బ్రేకింగ్: వైసీపీకి అంబటి రాయుడు గుడ్‌బై..
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ మధ్యే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.. అయితే, వైసీపీలో చేరకముందు నుంచే ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతూ వచ్చిన రాయుడు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.. జగన్ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు బాటలు వేసుకోవడమే కాదు.. వైసీపీలో చేరనున్నట్టు ఇంట్ ఇచ్చారు.. దాని అనుగుణంగా సీఎం సమక్షంలో గత నెల 28వ తేదీన వైసీపీలో చేరిన ఆయన.. ఉన్నట్టుండి ఇప్పుడు వైసీపీ వీడుతున్నట్టు ప్రకటించారు. నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు అంబటి రాయుడు.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను.. ధన్యవాదాలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు అంబటి రాయుడు.. అయితే, గుంటూరు పార్లమెంట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చారు అంబటి రాయుడు.. జగన్ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు కూడా చేశారు. జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఆకర్షితుడిని అయినట్టు కూడా చెప్పుకొచ్చారు.. ఈ నేపథ్యంలోనే గత నెల 28వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, పట్టుపని పది రోజులు కూడా గడవకముందే మళ్లీ వైసీపీకి గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై అంబటి వర్గం నుంచి ఎలాంటి స్పందనలేదు.. గుంటూరు పార్లమెంట్ గానీ లేదా గుంటూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోవడంతోనే అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది.
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. ప్రభుత్వం ఆదేశాలు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో 26 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. ఇక, ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.. ఇదే సమయంలో సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత పెట్టింది.. అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనం రూ.8,050 జమచేసింది ప్రభుత్వం.. వేతనంలో సుమారు రూ.3 వేలు కోత విధించిన తర్వాత మిగతా సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసింది.. గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం.. పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది.. అయితే, జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ సమ్మె కొనసాగిస్తుస్తూ వచ్చారు అంగన్వాడీలు.. ఈ నేపథ్యంలో ఎలాగైనా వారిని కట్టడి చేయాలన్న ఉద్దశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, వైఎస్ జగన్ సర్కార్‌పై అంగన్వాడీలు ఎలా స్పందిస్తారో చూడాలి.
12వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె.. మరోసారి చర్చలకు సర్కార్ ఆహ్వానం
తమ సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె ఆంధ్రప్రదేశ్‌లో 12వ రోజుకు చేరింది.. అయితే, సమ్మెకు పులిస్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఇప్పటికే కార్మిక సంఘ నాయకుల డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి.. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా లేదంటే నేతలు మండిపడుతున్నారు.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలని.. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఏపీ వ్రభుత్వం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం – మున్సిపల్ కార్మికుల మధ్య చర్చలు జరగనున్నాయి.. మున్సిపల్ కార్మికులతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్.. సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. నేటితో 12వ రోజుకు చేరింది మున్సిపల్ కార్మికుల సమ్మె. సమ్మెలో భాగంగా ఇవాళ మున్సిపల్ కార్యాలయాల ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. ఇవాళ్టి చర్చల్లోనైనా.. ప్రభుత్వం-కార్మిక సంఘాల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతాయా? అనేది చూడాలి.
రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్‌తోనే.. టీడీపీతో టచ్‌లో లేను..!
వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే.. అదికూడా ఒంగోలు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. విలువతోనే రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని.. సీఎం వైఎస్ జగన్ వెంట నడిచానని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు జరుగుతోందన్నారు. ఇక, తాను గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు బాలినేని.. అంతేకాదు.. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నానన్నది అవాస్తవమని తేల్చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ పార్టీకి, సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయం అన్నారు. ఎంపీ మాగుంట విషయాన్ని కూడా సీఎం జగన్ తో మాట్లాడుతానని తెలిపారు. ఇక, సీట్లు, పోటీపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయమే శిరోధార్యం క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
త్వరలో టీడీపీకి రాజీనామా.. టార్గెట్ చేరడానికి మా వాళ్లు ఏం చెబితే అదే చేస్తా..
త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి త్వరలో రాజీనామా చేస్తున్నాను అన్నారు. లోక సభ స్పీకర్ అనుమతి కోరాను.. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లించారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు కేశినేని నాని. ఇక, టార్గెట్ చేరడానికి మా వాళ్లు ఏం చెయ్యమంటే అదే చేస్తాను అన్నారు కేశినేని.. ఇందులో నా సొంత నిర్ణయం ఉండదు.. నేను ఏం చేసినా పారదర్శకంగా చేస్తాను.. ఏ నిర్ణయం తీసుకున్నా తెల్లవారు జామున సోషల్ మీడియా పోస్ట్ లో పెడతానన్నారు. నేను పెట్టే పోస్టులను మీడియా ఫాలో అవ్వటమే.. కానీ, రోజూ ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పలేను అన్నారు. రాజకీయ నేతగా, విజయవాడ ఎంపీగా సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేశాను.. ప్రజలను, నాతో ఉన్నవాళ్లను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేను.. వారితో చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు ఎంపీ కేశినేని నాని.
ఫార్మూలా ఈ -రేస్ రద్దు..! ఎఫ్ఐఏ ప్రకటన
దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఇ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… హుస్సేన్ సాగర్ తీరం వెంబడి రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. మన దేశంలో తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా – రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరంలో క్యూ కట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ ఫార్ములా ఇ రేసింగ్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని అందరూ ఆశపడ్డారు. కానీ తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన రేసింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఇ రేస్‌ను రద్దు చేసినట్లు ఎఫ్‌ఐఏ ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో రేసును రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌ఐఏ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదనే నిర్ణయాన్ని ఉటంకిస్తూ రేస్ నిర్వహించబోమని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఫార్ములా ఈ రేస్ రద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దు పై కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అని మండిపడ్డారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని సూచించారు. అయితే ఈ రేసింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం పై కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. చాలా ఈ రేసింగ్ చూడటానికి ఆశక్తి చూపారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్ పై తెలంగాణ ప్రజలు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించామని తెలిపారు.
నేతాజీ అమరుడు.. కోర్టు తీర్పు ద్వారా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఎస్సీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను జాతి పుత్రుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) పరిశీలించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు “అమరులు” అని న్యాయపరమైన ఉత్తర్వు ద్వారా వారిని గుర్తించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సుభాస్ చంద్రబోస్ పాత్రను అంగీకరిస్తున్నట్లు ప్రకటించాలన్న జ్యుడీషియల్ ఆర్డర్ సరైనది కాదని, ఎందుకంటే నేతాజీ వంటి గొప్ప వ్యక్తికి కోర్టు గుర్తింపు అవసరం లేదని కోర్టు పేర్కొంది. నేతాజీ లాంటి నాయకుడి గురించి ప్రత్యేకంగా దేశంలో ఏ ఒక్కరికీ చెప్పాల్సిన పని లేదని.. ప్రతి ఒక్కరికీ ఆయన గురించి, ఆయన చేసిన కృషి గురించి తెలుసని న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అతని గొప్పతనం గురించి కోర్టు నుండి మీకు డిక్లరేషన్ అవసరం లేదు. ఆయనలాంటి నాయకులు అమరులు.
ఎన్సీపీని నడిపించే అర్హత నాకే ఉంది..
నేషనలిస్ట్ కాంగ్రెస్‌లో నాయకత్వ అంశంపై చాలా ఏళ్లుగా చర్చ కొనసాగుతుంది. ఎప్పుడూ మాట్లాడని ఎంపీ సుప్రియా సూలే.. ఈ అంశంపై తొలిసారిగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడానికి తనకే ఎక్కువ అర్హత ఉందని ఆమె అన్నారు. షిర్డీలో జరిగిన రెండు రోజుల నేషనలిస్ట్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించారు. యశ్వంతరావు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే హక్కు నాకు మాత్రమే ఉంది.. యశ్వంతరావు చవాన్ ఆదర్శాలను అజిత్ పవార్ వర్గం పాటించడం లేదని సుప్రియా సూలే తెలిపారు. ఇక, జాతీయవాదులలో సుప్రియా సూలే లేదా ఆమె ప్రాముఖ్యత పెరుగుతోందని ప్రఫుల్ పటేల్ ప్రకటన చేశారు. అతని వ్యాఖ్యలపై సుప్రియ సూలే స్పందిస్తూ.. ‘నేను బాగా చదువుకున్నాను, ఓ ప్రైవేట్ కంపెనీకి సీఈవో అయ్యాను.. రాజకీయ నేతగా అయ్యాక ఏం చేస్తాను? నేను లోక్‌సభలో ఒక్క టికెట్ మాత్రమే అడిగాను.. ఎందుకంటే రాజకీయ నాయకుల ద్వారానే మార్పు వస్తుందని నేను నమ్ముతాను అని సుప్రీయ సూలే వ్యాఖ్యనించారు.
పని కోసం రష్యా- ఉక్రెయిన్ కు వెళ్లొద్దు..
తమ ప్రజలు పని కోసం ఉక్రెయిన్- రష్యా దేశాలకు వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగాల కోసం వెళ్తున్న చాలా మంది రష్యా ఆర్మీలో చేర్చుకున్నారని నేపాల్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. రష్యా సైన్యం తరపున పోరాడుతూ నేపాలీ మూలానికి చెందిన చాలా మంది వ్యక్తులు మరణించినట్లు నేపాలీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. దీంతో నేపాల్ ప్రభుత్వం ఆ రెండు దేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు విధించింది. అయితే, దాదాపు నలుగురు నేపాల్‌కు చెందిన వ్యక్తులను ఉక్రెయిన్ సైన్యం పట్టుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. యుద్ధంలో కనీసం 10 మంది నేపాలీ ప్రజలు మరణించినట్లు పలు నివేదికలు వెల్లడైంది. నేపాల్ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు పని కోసం రష్యా- ఉక్రెయిన్ దేశాలకు వెళ్తున్నారు.. ఇందు కోసం వీరంతా నేపాల్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. కొత్త నిబంధనల తర్వాత నేపాలీ ప్రజలు పని కోసం రష్యాతో పాటు ఉక్రెయిన్‌లకు వెళ్లలేరు.. ఇందుకు అవసరమైన పర్మిషన్ లను ప్రభుత్వం వారికి ఇవ్వలేదు అని తెలుస్తుంది.
టెస్టు అని ఎలా అనగలం?.. పిచ్ క్యురేటర్లపై స్టెయిన్ అసంతృప్తి!
కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు మాత్రమే పడ్డాయి. కేప్ టౌన్ పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారింది. చాలా బంతులు బ్యాట్స్‌మెన్ పైకి వచ్చి ఇబ్బందులకు గురి చేశాయి. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐడెన్ మార్‌క్రమ్ మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఇది నిలిచిపోయింది. దీంతో కేప్ టౌన్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పిచ్‌పై దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి పిచ్‌ను తయారు చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌లో తమ దేశంపై విమర్శలు వస్తున్నాయని డేల్ స్టెయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిడ్నీ, పెర్త్ పిచ్‌లలో పగుళ్లు ఉన్నా.. అక్కడ 4-5 రోజుల వరకు మ్యాచ్ సాగుతుందని.. కనీసం ఒక్క క్రాక్ లేకుండా మ్యాచ్ ముగియడం వల్ల ఏం లాభం అని విమర్శించాడు. ‘పిచ్‌పై పగుళ్లు వస్తే మేం ఎందుకు భయపడతాం?. సిడ్నీ, పెర్త్ పిచ్‌లపై పగుళ్లు ఉంటాయి. ఆ పగుళ్ల మధ్య కారును కూడా పార్క్ చేయొచ్చు. అయినా కూడా ఆ పిచ్‌లపై మ్యాచ్‌లు 4-5 రోజుకు వెళ్తాయి. కనీసం ఒక్క క్రాక్ లేకుండా.. మ్యాచ్ ఇంత వేగంగా ముగియడం వల్ల ఏం లాభం. సమయం గడిచే కొద్దీ పిచ్‌లో మార్పులు రావాలి. రెండు రోజుల్లోపే మ్యాచ్ ముగిస్తే.. దానిని టెస్టు అని ఎలా అంటాం?. ఈ టెస్ట్ మ్యాచ్ అర్ధంలేనిది’ అని ఎక్స్‌లో పేర్కొన్నాడు.
బుజ్జి తల్లే వచ్చేత్తున్న కదే.. ఈ సారి గురి తప్పదేలే అంటున్న నాగచైతన్య
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా తండేల్. ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో నాగా చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాతో నాగ చైతన్య, సాయి పల్లవి హ్యాటిక్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా.. అందుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే తండేల్ సినిమా నుంచి శుక్రవారం గ్లింప్స్ విడుదల చేస్తామని ప్రకటించి.. టెక్నికల్ సమస్యలు అని చెప్పి నిన్నే రెండు సార్లు వాయిదా వేసి అభిమానులని నిరాశ పరిచారు. మళ్ళీ నేడు రిలీజ్ చేస్తామని ప్రకటించి.. ఎట్టకేలకు తాజాగా తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తండేల్ కథను చిత్రయూనిట్ ముందే చెప్పేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో పాక్ వాళ్లు పట్టుకుంటే ఎలా బయటకు వచ్చారనేది కథ. గతంలో జరిగిన యదార్థ ఘటనలతో తెరకెక్కిస్తున్నారు. దానికి ప్రేమ కథ, దేశభక్తి అంశాలను జోడించి తండేల్ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్నారు. తాజగా విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య మొదటిసారి ఫుల్ గడ్డంతో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక గ్లింప్స్ చివర్లో సాయి పల్లవిని చూపించి ఆమె అభిమానులను కూడా ఆనందపరిచారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది అర్జున్ రెడ్డి సినిమానే. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో పాటు సందీప్ రెడ్డి వంగా పెద్ద స్టార్స్ అయ్యారు. అయితే ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తీయాలనుకున్నట్లు సందీప్ చెప్పారు. ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి ఎంపిక అని తెలిపారు. ‘2011లో అల్లు అర్జున్‌కు కథ చెప్పాను. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. దురదృష్టవశాత్తూ అర్జున్ రెడ్డి కథను ఆయనకు వినిపించడానికి అవకాశం రాలేదు. ఆ స్క్రిప్ట్‌తో చాలామంది నటులు, నిర్మాతలను కలిశాను. చివరకు నేనే నిర్మించా. విజయ్ దేవరకొండ నాకు ఓ స్నేహితుడి ద్వారా పరిచయం. అల్లు అర్జున్‌ను కలవడం కుదరకపోవడంతో విజయ్‌తో సినిమా తీశా. 13 సంవత్సరాల తర్వాత బన్నీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నా’ అని సందీప్ చెప్పారు.