నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మీటింగ్‌లో వారు ప్రకటించనున్నారు. ఇందు కోసం సాధికార కమిటీల ద్వారా బీసీల నుంచి వినతులను స్వీకరించారు.
నేడు మరో రెండు సీట్లను ప్రకటించనున్న బీఆర్‌ఎస్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే నేడు మరో రెండు సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామ నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో దిగనున్నారు.
ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
లెబనాన్ భూభాగం నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గాలియోట్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రమంపై ట్యాంకు విధ్యంసక క్షిపణి దాడి జరిగినట్లు.. ఈ దాడిలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడిన అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఈ ముగ్గురు భారతీయులు కేరళకు చెందిన వారని నివేదిక పేర్కొంది.
సోమవారం ఉదయం 11 గంటలకు ఉత్తర ఇజ్రాయెల్‌లోని గెలీలీ ప్రాంతంలోని మోషవ్ (సామూహిక వ్యవసాయ సంఘం)లోని మార్గలియోట్‌లోని వ్యవసాయ క్షేత్రాన్ని ఈ క్షిపణి ఢీకొట్టిందని రెస్క్యూ సర్వీసెస్ మాగెన్ డేవిడ్ ఆడమ్ (MDA) ప్రతినిధి జాకీ హెల్లర్ తెలిపారు. మృతుడిని కేరళలోని కొల్లంకు చెందిన పట్నీబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం మృతిచెందిన వ్యక్తి మృతదేహం స్థానిక జీవ్ ఆస్పత్రిలో ఉందని అధికారులు తెలిపారు. మెల్విన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన సఫేద్‌లోని జివ్ ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఇతడు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినవాడు.
సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ టూరిస్ట్‌కు రూ.10 లక్షల పరిహారం
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు. జార్ఖండ్, దుమ్కా పోలీసులు తీసుకున్న సత్వర చర్యపై సామూహిక అత్యాచార బాధితురాలి భర్త సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏడుగురు ప్రమేయం ఉందని, ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలో ఇతర నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. ఇది సంతృప్తిని కలిగించే అంశం. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు జార్ఖండ్ ప్రభుత్వానికి, పోలీసులకు బాధితురాలి భర్త కృతజ్ఞతలు తెలిపారు.
పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తర్వాత దాదాపు ఒక నెల తర్వాత, నగదు కొరతతో ఉన్న దేశం పగ్గాలను రెండవసారి స్వీకరించిన షరీఫ్ సోమవారం పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు.. అని ఎక్స్(ట్విట్టర్)లో ప్రధాని మోడీ తెలిపారు. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు, అయితే పార్లమెంటులో మెజారిటీని పొందలేకపోయారు.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయ్యారు. ఈ కేసులో గతేడాది అనుమానితుల ఇండ్లల్లో సోదాలు చేయగా.. భారీగా ఆయుధాలను గుర్తించారు NIA అధికారులు. 2024 జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసింది ఎన్‌ఐఏ.
2023, జులైలో లష్కరే తోయిబా తీవ్రవాది నజీర్ భావజాలానికి ఆకర్షితులై పనిచేస్తున్న ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7 పిస్తోళ్లు, 4 హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు పోలీసులు.. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసు దార్యప్తులో భాగంగా..2024, జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన NIA అధికారులు… నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన బెంగళూరు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) జైలులో జీవిత ఖైదీలు, ఇద్దరు పరారీలో ఉన్నవారితో సహా ఎనిమిది మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చార్జిషీట్ దాఖలు చేసింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర పర్యటన రెండో విడత మంగళవారం ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌కు వెళ్లి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రధాన మంత్రి అమ్మవారికి పట్టు చీర , ఇతర నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) ను ప్రారంభించేందుకు బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన మోడీ, ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అంకితం చేసి, బహిరంగ సభలో ప్రసంగించారు.
కాంగ్రెస్- బీజేపీ ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉంది
తెలంగాణను గుజరాత్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత సుంకె రవిశంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ మోడల్ దేశానికీ ఆదర్శంగా ఉంది.. అనేక పథకాలను చూసేందుకు గుజరాత్ వాళ్ళు తెలంగాణకు వచ్చారన్నారు. గుజరాత్ మోడల్ అని రేవంత్ అనడం వెనుక కారణాలు ఏంటి..? ఆరెస్సెస్ మూలాల ఉన్నాయి కాబట్టే రేవంత్ అలా అన్నారని సుంకె రవి శంకర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉందని, పార్లమెంట్ సాక్షిగా మోడీ తెలంగాణ రోల్ మోడల్ అంటే రేవంత్ గుజరాత్ మోడల్ అంటున్నారన్నారు.
వైసీపీకి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా
వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు. మంత్రి పదవి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారని.. తనకు ఇష్టం లేదన్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు.
12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానని.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.. మంత్రి పదవి చేశాను.. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానన్నారు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నా.. ఎంపీ పదవి వద్దన్నానని ఆయన తెలిపారు.మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మా కులం ఎక్కువగా రెండు జిల్లాల్లో ఉన్నారు.. గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సుముఖంగా ఉన్నానన్నారు. సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది.. కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని తెలిపారు.
నిన్నటి దాకా చౌకిదారు.. ఇప్పుడు మోడీకా పరివార్ అంటా..!
దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వలేదని, మోడీ ఎందుకు వచ్చినట్టు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. 4 మంది ఎమ్మెల్యేలను ప్రజలను గెలిపిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఎన్నికల సభ నిర్వహించారని, ఇప్పటి దాకా మీ డ్రామాలు నడిచాయని, మోడీ, రేవంత్ రెడ్డి లు ఒక్కరికి ఒక్కరు పొగుడు కోవడం తప్పా జిల్లా ప్రజలకు ఒరిగింది ఏంటని ఆయన అన్నారు.
రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు. రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఎసీబీ సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖ పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ముందుగానే లేఖలు రాసి వివరాలు కోరారు చంద్రబాబు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాసినట్లు తెలుస్తోంది.