ఆయన ఎస్సీ కాదు.. మంత్రి ఆదిమూలపు సురేష్‌పై ఫిర్యాదు
మంత్రి ఆదిమూలపు సురేష్‌పై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో ఓ ఆసక్తికరమైన ఫిర్యాదు అందింది.. అసలు ఆదిమూలపు సురేష్.. ఎస్సీ కాదంటూ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు.. తన ఫిర్యాదుపై విచారణ చేయాలంటూ మార్కాపురానికి చెందిన పి ఇమ్మానుయేలు.. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.. జెడ్పీ హైస్కూలులో హెచ్ఎంలుగా పనిచేసి రిటైర్ అయిన మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రులు.. అనంతరం బీసీ(సీ)లుగా క్రిస్టియన్ కోటాలో శ్రీరాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కాలేజీ ఏర్పాటు చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఆ ప్రకారం వారి పిల్లలుగా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా బీసీ(సీ) కిందకు వస్తారని.. తన ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు ఇమ్మానుయేలు అనే వ్యక్తి.. అయితే, ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చగా మారింది. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆదిమూలపు సురేష్.. ఎస్సీ కోటాలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్ వన్‌లో మంత్రి పదవి పొందారు.. ఇక, జగన్ కేబినెట్ -2లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా.. మరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు ఆదిమూలపు సురేష్. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో.. ఆయన ఎస్సీ కాదంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
శబ్ద కాలుష్య నివారణపై ఫోకస్.. బైక్ సైలెన్సర్ల తనిఖీ.. పోలీసుల స్పెషల్ డ్రైవ్..
అధిక శబ్దంతో కొన్ని వాహనాలు వెళ్తుంటాయి.. అయితే, అధిక శబ్దంతో నడిచే వాహనాలపై చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి నట్టు ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.. ఇక పై ప్రతిరోజు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని.. అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను బుల్లెట్ మోటార్ సైకిల్ కు అమర్చరాదని వార్నింగ్ ఇచ్చారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను బిగించే మోటార్ సైకిల్ మెకానిక్ షాపుల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు.
ఏపీ డిప్యూటీ సీఎంపై హైదరాబాద్‌లో కేసు.. మరోసారి సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. కొన్ని సార్లు సొంత పార్టీ నేతలు.. మరికొన్ని మార్లు విపక్షాలను టార్గెట్ చేస్తూ ఉంటారు.. అయితే, తాజాగా, కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీపై నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు.. హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. సోనియా గాంధీపై అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు టి.పీసీసీ నేత మల్లు రవి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సోనియా గాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలు పంపించి.. వైఎస్ జాడ కోసం వెతికించారని, వాతావరణం సరిగా లేకపోవడం వల్లే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారని గుర్తుచేశారు మల్లు రవి. అయితే, తెలంగాణాలో కేసు నమోదుపై సంచలనం వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. బేగంబజార్ పీఎస్‌లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. వాళ్లు ఇద్దరు కలసి వైఎస్ ను చంపారని ప్రజలందరికి తెలుసంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి చంద్రబాబుకు లేదన్న ఆయన.. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డే అన్నారు. చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని హింసించి పొట్టన పెట్టుకుంది మీకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయని వ్యక్తి.. ఎవడికి భయపడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి.. 16 నెలలు జైల్లో పెట్టారు అని ఆరోపణలు గుప్పించారు. అప్పుడు ఏమైంది..? మీ నోర్లు ఎక్కడి పోయాయి..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మనిషి.. రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించారని విమర్శించాడు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
సీఈసీని కలిసిన కేఏ పాల్.. పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి..!
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ బృందాన్ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను అన్నారు.. అంతేకాదు.. పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం అన్నారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు పాల్.. కాపులందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు.. పవన్ కల్యాణ్‌కి నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు అని సూచించారు. ఇక, నా ఆరోగ్యం బాగానే ఉంది.. నా మీద విష ప్రయోగం చేసినా.. దేవుని కృపతో.. వైద్యుల సహాయంతో బయటపడ్డాను అన్నారు కేఏ పాల్.. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ మధ్యే తనపై విష ప్రయోగం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించిన విషయం విదితమే.. ఎవరో కావాలని నన్ను చంపాలని ఫుడ్ పాయిజన్ చేశారన్న ఆయన.. వైజాగ్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నానని ఈ మధ్యే వెల్లడించిన విషయం విదితమే.. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. అయితే, ఎవరు ఫుడ్ పాయిజన్ చేశారో పోలీసులు కనిపెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
టీడీపీది విష ప్రచారం.. జగన్, చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ఓటు వేయండి..
శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతోంది.. ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంపై ఫోకస్ చేశారు పెద్దిరెడ్డి.. ఒకేసారి ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి పర్యటించడం ఆసక్తికరంగా మారగా.. టీడీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు మంత్రి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99.5 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిదే అన్నారు. కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్.. హైదరాబద్ లో దాక్కున్నారని దుయ్యబట్టారు. ఇక, సీఎం వైఎస్ జగన్ ఎక్కడా కులాలు, మతాలు, పార్టీలు చూడలేదు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించారని ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి.. పాలన అంతా ప్రజల ఇంటి ముందు ఉన్న సచివాలయంలోనే ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లాగా జన్మభూమి కమిటీలను వేసి ప్రజల్ని దోచుకునే పరిస్థితి లేదు.. నేరుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు.. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా.. సీఎం బటన్ నొక్కి లబ్ధిచేకూరుస్తున్నారని తెలిపారు. మరోవైపు.. పెన్షన్ లు పెంచి రూ.3,000 చేస్తే… పెన్షన్ ఇవ్వరు అంటూ టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ , చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
అన్ని అంశాలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు.. స్పెషల్ సెల్ పెట్టాలి
ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ని కలిసి కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల విధులకు అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకోవాలి. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. బీఎల్‌వోలుగా 2600 మంది మహిళా పోలీసులను పెట్టారు. మాపై, జనసేనపై 6 వేల నుంచి 7 వేల కేసులు అక్రమంగా పెట్టారు. ఒక్క పుంగనూరు కేసులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు.. చంద్రగిరిలో లక్షకు పైగానే..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలో చంద్రబాబుతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో సమావేశమై.. రాష్ట్రంలోని పరిస్థితులను సీఈసీ రాజీవ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. సీఈసీ బృందం విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసింది. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలు సీఈసీకి చెప్పారన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారు.. కేవలం చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయని. నమోదైన లక్ష పైచిలుకు దొంగ ఓట్లలో కొన్ని ఆమోదం కూడా జరిగాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు పవన్ కల్యాణ్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయి.. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేశాం. వైసీపీ కోసం పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించకుండా ఉండాలని సూచించాం.. ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాం.. ఇక, సీఈసీ రాజీవ్ కుమార్.. ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు చెప్పారని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
వాహనదారులు అలర్ట్.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ రేపే లాస్ట్ డేట్..
వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ రేపటితో అనగా..జనవరి 10న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు చెల్లించని వారు ఎవరైనా ఉన్నట్లయితే.. వెంటనే చెల్లించడం మంచిదని తెలిపారు. ఎందుకంటే.. మళ్లీ అలాంటి ఆఫర్ రాకపోవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీ ప్రకటించారు. బైక్‌లపై 80 శాతం తగ్గింపు. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే డిసెంబర్ 25 తర్వాత చెల్లించే చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని.. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఒకసారి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై రాయితీ ప్రకటించారు. అప్పుడు 50 శాతం తగ్గింపు ఇచ్చారు. మార్చి 31, 2022 నాటికి 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉంటే, రాయితీల ద్వారా రూ.300 కోట్ల వరకు చలాన్ ఫీజులు వసూలు చేయబడ్డాయి. అందుకే ఈసారి కూడా అదే తరహాలో తగ్గింపు అవకాశాన్ని కల్పించారు. గడువు ముగిసిన తర్వాత రాయితీ లభించదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం ఉందన్నారు. ఏవైనా సందేహాలుంటే 040-27852721, 8712661690 వాట్సాప్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని కోరారు. రేపు లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులకు అలర్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించాలని కోరారు. రేపు ఒక్కరోజు మిస్ అయితే.. డిస్కౌంట్ వర్తించదని తెలిపారు.
ఫార్ములా-ఈ రేస్‌కు కోట్లలో చెల్లింపులు.. సీనియర్ IAS అరవింద్ కుమార్‌కు మెమో..!
తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా-ఇ రేస్ నిర్వహణపై వారంలోగా వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరవింద్ కుమార్‌ను కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమో జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ నుంచి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేస్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేస్ పై నిర్వాహకులు సానుకూలంగా స్పందించలేదు. ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు గత వారం ప్రకటించారు.
నాలుగేళ్ల కొడుకును హత్య చేసి బ్యాగులో తీసుకెళ్లిన ఓ కంపెనీ సీఈఓ
బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కొడుకును గోవాలోని ఓ హోటల్‌లో హత్య చేసింది. ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించి సీఈఓగా పని చేస్తుంది.. తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఈ నెల 6వ తేదీన గోవాకు వెళ్లింది.. అక్కడ హోటల్‌లో రూమ్ తీసుకొని ఉంది.. ఆమె వెళ్లిన తరువాత రూమ్‌లో రక్తపు మరకలు కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, హోటల్ కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. హోటల్ రూమ్ లోకి వచ్చినప్పుడు బాబుతో వచ్చిన ఆమె.. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి సదరు మహిళతో మాట్లాడారు.. తన స్నేహితుడి దగ్గర కుమారుడిని వదిలి పెట్టానని సుచనా సేత్ వివరణ ఇచ్చింది. దీంతో గోవా పోలీసులు రంగంలోకి దిగి కర్ణాటక పోలీసులను సంప్రదించారు. ఇక, విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సుచనా సేత్ బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్ష కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ప్రయాణికులకు షాక్.. ఇండిగో సీటు కోసం రూ. 2000 అదనంగా చెల్లించాల్సిందే!
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ సీట్ల ఎంపిక ఛార్జీలను పెంచింది. ప్రయాణికులు తమ సీట్లను ఎంపిక చేసుకునేందుకు ఇకనుంచి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ప్రయాణికులు దాదాపు రూ. 2000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెనుక సీట్లకు సీటు ఎంపిక ధరను బేస్ ఛార్జీకి అదనంగా రూ. 75గా నిర్ణయించారు. నివేదికల ప్రకారం.. కంపెనీ గత వారం వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇండిగో వెబ్‌సైట్ ప్రకారం.. 232 సీట్లు ఉండే ఎయిర్‌బస్ A321 విమానంలో ముందు వరుసలోని విండో లేదా నడవా సీటు ఎంపిక కోసం రూ. 2000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మధ్య సీటుకు అయితే రూ. 1500 చెల్లించాలి. A321 (222 సీట్స్, A320 విమానాలకూ ఇదే ఛార్జీలు వర్తిస్తాయట. ఏటీఆర్ విమానాల్లో మాత్రం సీటు ఎంపిక ఛార్జీ రూ. 500 వరకు ఉంది. విమానయాన విశ్లేషకుడు అమేయ జోషి ఛార్జీల పెంపును ధ్రువీకరించారు. అదనపు లెగ్‌రూం ఉండే సీట్ల కోసం ఇండిగో రూ. 2000 వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇది రూ. 1500 వరకు ఉండేదని చెప్పారు.
అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ!
దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నారు. భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శన గాను అతడికి ఈ అవార్డు దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 2023 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. క్రీడాకారులకు అవార్డులను అందజేశారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డును అందుకున్నారు. సాత్విక్- చిరాగ్ జోడీ ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే. మొహమ్మద్ షమీ సహా మొత్తంగా 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్ (షూటింగ్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), అజయ్‌కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)లను ఈ అవార్డు వరించింది.
మహేష్, తేజా సజ్జా, వెంకీ మామా అయిపోయారు… ఇక ఇప్పుడు కింగ్ నాగ్ టైమ్
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’… సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే… సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి కానీ ఇంకా నాగార్జున ‘నా సామిరంగ’ ట్రైలర్ బయటికి రాలేదు. ఈ ట్రైలర్ రిలీజ్ అయితే గానీ సినిమా పై అనుకున్నంత హైప్ రాదు. అందుకే… ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. నా సామిరంగ ట్రైలర్ ఈరోజు బయటకి రాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ బయటికి రానుంది. ఇక్కడి నుంచి ‘నా సామిరంగా’ సినిమా పై సాలిడ్ బజ్ సనరేట్ చెయడం పక్కా అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో పక్కా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అల్లరి నరేష్‌కు జంటగా మిర్నా మోహన్ నటిస్తుండగా.. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ మెరిసింది. ఈ సినిమాతో విజయ్ బిన్నీ దర్శకుడిగా మారాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి ‘నా సామిరంగ’పై నాగ్ ఫ్యాన్స్‌లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ట్రైలర్ ఇంకెలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.
సలార్ మళ్లీ డిజప్పాయింట్… ప్రభాస్ ఫ్యాన్స్ కే ఇలా ఎందుకు జరుగుతుందో?
ఫైనల్‌గా బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ సలార్ ఫైనల్ కలెక్షన్స్ 700 నుంచి 800 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెచ్ రీచ్ అవడంతో పాటు… నైజాం వంటి ఏరియాల్లో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు మేకర్స్ కనీసం సక్సెస్ సలెబ్రేషన్స్ కూడా చేయలేదు. ప్రమోషన్స్ విషయంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని సలార్ మేకర్స్… సక్సెస్ విషయంలోను అదే ఫాలో అయ్యారు. ఒక్క చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. సక్సెస్ మీట్‌లో అయిన ప్రభాస్ బయటికి వస్తాడు అనుకుంటే… సైలెంట్‌గా కానిచ్చేశారు. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో… చిత్ర యూనిట్ చిన్న సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొన్నారు. సలార్ సినిమా బ్లాక్ థీమ్‌లో తెరకెక్కడంతో… ఈ సక్సెస్ పార్టీలో అందరూ కూడా బ్లాక్ డ్రెస్‌లోనే కనిపించడం విశేషం. ప్రభాస్, పృథ్వీరాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సలార్ సక్సెస్‌ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసేసుకున్నారు. అదుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో ప్రభాస్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో చాలా కూల్‌గా కనిపించాడు కానీ… ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఎలాగూ… సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు… కనీసం సక్సెస్ మీట్ అయిన గ్రాండ్‌గా చేస్తారని ఫ్యాన్స్ భావించారు కానీ ఇప్పుడు ఇలా సింపుల్ చేసేసి డార్లింగ్ అభిమానులను నిరాశ పరిచారు. ఏదేమైనా… సలార్ హిట్ అయింది కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు.