సంక్షేమ పథకాలు అందించాం.. గతం కంటే రెట్టింపు మెజార్టీతో గెలుస్తాం..!
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వెంకటే గౌడ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.. నామినేషన్ అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరోసారి ఎగురుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మన అభ్యర్ధిపై విమర్శలు చేశారు.. ఊరు, పేరు లేని వారు నాపైన గెలువగలరా? అని ఎద్దేవా చేశారు.. కానీ, అదే ఊరు, పేరు లేదు అని విమర్శలు ఎదురుకున్న వెంకటే గౌడ 33 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారని వెల్లడించారు.. అప్పటికి మన ప్రభుత్వం లేదు, అయినా భారీ మెజారిటీతో గెలిచాం.. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్ని అభివృద్ధి పనులు చేసి, ఇన్ని సంక్షేమ పథకాలు అందించాం.. ఈ నేపథ్యంలో మనం గతం కంటే రెట్టింపు మెజారిటీతో గెలవాలి.. కనీసం 66 వేల ఓట్ల మెజారిటీతో ఈసారి పలమనేరులో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
నాకు భారీ మెజార్టీ రాబోతోంది.. అది ఒక్కటే కారణం..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ఆగ్రహం కారణంగా నాకు భారీ మెజార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్.. తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, తన నివాసంలో సర్వమత ప్రార్ధనల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తిలక్ రోడ్డు నుంచి శ్యామలానగర్, గోరక్షణపేట, జాంపేట, దేవీచౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి భారీగా ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్ధిని దగ్గుబాటి పురంధేశ్వరిలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.. ఇక, ఆదిరెడ్డి వాసుతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు రాజమండ్రి చరిత్రలో లేనివిధంగా నా నామినేషన్ కు కార్యకర్తలు తరలివచ్చారని తెలిపారు ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం ఇవాళ నామినేషన్ సందర్భంగా కనిపించింది.. 50 వేలకు పైగా మెజార్టీతో కూటమి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు.. సీఎం జగన్ పై ఉన్న ఆగ్రహం కారణంగానే నాకు భారీ మెజార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్..
జనసేన గూటికి వట్టి పవన్ కుమార్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆశించిన టికెట్ దక్కక కొందరు.. తమకు గుర్తింపు లేదని మరికొందరు.. తమను పట్టించుకోవడం లేదని ఇంకా కొందరు పార్టీ కండువా మార్చేస్తున్నారు.. ఇక, మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వట్టి పవన్ కుమార్‌తో పాటు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కాటి కిరణ్, వైసీపీ సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ నాయకులు ముత్యాల బాలీజీతో పాటు పలువురు నాయకులు జనసేనలో చేరారు.. అందరికీ జనసేన కండువాలో కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మరోవైపు.. అమలాపురానికి చెందిన సీనియర్ కాపు నాయకులు నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్, నల్లా సంజయ్‌లు కూడా పవన్ సక్షంలో ఈ రోజు జనసేన పార్టీ గూటికి చేరారు.
పక్కా ప్లాన్‌తో చేసిన దాడే.. ఆకతాయిల చర్య కాదు..!
విజయవాడలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే.. అది ఆకతాయిల చర్య కాదన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రచార రథాలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు.. మన రాష్ట్రంలో మళ్లీ సీఎం వైఎస్ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇక, సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే.. ఇది ఆకతాయిల చర్య కాదని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై దాగి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితం అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి.. కానీ, వాళ్లను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ప్రశ్నించారు. బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుందన్నారు. తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా..? అని నిలదీశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
రాయలసీమలో రచ్చ చేస్తున్న బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్టార్ క్యాంపెనర్ గా మారి పార్టీని, పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మూడోసారి మరోసారి బరిలోకి దిగారు.. అయితే ఆయన తన నియోజకవర్గంలో పాటు రాయలసీమలోనూ అనేక నియోజకవర్గాలలో రోడ్షోలు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలకృష్ణ సందడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామంటున్నారు..
హనుమకొండ జిల్లాలోని డి కన్వెన్షన్ హల్ లో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్లమెంట్ సన్నాహాకా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్వీ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. కడియం కావ్య స్థానికురాలే.. కొత్త మంది నాయకులు అవాస్తవాలు పలుకుతున్నారు.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డాడు అని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి సేవాభావంతో రావాలి తప్ప.. వ్యాపారం చేసేందుకు కాదన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తాం అని చెబుతున్నారు అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇక, దేశంలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికోట్టాలి.. బీజేపీ నేతలు రామున్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.. కడియం కావ్యను గెలిపించాలి.. కడియం కావ్య గెలిస్తే వర్ధన్నపేటకు సాగు, తాగు నీటిని అందిస్తామన్నారు. రాష్ట్రానికి బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు ఏం చేయలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్దే ఇప్పటికి కనిపిస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ స్థానాల్లో విజయం సాధించబోతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయలు చేస్తున్నారు..
కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఆలుగునూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ సన్నాహక ఎన్నికల సమావేశంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న 316 బూత్ లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకురావాలని తెలిపారు. బండి సంజయ్ గెలిచిన అప్పటి నుంచి ఒక్క మండలానికి, గ్రామానికి వెళ్ళలేదు.. ప్రజల ఇబ్బందులు తెలుసుకోలేదు అని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. వచ్చే వర్షాకాల పంటలకు 500 రూపాయల బొనస్ తో ధాన్యం కొనుగోలు చేసి తీరుతామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఫ్రీ జర్నీ చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
స్వీపర్ కొడుకు సివిల్స్ సాధించాడు..
స్వీపర్ కొడుకు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 32 ఏళ్ల ప్రశాంత్ సురేష్ భోజానేకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో 849వ ర్యాంక్ సాధించారు. తన కలను సాధించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు. 2015లో ప్రశాంత్ తొలిసారిగా యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యారు. తన 9వ ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో అతని కుటుంబం బుధవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. అతని కుటుంబం నివసించే ఖర్తాన్ రోడ్ స్వీపర్ కాలనీలోని నివాసితులు ప్రశాంత్ విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రశాంత్ తల్లి థానే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ)లో స్వీపర్‌గా పనిచేస్తుండగా.. అతని తండ్రి క్లాస్-4 ఉద్యోగిగా ఉన్నారు. ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఐఏఎస్ అధికారి కావాలనే కలతో ఉద్యోగం చేయకుండా కష్టపడ్డాడని అతని కుటుంబం వెల్లడించింది. యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న సమయంలో 2020లో ఢిల్లీలో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌లో పనిచేశానని, అక్కడ విద్యార్థుల మాక్ ఎగ్జామ్ పేపర్లను చెక్ చేసే పని చేశానని ప్రశాంత్ చెప్పారు. ఈ విధంగా నేను చదువుకోవడంతో పాటు జీవనోపాధి పొందగలిగానని చెప్పారు.
‘ద్రౌపది లాంటి పరిస్థితి వస్తుంది’.. వివాదాస్పదమైన అజిత్ పవార్ వ్యాఖ్యలు..
మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాని ఉద్దేశిస్తూ ‘‘ ద్రౌపది’’ వ్యాఖ్యలు చేశారు. బారామతి నుంచి పోటీ చేస్తున్న తన భార్య సునేత్ర తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇదే స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. బుధవారం ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో లింగ నిష్పత్తిలో తేడా ఉందని, వెయ్యి మంది అబ్బాయిలకు దాదాపుగా 850 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని, ఇలాగే కొన్ని చోట్ల 790 మంది ఆడపిల్లలు ఉన్నారని, ఇది చాలా సమస్యలకు దారి తీస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ‘ద్రౌపది’(ద్రౌపది ఐదుగురితో వివాహం) ఆలోచించే పరిస్థితి వస్తుందని అన్నారు. మహాభారతం ప్రకారం.. ద్రౌపది పంచ పాండవులను పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఆమె ఎనర్జీకి కారణం సె*క్స్.. ఎంపీ అభ్యర్థి కామెంట్స్ వైరల్
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు పాలైంది. ఆ పార్టీ నేత షాజహాన్ షేక్ మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణలతో రాష్ట్రం అట్టుడికింది. ఇక పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. స్థానిక మీడియా రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఊహించని సమాధానం ఇచ్చింది. అది కూడా నవ్వుతూ.. సంతోషంగా సమాధానం ఇచ్చింది. ఎనర్జీకి కారణమేంటి? అని మీడియా ప్రతినిధి అడిగితే.. ఠక్కున తడబడకుండా ‘సె*క్స్’ అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ 2వ కూతుర్ని చూశారా.. ఈమె కూడా హీరోయిన్ మెటీరియలే?
గత కొన్ని రోజులుగా నటులే కాదు, వారి వారసులు కూడా ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతున్నారు అవుతున్నారు. అయితే వారు సినిమాల్లోకి రావడమే ఇందుకు కారణమని అంటున్నారు. కానీ, కొంతమంది నటీనటుల వారసులు సినిమాల్లోకి రాకపోయినప్పటికీ, నెటిజన్లు ఎలాగోలా వారిని కనిపెట్టి వైరల్ చేస్తున్నారు. అలా నటుడు అర్జున్ రెండో కూతురు ఈ మధ్య ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమె పేరు అంజన. ఒకప్పుడు అగ్ర కథానాయకుడుగా అర్జున్ సర్జా అందరికీ తెలుసు. ప్రస్తుతం పలు ప్రముఖ హీరోల చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒకరు ఐశ్వర్య మరొకరు అంజన. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ తమిళంలో పట్టతు యాని, కన్నడలో ప్రేమ పరాహా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా విశ్వక్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఇగో ప్రాబ్లమ్స్ వలన ఆ సినిమా ఆగింది. ఇక ఇప్పుడు నటుడు రామయ్య కుమారుడితో పెళ్ళికి సిద్ధం అయింది. అయితే అక్క నాన్న బాటలోనే నటిగా మారితే చెల్లెలు అంజన అలా కాదు. నటీనటుల సంతానంలో కొందరు తమ తల్లిదండ్రుల మాదిరిగానే సినిమాల్లోకి ప్రవేశిస్తే, మరికొందరు తమకు సంబంధం లేని రంగంలోకి దిగుతున్నారు. అలాంటి వారిలో అంజనా ఒకరు. అంజనా స్వయం ఉపాధితో ఎదగాలని అనుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మోడల్‌గా మారి పోజులిచ్చి మరీ ఫోటోషూట్‌లు చేసింది. అంజనకు ఇప్పుడు 28 ఏళ్లు. కొన్నాళ్ల క్రితమే ఆమె ‘సర్జా వరల్డ్’ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ‘సర్జా వరల్డ్’ అనేది హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్, ఏడాదిన్నర క్రితం ఆమె ఈ కంపెనీని ప్రారంభించింది. ఇక తాజాగా అంజనా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.
బన్నీ ఆల్ టైం రికార్డ్.. బాలీవుడ్ స్టార్స్ ను సైతం తలదన్ని!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే అనేక రికార్డులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2021 వ సంవత్సరంలో సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేసిన పుష్ప ది రైజ్ సినిమా అద్భుతమైన హిట్ అయింది. కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు నార్త్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఊహించని విధంగా ఈ సినిమాకి వందల కోట్ల కలెక్షన్ వచ్చి పడ్డాయి. ఇక మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క రైట్స్ అమ్మకం హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన నార్త్ ఇండియన్ రిలీజ్ రైట్స్ ఏఏ ఫిలిమ్స్ కి చెందిన అనిల్ తడాని సంపాదించారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఇందు కోసం ఆయన వెచ్చించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ దాదాపుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. 250 కోట్లు అనేది బేస్ ప్రైస్ అని సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించే కలెక్షన్ ను బట్టి 300 కోట్ల వరకు సినిమా రేట్ పెంచవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక డిజిటల్ రైట్స్ సంపాదించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ ఉండేది. ఆ సినిమాకి దాదాపు 170 కోట్లు డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాకి దాదాపు రెట్టింపు అమౌంట్ కి ఈ పుష్ప 2 రైట్స్ అమ్ముడుపోవడం ఆల్ టైం రికార్డు. ఇక ఈ దెబ్బతో అల్లు అర్జున్, పుష్ప 2 ఖాతాలలో మరో రికార్డు పడినట్టే.