త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర చోటుచేసుకుంది. దుండగుడి కాల్పుల్లో ఇద్దరు దౌత్యవేత్తలు ప్రాణాలు వదిలారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్- మిషన్ 2 లో మంటలు చెలరేగాయి. ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పైప్ లైన్ దెబ్బ తినడం కారణంగా లీకేజ్ జరిగినట్టు గుర్తించారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. స్టీల్ ప్లాంట్ ఫైర్ డిపార్ట్మెంట్ , రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో సిబ్బంది పరుగులు తీశారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది జరగలేదని తెలిసింది.
నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు
ఉగ్ర కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్ లను కేంద్ర కారాగారం నుంచి విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. సిరాజ్ సమీర్ లను విజయనగరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. నిన్న రాత్రి 10:30 నిమిషాలకు విజయనగరం పోలీసులకు సిరాజ్, సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతులు పేపర్స్ అందడంతో ఉదయాన్నే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు విజయనగరం పోలీసులు. రెండు వాహనాల్లో విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు విజయనగరం పోలీసులు.
కవిత లేఖ వెనుక రాజకీయం.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా పత్రికల్లో వచ్చిన లేఖ. ఈ లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా కవిత ఈ లేఖ రాశారా? లేదా ఆమె పేరుతో వేరే ఎవరైనా విడుదల చేశారా? అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. ఈ లేఖ విడుదల వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని డీకే అరుణ ఆరోపిస్తున్నారు. ఇది కేవలం కుటుంబ భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదని, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కవిత లేఖను కాంగ్రెస్ పార్టీనే విడుదల చేసిందా? బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టకపోవడం ద్వారా కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలన్న ఆలోచనగా ఇది కనిపిస్తోందని ఆరోపించారు.
ఏపీలో మరో కేసు.. రిమ్స్ హాస్పిటల్ లో కోవిడ్ కేసు నమోదు..
ఆంధ్రప్రదేశ్ లో మరో కోవిడ్ కేసు నమోదైంది. నిన్న విశాఖపట్నంలో మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నేడు రిమ్స్ హాస్పిటల్ లో కోవిడ్ కేసు నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమర్రి కి చెందిన 70 సంవత్సరాల మహిళలకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత నాలుగు రోజులుగా దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న మహిళకు కోవిడ్ గా గుర్తించారు వైద్యులు. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య రెండుకు చేరినట్లైంది. రిమ్స్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. రిమ్స్ లో కోవిడ్ 19 కోసం పది బెడ్స్ ఏర్పాటు చేశారు వైద్యులు.
వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వంశీని 2 రోజులపాటు కోర్టు అనుమతితో విచారించనున్నారు పోలిసులు. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
శాన్ డియాగోలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
శాన్ డియాగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస వీధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇళ్లులు, కార్లు దగ్ధమైపోయాయి. ఇక సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో సౌండ్ టాలెంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. స్టోరీ ఆఫ్ ది ఇయర్ మరియు పియర్స్ ది వీల్ వంటి రాక్ బ్యాండ్‌లు ఉన్నాయి. మాజీ డ్రమ్మర్ డేనియల్ విలియమ్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మర్ఫీ కాన్యన్ పరిసరాల్లో ఒక ఇల్లు ధ్వంసమైందని.. మరో 10 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. కార్లు దగ్ధమయ్యాయి.
ఉన్నత చదువుల నుంచి ఉద్యమబాట వైపు.. ‘ఆపరేషన్ కగార్’లో షాద్‌నగర్ యువతి మృతి
రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పన్నెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ కగార్’లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా, ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా విషాదకరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. సుదీర్ఘ కాలం పాటు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు దూరంగా ఉన్న విజయలక్ష్మి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అందరూ ఆమె సురక్షితంగా ఉందని ఆశించారు.
ఉగ్రవాదులపై వేట.. ఒక జవాను వీరమరణం
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చత్రోలోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు. చత్రో ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు దాక్కుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ తీవ్ర ఎన్‌కౌంటర్‌గా మారింది. మొదటి రోజు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే మిగిలిన ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లో దాక్కున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రెండో రోజు కూడా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో సెపాయ్ గాయ్కర్ సందీప్ పాండురంగ్ అనే జవాన్ వీరమరణం పొందారు. ఆయన త్యాగానికి గుర్తింపుగా జమ్మూ కశ్మీర్‌లో రీత్ లేయింగ్ సెరిమనీ నిర్వహించారు. ఇక ఉగ్రవాదులు దాక్కున్న స్థలాలను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు.
నేను ఆడలేను.. బీసీసీఐకి చెప్పేసిన బుమ్రా!
వచ్చే నెలలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో యువకులకు అవకాశం దక్కనుంది. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న వారిలో కూడా టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక టెస్ట్ సిరీస్ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ బాంబ్ పేల్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో తాను ఐదు టెస్ట్‌లు ఆడలేనని బీసీసీఐకి జస్ప్రీత్ బుమ్రా సమాచారం ఇచ్చాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం తన శరీరం మూడు టెస్ట్‌ల కంటే ఎక్కువ సహకరించిందని, ఇంగ్లండ్ పర్యటనలో అన్ని టెస్ట్‌లు తాను ఆడలేనని బీసీసీఐ సెలెక్టర్లకు చెప్పాడట. బుమ్రా పరిస్థితిని అర్ధం చేసుకున్న బీసీసీఐ.. ఆయన అభ్యర్థనకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రేపు పూర్తి క్లారిటీ రానుంది.