షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను పలు సందర్భాలలో పలు ప్రాంతాలలో రేప్ చేశాడని తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తోంది. ఇక గత ఎన్నికల ముందు జానీ మాస్టర్ జనసేనలో జాయిన్ అయ్యి ప్రచార బాధ్యతలు కూడా చేపట్టారు. ఏపీ మొత్తం ప్రచారం ఆయనే చూసుకున్నారు. ఆయనకు ప్రచార కమిటీ పదవి కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ రేప్ కేసు నేపథ్యంలో జనసేన పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అంటూ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు.
విశాఖ-దుర్గ్ వందేభారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి
విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విశాఖ జంక్షన్‌లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ వందేభారత్ రైలు నిలిచింది. ఏపీ,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు ప్రయాణించనుంది. దీంతో విశాఖ నుంచి వందే భారత్ నెట్‌వర్క్ నాలుగుకు పెరిగింది. ప్రస్తుతంవిశాఖ-,సికింద్రాబాద్ మధ్య 2, విశాఖ-భువనేశ్వర్ మధ్య ఒక వందేభారత్ రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి. రాయ్‌పూర్-విజయనగరం మార్గంలో ఇది మొదటిది కావడం గమనార్హం. విశాఖ-దుర్గ్ వందేభారత్.. దుర్గ్ నుంటి వారానికి 6 రోజులు ఉదయం 5.45 గంటలకు బయలు దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-దుర్గ్ వందేభారత్ విశాఖ నుంచి వారానికి 6 రోజులు 02.50 గంటలకు బయలుదేరి.. అదేరోజు రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ళను నడిపి ప్రపంచానికి మేకిన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామన్నారు. ప్రస్తుతం రైల్వేలు, పౌర విమానయాన సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ముడసర్లోవ దగ్గర 52 ఎకరాలను రైల్వేశాఖ కు జిల్లా యంత్రాగం అప్పగించింది. రాష్ట్ర విభజన సమయంలో జోన్ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 27న భారత ప్రభుత్వం ఈ జోన్ ఏర్పాటును ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
అమరావతి సురక్షితం.. 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది లేదు..
అమరావతి చాలా సురక్షితంగా ఉంది.. భవిష్యత్‌లో కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ.. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన ఆయన.. అనవసర ప్రచారం నమ్మవద్దు అన్నారు.. బుడమేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు.. కొండవీటి వాగు వల్ల కూడా ఇబ్బంది లేదన్నారు.. అమరావతి చాలా సురక్షితంగా ఉందన్నారు.. ఇక, కొండవీటి వాగు, పాల వాగులపై త్వరలో టెండర్లు పిలిచి పనులు చేస్తాం అన్నారు.. ఇక, బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు.. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదు.. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నాం.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ని డిజైన్ చేస్తున్నాం అన్నారు. వచ్చే రెండు నెలలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షా కాలం లోపు పూర్తి చేస్తాం అన్నారు.. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్ ని సైతం డిజైన్ చేయటం జరుగుతుందని వెల్లడించారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్ కి పంపించటం జరుగుతుంది.. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదు.. కరకట్టని 4లైన్లతో గతంలో డిజైన్ చేశామని.. ఐకాన్ బిల్డింగ్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు.. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80 శాతం పూర్తి చేయటం జరిగిందన్నారు మంత్రి నారాయణ.. రైతులకి కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ చేయటం జరిగింది.. ల్యాండ్ పూలింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారు.. వాటి పై క్లారిటీ వస్తే భూములు ఇవ్వటానికి ముందుకి వస్తామని రైతులు మాట్లాడారని పేర్కొన్నారు మంత్రి నారాయణ. కాగా, ఓవైపు కృష్ణానదిలో భారీ వరద.. బుడమేరు కాలువకు గండ్లు.. ఇంకోవైపు భారీ వర్షంతో విజయవాడ అతలాకుతలం అయిన విషయం విదితమే.. దీంతో.. అమరావతి రాజధానిపై కూడా కొంత ప్రచారం జరిగిన నేపథ్యంలో.. దానిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.
రేపే కేజ్రీవాల్ రాజీనామా.. ఎల్జీ అపాయింట్‌మెంట్!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పొలిటికల్‌గా తీవ్ర సంచలనం సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన పలుమార్లు బెయిల్‌కు అప్లై చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ వేడిలోనే ప్రభుత్వం రద్దైతే.. తనను కేంద్రం ఇబ్బంది పెట్టి.. జైల్లో పెట్టిన విషయం ప్రజలకు గుర్తుంటుందని కేజ్రీవాల్, ఆప్ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిగితే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చని ఆప్ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
జూడాలకు సీఎం మమత చివరి ఆహ్వానం.. నెక్ట్స్ ఏంటి?
కోల్‌కతాలో నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను బెంగాల్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే నాలుగు సార్లు మమత సర్కార్ చర్చలకు పిలిచింది. కానీ డాక్టర్లు మాత్రం చర్చలు నిరాకరించారు. దీంతో సోమవారం ఐదోసారి.. ఇదే చివరి ఆహ్వానం అంటూ జూడాలకు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ చర్చలకు ఆహ్వానించారు. సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్ నివాసంలో సమావేశానికి రావాలని డాక్టర్లను సీఎం మమత పిలిచారని మనోజ్ పంత్ స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లు ఓపెన్ మైండ్‌తో చర్చలకు రావాలని కోరారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో రికార్డింగ్ అనుమతించబడదని మనోజ్ పంత్ స్పష్టం చేశారు. సమావేశం యొక్క మినిట్స్ మాత్రం రికార్డ్ చేయబడతాయని వెల్లడించారు. ఇరు పక్షాల నుంచి సంతకాలు చేయబడతామని స్పష్టం చేశారు. సమావేశాన్ని లైవ్ టెలీకాస్ట్ చేయాలంటూ డాక్టర్లు పట్టుబడుతున్నారు.. దీంతో భేటీపై ప్రతిష్టంభన నెలకొంది. కనీసం టీ తాగేందుకైనా రావాలని ప్రభుత్వం ఆహ్వానించినా రాలేదు. న్యాయం జరిగాకే టీ తాగుతామని డాక్టర్లు స్పష్టం చేశారు. సోమవారం చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్లను హెచ్చరించింది. మరీ ఈ సమావేశానికైనా జూడాలు వస్తారా? ఎప్పటిలాగానే మొండిపట్టుపడతారా? చూడాలి. ఇప్పటికే నెల రోజులకు పైగా డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఈ సమావేశానికి డాక్టర్లు రాకపోతే.. తదుపరి బెంగాల్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
అహ్మదాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఫేజ్ 2లో మొత్తం 21 కిలోమీటర్ల మేరకు పొడిగించారు. ఎనిమిది కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు. అనంతరం సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రధాని మోడీ మెట్రో రైడ్ చేశారు. ఈ సందర్భంగా రైల్లో విద్యార్థులతో ముచ్చటించారు. జూన్ 9న 3.0 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్ట్ ప్రజలకు మెరుగైన సేవలు అందించనుంది. పట్టణ మరియు విద్యాకేంద్రాల మధ్య ప్రయాణించే పర్యాటకులకు మెరుగైన సేవలను అందించనుంది. ఇక ఈ సేవలు సెప్టెంబర్ 17న (మంగళవారం) ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీ (GNLU), పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU), GIFT సిటీ, రేసన్, రాండేసన్, ధోలకువా, ఇన్ఫోసిటీ మరియు సెక్టార్-1 వంటి ప్రధాన స్థానాలను అనుసంధానిస్తుంది. మొత్తం వ్యయం రూ.5,384 కోట్లు. AFD (ఫ్రాన్స్) మరియు KfW (జర్మనీ)తో సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులు రాబట్టింది. ఈ మెట్రో రైలు అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ప్రయాణికులు APMC నుంచి GIFT సిటీకి సుమారు రూ. 35 ధరతో గంటలోపు ప్రయాణించవచ్చు.సెక్టార్-1 మెట్రో స్టేషన్ నుంచి మోటెరా స్టేడియం మెట్రో స్టేషన్ వరకు సేవలు ఉదయం 7:20 నుంచి సాయంత్రం 6:40 వరకు నడుస్తాయి. GNLU మెట్రో స్టేషన్ మరియు GIFT సిటీ మెట్రో స్టేషన్ మధ్య నడిచే రైళ్లు ఉదయం 8:20 నుండి సాయంత్రం 6:25 వరకు అందుబాటులో ఉంటాయి. GIFT సిటీ మెట్రో స్టేషన్ నుంచి GNLU మెట్రో స్టేషన్ వరకు సేవలు ఉదయం 7:18 నుంచి సాయంత్రం 6:38 వరకు నడుస్తాయి. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఫ్రీక్వెన్సీ మరియు సమయాలను తర్వాత దశలో పెంచే అవకాశం ఉంది.
అపాచీ బైక్, 3 లక్షలు ఇవ్వలేదని భర్త దారుణం..
వరకట్న దాహానికి ఓ అమ్మాయి బలైంది. కట్నం ఇవ్వలేదని భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. కట్నంగా ఇస్తామని చెప్పిన టీవీఎస్ అపాచీ బైక్, రూ. 3 లక్షల నగదు ఇవ్వకపోవడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతిని ఆమె తల్లిగారి ఇంటి నుంచి తీసుకువచ్చిన భర్త, ఆమెను తీవ్రంగా కొట్టి చంపాడు. ఈ ఘటన అమ్రోహా జిల్లాలోని బైఖేడా గ్రామానికి చెందిన సుందర్‌కి మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కట్నం కోసం వేధించేవాడదు. దీంతో బాధిత యువతి తన తండ్రికి వేధింపుల గురించి చెప్పింది. రక్షాబంధన్ నుంచి మీనా సోహర్కాలోని తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. సుందర్ ప్రతీ రోజూ ఆమెను చూసేందుకు వచ్చే వాడు. అతను తన అత్తామామల ఇంట్లో భోజనం కూడా చేసే వాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆదివారం రాత్రి కూడా తన అత్తామామల్ని కలిసి, భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వరకట్నం విషయమై మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కట్నం ఇవ్వకపోవడంతో ఆమెపై కర్రతో దాడి చేసి గొంతుకోసి హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. మహిళ కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు.యువతి తండ్రి విజయ్ ఖడక్ బన్షీ ఆమె భర్త, అతడి తల్లి, సోదరి, మరో నలుగురిపై ఫిర్యాదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కాలేజీ హాస్టల్‌లో “గొడ్డు మాంసం”తో వంట.. ఏడుగురు విద్యార్థుల బహిష్కరణ..
ఒడిశాలోని బెర్హంపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరాలా మహారాజా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు కాలేజీ హాస్టల్‌లో ‘గొడ్డు మాంసం’’ వండారనే ఆరోపణలతో వారిని బహిష్కరించారు. ఈ ఘటనపై ఉద్రిక్తతలు పెరగడంతో అధికారులు కాలేజీ సమీపంలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బహిష్కరణలతో పాటు ఒక్కొక్కరికి రూ. 2000 జరిమానా విధించారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. దీనిపై పలువురు విద్యార్థులు డీన్‌కి ఫిర్యాదు చేశారు. ‘‘ విద్యార్థులందరి విలువలు మరియు విశ్వాసాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. ఈ సంఘటన (గొడ్డు మాంసం వండటం) అశాంతి మరియు అసౌకర్యానికి కారణమైంది, ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను దయతో అభ్యర్థిస్తున్నాము’’ అని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. హాల్స్ ఆఫ్ రెసిడెన్స్ (HoR) నియమాలు, సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా బహిష్కరించినట్లు సెప్టెంబరు 12 న స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం నుండి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబర్ 11 రాత్రి ఫల్గుణి హెచ్ఓఆర్ రూమ్ నెంబర్ బీ-23లోని విద్యార్థులు నిషేధించబడిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు నోటీసులు పేర్కొన్నాయి. ఈ సంఘటనపై బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు బీఫ్ తినడంతో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా వడ్డించారని వీహెచ్‌పీ ఆరోపించింది.
జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్.. పదవి నుంచి తొలగించాలని డిమాండ్?
జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు విషయంలో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఇక ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఒక కీలక ప్రకటన చేసింది. ఇక ఈ క్రమంలో రేపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు జానీ మాస్టర్. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో.. సమావేశం రేపటికి వాయిదా పడింది. జానీ మాస్టర్ అంశంపై రేపు అసోసియేషన్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. యూనియన్ బై లాస్ ప్రకారం జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్‌డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు వెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేశాడని, అలాగే హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతని పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.