పురంధేశ్వరితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ..
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు తర్వాత ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి.. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నేతలు.. పార్టీ అధ్యక్షులను కలుస్తూ వస్తున్నారు.. ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్.. వైసీపీకి రాజీనామా చేసిన వరప్రసాద్.. ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్‌ని కలిశారు.. అయితే, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. దీంతో ఈ రోజు ఆయన పురంధేశ్వరితో సమావేశం అయ్యారు.. పొత్తు అనంతరం బీజేపీ నుంచి తిరుపతి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారట వరప్రసాద్.. అంతేకాదు.. గతంలో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారు వరప్రసాద్.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు మార్పులు, చేర్పులు.. కొందరు సిట్టింగులకు సీట్లు లేకుండా చేశాయి.. దీంతో.. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనతోకి టచ్‌లోకి వెళ్లినా.. ఇప్పుడు పొత్తుల అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిని కలవడం చర్చగా మారింది.. ఇక, తిరుపతి పార్లమెంటు పరిధిలో వరప్రసాద్ కు ఉన్న బలం.. బలగం పై పురంధేశ్వరి, బీజేపీ ఎన్నికల సమన్వయకర్త శేఖర్ జీతో చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.
తన వ్యతిరేకవర్గంపై తీవ్రస్థాయిలో మంత్రి రోజా ఫైర్.. నగరి పరువు తీస్తున్నారు..!
ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నగరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదాలు మరింత రచ్చకెక్కుతున్నాయి.. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. మంత్రి రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఆ నియోజకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు.. అయితే, వారికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా.. నగరిలోని తన వ్యతిరేకవర్గం నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. ‘జగనన్న ముద్దు.. రోజమ్మ వద్దు..’ అంటూ ప్రతిరోజు 500 కట్టి ప్రెస్ క్లబ్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరు పార్టీలో ఉండడం వల్లే నగరిలో 500 ఓట్లు మెజార్టీ వస్తుంది.. మీరు పార్టీ నుండి బయటకు వెళ్తే.. నగరిలో 30,40 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక, మీరు మాట్లాడినట్టుగా నావాళ్లు మాట్లాడితే మీరుతట్టుకోలేగలరా..? బతకగలరా..? అంటూ మండిపడ్డారు మంత్రి రోజా.. నగరిలో మాట్లాడడానికి మొహం లేక తిరుపతిలో కూర్చొని నగిరి పేరు ప్రతిష్టలు దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు.. అంతేకాదు.. మనందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు.. వారందరికీ బుద్ది చెప్పే సమయం వచ్చిందని హెచ్చరించారు. నగరిని ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేశాను అని తెలిపారు. నగరిలో ప్రతిపక్షాలతో పాటు మన పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ములు గుద్ది ఉంటున్న వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తున్నాను అన్నారు. వారితో పోరాడుతూ ఇంకోపక్క ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని అందిస్తున్నాను అని వెల్లడించారు. జగనన్న ఏ విధంగా ప్రతిపక్షాలతో పోరాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయిస్తున్నారో.. నేను అలానే చేస్తున్నాను అన్నారు మంత్రి ఆర్కే రోజా.
వారిని ఇంటికి సాగనంపితేనే రైతాంగానికి మంచి రోజులు..!
రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతుల్ని వంచించిన సీఎం జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వ్యవసాయరంగం, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలోనిలిపిన జగన్ రెడ్డి, రైతుల అప్పుల్లో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలిపాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చే శారు రవీంద్రకుమార్.. టీడీపీ ప్రభుత్వంలో 73 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ప్రకృతి విపత్తులు, కరువు వల్ల రాష్ట్ర రైతాంగం రూ.80 వేల కోట్లు నష్టపోయింది. ధాన్యం సేకరణలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో వరిరైతులు 5 ఏళ్లలో రూ. 21 వేల కోట్లు నష్టపోయారు. విద్యుత్ సబ్సిడీ ధర పెంపుతో ఆక్వా రైతులు రూ. 10 వేల కోట్లు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లేక రైతాంగం రూ. 10 వేల కోట్లు నష్టపోయిందని గణాంకాలు వెల్లడించారు. చంద్రబాబు పాలనలో ఖరీఫ్, రబీ సీజన్లలో కోటి 42 ఎకరాలు సాగైతే, జగన్ రెడ్డి హాయాంలో 2023-24లో రెండు సీజన్లలో కూడా కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే సాగైందన్నారు.
పొత్తులపై మాకొక ప్రొసీజర్ ఉంటుంది.. నేను ప్రామిస్‌లు ఎప్పుడూ చేయను..
ఢిల్లీ స్థాయిలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులు కుదిరాయి.. ఇక, రాష్ట్రస్థాయిలో చర్చలు ప్రారంభం అయ్యాయి.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పొత్తులపై మాకొక ప్రొసీజర్ ఉంటుందన్నారు.. మా విధానంలో భాగంగా కేంద్ర మంత్రి.. రాష్ట్రానికి వచ్చినట్టు వెల్లడించారు.. కేంద్రమంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, జయంత పాండా, నాదెండ్ల మనోహర్ చర్చలు జరుగుతుండగా.. షెకావత్-టీడీపీ-జనసేనతో చర్చించిన తరువాత నిర్ణయం వస్తుందన్నారు. అయితే, నేను సీట్ల విషయంలో ప్రామిస్ లు ఎప్పుడూ చేయను అని స్పష్టం చేశారు.. మా సిద్ధాంతాలు, క్రమశిక్షణ అనుకూలంగా వచ్చిన వారు కలుస్తారని వెల్లడించారు.. ఇక, వైసీపీ ఎంఎల్ఏ వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని పేర్కొన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం..
భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు ఫాంహౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా.. భద్రాచలం దేవస్థానంను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీరందరూ మంచి మెజారిటీతో బలరాం నాయక్ ను గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడు పేదల పక్షం.. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రతి గారంటీని పేదలకు అందిస్తామని తెలిపారు. గతంలో ఆర్టీసీ రెట్లు పెంచితే.. కాంగ్రెస్ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని పేర్కొన్నారు. శ్రీరామ చంద్రుడు ఆలయం వద్ద చెబుతున్నాం… హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సాక్షాత్తు భద్రాద్రి రాముడి సమక్షంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మొందికుంట ప్రాజెక్ట్, పాలెం వాగు ప్రాజెక్ట్, పగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు.. సీతారామ ద్వారా జిల్లా మొత్తం నీళ్ళు ఇచ్చే ప్రక్రియ చేపడుతామన్నారు. అంతేకాకుండా.. కరకట్టను పూర్తి చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన అప్పులున్నప్పటికి అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇస్తామని అన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ఇచ్చిన విధంగా భట్టి ఇవ్వాలని కోరుతున్నాం.. మీ ముందు శభాష్ అనిపించుకుంటాం.. తప్ప ఛీ ఛీ అనిపించుకోమన్నారు.
సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్.. తెలంగాణలోని 8 స్థానాలపై క్లారిటీ
బీజేపీ రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం అయింది. అందుకోసం.. సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌లతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే 195 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. మరో 150 మందిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 8 స్థానాలపై నేటి సమావేశంలో క్లారిటీ రానుంది. మరోవైపు.. ఆదివారం బీఆర్ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. దీంతో.. వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు.. ఏపీలో పొత్తులో భాగంగా పోటీ చేసే 6 ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని రాష్ట్రాల అధికారులతో సీఈసీ భేటీ.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. ఇక ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. సీఈసీ రాజీవ్‌కమార్, సీనియర్ ఎన్నికల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానంపై ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో మొత్తం 2150 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ట్వీట్ చేసింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఈసీ ట్వీట్ చేసింది.
షెహబాజ్ షరీఫ్ కేబినెట్లో 19 మందికి చోటు!
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి 19 మంది పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి సిఫార్సు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ పేర్లను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లయితే, వారు త్వరలో మంత్రిగా ప్రమాణం చేయవచ్చు. డాన్ వార్తాపత్రిక ప్రకారం, అధ్యక్షుడు జర్దారీకి పంపిన లేఖలో 19 మంది పేర్లు ఉన్నాయి, ఇందులో 12 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులు, ముగ్గురు సెనేటర్లు ఉన్నారు. ఒక రోజు ముందు కేబినెట్‌కు సంబంధించి ప్రధాని షరీఫ్ మారథాన్ సమావేశాన్ని నిర్వహించారు. డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం, పేర్లను ఖరారు చేయడానికి సమావేశం ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగింది. 19 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గాన్ని నియమించాల్సిందిగా అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచించారు.
నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర ఎన్ని కోట్లో తెలుసా?
ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఎప్పుడు ఖరీదైన వస్తువులను వాడుతూ వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ఆ పెళ్లిలో ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.. ఇప్పుడు మరోసారి ఖరీదైన నగ, ఇయర్ రింగ్స్ ధరించి అందరిని ఆకట్టుకున్నారు.. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దాని ధర విని అందరు షాక్ అవుతున్నారు.. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది.. ఇటీవల ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్లో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా చేసిన దాతృత్వ సేవలకు గాను ‘బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు’ అందుకున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ మేడ్ జాంగ్లా డిజైన్ బనారసీ చీరలో అందరిని ఆకట్టుకుంది.. అలాగే ఇయర్ రింగ్స్ కూడా కోటికి పైగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చక్రవర్తి శిరస్సుపై కల్గిని మళ్లీ తయారు చేశారట.. ఈ అరవంకి ధర దాదాపుగా 200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం..ఏది ఏమైనా దీని ధర మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. లీక్ చేసేసిన సోదరుడు!
ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒక్క టాలీవుడ్ అనే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ జంటలుగా మారుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే మరో యంగ్ హీరో వివాహానికి సంబంధించిన వార్త కూడా తెర మీదకు వచ్చింది. ఆయన ఇంకెవరో కాదు చాలా సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు చేస్తూ డీజే టిల్లు సినిమాతో బ్రేక్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ బబుల్ గం సినిమాతో మంచి పేరు సంపాదించారు. మధ్యలో మరో రెండు మూడు సినిమాలు కూడా చేసిన ఆయన తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా చైతు జొన్నలగడ్డను సిద్దు జొన్నలగడ్డ వివాహం గురించి యాంకర్ ప్రశ్నించాడు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు వింటున్నాం అది నిజమేనా అని అడిగితే దానికి చైతు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. స్టార్ హీరోయిన్ ని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ స్టార్ హీరోని చేసుకుంటేనే కదా ప్రాబ్లం అని అంటూ నవ్వేశాడు. అయితే స్టార్ హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు కానీ అతనికి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అయితే ఉందని చైతూ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది కూడా వివాహం జరుగుతుందో లేదో తెలియదు ఆ సమయానికి అన్నీ కుదిరితే జరిగిపోవచ్చు అని ఆయన పేర్కొన్నాడు.
నాకు ఆ పిచ్చి ఎక్కువ.. ఏ డైరెక్టర్ ఆఫర్ చేయలేదు
మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లయిన మూడేళ్లకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక హీరోయిన్ గా తన కెరీర్ ను మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. నటిగా, నిర్మాతగా ఆమె ముందు ముందు విజయాలను అందుకోవడానికి బాగానే కష్టపడుతుంది. ఇక తాజాగా నిహారిక.. ఆహాలో యాంకర్ గా మారింది. చెఫ్ మంత్ర సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మార్చి 8 న ఈ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కూడా అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ” ఈ మధ్య నాకు తిండి పిచ్చి ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా పప్పుచారు కనిపిస్తే అస్సలు వదలడంలేదు. ఇక ట్రావెలింగ్ కు ఎక్కువ వెళ్తున్నాను. ఏది కావాలని ప్లాన్ చేసుకొని వెళ్లడం లేదు. ఈ ట్రావెల్ కు అయ్యే ఖర్చు నేనే దాచుకుంటున్నాను. నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, ఏ డైరెక్టర్ నాకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయలేదు. అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తా. ప్రస్తుతం చెఫ్ మంత్ర చేస్తున్నా.. ఈ షోలో నాన్నమ్మను, సురేఖ అమ్మను, ఉపాసన వదినను తీసుకురావాలని ఉంది. నాకు ఆడిషన్స్ కు వెళ్లడం అంటే ఇష్టం.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు ఆడిషన్ చేయరు అంటారు. ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్ మంచి సినిమాకు నన్ను ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చింది.