సభలో మీసాలు మెలేసిన బాలకృష్ణ.. సభలో ఉద్రిక్తత.. అసెంబ్లీ వాయిదా
అసెంబ్లీలో మీసాలు మెలేశారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. దీనికి ప్రతిగా బియ్యపు మధు తొడగొట్టారు.. ఇక, బాలయ్య మీసాలు మెలేయడంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సినిమాల్లో మీసాలు మెలేయండి ఇక్కడ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు.. స్పీకర్ పోడియం ముందుకు టీడీపీ, వైసీపీ సభ్యులు దూసుకెళ్లడంతో.. లేచి నిలబడి దండం పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ సభ్యులను వెనక్కి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.. అయినా సభలో ఆందోళన కొనసాగడంతో.. అసెంబ్లీని వాయిదా వేశారు.. ఇక, స్కిల్ స్కాంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి బుగ్గన.. చంద్రబాబు అరెస్ట్ చర్చపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ప్రతిసారి అర్థంపర్థంలేని వాయిదా తీర్మానం ఇచ్చి సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టీడీపీ వాళ్ల దగ్గర సమాధానం ఉందా? అని నిలదీశారు మంత్రి బుగ్గన. మరోవైపు.. టీడీపీ సభ్యులతో పాటు పోడియం ఎక్కి ఆందోళన చేశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఆ మధ్యే ఆమె వైసీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే.
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికర చర్చ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సభలో వాయిదా తీర్మానానికి పట్టుబట్టడం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు తిప్పడం, వైసీపీ ఎమ్మెల్యే తొడ గొట్టడం.. దమ్మంటే రా అంటూ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇవ్వడం.. పోటీపోటీగా పోడియం దగ్గరకు వైసీపీ, టీడీపీ సభ్యులు దూసుకురావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. దీంతో.. సభను వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై మేం చర్చకు సిద్ధం.. మేం అడిగే ప్రశ్నలకు సమాధాలను చెప్పడానికి టీడీపీ సిద్ధమా అంటూ మంత్రి బుగ్గన సవాల్ చేశారు.. ఇక, ఏపీ అసెంబ్లీ లాబీల్లోని టీడీఎల్పీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, సత్యనారాయణ రాజు-మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.. ప్రతిపక్షం హింసను కోరుకుంటోందని పేర్కొంటూ.. సభలో జరిగిన పరిణామాలను లాబీల్లో పేర్ని నాని వివరించారు.. అంతేకాదు.. బుచ్చయ్య చౌదరి మనస్సు చంపుకుని రాజకీయం కోసం పని చేస్తున్నారన్న పేర్కొన్నారు పేర్నిననా.. దీనికి బదులిస్తూ.. తాను రాజకీయం కోసం కాదు.. రాజ్యాంగం కోసం పని చేస్తున్నానన్నారు బుచ్చయ్య చౌదరి. ఇలా నేతల మధ్య కాసేపు చర్చ హాట్ హాట్‌గా సాగింది.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హీట్ పెంచాయి.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. చర్చకు పట్టుబట్టడం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. ప్రతిగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకురావడం.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో స్పీకర్ సభను వాయిదా వేయడం జరిగిపోయాయి.. అయితే, వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు మళ్లీ ఆందోళన దిగారు.. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టకుండా మార్షల్స్ ఏర్పాటు చేయగా.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లటానికి మార్షల్స్ ను నెట్టే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు.. ఇక, సభలో గందరగోళ పరిస్థిలు ఏర్పడడంతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనగాని ప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావు కేశవ్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయగా.. మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒక రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. సభ లోపల ఫోన్లలో వీడియో తీశారు టీడీపీ సభ్యులు పయ్యావుల, ఉండి ఎమ్మెల్యే రామరాజు… స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. మరోవైపు.. సభలో మీసాలు మెలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను హెచ్చరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. మొదటి తప్పు గా పరిగణిస్తున్నాం.. పునరావృతం చేయవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
మీసం తిప్పిన బాలయ్య.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన స్పీకర్
సభా స్థానంలో తొడగొట్ట, మీసాలు మిలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి.. సభ ఆయనకు మొదటి హెచ్చరిక చేస్తోంది. ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది సభ హెచ్చరిస్తోందని పేర్కొన్నారు. మీసాలు మెలేయడం వంటి వికృత చేష్టలు చేయడం తప్పు.. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని ప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావు కేశవ్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయగా.. మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒక రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. సభ లోపల ఫోన్లలో వీడియో తీశారు టీడీపీ సభ్యులు పయ్యావుల, ఉండి ఎమ్మెల్యే రామరాజు… స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. .
ముగిసిన బీఏసీ.. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు.. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడగా.. పోటీగా వైసీపీ సభ్యులు పోడియం దగ్గరకు దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.. మొదట సభను వాయిదా వేసిన స్పీకర్.. ఆ తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు.. బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం వైఎస్ జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ చిప్ విప్ ప్రసాద్ రాజు.. అయితే, ఈ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది.. అయితే, ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీ వరకు శాసన సభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.. అయితే, శని, ఆదివారం శాసన సభకు సెలవు ఉంటుందని బీఏసీ సమావేశంలో ప్రకటించారు. రేపు శాసన సభలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుపై చర్చించారు. రోజుకు రెండు చొప్పున 8 అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
అంబటి నన్ను రెచ్చగొట్టాడు.. రా చూసుకుందాం అన్నాడు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. ఓ దశలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీసాలు మిలేయడం, తొడగట్టడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.. ఆ తర్వాత టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.. ఇక, మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. అంబటి రాంబాబు సభలో మీసం మేలేసి తొడ కొట్టాడు.. నా వృత్తిని అవమానించాడు. సినిమాల్లో చూసుకోమన్నాడు.. అంబటి నన్ను రెచ్చగొట్టాడు అంటూ ఫైర్ అయ్యారు బాలయ్య.. రా చూసుకుందామని అంబటి అన్నాడు.. నేనూ రా చూసుకుందామన్నాను.. సినిమా ఇండస్ట్రీలో నాలాగా ధైర్యంగా భయపడకుండా మాట్లాడే వారు కొందరే ఉంటారని.. మిగిలిన వారిలాగా నేనూ సైలెంటుగా ఉంటానని అనుకున్నారు.. నేను ముందుకొచ్చేసరికి బిత్తరపోయారని వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ. రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన జరుగుతోందని విమర్శించారు బాలయ్య.. సంక్షేమం-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబేనన్న ఆయన.. చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్.. చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదని.. కక్ష సాధింపు తప్ప.. సీఎం జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఏ చట్ట ప్రకారం చంద్రబాబు అరెస్ట్ జరిగిందోనని ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని.. అభివృద్ధి – సంక్షేమం చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా..? అని అందరూ చర్చించుకుంటున్నారని వెల్లడించారు. స్కిల్ కేసులో నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు? అని నిలదీశారు బాలయ్య.. స్కిల్ కేసులో షెల్ కంపెనిలే లేవని తెలిపారు.
మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? కంగారు పడకండి.. కారణం అదే
దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియక అంతా అయోమయంలో పడ్డారు. దానిని చూస్తే తీవ్రమైన పరిస్థితి” అని అర్థం వచ్చేలా ఒక ఫ్లాష్ మెసేజ్ ఉంది. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. దీనిని కేంద్రప్రభుత్వమే పంపింది. ఎమర్జెన్సీ నోటిఫికేషన్ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా చాలా మంది ఫోన్లకు ఈ మెసేజ్ వచ్చింది. కేవలం ఈ రోజు మాత్రమే కాకుండా గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి మెసేజ్ లను పంపించింది కేంద్రప్రభుత్వం. కొంతమంది వినియోగదారులకు జూలై 20, ఆగస్టు 17న కూడా ఇలాంటి మెసేజ్ లను పంపారు. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో కేంద్రం ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. తాజాగా, గురువారం ఉదయం 11:41 గంటల ప్రాంతంలో దీనిని పరీక్షించగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు పెద్ద సౌండ్‌తో ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. తరువాత కొద్ది సేపటికి 12:10 నిమిషాల ప్రాంతంలో కూడా మరోసారి ఇలాంటి మెసేజ్ వచ్చింది. దీనిని కమ్యూనికేషన్స్ సెల్యులార్ బ్రాడ్‌కాస్ట్ సర్వీస్ విభాగం పంపించింది. “అత్యవసర హెచ్చరిక: తీవ్రమైన పరిస్థితి” అంటూ ఈ హెచ్చరిక మెసేజ్ వచ్చింది. ఏవైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రజలను వెంటనే అప్రమ్తం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొబైల్ ఆపరేటర్లు , మొబైల్ సిస్టమ్‌ల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు టెలికాం, మాస్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. ఈ మెసేజ్ రావడంతో చాలా మంది దానిని స్ర్కీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు
ఈ ట్రిక్ ఉపయోగించండి.. మీ ట్రైన్ తత్కాల్ టికెట్ తక్షణమే బుక్ అవుతుంది
భారతీయ రైల్వేలో సామాన్య ప్రజలు రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో భారత్‌లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీని కారణంగా చాలాసార్లు ప్రజలు ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను పొందలేరు. దీంతో వారికి తత్కాల్ టికెట్ పొందడానికి ఒకే ఒక ఎంపిక మిగిలి ఉంది. అయితే, తత్కాల్ టికెట్ బుకింగ్ చిట్కాలను బుక్ చేసేటప్పుడు చాలా సార్లు అన్ని సీట్లు నిండిపోతాయి. మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇందుకు మనం ఓ ట్రిక్ తెలుసుకుందాం.. దానిని అనుసరించడం ద్వారా మీరు సులభంగా తత్కాల్ టిక్కెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రజల సాధారణంగా చేసే ఫిర్యాదు ఏమిటంటే.. ఇంటర్నెట్ స్లో కారణంగా ప్రయాణీకుల వివరాలన్నీ నింపే సమయానికి అన్ని సీట్లు నిండిపోతున్నాయి. IRCTC తత్కాల్ ఆటోమేషన్ టూల్ సాయంతో ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. IRCTC తత్కాల్ ఆటోమేషన్ టూల్ అనేది మీ బుకింగ్ కోసం పట్టే సమయాన్ని బాగా తగ్గించే ఉచిత ఆన్‌లైన్ సాధనం. బుకింగ్ చేసేటప్పుడు, ప్రయాణీకుడు పేరు, వయస్సు, ప్రయాణ తేదీ మొదలైన వాటిని పూరించాలి. ఈ సాధనం ద్వారా, మీ వివరాలన్నీ కేవలం కొన్ని సెకన్లలో లోడ్ చేయబడతాయి. ఇది మీ సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.
హ్యాట్సాఫ్ బాసూ.. ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యువకుడు!
క్రికెట్ ఆడాలంటే ఎంతో ఫిట్‌నెస్ అవసరం. ఫిట్‌నెస్‌తో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ కూడా చాలా చాలా ముఖ్యం. క్రీజులో నిలబడి బంతిని బాదాలంటే.. ఏ బ్యాటర్‌కైనా ఫుట్‌వర్క్ ఉండాల్సిందే. బంతి గమనాన్ని బట్టి కాళ్ల కదలికలు ఉంటేనే.. సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలడు. స్టార్ బ్యాటర్స్ సైతం కొన్నిసారి సరైన ఫుట్‌వర్క్ లేక అవుట్ అయి పోతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ దివ్యాంగ యువకుడు ఒంటి కాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు ఫాస్ట్ బౌలర్‌ను సునాయాసంగా ఎదుర్కోవడం ఇక్కడ విశేషం. ఓ స్టార్ బ్యాటర్‌కు ఎంత ఫుట్‌వర్క్ ఉంటుందో.. ఈ దివ్యాంగ యువకుడికి ఒక కాలే ఉన్నా అదే దివ్యాంగ ఫుట్‌వర్క్ ఉంది. క్రీజులో సునాయాసంగా కదులుతూ బంతిని బాదుతున్నాడు. అంతేకాదు భారీ షాట్స్ కూడా అలవోకగా బాదేస్తున్నాడు. ఆ యువకుడు ఆడే విధానం చూస్తే.. అతడికి రెండు కాళ్లు ఉన్నాయా? అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. దివ్యాంగ యువకుడు ఒంటి కాలితో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ‘బార్మీ ఆర్మీ’ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘వైకల్యం ఆ యువకుడు ఉత్సాహాన్ని ఏ మాత్రం కుంగదీయలేదు’, ‘సంకల్ప బలంతో వైకల్యాన్ని కూడా ఎదిరించి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు’, ‘హ్యాట్సాఫ్ బాసూ’ అంటూ నెటిజన్లు అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఆ విషయం పై వస్తున్న రూమర్స్ ని ఖండించిన జైలర్ నటుడు..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జైలర్ మూవీ 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు..’జైలర్’లో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించారు. ఆయన కుమారుడిగా ‘అశ్విన్స్’ ఫేమ్ వసంత్ రవి, కోడలిగా మిర్నా మీనన్, బ్లాస్ట్ మోహన్ పాత్రలో సునీల్, కీలక పాత్రలో తమన్నా తదితరులు నటించారు. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జైలర్’ సినిమా విడుదలైన తర్వాత ఇంత భారీ విజయం సాధిస్తుందని, వసూళ్ళ సునామీ సృష్టిస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు.స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రీ రికార్డింగ్ చేయక ముందు సినిమా చూసి యావరేజ్ అనుకున్నానని సక్సెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. ‘జైలర్’ సక్సెస్ తర్వాత చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన సూపర్ స్టార్ రజనితో పాటు దర్శకుడు దిలీప్ నెల్సన్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులకు ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చారు. అంతే కాకుండా లాభాల్లో కొంత షేర్ ను కూడా ఇచ్చారని, ముందుగా అనుకున్న పారితోషికం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారని సమాచారం.’జైలర్’ సినిమాలో మెయిన్ విలన్ రోల్ చేసిన వినాయకన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక మలయాళీ. అయితే… తమిళ సినిమాలు కూడా చేశారు. తెలుగులో ‘పొగరు’గా విడుదలైన విశాల్ ‘తిమిరు’ ఆయనకు తమిళంలో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించారు. దాదాపు పదేళ్ళ విరామం తర్వాత ‘జైలర్’తో మళ్ళీ కోలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘జైలర్’లో వినాయకన్ పాత్ర ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అయితే అంత అద్భుతంగా నటించిన వినాయకన్ కు రెమ్యూనరేషన్ పరంగా అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.’జైలర్’కు గాను ఆయనకు కేవలం 35 లక్షల రూపాయల పారితోషికం మాత్రమే అందిందని ఒక వార్త వైరల్ అవుతుంది.. దానిని వినాయకన్ ఖండించారు.’జైలర్’కు తాను కేవలం 35 లక్షల రూపాయలే అందుకున్నట్లు వచ్చిన వార్తలను వినాయకన్ కొట్టి పారేశారు. ”నాకు 35 లక్షలు ఇచ్చారనేది ఒట్టి పుకారు మాత్రమే. మా నిర్మాత కళానిధి మారన్ చెవిలో ఈ మాటలు పడలేదని నేను ఆశిస్తున్నా. ప్రచారంలో ఉన్న పారితోషికం కంటే మూడు రేట్లు ఎక్కువగానే నాకు అందింది. నేను అడిగిన మొత్తం నాకు ఇచ్చారు. చిత్రీకరణలో నన్ను ఎంతో మర్యాదగా చూసుకున్నారు” అని వినాయకన్ పేర్కొన్నారు
ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కాలా వెబ్ సిరీస్..
రీసెంట్ గా ఓటీటీలో వెబ్ సిరీస్‌ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీ సంస్థలు సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక స్టార్ హీరో హీరోయిన్ లు మరియు డైరెక్టర్లు కూడా వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు సినిమా లు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతగానో బిజీబిజీగా ఉంటున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా మరియు అలా వైకుంఠపురం, విరాటపర్వం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిందీ. ఈ ఏడాది విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ అనే సినిమాలో చివరిగా కనిపించింది.రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన రకుల్ ప్రీత్ సింగ్ బూ లో కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడు కాలా వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.అవినాష్ తివారీ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరీఓ ఆఫీసర్ సితారగా నివేద కనిపించింది రోహన్ వినోద్ మెహ్రా, నితిన్ గులాటి మరియు అనిల్ ఛటర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో కాలా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.కాలా వెబ్ సిరీస్‌కు బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ టీ- సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషణ్ కుమార్, బిజాయ్ నంబియార్ సంయుక్తం గా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను నిర్మించారు.కోల్‌కతాలోని మనీలాండరింగ్, హవాలా స్కామ్‌లతో సాగే క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో నివేద పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడ నటించింది.ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది