ్డానికి మాత్రమే వీలవుతుంది.. హెచ్‌డీ సదుపాయం ఉండదన్నమాట.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 2016లో భారత్‌లో ప్రవేశపెట్టగా.. నెలవారీ చందా సదుపాయాన్ని మాత్రం 2018లో తీసుకొచ్చింది.
థ్రిల్లర్ సినిమాకి నందమూరి హీరో కాంప్లిమెంట్స్…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ ఆని సెంటర్స్ లో యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విరుపాక్ష మూవీ ఇప్పటికే దాదాపు 60 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్న విరుపాక్ష సినిమాపై ఆడియన్స్ నుంచే కాదు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. స్టార్ హీరోలు కూడా విరుపాక్ష సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా విరుపాక్ష సినిమా చూసి సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు, అజ్నీష్ లోక్నాథ్ లని కాంప్లిమెంట్ చేశాడు. కళ్యాణ్ రామ్ ట్వీట్ కి సాయి ధరమ్ తేజ్ “అన్నా, థాంక్యూ సో మచ్” అంటూ ట్వీట్ చేశాడు.