కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల లోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి లేదా కూల్చేయాలని సూచించింది. భవన యజమానికి అభ్యంతరాలుంటే 18 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం..సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ అధికారులు భవనాలు లేదా చెట్లను స్వయంగా కూల్చే అధికారం కల్పించింది. ఆమోదం లేకుండా నిర్మించిన భవనాలు ,వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి తక్షణంగా తొలగించవచ్చని కేంద్రం తెలిపింది.
కేరళ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై సామాన్యులు పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లను ఉపయోగించలేరు
కేరళ హైకోర్టు పబ్లిక్ వాష్‌రూమ్‌లకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్‌లు సాధారణ ప్రజల ఉపయోగం కోసం కాదని తెలిపింది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లను బహిరంగంగా బహిర్గతం చేయకూడదని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పంపుల యజమానుల తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లను ప్రజా సౌకర్యంగా వర్గీకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలపై పంపుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. నేడు తులం ఎంతంటే?
బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు తులం పసిడి ధర రూ. 170 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,18, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,265 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ. 92,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 పెరిగింది. దీంతో రూ. 1,01,080 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,210 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు కిలో సిల్వర్ పై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,22,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,12,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల్లో ఆందోళన
ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం (SpiceJet)లో ప్రయాణికులకు కలవరాన్ని కలిగించే సంఘటన చోటుచేసుకుంది. విమానం తిరుపతి దిశగా ప్రయాణిస్తుండగా, ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకమునుపే, విమానాన్ని వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వారు తమ గమ్యస్థానమైన తిరుపతికి చేరుకుంటున్నామని భావించిన సమయంలో విమానం మళ్లీ షమ్‌షాబాద్‌కు తిరిగిరావడంతో విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక, ప్రయాణంలో ఏర్పడిన అంతరాయం వల్ల ప్రయాణికులలో అసహనం కూడా పెరిగింది. విమానయాన సంస్థ అధికారులపై తమ అసంతృప్తిని తెలియజేస్తూ, తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన కారణంగా.. ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్ గజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర అంబటి తన సోదరుడు మురళితో కలిసి బ్యారికేడ్స్ తొలగించి హంగామా చేశారు.
హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..
నటుడు సందీప్ కిషన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతని నానమ్మ ఆగ్నేసమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తాజాగా ఆరోగ్యం మరింత విషమించడంతో విశాఖపట్నంలో సోమవారం మృతి చెందినట్లు సమాచారం. ఈ విషాదాన్ని సందీప్ కిషన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.. ‘నిన్న మా నానమ్మ గారు మమ్మల్ని విడిచిపెట్టారు. మా తాతయ్య కృష్ణం నాయుడు గారు ఒక షిప్ ఆర్కిటెక్ట్ కాగా, నానమ్మ గారు విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. వారి ప్రేమ కథ ఒక సినిమా కంటే ఏ మాత్రం తక్కువ కాదు. 1960లో మతాంతర వివాహం చేసుకుని, తాతయ్య పేరు జోసెఫ్ కృష్ణం నాయుడు, నానమ్మ పేరు ఆగ్నెస్ లక్ష్మిగా మార్చుకుని ఒక ఆదర్శ జంట గా నిలిచారు. వారి ప్రేమకథ నా జీవితానికి ఇన్స్పిరేషన్. మిస్ యూ నానమ్మ… లవ్ యూ’ అంటూ సందీప్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. అతని ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తూ, సందీప్‌కు ధైర్యం చెబుతున్నారు.
దెబ్బతిన్న ఎయిరిండియా బ్లాక్ బాక్స్.. విదేశాలకు పంపే యోచన!
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. డేటా కోసం కచ్చితంగా బ్లాక్ బాక్స్‌ను అమెరికాకు పంపాల్సి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ యూఎస్‌కు పంపించాల్సి వస్తే.. ప్రొటోకాల్ ప్రకారం భారత అధికారుల బృందం కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ఇందులో రెండు పరికరాలు ఉంటాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ లేదా సీవీఆర్, అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా ఎఫ్‌డీఆర్ ఉంటుంది. దీంట్లో సమాచారాన్ని కోడీకరించాలంటే యూఎస్‌కు పంపించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
హైదరాబాద్‌లో పిల్లల అశ్లీల వీడియోల కలకలం.. 18 మంది యువకులు అరెస్ట్
పిల్లలతో సంబంధిత అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి వాటిని షేర్ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న యువకులపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అమెరికాలోని ఇంటర్నెట్ క్రైమ్ కంట్రోల్ రూమ్ (National Center for Missing & Exploited Children – NCMEC) నుంచి వచ్చిన సమాచారంపై స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం, హైదరాబాద్‌లో 18 మంది యువకులను అరెస్ట్ చేసింది. ఈ యువకులు ఇంటర్నెట్ ద్వారా చిన్న పిల్లల అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసి వాటిని మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే వారికి స్పష్టంగా నిబంధనలు తెలియజేసి, అలాంటి వీడియోలను డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోలేదని సమాచారం.
ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించండి.. కేంద్రమంత్రికి లోకేశ్ విజ్ఞప్తి!
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్‌సుఖ్ మాండవీయను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి చెప్పారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కేంద్రమంత్రి మాండవీయతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ నారా లోకేష్ మాట్లాడుతూ… అమరావతిలో రాజధాని నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయి, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ‘క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు నివ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించండి. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత అందించండి. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్.. కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో హాకీ, షూటింగ్‌లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ.341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపండి’ అని లోకేష్ కోరారు.
సిట్ కీలక నిర్ణయం.. ప్రభాకర్ రావు అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మూడు విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్, ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో, విచారణను మరింత వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం.