బొత్సతో ఎస్.కోట ఎమ్మెల్యే భేటీ.. ఏదో ఆశించి నాపై ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పు, చేర్పుల వ్యవహారం కాకరేపుతోంది.. ఇదే సమయంలో.. కొన్ని నియోజకవర్గాల్లో సీఎం జగన్ కావాలి.. కానీ, మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనలు చేసేవాళ్లు లేకపోలేదు.. మరికొందరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తు్న్నారు. అయితే, ఈ రోజు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణతో శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.. బొత్స ఝాన్సీ కి విశాఖపట్నం లోక్‌సభ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో.. శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చానని తెలిపారు.. ఇక, తనపై అసమ్మతి నేతల తిరుగుబాటుపై స్పందించిన ఎస్.కోట ఎమ్మెల్యే కడిబండి శ్రీనివాసరావు.. కష్టపడి పని చేసే వారికే అధిష్టానం టిక్కెట్లు ఇస్తుందన్నారు. నా మీద ఫిర్యాదు చేసేవారు ఏదో ఆశించి చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అయినా మరే నాయకుడు అయినా వాళ్లు ఏదో ఆశిస్తున్నారని తెలిసిందన్నారు. నన్ను గెలిపించాలని ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బా రెడ్డి చెప్పారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. తాను బాగా పని చేస్తున్నానని.. నీ పని నువ్వు చేసుకో అని హామీ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఫైనల్ గా అందరూ పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిందే.. మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.
వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి హాట్ కామెంట్స్..
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం కొన్ని ప్రాంతాల్లో రచ్చ సృష్టిస్తోంది.. ఉమ్మడి అనంతపురంలో ఉన్న రెండూ ఎంపీ స్థానాలనూ.. 3 అసెంబ్లీ స్థానాలను వైసీపీ అధిష్టానం మార్చేసింది. అంతేకాదు మరో నాలుగు స్థానాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చంటూ సంకేతాలు ఉన్నాయి.. ముఖ్యంగా సింగనమల, మడకశిర, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో మార్పు కన్ఫర్మ్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించగా.. సింగనమల, మడకశిరలోనూ మార్పు తథ్యం అనే టాక్ నడుస్తోన్న సమయంలో.. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి.. ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు? అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ మహిళను కాబట్టే అంత చిన్న చూపా…? అని నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ.? సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోంది.. మా కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా.. తమకు నీరు రాకుండా కొంతమంది సీఎం వద్ద పంచాయితీలు పెట్టే స్టేజ్ కి వెళ్ళింది.. జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా, ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని.. కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పది రూపాయలు ఇచ్చి వంద లాక్కుంటున్నారు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..!
ఓ చేతితో పది రూపాయలు ఇచ్చి.. మరో చేత్తో వంద లాక్కుంటున్నారంటూ.. వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఐదేళ్లు జగన్ పాలనను ప్రజలు చూశారు.. మా ప్రచారంలో ప్రజలంతా ఇదే చెబుతున్నారు.. నిత్యావసరాలు, విద్యుత్ చార్జీలతో పాటు అన్నింటి మీదా ధరలు పెరిగాయి.. ఇళ్లు కట్టుకోవాలంటే ఇసుక అదనపు భారంగా మారింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రుణాలు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ లను మూసివేయడం ఎంతవరకూ సబబని ప్రజలు అడుగుతున్నారు.. రంజాన్ తోఫా.. క్రిస్మడ్.. సంక్రాంతి కానుక ఇవ్వడం లేదు.. చెత్త పేరుతో పన్ను వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు.. అంగన్‌వాడీలు.. సమగ్ర శిక్ష.. మునిసిపల్ కార్మికులు ఆవేదనతో వున్నారు.. ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాలంటే వాలంటీర్ పోస్టులు కాదు.. వాలంటీర్లు కూడా సంతృప్తిగా లేరు.. ఉద్యోగ భద్రత లేదు.. అందుకే వారు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు కోటంరెడ్డి.. ప్రైవేటు కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.. అధికారుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది.. టీడీపీ నేతలతో వాళ్లు టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపారులను వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నారు.. వ్యాపారుల నుంచి వ్యాపారాన్ని వైసీపీ పెద్దలు లాక్కుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
మూడు సార్లు గెలిచి ఏం అభివృద్ధి చేశారు..?
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం అభివృద్ధి చేశారు..? అంటూ మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనారెడ్డిని నిలదీశారు.. టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. రాజీకాయాలు హీటెక్కుతున్నాయి.. మరోవైపు.. నేతలు అప్పుడే జోరుగా ప్రచారంలోకి దిగిపోయారు.. గవిగట్టుగ్రామంలో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది టీడీపీ.. ఆ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక వ్యాపారం, పంచాయితీలు, భూ దందాలు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ సంపాదనపై పడ్డారు తప్ప.. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఫైర్ అయ్యారు తిక్కారెడ్డి.. ఇక, ఇసుక వ్యాపారం కారణంగా నియోజకవర్గంలోని రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని ధ్వజమెత్తారు.. వచ్చే ఎన్నికల్లో బాలనాగిరెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.
విప్లవానికి నాంది పలికిన ఆయనే నాకు స్పూర్తి.. తాజ్ కృష్ణలో భట్టి..!
టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు స్ఫూర్తి దాయకులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడ రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ తో కలిసి భట్టి ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. ఆర్థిక అసమానతలు పెరగడం వల్ల సమాజానికి మంచిది కాదని ఇంక్లీజీవ్ గ్రోత్ బయట ఉన్న ప్రజలను ఇంక్లీజీవ్ గ్రోత్ లోకి తీసుకురావాలని ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంత మైనవన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు ఆశలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి సాంకేతికంగా, మేధో పరంగా మద్దతు సహకారం అందించాలని శ్యామ్ పిట్రోడా గారికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా నాకు స్ఫూర్తి దాయకులన్నారు.
కర్ణాటకలో ఈడీ రైడ్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లలో సోదాలు..
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఉదయం సోదాలు చేసింది. అయితే, కర్ణాటక అసెంబ్లీలో మలూరు స్థానానికి నంజేగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేవై నంజేగౌడ కోలార్-చిక్కబల్లాపూర్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. అయితే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) దర్యాప్తులో భాగంగా మలూరుతో పాటు కోలార్ జిల్లాల్లో వారి స్థలాలకు సంబంధించిన కొన్ని సంస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
మా రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టండి.. కావాల్సినంత సబ్సిడీ ఇస్తాం
ఇటీవల దేశంలో సెమీకండక్టర్ అంటే చిప్ పరిశ్రమ కోసం పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా చిప్స్ విషయంలో దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైపు నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. తాజాగా తమ రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలపై అదనపు సబ్సిడీని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విధంగా తమిళనాడులోని చిప్‌ల తయారీ కంపెనీలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాలను పొందబోతున్నాయి. జనవరి 7న పెట్టుబడిదారుల కార్యక్రమం TN GIM 2014 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు సెమీకండక్టర్ అండ్ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2024ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎంపిక చేయబడిన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు, రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుకు 50 శాతం అదనపు ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.
రామ మందిరం తాళం తెరిచేందుకు రాజీవ్ గాంధీ ట్రై చేశారు..
రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ బీజేపీ వాళ్ళు అబద్దాలు, తప్పుడు ప్రచారాలు తప్ప మరో పని లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అయోధ్యలోని అప్పటి బాబ్రీ మసీదు తాళాలను తెరిచిన విషయాన్ని రామలింగారెడ్డి రెడ్డి ప్రస్తావించారు. మేము హిందూ మతాన్ని రాజకీయాలతో తీసుకురామన్నారు. ఈ బీజేపీ వాళ్ళు రాజకీయాలను హిందూ మతంతో పాటు ఆ శ్రీరాముడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మేము చేయమని మంత్రి రామలింగారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని 34,000 ఆలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో పాటు రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్ లాలాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. మహా మందిరంలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి కాంబోలో సినిమా కావున ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్లు చాలా కాలం తర్వాత మహేష్ బాబును పోకిరి తరహాలో పాత్రలో చూసించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. గతేడాది సర్కారు వారి పాట మూవీలో కూడా మాస్ లుక్ లో కనిపించాడు మహేష్ బాబు.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు.. పక్కా మాస్ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలను పెంచేలా వరుస అప్డేట్స్ ను వదులుతున్నారు.. తాజాగా మరో అప్డేట్ ను రిలీజ్ చేశారు.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రేపు (ఈ నెల 9 )న గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్డులో నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటి వరకు 25 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది..
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఓపెన్‌హైమర్‌కు ఐదు అవార్డులు!
‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ 2024లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు (సిలియన్ మర్ఫీ), ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్ నోలన్), ఉత్తమ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) మరియు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు వచ్చాయి. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. తేడాది విడుదలైన ఓపెన్‌హైమర్ సంచలనం సృష్టించింది. ఉత్తమ నటి అవార్డు ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాలో నటనకు గాను లిల్లీ గ్లాడ్‌స్టోన్ గెలుచుకున్నారు. ఉత్తమ హాస్య నటిగా ఎమ్మా స్టోన్, ఉత్తమ హాస్య నటుడుగా పాల్ గియామట్టి ఎంపికయ్యారు. ‘బార్బీ’ సినిమా కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
ఉత్తమ చిత్రం-ఓపెన్‌హైమర్
ఉత్తమ కామెడీ చిత్రం-పూర్ థింగ్స్
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం-అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం-ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్ అచీవ్‌మెంట్ అవార్డు-వార్నర్ బ్రదర్స్ (బార్బీ)
ఉత్తమ దర్శకుడు-క్రిస్టఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి-లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటి-డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు-రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్-వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్-లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
కన్నడ హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కేజీయఫ్ హీరో యశ్‌కు సోమవారం ఉదయం బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అభ్యర్థిస్తున్నారు. యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్‌డే నేపథ్యంలో యశ్ జనవరి 5న ఓ పోస్ట్ చేశారు. ‘ఫాన్స్ నా పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. నన్ను కలిసి విషెస్ చెప్పాలని ఆశపడుతున్నారు. మీతో కలిసి సమయాన్ని గడపడం నాకు అత్యంత విలువైన వాటిలో ఒకటి. అయితే జనవరి 8న నేను అందుబాటులో ఉండను. మనం మరో రోజు కలుద్దాం. ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా.. మీ అందరి శుభాకాంక్షలు నా హృదయానికి చేరతాయి’ అని యశ్ ట్వీట్ చేశారు.