ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి..
ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్నేళ్లుగా ఈమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో విసుగు చెందిన యువతి పొలాల్లో జల్లడానికి ఇంట్లో భద్రపరిచిన పురుగుల మందును ఈనెల 16వ తేదీ సాయంత్రం తాగింది. ఇంట్లోని వారు గమనించి తగరపువలస ఎన్నారై ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మృత్యువుతో పోరాడుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది.
ఏపీకి మూడురోజుల పాటు భారీ వర్ష సూచన..
ఏపీ రైతులకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈనెల 27,28,29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎండీ కూర్మనాథ్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. వరి కోతకు వచ్చే సమయం కావడంతో ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసేందుకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి ధర్నాకు, నిరసనకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. అనుమతి లేకుండా ధర్నా, నిరసనలు చేపట్టినందుకు గాను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలపై బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 35(3) కింద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుంటున్నారు. బొగ్గు బూడిద రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానాలను కూడా అసెంబ్లీ లోపల, బయట, మీడియా సమావేశాల్లో విపక్షాలు తరచూ విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే ఫిరాయింపు వివాదంలో కౌశిక్ రెడ్డి స్వయంగా అరికపూడి గాంధీకి సవాళ్ల వివాదం సాగింది. కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైంది.. వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క
సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు. డోర్ లాక్, వలసలు వారి వివరాలను సేకరించాలని ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశించారు. సమగ్ర సర్వే లో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని అధికారులకు తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయీ కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని సూచించారు. అంతేకాకుండా.. వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలి అని తెలిపారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. ఈ పాఠశాలలో ఆహారం మరియు పరిశుభ్రతపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతుంది
అదానీ కంపెనీతో జగన్ ప్రభుత్వ సోలార్ పవర్ కొనుగోళ్ల ఒప్పందాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ విషయంలో ఈ ఒప్పందం రెండో అతిపెద్ద క్విడ్ ప్రో కో అంటూ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జగన్ క్విడ్ ప్రో కో వ్యవహరంలో విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని యనమల కోరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయమై సీఎం హోదాలో జగన్ అతి పెద్ద క్విడ్ ప్రో కోకు పాల్పడ్డాడని, జగన్ అవినీతి అక్రమాల చిట్టాలో అదానీతో సోలార్ పవర్ ఒప్పందాలు రెండో పెద్ద క్విడ్ ప్రో కో అని ఆయన ఆరోపించారు. జగన్ క్విడ్ ప్రో కో వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు.
బయటపడ్డ కీచక ఉపాధ్యాయుడు నిర్వాకం..
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ, అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గు కూడిన కృత్యం. ఈ తరహా సంఘటనలు ఎప్పటికప్పుడు మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాకినాడలో పాఠాలు చెప్పాల్సిన గురువే దుష్కృత్యం చేశాడు. సమాచారం ప్రకారం, కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఇటీవల ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పై అవగాహన సదస్సు నిర్వహించిన సమయంలో తమ అనుభవాలను మహిళా పోలీసులకు తెలియజేసిన విద్యార్థినులు, గురువు శ్రీనివాసరావు వారు చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారనే విషయాన్ని వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో శ్రీనివాసరావును కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు. ఎంఈఓ అడ్డుకునేందుకు ప్రయత్నించినా, తల్లిదండ్రులు వినక, పోలీసులకు ఇచ్చి పట్టించుకోవాలని కోరారు. పోలీసులు, విద్యార్థినుల ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని, శ్రీనివాసరావుపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు అన్నారు.
ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..
ఈనెల (నవంబర్) 29వ తేదీ తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజని బీఆర్‌ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన దీక్ష మైలు రాయిగా ఉందన్నారు. అందుకే నవంబర్ 29 దీక్ష దివస్ చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయన్నారు. ఆరోజు తెలంగాణ కోసం దీక్ష చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ అరాచకాలపై మరోసారి దీక్షలు చేయాలని అనుకుంటున్నామన్నారు. నవంబర్ 29 నాడు 33 జిల్లాలో దీక్ష దివస్ చేయబోతున్నామన్నారు. ప్రతి జిల్లాలో సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు. డిసెంబరు 9న మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం పాల్గొంటామన్నారు. నవంబర్ 29 న నిమ్స్ ఆసుపత్రిలో కూడా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఎక్కడా పాల్గొనరు.. కానీ ఆయన స్ఫూర్తి తోనే దీక్ష దివస్ చేస్తామన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాది పడిందన్నారు. ఈ నిరాహార దీక్ష యావత్ భారత రాజకీయ వ్యవస్థను కుదిపేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేలా చేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ నెల 29న కరీంనగర్ లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఎ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని ఈనెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రానికి పంపించారు. ఎండబెట్టి, తూర్పారబెట్టాక చేసిన తర్వాత వరిలో తేమ శాతం, నాణ్యతను ఏఈవో పరిశీలించి కొనుగోలుకు ఎంపిక చేశారు. ఈ నెల 16న కాంటా వేశారు. కీమాకు చెందిన 425 బస్తాలు, మరో ఇద్దరు రైతులకు చెందిన 263 బస్తాలు కలిపి మొత్తం 688 బస్తాలను ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఎగుమతి చేశారు. వరి ధాన్యం నల్లగా ఉందని, దించలేదని మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ఐకేపీ కేంద్రానికి సమాచారం అందించారు. రైతు కీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా వడ్లు బాగోలేదని బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తామని మిల్లు నిర్వాహకులు తెలిపారు.
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడు
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు. జగన్ …ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి చేయలేదని జగన్ అంటున్నాడని, తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలుని అమెరికా కు పంపు అని ఆయన అన్నారు. రూ.1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నావని ఎఫ్. బి.ఐ. చెబుతోందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అవినీతి కుంపటని టీడీపీ ఎప్పుడో చెప్పిందని, సోలార్ విద్యుత్ ను యూనిటకు 11 రూపాయలకు కొన్నారు… టెక్నాలజీ మారే కొద్దీ ధరలు తగ్గుతూ వచ్చాయని, 9 వేల మెగావాట్లకి 1750 కోట్లు సరే… ఇంకా అనేక సోలార్ సంస్థలకు పీపీఏ లు చేశారు… వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో బయటకి తీయాలని ఆయన అన్నారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ. 20 వేల కోట్ల రూపాయల లంచం జగన్ కు ముట్టిందని ఆనం ఆరోపించారు.
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఫిక్స్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.